03.04.2012 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయితో మధుర క్షణాలు - 13
(ఆస్పత్రిలో సుహాస్ కు బాబా దర్శనమిచ్చుట) -1 వ.భాగం
ముందుగా శ్రీ విష్ణు సహస్రనామం 21వ.శ్లోకం, తాత్పర్యము
శ్లోకం: మరీచిర్దమనో హంసస్సుపర్ణో భుజగోత్తమః
హిరణ్య నాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః ||
భగవంతుని, చీకటి నశింపచేయు వెల్గుగా, లేక మనస్సను చీకటికి వెలుగైన వానిగా, హంసగా లేక జీవుని శ్వాసయే తానైనవానిగా, సుపర్ణుడను గరుత్మంతునిగా, సకల లోకములను మోయుచున్న అనంతుడను మహా సర్పముగా, బంగారపు బొడ్డు గలవానిగా, సత్పురుషుల తపస్సు తన రూపమైనవానిగా, బొడ్డుయందు పద్మము గలవానిగా, జీవుల పుట్టుకకు, రక్షణకు కారకుడైన వానిగా, ధ్యానము చేయుము.
శ్రీసాయితో మధుర క్షణాలు - 13
(ఆస్పత్రిలో సుహాస్ కు బాబా దర్శనమిచ్చుట) -1 వ.భాగం
మనసు ఎప్పుడయితే స్వచ్చంగా ఉంటుందో అప్పుడే భగవత్ సాక్షాత్కారానికి గొప్ప అవకాశం ఉంటుంది.
సుహాస్ నాలుగున్నర సంవత్సరాల బాలుడు అతని తండ్రి శ్రీ జయవంత్ పవార్ ధానే జిల్లాలో జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్. 1981 ఫిబ్రవరి 14 న. పరేల్ లో ఉన్న వాడియా ఆస్పత్రి (పిల్లల ఆస్పత్రి) లో సుహాస్ ని చేర్పించారు. అతని పరిస్థితి ప్రతి నిమిషానికి ప్రమాదకరంగా మారుతోంది. పరిస్థితి ప్రమాదకరంగా ఉండటం వల్ల ఆపిల్లవాడిని యింటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి, ఆక్సిజన్ కూడా పెట్టారు. శక్తినివ్వడానికి సెలైన్ కూడా పెట్టారు. డాక్టర్ జయవంత్ రావ్ యాదవ్ నర్సుతో సహా సుహాస్ ప్రక్కనే ఉన్నారు. అప్పుడు సమయం ఉదయం 3 గంటలయింది. సుహాస్ తలిదండ్రులు ఊపిరి బిగపెట్టి చాలా ఆతృతగా అతని పరిస్థితిని గమనిస్తూ ఉన్నారు. పిల్లవాని పరిస్థితి ప్రతి నిమిషం గడిచే కొద్దీ చాలా ఆందోళనకరంగా మారుతూ ఉండతం వారికి చాలా బాధ కలిగిస్తోంది. డా.జాదవ్ అతని పరిస్థితిని నిరంతరం గమనిస్తూనే ఉన్నారు. అకస్మాత్తుగా సుహాస్ "డాక్టర్ కాకా, మీరు కూర్చున్న కుర్చీమీదనించి లేవండి. చూడండి సాయిబాబా గారు వచ్చారు. ఆయనకు మనం మర్యద చేయాలి. ఆయన కూర్చోవడానికి కుర్చీ చూపించండి". అన్నాడు. సుహాస్ అన్న ఈ మాటలు విన్న డా.జాదవ్ కి ఒక నిమిషం పాటు ఏమీ అర్ధం కాలేదు.
బహుశ సుహాస్ మగతలో ఉండి పరాకు మాటలు మాట్లాడుతున్నాడేమోనని అనుమానం కలిగింది. "బాబూ! ఏమిటి నువ్వు చెపుతున్నది? ఎక్కడున్నారు సాయిబాబా? నాకెందుకు కనబడటంలేదు?" అన్నారు డాక్టర్.
ఆయన ప్రశ్నలకు సుహాస్ స్పృహలోనే ఉండి సమాధానమిచ్చాడు. "డాక్టర్ కాకా, సాయిబాబా ఇక్కడ ఉన్నారు. ఆయన మీ ప్రక్కనే నిలబడి ఉన్నారు. నేనాయనను చాలా స్పష్టంగా చూడగలుగుతున్నారు. ఆయన కూర్చోవడానికి మీరెందుకని కుర్చీ చూపించటంలేదు"?
సుహాస్ వయసును బట్టి చూస్తే అతను తన పెద్దవాళ్ళ ద్వారా సాయిబాబా గారి పేరు విని ఉండవచ్చు. కాకపోతే ఆయన ఫోటొనయినా చూసి వుండవచ్చనుకున్నారు డాక్టర్. కాని సుహాస్ చాలా అదృష్టవంతుడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్న ఈ దురవస్థ సమయంలో సాయిబాబావారు అతని వద్దకు వచ్చారు. ఏమయినప్పటికి శ్రీసాయిబాబా దర్శనంతో అతని పరిస్థితి కొంచెం మెరుగయి సాయినాధులవారి ఆశీర్వాద బలంతో కుదుటపడ్డాడు.
1981 జనవరి 24 నుండి సుహాస్ అనారోగ్యంగా ఉన్నాడు. అతని తండ్రి ధానేలోనే ఉండటంవల్ల సుహాస్ ని జనవరి 24న 1981 లో ధానేలో ఉన్న డా.అగర్వాల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆబాలుడు ఫిబ్రవరి 13, 1981 వరకూ ఆ ఆస్పత్రిలోనే ఉన్నాడు. రాత్రి సమయంలో అతని పరిస్థితి ఏమీ బాగుండకపోవటంతో, ప్రతి రాత్రి ఆక్సిజన్, సెలైన్ రెండు కూడా పెట్టవలసి వచ్చ్చేది.
నిద్రపోయే సమయంలో శ్వాస పీల్చుకోవడం చాలా యిబ్బందిగా ఉండేది. అన్ని రకాల ఎక్స్ రే పరీకషలు చేసి, మందులు వాడినా గాని, అతని పరిస్థితిని ఏవిధంగాను మెరుగు పరచలేకపోయారు. పగలు మాత్రం సుహాస్ బాగానేఉంటు ఆటలు కూడా ఆడుతూ ఉండేవాడు. కాని, రాత్రి నిద్రపోయిన గంట తరవాత శ్వాస పీల్చుకోవడానికి యిబ్బంది పడేవాడు. ప్రతిరోజూ జరిగే ఈ వైద్యం వల్ల సుహాస్ నిరాశతో బలహీనంగా తయారయాడు.
ఆఖరికి ప్రముఖ పిల్లల వైద్యుడు డా.మర్చంట్ గారి ని సంప్రదించడానికి నిర్ణయించుకున్నారు ఆయన పరేల్ లోని వాడియా చిన్న పిల్లల ఆస్పత్రిలో గౌరవ డాక్టర్ గా పని చేస్తున్నారు. డా.మర్చంట్ గారు సుహాస్ ని పరీక్షించారు. కాని ఎంతో జాగ్రత్తగా పరీక్ష చేసిన తర్వాత కూడా అతని రోగానికి తగిన కారణం కూడా యితమిథ్థంగా చెప్పలేకపోయారు. అందుచేత ఆయన సుహాస్ ని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి అయిష్టత వ్యక్తం చేశారు. సుహాస్ ని బాంద్రాలో ఉన్న మరొక బందువుల యింటికి తీసుకొని వెళ్ళారు. అక్కడ సుహాస్ కి శ్వాస పీల్చుకోవడంలో యిబ్బంది కలిగేటప్పటికి వెంటనే ఆస్పత్రిలో చేర్పించడానికి నిర్ణయించుకొన్నారు. డా.జయంత్ రావ్ జాదవ్ గారికి సుహాస్, అతని తల్లిదండ్రులు అందరూ తెలుసు. అందుచేత ఆయన కూడావెళ్ళి సుహాస్ ని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ అబ్బాయి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండటంతో ఆక్సిజన్, సెలైన్ పెట్టాల్సి వచ్చింది. మరునాడు, డా.మర్చెంట్ గారికి, సుహాస్ కి వచ్చిన జబ్బు గురించి, రాత్రి చేసిన వైద్యం గురించి వివరంగా చెప్పారు. అన్నిరకాల వైద్యం అప్పటికే జరిగిపోయినందువల్ల యిక ఆఖరి ప్రయత్నంగా బ్రాంకోస్కోప్ చేసి చూద్దామని డా.మర్చంట్ గారు చెప్పారు. కాని ఈ వైద్యం చేయాలంటే ఒక బాధ్యత గల వ్యక్తి యొక్క అనుమతి అవసరం అని చెప్పారు.
(ఆఖరి భాగం రేపటి సంచికలో)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment