15.02.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 9వ. అధ్యాయం
బాబా కుదిర్చిన బేరం:
షిరిడీ వాస్తవ్యుడైన లక్ష్మణ్ భట్ బ్రాహ్మణుడు. అతని వద్దనుండి 1910 లో నేను కొంత భూమిని కొన్నాను. ఆభూమి కొనుగోలు గురించి లావాదేవీలు జరుగుతున్నపుడు మొదట లక్ష్మణ్ భట్ దాని ఖరీదు 200/- రూపాయలు చెప్పాడు.
ఆభూమి 150/- రూపాయలకన్నా ఎక్కువ చేయదని దానికి మించి ఒక్కపైసా కూడా ఎక్కువ యివ్వనని చెప్పాను. బేరం కుదరలేదు.
లక్ష్మణ్ భట్ మసీదుకు వెళ్ళినపుడు బాబా అతనిని దగ్గరకు పిలిచి యిద్దరూ కలిసి ఒక పరిష్కారానికి రండి, మధ్యే మార్గంగా 175/- రూ. తీసుకో అంతకంటే తక్కువకు మాత్రం వప్పుకోవద్దు అన్నారు. అయితే లక్ష్మణ్ భట్ అప్పట్లో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.
బేరసారాలు జరిగి ఆఖరికి నేనడిగిన 150/- రూ.లకే బేరం కుదిరింది. రెజిస్త్రార్ ఆఫీసుకు వెళ్ళ్లినపుడు నేను మొత్తం 150/- రూ.చెల్లించేశాను. ఆశ్చర్యం, లక్ష్మణ్ భట్ యింటికి వెళ్ళి డబ్బు లెక్క చూసుకోగా సరిగ్గా రూ.175/- ఉన్నాయి. బాబా చెప్పిన దానికి సరిగా సరిపోయింది.
ఆపద్భాందవుడు:
శ్రీగణపతి అనే భక్తుడు తనకు కలిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని నాకు ఇలా వ్రాశాడు.
"1914 లో నేను, నాభార్య కలిసి బాబా దర్శనానికి షిరిడీ బయలుదేరాము. మేము ఎక్కిన రైలు నాసిక్ ను సమీపిస్తూండగా, 15, 20 మంది గుంపుగా మాపెట్టెలోకి చొరబడ్డారు. వారు కారు నలుపురంగులో ఉండి చూడటానికి భయంకరంగా ఉన్నారు. ఆపెట్టెలో నేను, నాభార్య, మా కుమార్తె తప్ప మరెవరూ లేరు. ఆసమయంలో నేను, శ్రీ లక్ష్మణ్ రామచంద్ర పాంగార్కర్ రచించిన భక్తి మార్గ్ ప్రదీపిక చదువుతున్నాను. ఆభిల్లులు వచ్చి నాప్రక్కనే కూర్చున్నారు. వారు ఆ పుస్తకం వినడానికి వచ్చినట్లుగా భావించుకుని దానిలోని కొన్ని అభంగాలను పెద్దగా చదవడం మొదలు పెట్టాను. ఆభిల్లులు అయిదు నిమిషాలపాటు నావద్దనే కూర్చున్నారు. తరువాత ఉన్నట్టుండి లేచి రైలు పరిగెడుతూ ఉండగానే రైలునుంచి దూకేశారు. నేను తలుపు దగ్గరకు వెళ్ళి చూసినపుడు వారందరూ క్రిందికి దిగి పరిగెత్తిపోతూ కనిపించారు. అపుడు నాకర్ధమయింది వారు ప్రయాణీకులు కాదు బందిపోటు దొంగలని. నెనుకకు తిరిగి చూసినపుడు మాపెట్టెలో మేమున్నచోట ఒక వృధ్ధ ఫకీరు కూర్చుని ఉన్నాడు. ఆఫకీరు మాపెట్టెలోకి ఎలావచ్చాడా అని ఆశ్చర్య పోటూండగానే ఆఫకీరు మాకళ్ళముందే అదృశ్యమయాడు. హటాత్తుగాసంభవించిన ఈఅద్భుతానికి నేను సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాను. కొంతసేపటికి గాని నేను తేరుకోలేకపోయాను. మరచిపోలేని విధంగా ఆసంఘటన నామనస్సులో హత్తుకు పోయింది.
తరువాత మేము షిరిడీ చేరి మసీదు మెట్ల మీద కాలు పెట్టామో లేదో శ్రీసాయిబాబా మమ్ములని చూస్తూ క్షేమంగా చేరారు కదా అని అడిగారు. రైలులో మాపెట్టెలోకి వచ్చిన భిల్లులు మమ్మల్ని దోచుకోవడానికి వచ్చారని అర్ధమవుతూనే ఉంది. మహిమాన్వుతుడైన ఫకీరు ఉండటంవల్ల ఆభిల్లులు ఎందుకో భయపడి పారిపోయారని మాకర్ధమయింది. బాబావారి రక్షణ కవచమే కనక లేకుంటే వారంతా మమ్మలిని దోచుకునేవారే. ఈ సంఘటన నామదిలో చెరగని ముద్ర వేసింది. ఆయన భక్తులుగా మామదిలో ఎన్నటికీ గుర్తుండిపోతుంది. తన భక్తులు ఆపదలో ఉన్నపుడు బాబా వారిని రక్షించడానికి వెంటనే వచ్చి కాపాడతారనడానికి యిదొక ఉదాహరణ.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment