20.05.2013 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
వారం రోజులుగా హైదరాబాదులో ఉన్నకారణంగా ప్రచురించటానికి వీలుకుదరలేదు..ఈ రోజు, పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి అందిస్తున్నాను చదవండి.
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 70వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: కామదేవః కామపాలః కామీకాంతః కృతాగమః |
అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరో నంతో ధనంజయః ||
తాత్పర్యం: పరమాత్మను కోరికలకధిదేవతగా, కోరికలను కలిగించి పాలించువానిగా మరియూ కోరబడినవానిగా ధ్యానము చేయుము. ఆయన మనయందు శాస్త్రమును, సంప్రదాయమును నిర్మాణము చేయువాడు. ఆయన శరీరము నిర్దేశించుటకు సాధ్యము కాదు. చుట్టలుగా విచ్చుకొనుచున్న అనంతుడను కాలసర్పముగా, ధనమును జయించువానిగా ధ్యానము చేయుము.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 37వ. అధ్యాయము
09.02.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు శ్రీసాయి యొక్క గుణగణాలను, చావడి ఉత్సవము గురించిన వివరాలు వ్రాసినారు. శ్రీ సాయి సత్ చరిత్రలో శ్రీ హేమాద్రిపంతు అంటారు " వారు సోమరిగా గాని, నిద్రితులుగా గాని, కనిపించెడివారు కారు. వారు ఎల్లపుడు ఆత్మను సంధానము చేసిడివారు."
ఆయన మధ్యాహ్న్నవేళలో తీరుబడిగాకూర్చున్నపుడు తన పాత కఫనీల చిరుగులను ఆయనే స్వయముగా కుట్తుకొనేవారు. ఆపనిని ఆయన భక్తులు ప్రేమగా తాము చేస్తామనిన ఆయన అంగీకరించేవారు కాదు. ఈవిధమైన పని చేసి తన భక్తులను సోమరితనము వదలమని బోధించినారు. నిజానికి ఆయన చినిగిపోయిన చొక్కా (కఫనీ) ను కుట్టలేదు. చితికిపోయిన తన భక్తుల జీవితాలను దగ్గరకు చేర్చి కుట్టేవారు అని మనము గ్రహించాలి. శ్రీహేమాద్రిపంతు అంటారు "వారి సాంగత్యము వలన మనకు కలిగిన జ్ఞానము మనము మరణించువరకు నిలుచు గాక! ఎల్లపుడు హృదయ పూర్వకమగు భక్తితో వారి పాదాలకు సేవ చేసెదము గాక. వారిని సకల జీవకోటియందు చూచెదము గాక! వారి నామమును ఎల్లపుడు ప్రేమించెదము గాక! హేమాద్రిపంతు ఎంత అదృష్ఠవంతుడు. వారు పలికిన ప్రతి మాటను తమ జీవితములో ఆచరణలో పెట్టి తోటి సాయి బంధువులకు మార్గ దర్శకుడుగా నిలచినాడు.
ఈ విధానాన్ని నీవు నిజముగా పాటించగలిగితే నీవు నిజమైన సాయి భక్తుడుగా మారిపోతావు. మనము 1918 సంవత్సరము తర్వాత జన్మించినాము. శ్రీసాయి చావడి ఉత్సవము చూడలేదు. అందుచేత ఈ అధ్యాయమును శ్రధ్ధ భక్తితో చదువు. శ్రీసాయిని నీమనసులో నింపుకో. ఆచావడి ఉత్సవము యొక్క అనుభవాన్ని పొందు. శ్రీహేమాద్రిపంతు శ్రీసాయి పీల్చే చిలుము యొక్క అదృష్ఠాన్ని వర్ణించుతారు "జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తపః పరీక్షలకు నిలబడవలసి వచ్చినది. కుమ్మరులు దానిని త్రొక్కుట ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుటవంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు, హస్త స్పర్శకు నోచుకొన్నది." ఒక రోజున నేను ధ్యానములో శ్రీసాయి గురంచి శ్రీసాయి భక్తుల గురించి ఆలోచించుతుంటే ఒక అజ్ఞాత వ్యక్తియొక్క మాటలు వినబడినవి. "నీజీవితము నిప్పులో కాల్చబడిన యినుప ముద్ద. దానిపై సమ్మెట దెబ్బలు తగలనీ. ఆతర్వాత దానిని సాయి అనే ద్రావకములో ముంచబడని - అతర్వాత ఆ యినుపముద్ద యొక్క రంగు, రూపము చూసుకో". ఆ అజ్ఞాత వ్యక్తి నా ఆరాధ్య దైవము సాయినాధుడు. కాలిన యినుపముద్ద నాజీవితము. సమ్మెట దెబ్బలు నా జీవితములోని అనుభవాలు. మరి సాయి అనే ద్రావకములో మునిగే భాగ్యము శ్రీసాయి ఎప్పుడు ప్రసాదించుతారు అనే దాని కోసము ఎదురు చూస్తున్నాను.
చావడి ఉత్సవము పూర్తి అయిన తర్వాత భక్తులు అందరు శ్రీసాయికి నమస్కరించి యిండ్లకు వెళ్ళేవారు. ఆసమయంలో శ్రీసాయి తాత్యాను పిలిచి "నన్ను కాపాడుము. నీకిష్ఠము యున్నచో వెళ్ళుము గాని రాత్రి ఒకసారి వచ్చి నాగూర్చి కనుగొనుచుండుము." ఈ మాటలు వినటానికి యిబ్బందిగా యున్నది. కోటానుకోట్ల భక్తులను కాపాడే శ్రీసాయినాధుడు తాత్యాను పిలిచి తన్ను కాపాడమంటాడు ఏమిటి అని ఆలోచించుతున్నావా. యిక్కడ ఒక చిన్న రహస్యము నీకు చెబుతాను. శ్రీసాయి ఏనాడు రాత్రివేళలలో నిద్రపోలేదు. ఆయన రాత్రివేళలలో ద్వారకామాయిలోను, చావడిలోను తన నిజ శరీరాన్ని వదలి సూక్ష్మ శరీరముతో దూరప్రాతాలకు వెళ్ళి తన భక్తులను కాపాడేవారు. యోగ క్షేమాలు చూసేవారు. అటువంటి సమయములో నిజ శరీరము ధ్యానములో యండెడిది. శ్రీసాయి ధ్యానములో యున్న సమయములో ఆయనను ఎవరు పలకరించరాదు. పొరపాటున పలకరించితే శ్రీసాయికి ధ్యాన భంగము జరిగి శ్రీసాయి భక్తులకు కీడు జరిగేది. అటువంటిది జరగకుండా యుండటానికి తను ధ్యానములో యున్న సమయములో తన నిజ శరీరాన్ని ఎవరు తాకకుండా యుండటానికి ఆయన తాత్యా సహాయమును, మహల్సాపతి సహాయమును కోరేవారు. ఈవిషయము ఆర్థర్ ఆస్ బోర్న్ ఆంగ్లములో వ్రాసిన "ది యింక్రెడిబుల్ సాయిబాబా" అనే పుస్తకములో వివరించబడినది. యిటువంటి విషయాలు నీకు ముందు ముందు యింకా వ్రాస్తాను.
శెలవా మరి.
శ్రీసాయి సేవలో
నీతండ్రి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment