03.09.2013 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయితో మధురక్షణాలు - 17
మరలా వారం రోజుల తరువాత, మన బ్లాగులో ప్రచురణకు సాధ్యపడింది..ఆలశ్యమైన ప్రతీసారి బాబాని మన్నించమని కోరడం నాకే ఇబ్బందిగా ఉంది.. ఆంగ్ల పుస్తకంలోని మధురక్షణాలను అనువదించడంలో కాస్త సమయం తీసుకుంటోంది. అందుచేత ఆలశ్యం తప్పటల్లేదు..నాది ఈ నెల 30తారీకున పదవీ విరమణ..అప్పటినుండి పూర్తిగా బ్లాగుకు, ఇంకా మిగతా పనులకు పూర్తి సమయాన్ని కేటాయంచుకోవచ్చు.
ముందుగా శ్రీవిష్ణుసహస్ర నామం 84వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం : శుభాంగో లోకసారంగ స్సుతంతు స్తంతువర్ధనః |
ఇంద్రకర్మా మహాకర్మాకృతకర్మా కృతాగమః ||
తాత్పర్యం: పరమాత్మను శుభమైన ఆకారముతో శుభమయిన అవయవములతో కూడినవానిగా ధ్యానము చేయుము. ఆయన సకలలోకముల సారము తానేయైనవాడు. సృష్టియను దారము లేక సూత్రము తానేయైననూ మరల తానే తననుండి సృష్టిని దారముగా తీయువాడై యున్నాడు. ఆయన సృష్టియను మహాకార్యముగా మరి అట్టి కార్యము పరిపూర్తి చేయువానిగా నున్నాడు. సృష్టియందలి శాస్త్రీయ సంప్రదాయము కూడా తానే నిర్మించుకున్నాడు.
కాల్పనికత కన్నా వాస్తవం చాలా విచిత్రం
అన్ని లీలలోకెల్ల యిప్ప్పుడు చెప్పబోయే ఈ లీల చాలా విచిత్రం. డా.పి.ఎస్.ఆర్. స్వామిగారు తమ జీవితంలో అసలు జరగడానికే సాధ్యం కాని సంఘటన, ఎలా జరిగిందో మొత్తం జరిగిన తీరుని వివరిస్తున్నారు. బాబాకు అంకిత భక్తుడయిన ఆయనకు తన కొడుకు మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన బాబాను నిందించడం మొదలుపెట్టారు. బాబాయొక్క మాతృప్రేమ ఆయన హృదయానికి గాయాన్ని మిగిల్చింది. ఆసంఘటనే మూఢభక్తితో ఉండేలాగ చేసింది. ఈ లీలను ఆయన మనోరంజకంగా వివరించారు.
ఒక్క క్షణం ముందు, నా మొదటి కుమారుడు 10సంవత్సరముల వాడు చనిపోవడంతో దిక్కుతోచక పిచ్చెత్తినట్లయి బాబా అస్థిత్వాన్ని ఆయన సర్వవ్యాపకతను అంతా వట్టిదే అని నిందించాను. ఆయన భక్తులందరూ కూడా ఆయన సమాధి చెదకముందూ, చెందిన తరువాత సర్వత్రా నిండిఉన్నారని చెప్పిన అనుభవాలని నేను ఖండించాను.
ఆయన అసలు భగవంతుడే కాదు అని ఖండితంగా చెప్పి ఆయన చిత్రపటాన్ని పేడకుప్పలో విసిరిపడేయి అని నాభార్యను బ్రతిమిలాడాను. కాని, యిక్కడ ఆయన తాను ఉన్నాననే విషయాన్ని ఋజువు చేశారు.
అచేతనంగా స్పృహ లేకుండా పడివున్న నాకుమరుడి నోటిలో పోసిన మందు అలాగే ఉండిపోయింది. మందు మింగమని నేను గట్టిగా అరచి చెప్పాను. కాని, ఆనోరు అలాగే తెరచుకొని ఉండిపోయింది. నేను వొళ్ళుతెలియని స్థితిలో నోరు మూయడానికి ప్రయత్నించాను. కాని దవడలు గట్టిగా బిగుసుకుపోయి ఉన్నాయి. నాడి పట్టుకొని చూశాను. అదికూడా ఆగిపోయింది. వంట గదిలో ఉన్న భార్యను పిలిచి దైవాన్ని దూషిస్తూ చాలా పరుషంగా మాట్లాడాను. కొడుకు పోయిన వియోగంలో బాధపడుతున్నదామె. నేను చేసిన దైవ దూషణకి, అపచారానికి హృదయం బాగా గాయపడి మంచం ప్రక్కనే కళ్ళంబట కన్నీరు కార్చుతూ తలవంచుకుని కూర్చుంది. నన్ను ఆధ్యాత్మికానికి కట్టబడిన బంధం తెగిపోయే స్థితి వచ్చింది. యిక నేను నేను కాదు వళ్ళు తెలియని స్థితిలో ఉన్నాను. నేను క్రూరంగా సిగ్గులేకుండా, రోదిస్తున్న నాభార్యతో యిలా అన్నాను.
"పోయినవాడెలాగూ పోయాడు. నేను చావాలనుకోవటల్లేదు. నాకు ఆకలిగా వుంది. భోజనం చేయాలి వంట చేశావా" అనడిగాను. ఎటువంటి భావాలు లేకుండా, కేవలం శోకంలో మునిగిఉన్న తల్లితో అటువంటి అమానుషమైన ప్రశ్న వేసిన ఆతండ్రిని ఊహించుకోండి.
భగవంతునికి ఎంత కృతజ్ఞుడుగా ఉన్నప్పటికీ, మానవుని స్వభావం అధోగతి చెందడానికి అంతం లేదు.ఇక్కడ నేను చెప్పదలచుకునేదేమిటంటే నాలాగ కాకుండా నాభార్య నమ్మకం చివరి వరకూ కూడా ధృడంగానే ఉంది. నాదుర్మార్గ ప్రవర్తన కారణంగా బయటపడిన నా వెఱ్ఱితనం,నా భార్య సత్ప్రవర్తతన నుంచి నేనెలా తప్పించుకున్నానో ఆశ్చర్యంతో నేనేమీ చేయలేని పరిస్థితి. మానవునియొక్క గొప్పతనం ఎప్పుడూ పతనమవడంలో కాదు, పతనమవుతున్న ప్రతిసారీ నిలదొక్కుకొని నిలబడటంలోనే ఉందన్నది ఒక సామెత. ఆమె తన మృదుస్వరంతో "ఇప్పుడే పిల్లలకి వంట చేశాను. ఈ ఒక్కసారికి మీరే వడ్డించుకోమని కోరుతున్నాను" అన్నది. గతించినదాన్ని తలుచుకుంటూ ఆమె బాబాను ప్రార్ధిస్తూ ఉంని అనుకున్నాను.
నాకు నలుగురు పిల్లలు. అందులో యిద్దరు కవలలు. వారికి 6 నెలల వయసు. నామనస్సు, హృదయం కరడు కట్టాయి. ఎవరిమీద కూడా ఎటువంటి భావాలు, ఆలోచనలు లేవు. ఆఖరికి బాబా మీద కూడా. ఆవిధంగా నేను భోజనం చేయడానికి వంట గదిలోకి వెళ్ళాను. నాముందు కంచం పెట్టుకొని యాంత్రికంగా అన్నం వడ్డించుకొన్నాను. తినబోయేముందు అన్నం వంక నిస్తేజంగా, నిర్వేదంగా అలాగే కూర్చొని తేరిపార చూశాను. మనోవైకల్యం కలిగి, నా అంతరాత్మ నన్నిలా ప్రశ్నించింది "చూడు ! నువ్వేమి చేస్తున్నావో. నీ పెద్దకొడుకు అక్కడ చనిపోయి ఉంటే నువ్వు తినడానికి తయారయ్యావా?" నేనెంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నానో తెలిసి షాక్ కి గురయ్యాను. వంటగదికి ఎదురు వరుసలోనే ఉన్న మొదటి గదిలో ఉన్న మంచం మీదకు చూశాను.
అప్పుడే నాకళ్ళు అద్భుతమయిన బాబా రూపం మీదకు దృష్టి సారించాయి. అది కేవలం దృశ్యరూపమా లేక నా భ్రమా? యింకా తలవంచుకొని కూర్చున్న నాభార్యతో గట్టిగా అరచి చెపాను "కామూ ! ఎవరొచ్చరో వెళ్ళి చూడు" వుద్వేగంతో నిండిన నాస్వరంలోని ఆత్రుతను గమనించి నాభార్య గేటువయిపు చూసింది. ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్లుగా దృష్టిని సారించి, అంకిత భావంతో ప్రార్ధిస్తూ ఆశ్చర్యంతో ముగింపుగా " అమ్మా, నాయనా! బాబా వచ్చారు" అన్నది.
అవును, అక్కడ గేటువద్ద నిర్మలయయిన వదనంతో కనులలో కరుణారసం ఉట్టిపడుతూండగా కఫ్నీ ధరించి, తలమీద చుట్టుకొన్న గుడ్డ భుజములమీదనుండి వేళ్ళడుతూ, కుడి చేతిలో భిక్షాపాత్ర పట్టుకొని, ఎడమచేయి ముడుచుకొని కుడి భుజమ్మీద వేసుకొని నిలబడి ఉన్నారు. సత్ చరిత్ర ఆంగ్ల భాషలో నున్న పుస్తకంలో 112వ. పేజీలో ఆయన ఫొటో ఎలా ఉన్నదో సరిగా అలాగే ఉన్నారు. నేను ఒక్కసారిగా ఖంగుతిని ఆశ్చర్యపోయాను.
వాస్తవానికి ఆప్పటికింకా మేమిద్దరిలో ఎవరమూ సత్ చరిత్ర బాబా ఫోటోకుడా చూడలేదు. మాపూజాగదిలో బాబా కాలుమీద కాలు వేసుకొని ఉన్న ఫోటో మాత్రమే ఉంది.
ఏమయినప్పటికీ ఆయన తన అతి నిగూఢమయిన జ్ఞానంతో అయిదునెలలముందే యిప్పటి ఈ భంగిమతో ఉన్న అయిదు రకాల భంగిమలతో ఉన్న చిత్తరువులను కొనేలా చేశారు. అందుచేతనే మేము ఆయనని వెంటనే గుర్తుపట్టాము. నాకిప్పుడు ఖచ్చితంగా ఆయన బాబాయే అని అనిపించింది. నేను తిరిగి స్పృహలోకి వచ్చాను సరిగా యిదే క్షణంలో మమ్ములని ఈ కష్టం నుంచి గట్టెక్కిచడానికి బాబా రావడంతో నాహృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. లేకపోతే నాతెలివి తక్కువతనంతో ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన గురించిగాని, ఆయన మీద గాని. ఎటువంటి ధ్యాస లేకుండా నాముందున్న ఆహారాన్ని అపవిత్రం చేసి ఉండేవాడిని.
ఇలా నూతనంగా లభించిన ఆనందంతో నేను ఎంతో వినయంతో కంచం తీసుకొని వెళ్ళి అన్నం అతని భిక్షాపాత్రలో వేశాను. అతను దానిని స్వీకరించి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నిజానికి అంత అవసరం కూడా లేదు. నాహృదయం ఆనందంతో నిండిపోయింది. గట్టెక్కినట్లు అనిపించి అర్ధం చేసుకోగానే ఎంతో శాంతి లభించింది.
నేను యింట్లోకి అడుగు పెట్టగానే, మా అబ్బాయి కళ్ళు తెరచి, "నాన్నా నాకు దాహంగా ఉంది. కాస్త మంచినీళ్ళు యివ్వు"!!! ఈ సంఘటన బాబా మహాసమాధి చెదిన 26 సం.తరువాత మార్చి, 1944 లో జరిగింది. మానవ శక్తికి సాధ్యం కానిది, సాధ్యపడింది.
శ్రీసాయిలీల
సెప్టెంబరు 1986
డా.పీ.ఎస్.ఆర్.స్వామి, హైదరాబాదు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment