12.01.2013 శనివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సంక్రాంతి శుభాకాంక్షలు
గత వారం రోజులుగా ప్రచురణకు అంతరాయం కలిగింది. ఈ రోజు శ్రీ సాహిమధుర క్షణాలలో మరొక మధురమైన బాబా లీల చదవండి. మరలా ప్రచురణకు కొంత ఆలశ్యం జరుగుతుంది. ఓపికతో ఎదురు చూడండి.
శ్రీసాయితో మధురక్షణాలు - 15
ఊలు..........?????
స్క్వాడ్రన్ లీడర్ జీ.కే.నిగమ్ గారి భార్య సీతా నిగమ్ భర్తతో కూడా ఉద్యోగరీత్యా బదిలీ మీద ఆయన వెళ్ళే అన్ని ప్రాంతాలకీ కూడా వెడుతూ ఉండేది. వారు బెల్గాం నుంచి కాన్పూర్ కి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు.
దారిలో షిరిడీ వెడదామని నిర్ణయించుకొన్నారు. బెల్గాం నుంచి 1979 వ.సంవత్సరం అక్టోబరు 15, తేదీన బయలుదేరి నవంబరు మొదటి వారంలో తిరిగి రావచ్చనుకున్నారు. సంవత్సరంలో ఆసమయంలో ఉత్తరభారత దేశ ప్రాతంలో వాతావరణం కొంచెం చలిగా ఉంటుంది. ప్రయాణం గురించి ఆలోచిస్తూ ఉండగా, తన చిన్న బాబుకి పొడుగు చేతుల స్వెట్టర్ లేదనే విషయం గుర్తుకు వచ్చింది. ప్రయాణానికి ముందు ఇది అత్యవసరం. చిన్న బాబుకి స్వెట్టర్ అల్లడానికి ఊలు తెమ్మని ఆమె భర్తను అడిగింది. ఎలాగూ కాన్పూర్ వెడుతున్నాముగా, అక్కడ చాలా రకాల ఊలు దొరుకుతుందని పైగా చాలా చవకగా కూడా వస్తుంది అని ఆమె చెప్పినా ఊలు తీసుకురావడానికి ఆయన ఒప్పుకోలేదు. భర్త చెప్పిన సమాధానం ఆమెకు రుచించలేదు. భర్త చెప్పినదానికి ప్రస్తుతానికి ఆమె మౌనంగా ఊరుకున్నా ముఖ్యంగా ప్రయాణంలో బాబుకు బాగా చలిగాలి తగిలి జలుబు చేస్తుందని మనసులో భయంగానే ఉంది.
మరునాడు ఉదయం 11 గంటలకు ఆమె తోటలో కూర్చొని ఉన్నపుడు ఆమె మనసులో షిరిడీ కూడా వెడుతున్నామనే ఆలోచన తళుక్కున మెరిసింది. అ ఆలోచనతో తన చిన్న బాబుకు బాగా చలిగాలి తగులుతుందనే భయం మరలా కలిగింది. ఆమె మనసులోనే బాబా తో చెప్పుకొంది, "నేను నీ దర్శనానికి వస్తున్నాను. బాబుకు కనక జలుబు చేస్తే దానికి బాధ్యత నీదే. బాబుకి ప్రయాణంలో జలుబు చేయకుండా ఆరోగ్యంగా ఉండాలంటే నాకు ఊలు దొరికేలా సహాయం చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాను." ఆలోచనా తరంగాలు ఆమెలో ఇలా సాగుతూండగా, తెల్లని దుస్తులు ధరించి తలపై ఊలు మూట పెట్టుకున్న ఒక వృధ్ధుడు ఆమె యింటి ముందు ప్రత్యక్షమయాడు. అసంకల్పితంగా ఆమె తనంతట తాను "బాబా, నీదగ్గర ఊలు ఉందా" అని అడిగింది. ఆ వృధ్ధుడు ఉందన్నట్లుగా తలాడించి ఆమె దగ్గరకు వచ్చి అసాధారణమైన తీయని స్వరంతో "అమ్మాయీ! నీకు ఊలు కావాలా. చూడు, యిందులోనుంచి నీకు కావలసినది ఏరుకో" అన్నాడు ఈ ప్రాంతంలో అమ్మేవారందరూ కూడా ఆడవారిని "బాయీ" అని పిలుస్తారు. కాని అతను పిలిచిన పిలుపు అందుకు పూర్తిగా విరుధ్ధం. ఆమె దృష్టంతా ఊలును ఏరి చూసుకోవడంలోనే ఉంది. అందుచేత ఆమె అతనిని అంత పరీక్షగా చూసి పట్టించుకోలేదు. అతను తన వద్దనున్న ఊలునంతా ఆమెకు చూపించాడు. అందులో తనకు బాగా నచ్చిన రకాన్ని ఎంపిక చేసుకొంది. అతనిని దాని ధర అడిగింది. దానికా వృధ్ధుడు కొంత ధర చెప్పాడు. కాని ఆఊలు నాణ్యతకు ఆ ధర కొంచెం ఎక్కువనిపించింది. తన వద్ద అంత డబ్బు లేదనీ, ధర కూడా కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పిందామె. అపుడా ముసలివాడు ఆమెతో ఎంతో వాత్సల్యంతో, "అమ్మాయీ! డబ్బు గురించి అసలు బెంగ పెట్టుకోకు. ఊలు తీసుకుని నీదగ్గిర ఎంత ఉంటే అంతే ఇవ్వు. ఒకవేళ నీదగ్గిర డబ్బు లేకపోయినా నాతరఫున మీ బాబుకు ఈ ఊలు తీసుకో" అన్నాడు. ఈ మాటలు విన్న తరువాత కూడా తాను ఎవరితో మాట్లాడుతున్నదో యింకా ఆమె గ్రహిం చుకోలేకపోయింది. దానికి డబ్బు ఇవ్వకుండా తానా ఊలును తీసుకొనేది లేదని చెప్పింది. అతనిని అక్కడే ఉండమని చెప్పి, తన వద్ద ఎంత డబ్బుందో అంతా ప్రోగుచేసి చూద్దామని యింటిలోపలికి వెళ్ళింది. ఆఖరికి అక్కడక్కడా ఉన్న చిల్లరను కూడా ప్రోగుచేసి మొత్తం డబ్బు తీసుకొని తిరిగి వచ్చింది. కాని ఊలు కొనడానికి యింకా సరిపడగా డబ్బు సమకూడలేదని బాధపడింది.
ఆ వృధ్ధ్దుడు ఆమె బాధను అర్ధం చేసుకొని బుజ్జగిస్తూ "అమ్మాయీ! డబ్బు గురించి నువ్వు అసలు దిగులు పెట్టుకోకు. నేను ముందే చెప్పాను. ఈ ఊలు తీసుకొని మీ అబ్బాయికి స్వెట్టరు అల్లు. స్వెట్టరు తొడుక్కొని దానితో వాడిని సంతోషంగా ఉండనీ" అతను ఆమె తెచ్చిన కొద్దిపాటి డబ్బును తీసుకొని ఆమెకిష్టమయిన ఊలును యిచ్చాడు. ఈ విధంగా బేరం ముగియగానే అతను మిగిలిన ఊలును కట్ట్ఘకట్టుకొని వెళ్ళిపోయాడు. అతనిచ్చిన ఊలును చేతిలో పట్టుకొని, అతను కొంతదూరం వరకూ వెడుతూ ఉండటం గమనిస్తూనే వుంది. అలా వెడుతున్న అతను అకస్మాత్తుగా అదృశ్యమవడం గమనించింది.
ఈ స్వెట్టర్ ఎవరికి అనేది అతనికెలా తెలిసిందనే ప్రశ్న ఆమెకు కలుగలేదు. కాని తరచూ ఆ వ్యక్తి మరలా కనపడతాడేమోనని చూసింది కాని, ఆ తరువాతనించి అతను కనపడలేదు. దక్షిణ భారత ప్రాంతం అంత విపరీతమయిన చలి ప్రదేశం కూడా కాదు. అందుచేత యిక్కడ వీదిలో ఊలు అమ్మేవాళ్ళు కూడా ఎవరూ కనపడరు. ఆముసలివాడు తన బిడ్డలను ప్రేమిచే సాయినాధుడే తప్ప మరెవరూ కాదని అర్ధమయింది. ఆయన వారి కోసం అన్నీ సమకూరుస్తారు. సాయినాధుడు తన బిడ్డల బాధలను ఉపశమింపచేస్తారు. అయన స్వయంగా వచ్చి ఊలును అమ్మి వ్యాకుల పడుతున్న ఆతల్లికి ఊలును అమ్మారు. ఆమె బాధ ఉపశమించింది స్వెట్టరు అల్లడం పూర్తయిన ఒక వారం తరువాత ఆమె తన భర్తకు జరిగినదంతా వివరించి చెప్పింది. బాబా తమ మీద చూపించిన దయకి ఆకుటుంబం ఎంతగానో సంతోషించింది.
శ్రీసాయిలీల
ఏప్రిల్, 1980
శ్రీమతి సీతా నిగమ్
కర్నాటక
ఈ మధుర క్షణానికి పేరు - సాయ్హినాధుడు ఊలును అమ్ముట అని పేరు పెట్టవచ్చు. కాని పాఠకులకి ముందే తెలిసిపోతుందనీ అందులో ఉన్న ఉత్సుకత మరుగున పడిప్తుందనే ఉద్దేశ్యంతో ఇవ్వడం జరగలేదు. కాని మన సాయి బంధువులకు ఊలు అమ్మినదెవరో ఊహించడం కష్టమేమీ కాదు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment