29.03.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీవిష్ణుసహస్రనామం 54వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: సొమపో మృతస్సోమః పురుజిత్ పురుసత్తమః
వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్త్వతాంపతిః
తాత్పర్యం :: పరమాత్మను యజ్ఞము చేసి సోమరసమును, అమృతమును స్వీకరించువానిగా, తిరిగితిరిగి విజయములను సాధించువానిగా మానవునియందలి ఉత్తమోత్తమ మానవునిగా, వినయవంతునిగా, జయము కలిగించువానిగా, సత్యమున కంకితమయిన వానిగా, దాశ కులమునందు పుట్టినవానిగా, సాత్వతులవంశము వానిగా ధ్యానము చేయుము.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 21వ. అధ్యాయము
ఈ ఉత్తరములో నేను వ్రాసే విషయాలు చదివితే శ్రీసాయి ఒక్క శిరిడీలోనే లేరు, ఆయనను ఈప్రపంచములో ఏమూలన మనము నిలబడి పిలిచిన అక్కడ దర్శనము యిస్తారు అనేది నేను అనుభవ పూర్వకముగా వ్రాస్తున్నాను.
నీలో ఈ విషయాలు చాలా ఉత్సాహాన్ని కలుగ చేస్తాయి. జాగ్రత్తగా చదువు. శ్రీసాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు ఈవిధముగా వ్రాస్తారు "అత్యంత ప్రాచీన కాలమునుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ యున్నది. అనేకమంది యోగులనేక చోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారనేక చోట్ల పని చేసినను ఆందరు ఆ భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయునది యింకొకరికి తెలియును. ఒకరు చేసినదానిని యింకొకరు పూర్తి చేసెదరు" ఈమాటలు గుర్తు పెట్టుకొని నాజీవితములో జరిగిన అనుభవానికి జోడించి చూడు అపుడు హేమాద్రిపంతు వ్రాసినది అక్షరాల నిజము అని నీవు అంటావు. ఆరోజు 11.01.1991 శ్రీసాయి సత్ చరిత్రలో 21వ. అధ్యాయము నిత్యపారాయణ చేస్తున్నాను. ఆ అధ్యాయములోని సందేశము నన్ను చాలా ఆకట్టుకొన్నది. అది అప్ప అనే కన్నడ యోగి శ్రీ వీ.హెచ్.ఠాకూర్, బీ.ఏ.గారికి యిచ్చిన సందేశము. ఆసందేశము నాకు వర్తించుతుంది అని నమ్ముతాను. కారణము శ్రీ వీ.హెచ్.ఠాకూర్ గార్కి, నాకు జరిగిన సంఘటనలో పోలికలు ఉన్నాయి. ముందుగా ఆసందేశము "ఈ పుస్తకము నీవు చదవవలెను. నీవట్లు చేసినచో నీకోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తరదిక్కునకు పోయినపుడు నీవొక గొప్ప యోగిని నీ అదృష్టము చేత కలిసికొనెదవు. వారు నీభవిష్యత్తు మార్గమును చూపెదరు. నీమనసుకు శాంతి కలుగ చేసెదరు. నీకు అనందము కలుగచేసెదరు". ఈ అధ్యాయము పారాయణ చేసిన రెండు రోజుల తర్వాత మా ఆఫీసులో నలుగురు ఆఫీసర్లను ఆఫీసు పనిమీద కొరియా దేశానికి పంపవలెనని నిర్ణయించబడినది. మొత్తము ఎనిమిది మంది పేర్లు వినబడసాగినాయి. నాపేరు కూడా యుంది. ఆఎనిమిది మంది పేర్లలో - కాని, నలుగురి నే విదేశాలకు పంపుతారు. మరి అదృష్టము ఎవరిని వరించబోతున్నది ఎవరికి తెలియదు. 11.01.1991 నాడు నిత్యపారాయణలోని శ్రీసాయి సందేశము నిజము కావాలి అంటే నాపేరు మొదటి నలుగురి పేర్లలో యుండాలి. అంతా శ్రీసాయి దయ అని తలచి భారము శ్రీసాయి మీద వేసినాను. అదేరోజు ఆఫీసులో నన్ను పై అధికార్లు పిలిచి పాస్ పోర్టు కాగితాలపై నాచేత సంతకాలు పెట్టించినారు. నాసంతోషానికి హద్దులు లేవు. శ్రీసాయి దయ వలన నాపేరు మొదటిసారిగా వెళ్ళే యింజనీర్సులో రెండవ పేరుగా ఉన్నది. మొదటి పేరు నామిత్రుడు శ్రీనివాస్ రావుది. విధిగా నాపేరుతో ఉన్న పాస్ పోర్టు వచ్చినది. 01.05.1991 నాడు కొరియా దేశము సందర్శించవచ్చునని డిల్లీ నుండి విసా వచ్చినది. 05.05.1991 నాడు హైదరాబాద్ నుండి విమానములో బొంబాయి చేరుకొన్నాము. అక్కడనుండి కొరియా దేశానికి విమానములో వెళ్ళవలెను. కొరియా దేశము భారతదేశము నకు తూర్పు ఉత్తరము దిశలలో అంటే ఈశాన్యములో యున్నది.
05.05.1991 నాడు రాత్రి అంటే 06.05.1991 నాటి తెల్లవారు జామున బొంబాయి విమానాశ్రయమునుండి విమానములో కొరియా దేశానికి బయలుదేరి 06.05.1991 సాయంత్రము 6.30 నిమిషాలకు కొరియా దేశము చేరుకొన్నాము. నా విదేశీ ప్రయాణ వివరాలు అన్నీ సందర్భానుసారముగా ముందుముందు ఉత్తరాలలో నీకు వ్రాస్తాను అంత వరకు ఓపికతో యుండు. శ్రీ సాయి సత్ చరిత్రలో శ్రీఠాకూర్ "శ్రీసాయి పాదాలపై శిరస్సు పెట్టి నమస్కరించి తనను స్వీకరించి ఆశీర్వదించవలెనని ప్రార్ధించెను". యిది ఆనాడు శ్రీ వీ.హెచ్.ఠాకూర్ గార్కి లభించిన అదృష్టము. శ్రీసాయి నాకు అటువంటి అదృష్టాన్ని ప్రసాదించినారు. నేను కొరియా దేశములో 10.05.91 నాడు శ్రీసాయి సత్ చరిత్ర 51వ. అధ్యాయము పారాయణ పూర్తిచేసినాను. ఆరోజు శ్రీసాయి ఏవిదమైన అనుభూతిని కలుగచేయలేదని బాధపడుతు రోజు అంత ఆఫీసు పనిమీద గడిపినాను. రాత్రివేళ 8 గంటలకు నాకొరియా మిత్రుడు మిస్టర్ లీ నన్ను, నామిత్రుడు శ్రీనివాసరావును బయట హోటల్ కు భోజనమునకు తన కారులో తీసుకొని వెళ్ళినాడు. 9.30 నిమిషాలకు భోజనము పూర్తి అయినది. మేము ముగ్గురము చాంగ్ వాన్ పట్టణములో రాత్రి దీపాల కాంతిలో కారులో తిరుగుతున్నాము. నామనసులో శ్రీసాయి 51వ. అధ్యాయము పూర్తి చేసిన సందర్భములో కొత్త అనుభూతిని ఇవ్వలేదు అనే బాధ నిండియున్నది. బహుశ శ్రీసాయి దానిని గ్రహించి రాత్రి 9.45 నిమిషాలకు నామిత్రుడు శ్రీ లీ చేత పలికించిన మాటలు విను, "గోపాల ఈ ఊరు బయట కొండలు చూడు. ఆకొండ మీద బుధ్ధుని గుడి యుంది. ఆగుడిలో దీపాలు యింకా వెలుగుతున్నాయి. నీకు చూడాలని కోరిక యుంటే మనము ఆగుడికి వెళ్ళుదామా!" అనగానే శ్రీసాయి సాక్షాత్తు నాతో మాట్లాడినట్లు భావించి సంతోషముతో అంగీకరించినాను. శ్రీ లీ తన కారును గంటకు 90 కిలోమీటర్ల వేగముతో నడుపుతు ఆకొండ దగ్గరకు తీసుకొని వచ్చినాడు. అప్పటికి రాత్రి 10.15 నిమిషాలు అయినది. రోజు రాత్రి పది గంటలకు గుడిని మూసివేస్త్గారు. మన అదృష్టమును పరీక్షించుకొందాము అని శ్రీ లీ చెప్పగానే పరుగులు పెడుతు మేము 10.30 నిమిషాలకు కొండ మీద యున్న బుధ్ధుని గుడికి చేరుకొన్నాము. మాగురించే గుడి తలుపులు తెరచియున్నాయి అనే భావన కలిగినది. ఆగుడిలోని బౌధ్ధలామ ఆరు అడుగుల మనిషి. తెల్లని వస్త్రాలు ధరించి యున్నారు. ఆయన తలపై కేశాలు పూర్తిగా తొలగించి యున్నాయి. గుండ్రటి ముఖము, తెల్లని వర్చస్సు, చిరునవ్వుతో మాకు స్వాగతము పలికినారు. ఈవిధమైన ఆహ్వానానికి నామిత్రుడు శ్రీలీ చాలా ఆశ్చర్యపడినాడు.
మేము భారత దేశమునుండి వచ్చినాము అని నాకొరియా మిత్రుడు శ్రీలీ ఆబౌధ్ధ లామాకు మమ్ములను పరిచయము చేసినారు. ఆ లామా తను భారతదేశములోని బుధ్ధ గయ దర్శించినాను అని చెప్పినారు. యిక్కడ ఒక చిన్న విషయము గుర్తు పెట్టుకో ముందు ముందు 46వ. అధ్యాయములో శ్రీసాయి అన్నమాటలు "కాశి ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామా కంటే ముందుగనే గయలో కలిసికొనెద". బహుశ ఆనాడు శ్యామా కోర్కె తీర్చటానికి శ్రీసాయి పటము రూపములో గయలో శ్యామాకు దర్శనము ఇచ్చినారు. మరి 10.05.91 నాడు శ్రీసాయి నాకు చాంగ్ వాన్ పట్టణములోని కొండమీద బౌధ్ధ దేవాలయములో పూజారిగా నాకు దర్శనము యిచ్చినారు. ఆబౌధ్ధ లామా ఆరాత్రివేళ తన చెల్లెలును లేపి కొరియా దేశపు ఆచారము ప్రకారము ఆకుపచ్చ రంగు టీ తయారు చేయించి మాకు యిచ్చినారు. శ్రీసాయి స్వయముగా మాచేత టీ త్రాగించుచున్న అనుభూతిని పొందినాము. యిక్కడ యికొక విషయము ప్రస్తావించుతాను. 30వ. అధ్యాయము లో హేమద్రిపంతు కాకాజీ విషయములో అంటారు, "యోగి సంకల్పించనిదే వారిని జూడగలుగు వారు ఎవరు? అతని ఆజ్ఞ లేనిదే చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనముకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో, అంత త్వరగాను, బలముగాను, అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములొనర్చును. ఆనాడు కాకాజి విషయములో అట్లే జరిగెను. నావిషయములో మొదటిసారి శిరిడీకి 1989 వెళ్ళినపుడు, మరియు 10.05.91 నాడు కొరియాలోని చాగ్ వాన్ పట్టణము బౌధ్ధ దేవాలయమునకు వెళ్ళినపుడు అట్లే జరిగెను. యిది అంత శ్రీసాయి నాచేత 51వ. అధ్యాయము నిత్య పారాయణ చేయించి చేతికి ఫలము యిచ్చినట్లుగా భావించినాను. ఆగుడిలో జరిగిన ఒక సంఘటన వ్రాస్తాను. నేను భారతదేశమునుండి బయలుదేరేముందుగా రెండు డాలర్లను విడిగా పర్సులో పెట్టుకొన్నాను. ఆరెండు డాలర్లు కొరియా దేశములో ఎవరైన యోగీశ్వరులు దర్శనము యిస్తే వారికి దక్షిణగా యివ్వదలచుకొన్నాను. యిది నేను మ్రొక్కు కొన్న మొక్కు. శ్రీసాయి నాకు ఆబుధ్ధుని దేవాలయములోని లామా రూపములో దర్శనము యిచ్చినారు. మనసు ఆనందముతో నిండిపోయినది. రెండు చేతులు జోడించి ఆలామా (శ్రీసాయి) పాదాలపై శిరస్సు పెట్టి, నన్ను స్వీకరించి ఆశీర్వదించమని ప్రార్ధించినాను. ఆరెండు డాలర్లు దక్షిణగా స్వీకరించమన్నాను. ఆయన నన్ను ఆశీర్వదించి ఆరెండు డాలర్లు బుధ్ధుని పాదాల దగ్గర పెట్టమని చెప్పినారు. శ్రీసాయి రాత్రివేళలలో ఏభక్తుని దగ్గరనుండి దక్షిణ స్వీకరించలేదు. ఈవిషయము శ్రీ ఎం.వీ.కామత్ గారు వ్రాసిన పుస్తకము సాయిబాబా ఆఫ్ షిరిడీ, ఏ యూనిక్ సైంట్ 246వ.పేజీలో వ్రాయబడినది. ఆ బౌధ్ధ లామా మా ముగ్గిరికి మూడు వెండి లాకెట్లు ఆశీర్వచనాలతో యిచ్చినారు. ఆవెండి లాకెట్టు మీద స్వస్తిక్ ముద్ర యున్నది. యిదే ముద్రను నీవు శిరిడీసాయినాధుని సమాధి మందిరము గోడపై చూడగలవు. ఆబౌధ్ధ లామ (శ్రీసాయి) నాకు ఆవెండి లాకెట్టు యిస్తున్నపుడు సాక్షాత్తు శ్రీసాయినాధుడు నాకు వరము యిస్తున్న భావన పొందినాను. ఆ లాకెట్టు ఈనాడు నామెడలో యున్నది. ఆఖరి శ్వాస వరకు ఆ లాకెట్టు నామెడలో యుండాలని కోరుకొంటున్నాను. అంతా శ్రీసాయి దయ. యింక శ్రీహేమాద్రి పంతు నవవిధ భక్తి మార్గమును గురించి చెబుతారు. నేను ఆమార్గములో "శ్రీసాయి స్మరణ" మార్గాన్ని ఎన్నుకొన్నాను. అనుక్షణము శ్రీసాయి నామ స్మరణ చేస్తే శ్రీసాయి మనలకు ఎల్లపుడు కాపాడుతారు. మనకు ముక్తిని ప్రసాదించుతారు. శ్రీసాయి సత్ చరిత్రలో బాబా యిచ్చిన సందేశము. ఒకరి గూర్చి చెడ్డ చెప్పరాదు. అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు. యిది పాటించగలిగితే అందరు మన మిత్రులే అందరు సాయి స్వరూపులే.
శ్రీసాయి సేవలో
నీ తండ్రి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment