Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, February 26, 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 5వ. అధ్యాయము

Posted by tyagaraju on 7:01 AM


                        
                                        
                                     
                                     
26.02.2013  మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
                                            
                            

                                   

శ్రీవిష్ణుసహస్రనామం 42వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  వ్యవసాయో వ్యవవస్థానః సంస్థానః స్థానదో ధృవః  |   

             పరర్ధిః పరమ స్పష్టః స్తుష్టః పుష్టశ్శుభేక్షణః  || 

తాత్పర్యము:  భగవంతుని నిరంతరము యత్నించువానిగా, యితరులను తరగతులుగా విభజించి స్థాపన చేసి స్థలము ఏర్పరచు శక్తిగా, నిన్ను తన చుట్టు త్రిప్పుకొను కేంద్రముగా ధ్యానము చేయుము.  అతడు యితరులకు అభివృధ్ధి కలిగించి శ్రేష్టము, ఉత్తమములైన వ్యక్తము అవ్యక్తము అను శక్తులుగా యున్నాడు.  యింకనూ తృప్తిగా, పోషణగా, శుభ దృష్టిగా తెలియబడుచున్నాడు. 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన  రత్నమణి సాయి - 5వ. అధ్యాయము 


(Listen Discourses of Saibanisa Ravada(English &Telugu) and devotional songs( Telugu) on Lord Sainath of Shirdi  


ప్రియమైన చక్రపాణి,

ఈరోజు శ్రీసాయి సత్ చరిత్ర 5వ. అధ్యాయము గురించి వివరించుతాను.  ఈ అధ్యాయములో జరిగిన సంఘటన నా నిజ జీవితములో శ్రీసాయి ప్రవేశించిన తీరులలో పోలికలు ఉండటము చేత ఈ అధ్యాయముపై నాకు భక్తి, విశ్వాసములు ఎక్కువ. 



ముందుగా ఈ అధ్యాయములో చాంద్ పాటిల్ తన తప్పిపోయిన గుఱ్ఱమును వెతకటము ఆ విషయములో శ్రీసాయి, చాంద్ పాటిల్ కు సహాయము చేయటము హేమాద్రిపంతు వర్ణించుతారు.  
                           
                                                              
యిక్కడ ఒక్క విషయము ఆలోచించాలి.  శ్రీచాంద్ పాటిల్ ధనికుడు.  అతను తన గుఱ్ఱమును పోగొట్టుకొన్న మాట వాస్తవమే.  అతను తలచుకొన్న తన తప్పిపోయిన గుఱ్ఱములాంటి గుఱ్ఱములను ఒక పది గుఱ్ఱములను కొనగలడు.  అయినా అతను తన తప్పిపోయిన గుఱ్ఱాన్నే ఎందుకు వెతుకుతున్నాడు?  అనేది ఆలోచించాలి.  బహుశ శ్రీసాయి దృష్టిలో చాంద్ పాటిల్ అన్ని ప్రాపంచిక సుఖాలు అనుభవించిన వ్యక్తి.  అతనిలో ఆధ్యాత్మిక చింతన కలుగ చేయటానికి ప్రాపంచిక సుఖాలపై వైరాగ్యము కలుగ చేయటానికి చాంద్ పాటిల్ లో ఉన్న అరిషడ్ వర్గాలను పూర్తిగా తొలగించటానికి శ్రీసాయి, చాంద్ పాటిల్ ను దగ్గరకు చేరదీస్తారు.  ఈసాయి సత్ చరిత్రలో 21వ. అధ్యాయములో దాదా కేల్కర్ గుఱ్ఱము గురించి ప్రస్తావించుతు, "ఆడ గుఱ్ఱము, అనగా యిచట భగవంతుని అనుగ్రహము  అని అంటారు.  శ్రీసాయి దృష్టిలో చాంద్ పాటిల్ పోగొట్టుకొన్నది భగవంతుని అనుగ్రహము.  అందుచేత ఆభగవంతుని అనుగ్రహాన్ని చాంద్ పాటిల్   కు యివ్వటానికి శ్రీసాయి, చాంద్ పాటిల్ ను దగ్గరకు చేరదీశారు అనేది మనము గ్రహించాలి.

శ్రీచాంద్ పాటిల్ పెండ్లివారితోను ఫకీర్ (శ్రీసాయి) తోను కలసి శిరిడీలోని ఖండోబా మందిరమునకు చేరగానే భక్త మహల్సాపతి ఆఫకీర్ ను చూసి "దయచేయుము సాయి" అని స్వాగతించెను అని హేమాద్రిపంతు  వ్రాస్తారు.

                        
                           
  ఆనాటి నుండి ఆఫకీర్ ను సాయిబాబా అని శిరిడి ప్రజలు పిలవనారంభించినారు.  ఈనాడు "సాయీ" అనే పిలుపు కొన్ని కోట్లమంది భక్తుల హృదయాలలో శాశ్వతముగా నిలిచిపోయినది.  యిక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని నీకు వ్రాస్తాను.  శ్రీఆర్ధర్ ఆస్ బోర్న్ యిండియాకు వచ్చి 1957 సంవత్సరములో శిరిడీలో చాలా కాలము యుండి శ్రీ శిరిడీ సాయిపై అనేక విషయాలు సేకరించి యింగ్లీషు భాషలో " ది యిన్ క్రిడిబుల్ సాయిబాబా" అనే పుస్తకము వ్రాసినారు.  
                          
                                                   
ఆపుస్తకములో ఒకటవ పేజీలో ఆయన వివరించిన విషయము నన్ను చాలా కలత పరిచినది.  అది ఆ యువ ఫకీరు శిరిడీలో స్థిర నివాసము ఏర్పరుచుకోవటానికి నిశ్చయించుకొని దగ్గరలో ఉన్న ఓ హిందూ దేవాలయమునకు వెళ్ళి ఆశ్రయము కోరినాడు.  కాని, అక్కడి పూజారి ఆయువకుడిని ముసల్ మాన్ గా గుర్తించి ఆగుడిలోనికి రానీయక ఆ ఊరిలోని  మశీదుకు వెళ్ళమని కసరి కొట్టినాడు.  ఆశ్చర్యము ఆపూజారి ఎవరో కాదు, కాల క్రమేణ ఆఫకీర్ కు ప్రియ భక్తుడు అయిన మహల్సాపతి.  ఆయువకుడు ఆఖరికి ఆపాడుబడిన మట్టితో కట్టబడిన మశీదునే తన నివాసముగా చేసుకొన్నాడు."  ఆరోజులలో శ్రీసాయి హిందూ యోగులతోను, ముస్లిం ఫకీర్లుతోను కలసి మెలసి యుండెడివారు.  శ్రీసాయి నిత్య కృత్యాలు వివరించుతు హేమాద్రిపంతు యిలాగ వ్రాశారు  "శిరిడీకి మూడు మైళ్ళ దూరములో ఉన్న రహతాకు పోయినపుడు బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి, నేలను చదును చేసి, వాటిని నాటి, నీళ్ళు పోయుచుండెను.  సాయిబాబా కృషి వలన అచట ఒక పూలతోట లేచెను.  ఆస్థలములోనే యిప్పుడు బాబా సమాధి యున్నది.  దీనివలన శ్రీసాయి తన భక్తులకు యిచ్చిన సందేశము ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచించాలి.  మానవజీవితము పూలమొక్కలు లాంటివి.  వాటికి చక్కగ రక్షణ యిచ్చి పెంచి పెద్ద చేయాలి.  స్వార్ధము అనేది ఏమీ తెలియని ఆపూలులాగ వికసించి భగవంతుని పాదాలపై చేరిపోవాలి.  శ్రీసాయి జీవితము ఒక చక్కటి పూలమొక్కగా పెరిగి స్వార్ధము లేకుండ తన భక్తులకు సేవ చేసుకొని ప్రకృతి ఒడిలోనికి (భూమిలోనికి) ఒరిగిపోయినది (మహాసమాధి  చెందినారు).
                                 

                              
 శ్రీసాయి సత్ చరిత్ర 46 వ.పేజీలో వేప చెట్టు క్రింద ఉన్న పాదుకల వృత్తాంతము హేమాద్రి పంతు వివరించినారు.  "బాబా ప్రప్రధమమున శిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసినదాని జ్ఞాపకార్ధము బాబాయొక్క పాదుకలను వేప చెట్టు క్రింద ప్రతిష్టించవలెనని నిశ్చయించుకొనిరి.  పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించిరి."  నాజీవితములో నేను మొదటిసారిగా శిరిడీకి వెళుతున్నరోజు ( అది 1989 సంవత్సరము జూలై నెల శనివారము).  ఉదయము యధావిధిగా శ్రీఆంజనేయ స్వామి గుడికి, మైసమ్మ తల్లి గుడికి పూజ చేయటానికి చేతిలో నాలుగు రూపాయలు తీసుకొని బయలుదేరినాను (ప్రతి శనివారము శ్రీఆంజనేయస్వామి గుడిలో పూజారికి రెండు రూపాయలు యిచ్చి అర్చన చేయించుకోవటము,  ఆగుడికి దగ్గరలో ఉన్న మైసమ్మ తల్లి గుడిలో దీపారాధనకు ఒక రూపాయ యివ్వటము, మిగిలిన ఒక రూపాయి ఎప్పుడూ  భిక్ష కోరే ఒక ముసలమ్మకు యివ్వటము నాకు అలవాటుగా మారిపోయినది.)

యధావిధిగా శ్రీఆఅంజనేయ స్వామి గుడికి ముందుగా వెళ్ళినాను.  గుడిలోనికి వెళుతూ ఉంటే వేపచెట్టు క్రింద ఎప్పుడు యుండే ముసలమ్మ నన్ను యధావిధిగా పలకరించినది.  నేను గుడిలో అర్చన చేయించుకొని రెండు రూపాయలు పూజారి గారికి యిచ్చి మిగిలిన రెండురూపాయలతో బయట వేప చెట్టు క్రింద ఉన్న ముసలమ్మకు ఒక రూపాయ బిళ్ళ ఇవ్వడానికి వచ్చినాను.  నేను ఆముసలి స్త్రీకి ఒక రూపాయ దానము చేస్తూ ఉంటే ఆమె ప్రక్కనే ఒక ముసలివాడు, ఖాకీ నిక్కరు, ఖాకీ చొక్క ధరించి యున్నాడు.  తెల్లని గెడ్డము, నెత్తికి బట్ట చుట్టుకొని, భుజానికి ఒకజోలె, నేలపై ఒక రేకు డబ్బా చేతిలో ఒక పొట్టి కఱ్ఱతో నాముందు చేయి చాచి భిక్ష కోరినాడు.  నాలో ధర్మ సందేహము కలిగినది.  చేతిలో యున్నది రెండు ఒక రూపాయ బిళ్ళలు. ఒక రూపాయి ఆముసలమ్మకు యిస్తే మరి యింకొక రూపాయి బిళ్ళ ఆముసలివానికి యిస్తే మరి మైసమ్మ తల్లి గుడిలో దీపారాధనకు ఏమి యివ్వాలి? ఒక్క క్షణము ఆలోచించి చేతిలో ఉన్న రెండు రూపాయి బిళ్ళలను ఆముసలమ్మకు, ఆముసలివానికి యిచ్చినాను.  అక్కడనుండి బయటకు వస్తూ ఉంటే నాలో అనేక ఆలోచనలు రేకెత్తసాగినాయి.  గుడిలోనికి వెళ్ళేముందు లేని ఈముసలివాడు ఎవరు, నేను ఎన్నడు ఆవ్యక్తిని చూడలేదు అనే ఆలోచనలతో వెనక్కి చూసినాను.  అవ్యక్తి నాకేసి చూస్తూ చిరునవ్వు నవ్వసాగించినారు. ఆవ్యక్తి ముఖములో ఏదో తెలియని శక్తి నన్ను పరవశము చేసుకోసాగినది.  అనేక ఆలోచనలతో యింటికి చేరుకొన్నాను.  బహుశ ఆయన శ్రీసాయిబాబా అయి ఉంటారు అనే ఆలోచన నామనసులో కలగగానే తిరిగి ఆగుడికి వెళ్ళినాను.  అప్పటికే ఆముసలి వ్యక్తి వెళ్ళిపోయినారు అని ఆముసలమ్మ చెప్పినది.  నాకంటికి ఖాకీనిక్కరు, ఖాకీ చొక్కా వేసుకొన్న ఆముసలి వ్యక్తి గురించి ఆముసలి స్త్రీని అడిగితే ఆమె పలికిన పలుకులు నన్ను యింకా ఆశ్చర్యపరచినాయి.  ఆమె ఆముసలివాని గురించి యిచ్చిన వర్ణన యిది - "ఆ ముసలి ఆయన తెల్ల అంగీ, తెల్ల ధోతి, నెత్తికి చిన్న బట్ట, భుజానికి జోలె ఒక చెతిలో డబ్బా, యికొక చేతిలో పొట్టి కఱ్ఱతో వచ్చి ఆమె ప్రక్కన కూర్చుని యిక్కడ గుడికి వచ్చే భక్తులు దాన ధర్మాలు చేస్తారా! అని అడిగినారట.   ఆస్త్రీ నాపై నమ్మకముతో యిపుడు ఓదొర గుడిలోనికి వెళ్ళినాడు. రాగానే నాకు ఒక రూపాయి ఇస్తాడు.  నీవు అడుగు నీకు ఒక రూపాయి ఇస్తాడు అని చెప్పినదట.  ఆస్త్రీ ఎంత అదృష్ఠవంతురాలు,  సాక్షాత్తు శ్రీసాయిబాబా ఆమె ప్రక్కనే కూర్చున్నారు.  నాకు తెలియకుండా నానుండి ఒక్కరూపాయి దక్షిణ స్వీకరించినారు.  నేను అనేక శనివారాలు ఆముసలి వ్యక్తి గురించి గాలించినాను.  యింతవరకు ఆవ్యక్తి తిరిగి కనిపించలేదు.  నానుండి ఒక రూపాయి దక్షిణ స్వీకరించి చిరునవ్వుతో నన్ను ఆశీర్వదించినది శ్రీసాయిబాబా అనే నమ్మకము చెరగని ముద్ర వేసినది.

మొదటి సారిగా శిరిడీకి వెళ్ళిన రోజున హైదరాబాద్ లోని డీ.ఏ.ఈ. కాలనీలోని వేపచెట్టు క్రింద శ్రీసాయి ఆశీర్వచనాలు పొందినాను అనే తృప్తితో ఆవేప చెట్టు క్రింద శ్రీసాయి పాదుకలు ప్రతిష్టించాలి అని నిశ్చయించుకొన్నాను.  కాని, శ్రీసాయి నాకోరికను నెరవేర్చిన విధానము చాలా వింతగా యున్నది.  నేను శ్రీసాయి పాదుకలు ఆవేప చెట్టు క్రింద ప్రతిష్టించాలి అనే ఉద్దేశముతో స్నేహితుల సహాయము కోరినాను.  నాకు సాయము దొరకలేదు సరికదా,  పైగా అన్నీ అడ్డంకులే.  ఏమి చేయాలి తోచక ఒక శనివారము రోజున ఆవేప చెట్టు క్రింద నిలబడి ఆలోచించసాగాను.  శ్రీసాయి ఆ ఆంజనేయస్వామి గుడిలోని పూజారి మనసులో ప్రవేశించి నాసమస్యకు ఆయనే పరిష్కారము సూచించినారు.  ఆపూజారి గుడిలోనుండి బయట ఉన్న వేపచెట్టు  క్రిందకు వచ్చి నన్ను ఒక రెండు కోరికలు కోరినారు.  అవి (1) తను ఎండలో నడుస్తూ ఉంటే కాళ్ళు కాలుతున్నాయి, కొత్త చెప్పులు కొని పెట్టమన్నారు.  (2) తను యింటిలో వంట చేసుకొనేందుకు చాలా యిబ్బంది పడుతున్నాను, తనకి ఒక కిరసనాయలు స్టౌ కొని పెట్టమని కోరినారు.  ఈ రెండు కోరికలు వినగానే నాలో సంతోషము కలిగినది.  శ్రీసాయి నానుండి కొత్తగా గుడికి కావలసిన పాదుకలు మరియు పవిత్రమైన ధుని ఏర్పాటు చేయమని ఆదేశించినారు అని భావించి, మరుసటి గురువారము నాడు ఆపూజారి కాళ్ళకు కొత్త చెప్పులు తొడుగుతూ ఉంటే నేను కోరుకొన్న సాయి పాదుకలు ప్రతిష్టించిన అనుభూతిని పొందినాను.  ఆపూజారికి  కిరసనాయలు స్టౌ దానము యిస్తూ ఉంటే కొత్తగా నిర్మించిన సాయి మందిరములో ధునిని ఏర్పాటు చేసిన అనుభూతిని పొందినాను.

శ్రీసాయి నీళ్ళతో దీపాలు వెలిగించెను అనేదానికి అర్ధము ఏమిటి ఆలోచించు.  భగవత్ కార్యానికి నీవు నీతోటివాడి సహాయ సహకారాలు కోరడములో తప్పు లేదు.  ఆసహాయము అందలేదు కనుక భగవంతుని కార్యమును ఆపివేయకూడదు.  నీదగ్గర ఉన్నదానితో ఆపని పూర్తి చేయాలి. అంతే గాని అది లేదు, యిది లేదు అంటు భగవంతుని పూజ ఆపకూడదు.  శ్రీసాయి భగవంతుని పూజలో మశీదులో దీపాలు వెలిగించాలి అనే ఉద్దేశముతో కోమట్లనుండి నూనె కోరినారు.  కాని, ఆయనకు సహాయము అందలేదు.  అయినా ఆయన భగవంతునిపై అచంచలమైన విశ్వాసము, భక్తితో నీళ్ళతోనే దీపాలు వెలిగించినారు.  దీపారాధనకు నూనె యివ్వలేదని ఆ కోమట్లను ఏనాడు తూలనాడలేదు.

తనకంటే తక్కువ జ్ఞానము కలిగియున్నా జవహర్ ఆలీ అనే ఫకీరు తన్ను అవమానించినా ఏమీ బాధపడకుండ మానావమానాలకు అతీతుడు సాయి అని నిరూపించినారు.

తన భక్తుల సేవకే తన జీవితము అంకితము చేసుకొన్న శ్రీసాయిబాబా పాదాలను నమ్ముకోవటము అంటే మానవత్వాన్ని నమ్ముకోవటం అని అర్ధము చేసుకో.

శ్రీసాయి సేవలో

నీతండ్రి.
 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List