24.03.2013 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత మూడు రోజులుగా మన బ్లాగులో రత్నమణి సాయి అందించలేకపోయాను.. మన్నించాలి... ఈ రోజు 16,17 అధ్యాయాలు చదవండి...
శ్రీవిష్ణు సహస్రనామం 52వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: గభస్తినేమిస్సత్తత్వస్థస్సిం హో భూత మహేశ్వరః |
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవ భృద్గురుః ||
తాత్పర్యం: నారయణుని మార్గము సూర్యగోళము యొక్క వెలుగుచే నిర్ణయింపబడుచున్నది. ఆయన మనయందు, సామ్యముగను, సిం హముగను, అన్ని భూతములయందలి ఈశ్వరునిగా, మొట్టమొదటి దేవునిగా, మహాదేవునిగా, దేవతలకధిపతిగా, మరియు దేవతలను సం రక్షించువానిగా, ఉపదేశకునిగా ధ్యానము చేయవలెను.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
18,19 అధ్యాయములు
22.01.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ ఉత్తరములో 18-19 అధ్యాయములలోని విషయాలపై నాకు తోచిన అభిప్రాయాలు నీకు తెలియ చేస్తాను. ఈ నా అభిప్రాయాలను నీవు అర్ధము చేసుకొనిన తర్వాత నీ స్నేహితులకు కూడా పనికివస్తుంది అని తలచిననాడు ఈ ఉత్తరాలు నీ స్నేహితుల చేత కూడా చదివించు.
ఈ విషయములో శ్రీ హేమాద్రిపంతు తెలియచేసిన సంగతి నీవు గుర్తు చేసుకో. అదే సద్గురువు వర్షాకాలము మేఘము వంటివారు. వారు తమ అమృత తుల్యములైన భోదలు పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిసెదరు. వానిని మనముభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా యితరుల మేలుకొరకు వెల్లడి చేయవలెను. యింకొక విషయము నిన్న రాత్రి షిరిడీ డైరీ ఆఫ్ ది హానరబుల్ మిస్టర్ జీ.ఎస్.ఖపర్డే పూర్తిగా చదివినాను. ఈ రోజు ఉదయము శ్రీ ఖాపర్దే డైరీ తిరిగి అలమారులో పెడుతుంటే ఎందుకో బాబానుండి సందేశము పొందాలని మనసులో కోరిక పుట్టి కళ్ళు మూసుకొని ఒక పేజీ తెరచినాను. (పేజీ 69). శ్రీ ఖాపర్దే మరియు శ్రీసాయి మీద 30.01.1912 నాడు జరిగిన సంభాషణ. "నేను ఉత్తరాలు వ్రాసానని చెపితే, ఆయన నవ్వి సోమరిగా కంటే ఏదో పనిలో చేతులు కదలటమె మంచిది " అనే సందేశము వచ్చినది. నీకు జ్ఞాపకము ఉండే యుంటుంది. నారెండవ ఉత్తరములో శ్రీసాయి గురించిన ఉత్తరాలు వ్రాయడానికి ప్రోత్సాహము 06.01.1992 నాడు మీఅమ్మనుండి లభించినది. ఈ ఉత్తరాలు ఈ విధముగా నీకు వ్రాయడానికి శ్రీసాయినుండి అనుమతి ఈ రోజునే లభించినది. శ్రీసాయి ఆశీర్వచనాలతో శ్రీ సాయి జీవిత చరిత్రపై నీకు 48 ఉత్తరాలు వ్రాయగలను అనే ధైర్యము ఈక్షణములో కలిగినది. శ్రీసాయి ఈ ధైర్యమును నామనసులో సదా కలిగించుతు ఉంటారని నా నమ్మకము. శ్రీహేమాద్రిపంతు శ్రీసాయి సత్ చరిత్రలో ఈ విధముగా అంటారు. "వాని పాపకర్మలు ముగియు వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలిసికొనుట సంభవింప చేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును జూచెదరు". యిది అక్షరాల నిజము. నేను చేసిన పాపాల కర్మలు ముగిసిన నాకు మంచిరోజులు (1989) వచ్చే సమయలో భగవంతుడు శ్రీసాయి అనే యోగీశ్వరుని పాదాలు నాకు చూపించినారు. ఈరోజున నేను శ్రీసాయి పాదాలపై నా శిరస్సు ఉంచి ఆయన శరణు కోరుతున్నాను. శ్రీసాయి హరివినాయ సాఠే చేత ఏడు రోజులలో గురుచరిత్ర పారాయణ చేయించినారు అనే విషయము వ్రాయబడియుంది. శ్రీసాయి నాచేత 1991లో గురుచరిత్ర ఏడురోజులలో పారాయణ చేయించినారు. మీ అమ్మచేత రోజుకు ఒక అధ్యాయము పారాయణ చేయించినారు. అది మా అదృష్టముగా భావించుతాము. శ్రీసాయి సత్ చరిత్రలో భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో, బాబా అంత త్వరగా సహాయపడును అని చెప్పబడింది. ఒక్కొక్కపుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును అని వ్రా యబడినది. నేను పట్టుదలతో 07.06.1990 నుండి శ్రీసాయిబాబా జీవిత చరిత్రను నిత్యపారాయణ చేస్తున్నాను.
ఈ నిత్యపారాయణ ఫలితమును నేను చూడలేను. కారణము నేను కోరుకొన్న కోరిక అటువంటిది. ఆకోరిక చెప్పమంటావ - బాధపడవద్దు - నేను నిత్య పారాయణ చేస్తున్న సమయములో ప్రశాంతముగా కన్నుమూయాలి అనే కోరిక. ఈ కోరిక తీర్చవలసినది శ్రీసాయి. ఈకోరిక తీరినది లేనిని అనేదానికి సాక్షిగా నిలబడవలసినది నీవు.
గురువుకు మనము యివ్వగలిగినది రెండు కాసులు. ఒకటి ఢృఢమైన విశ్వాసము (శ్రధ్ధ) రెండవది ఓపిక (సహనము) అని శ్రీసాయి సత్ చరిత్రలో చెప్పబడింది. నీవు శ్రీసాయిని నీగురువుగా భావించితే నీవు కూడ శ్రధ్ధ, సహనములతో ఆయనను పూజించు. శ్రీసాయి అనుగ్రహము పొందటానికి ప్రయత్నించు. నేను నీకు యిచ్చిన ఈసలహానునీవు నీపిల్లలకు యిచ్చిన నాకు సంతోషము. నీవు శ్రీసాయిని నమ్మితే ఒక విషయము జ్ఞాపకము ఉంచుకో. మంత్రమునకు గాని, యుపదేశమునకు గాని ఎవ్వరి వద్దకు పోవద్దు. ఈవిషయములో శ్రీహేమాద్రిపంతు తన ఆలోచనలను వివరముగా శ్రీసాయి సత్ చరిత్రలో వ్రాసినారు. ఒకసారి బాగా చదివి అర్ధము చేసుకో. నేను 1989 నుండి 1991 వరకు శ్రీసాయి గురించి తెలుసుకోవాలని తపనతో ఎంతో మంది దగ్గరకు వెళ్ళినాను. నాకు తృప్తి కలగలేదు. శ్రీసాయి తన భక్తుడు శ్రీ బీ.వి.దేవుతో ఏవిషయమైన తెలుసుకోదలచిన తననే స్వయముగా అడిగి తెలుసుకోమన్న విషయము నేను గుర్తు చేసుకొంటు సరాసరి శ్రీసాయిని అడిగి తెలుసుకోవటము ప్రారంభించినాను.
ఇక్కడ నీకు ఒక సలహా యిస్తాను పాటించు. నీవు హేమాద్రిపంతు వ్రాసిన శ్రీసాయి సత్ చరిత్రకు యింగ్లీషు తెలుగు అనువాదాలు చదువు. శ్రీసాయి తత్వాన్ని గ్రహించు. శ్రీసాయి తత్వము అనే బాటలో ముందుకు సాగిపోతు కొంత జీవితాన్ని అనుభవించు.
ఇదే విషయము హేమాద్రిపంతు శ్రీసాయి సత్ చరిత్రలో ఈ విధముగా అన్నారు. "అవును బాబా! నా మనస్చాం చల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి , విశ్రాంతి కలిగినది. సత్యమార్గమును కనుగొనగలిగితిని". ఈ మాటలలో ని అర్దాన్ని నీవు తెలుసుకొంటావు. గురు శిష్యుల సంబంధముపై శ్రీసాయి చక్కటి ఉదాహరణ యిచ్చినారు. అది తల్లి తబేలు పిల్ల తాబేలు జీవన విధానము. యిటువంటి ఉదాహరణ యింకొకటి నేను చెబుతాను. మన హిందూ సాంస్కృతిలో పిల్లల భవిష్యత్ కోసము, వారి ఆరోగ్యము కోసము తల్లి ఉపవాసములు, పూజలు, నోము, వ్రతాలు ఆచరించుతుంది. దీని అర్ధము ఏమిటి ఒక్కసారి ఆలోచించు. తల్లినుండి పిల్లలు శారీరకముగా ఎంత దూరములో ఉన్న ఆపిల్లలు తల్లి మనసులో అంత దగ్గరగా యుండటము చేతనే ఆతల్లి తన పిల్లల యోగక్షేమము కోసము నోములు వ్రతాలు చేస్తుంది. అదే విధముగా శ్రీసాయి యొక్క భక్తులు శ్రీసాయి మనసులో చోటు చేసుకొని శ్రీసాయి యొక్క ప్రేమ అనురాగాలను ఆనాడు, ఈనాడు పొందగలగుతున్నారు.
శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి చెప్పిన ఈమాటలు గుర్తు చేసుకో - "ఏదైన సంబంధముండనిదే ఒకరు యింకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీవద్దకు వచ్చినచో నిర్ధాక్షిణ్యముగా వానిని తరిమి వేయకు. ఈ విషయము నీకు ఎక్కువ వ్రాయనక్కరలేదు. కారణము మన యింటిలోనికి నెల రోజుల క్రితము ఉదయము 5 గం టలకు పాలవాడి వెనకాలనే వచ్చిన చిల్లి (పిల్లి) మన యింట పెంపుడు పిల్లిగా మారిపోయిన సంగతి నీకు బాగా గుర్తు యుండి యుంటుంది కనుక. శ్రీసాయి యింకొక విషయము చెప్పినారు. "నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలియు మార్గము ఏర్పడును. నాకునీకు భేదము గలదనునదియే భక్తుని గురువునకు దూరముగానుంచుచున్నది . దానిని నశింపజేయనిదే మన ఐక్యత కలుగదు. అందుచేత ఈవిషయము గుర్తించి నీవు ప్రత్యక్షముగా శ్రీసాయితో సంబంధము పెట్టుకో. మధ్య వర్తులకు దూరంగా యుండు. శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయికి త్రాగుబోతులు అంటే అసహ్యము అని హేమాద్రిపంతు తెలియచేసినారు. బహుశ ఇదే కారణము అయి ఉండవచ్చును. నేను 1991 నుండి త్రాగుడు మానివేసినాను. ఈరోజున నేను సారాయికి బానిసను గాను, సాయికి మాత్రమే బా.ని.స. ను. యిది నా అదృష్టము. శ్రీసాయి సత్ చరిత్రలో కష్టమునకు కూలి అనే విషయములో శ్రీసాయి అంటారు. "ఒకరి కష్టమును యింకొకరు ఉంచుకొనరాదు". దాని వలన ఎదుటివానికి సుఖము, నీకు తృప్తి మిగులుతుంది.
శ్రీసాయి సేవలో
నీతండ్రి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment