03.03.2013 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు హైదరాబాదు వచ్చిన కారణంగా శ్రీవిష్ణుసహస్రనామం శ్లోకం, తాత్పర్యం ఇవ్వలేకపోతున్నాను. పుణ్యభూమిలో దొరికిన రత్నమణి సాయి ని అందిస్తున్నాను. చదవండి.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 8వ.అధ్యాయము
ప్రియమైన చక్రపాణి,
ఈ ఉత్తరములో నా అనుభవాలు వ్రాయలేను. కారణము హేమాద్రిపంతు ఎనిమిదవ అధ్యాయములో ముఖ్యముగా శ్రీసాయి జీవన విధానము గురించి ఆయనకు ఆరోజులలో ఉన్న ముఖ్య భక్తులతో పరిచయము గురించి వర్ణించినారు. శ్రీసాయితో కలసిమెలసి యున్న హేమాద్రిపంతు మానవ శరీరము గురించి ఏమంటారు చూడు. "శరీరమును అశ్రధ్ధ చేయకూడదు . దానిని ప్రేమించకూడదు. కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుఱ్ఱము రౌతు తన గమ్యస్థానము చేరువరకు గుఱ్ఱమును ఎంత జాగ్రత్తగా చూచుకొనునో యంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను". యిక్కడ నీకు నీ చిన్ననాటి సంగతులు జ్ఞాపకము చేస్తాను. నీకు సైకిలు త్రొక్కడము వచ్చిన తర్వాత రోజూ సైకిలు షాపుకు వెళ్ళి సైకిలు అద్దెకు తెచ్చుకొని జాగ్రత్తగా వాడుకొని తిరిగి సైకిలు షాపువాడికి సైకిలును, ఎన్ని గంటలు త్రొక్కినది దానికి అద్దె యిస్తు ఉండేవాడివి. అలాగే ఈ జీవిత ప్రయాణము సాగించటానికి శరీరము అనే సైకిలుని 100 గంటలు (నూరు సంవత్సరాలు) కు భగవంతుని దగ్గరనుండి అద్దెకు తీసుకొని వచ్చినాము. దురదృష్ఠవశాత్తు మనము ఆసైకిలును (శరీరమును)గతుకులు రోడ్డుమీద నడిపి దానిని పాడు చేసుకొని 100 గంటలు పూర్తి కాకుండ షాపువాడికి (భగవంతునికి) తిరిగి యిచ్చి వేస్తున్నాము. శ్రీసాయి అనే గురువుని నమ్ముకొని సైకిలు త్రొక్కితే జీవించినంత కాలము గతుకులు (కష్ఠాలు) లేని రోడ్డు మీద ప్రయాణము సాగించవచ్చును. శ్రీసాయికి బధ్ధకము అంటే చాలా కోపము. భగవంతుడు మనకు చక్కటి మేధస్సు దానిని సరిగా వినియోగించుకోవటానికి కాలము యిచ్చినాడు. బధ్ధకము అనే జాడ్యమును దగ్గరకు రానిస్తే దాని పరిణామము ఎలాగ యుంటుంది ఒక్కసారి ఆలోచించు. బధ్ధకముతో మనము చేయవలసిన పనులు సరిగా చేయము. దానితో బ్రతుకు తెరువుకు అబధ్ధాలు చెప్పవలసియుంటుంది. ఒక్కసారి జీవితములో బధ్ధకము, అబధ్ధము ప్రవేశించితే దాని పరిణామము దొంగతనము చేయటమునకు దారి తీస్తుంది. ఒకమనిషి జీవితములో బధ్ధకము, అబధ్ధము, దొంగతనము అనె లక్షణాలు చోటు చేసుకొంటే ఆమనిషి జీవితము పతనము చెందుతుంది. అందుచేత జీవితములో బధ్ధకాన్ని దగ్గరకు రానీయకు. శ్రీసాయి మధ్యాహ్ న్నము వేళలో తన దగ్గరకు భక్తులు రాని సమయములో ఏకాంతముగా ఏమి చేస్తు ఉండేవారు అనేది తెలుసుకోవటానికి ప్రయత్నించు. వారు ఆసమయములో తన చినిగిపోయిన కఫ్నీ (చొక్కా) ని సూది, దారము తీసుకొని కుట్టుకొంటూ యుండేవారు. ఆయన భక్తులు ఆయన దగ్గరకు వచ్చి తాము కుట్టి పెడతాము అంటే అంగీకరించేవారు కాదు. కారణము బధ్ధకము అనే పిశాచమును దగ్గరకు రానీయకూడదు అని చెప్పేవారు. యిక బాబా భిక్షాటన గురించి హేమాద్రిపంతు వివరముగా చెప్పేవారు.
శ్రీసాయి తాను తెచ్చిన భిక్షను అంతా ద్వారకామాయి లో ఉంచిన మట్టిపాత్రలో వేసేవారు. ముందుగా మశీదు శుభ్రము చేసే స్త్రీ కొంత ఆహారము, మశీదులోని కుక్కలు, పిల్లులు కొంత ఆహారము తిన్న తర్వాత మిగిలిన ఆహారము అంతా కలిపివేసి కొన్ని ముద్దలు తినేవారు. వారు ఏనాడు రుచిని కోరలేదు. వారు తమ భోజనములో రుచి గురించి ఆలోచించలేదు. అటువంటిది శ్రీసాయి భోజన పధ్ధతి. యిక్కడ నా చిన్ననాటి సంఘటన ఒకటి చెబుతాను. నేను 7వ.తరగతి చదువుతున్నరోజులలో సైన్సు మాష్టారు మిశ్రమ ఆహారము గురించి పాఠము చెబుతున్నారు. ఆరోజు నేను క్లాసులో చాలా పరధ్యానముగా యున్నాను. పాఠము సరిగా వినలేదు. క్లాసు ఆఖరులో సైన్సు మాస్టారు నేను పరధ్యానముగా ఉన్నది లేనిది చూడటానికి "మిశ్రమ ఆహారము అంటే ఏమిటి?" అని ప్రశ్న వేసినారు. నేను పాఠము సరిగా వినలేదు. ఏదో సమాధానము చెప్పాలి లేకపోతే పరధ్యానముగా ఉన్నందులకు బెంచి ఎక్కవలసియుంటుంది. అందు చేత నేను ఒక క్షణము ఆలోచించి "మిశ్రమ ఆహారము అనగా మనము తినదలచుకొన్న వండిన పదార్ధములు అన్నింటిని ముందుగా ఒక గిన్నెలో మిశ్రమము చేసి (కలిపివేసి) తర్వాత తినే ఆహారమును మిశ్రమ ఆహారము" అందురు అని సమాధానము చెప్పినాను. క్లాసు విద్యార్ధులు అందరు గొల్లుమని నవ్వినారు. మరి ఈరోజున ఆనాటి క్లాసు విద్యార్ధులలో ఎవరైన శ్రీసాయి భక్తులు ఉంటే వారు ఆనాటి క్లాసులోని సంఘటన గురించి ఏమంటారు అనేది ఊహించలేని విషయముగా ఉన్నది. ద్వారకామాయిలో రోజూ రాత్రి శ్రీసాయితోపాటుగా, తాత్యా కోతేపాటిలు, మహల్సాపతి నిద్రపోయేవారు. వారు ముగ్గురు ద్వారకామాయిలో నేలపై తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరము వైపు మాత్రమే ఉంచి నిద్రపోయేవారు. దానికి కారణము ఏమి అయి ఉంటుంది అని ఆలోచిస్తే నాకు తోచిన సమాధానము, ఈ భూగోళములో తూర్పు,పడమర, ఉత్తరము వైపులలో జన జీవనము ఉన్నది. దక్షిణ ద్వారములో జన జీవనము లేదు. మనకు తెలియని రహస్యము శ్రీసాయికి తెలిసి యుంటుంది. అందుచేత వారు దక్షిణము వైపు తలపెట్టి నిద్ర్రించేవారు కాదు.
శ్రీసాయి సేవలో
నీతండ్రి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment