03.10.2014 శుక్రవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
విజయదశమి శుభాకాంక్షలు
ఈ రోజు సాయిలీల పత్రిక జనవరి - ఫిబ్రవరి 2008 సంచికలోని మరొక బాబా లీలను తెలుసుకొందాము.
బాబా ఇప్పటికీ సజీవంగా ఉండి కోరికలు తీరుస్తున్నారా?
మాకుటుంబంలో మేమంతా సాయి భక్తులం. బాబా దయవల్ల సంవత్సరాల తరబడి మాకెన్నో అనుభవాలు కలుగుతూ ఉన్నాయి. ఈ మధ్యనే మా అమ్మగారికి బాబా చూపించిన అనుభూతి మరపురానిది. బాబా బోధించినవాటిని మా అమ్మగారు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. కారణం బాబా అంటే విపరీతమయిన భక్తి. ఆవిడ ధృఢమయిన భక్తికి మా అమ్మగారిని అభినందించకుండా ఉండలేను. ఆవిడ చేసే ప్రార్ధనల వల్ల మాకెన్నో సత్ఫలితాలు కలిగాయి.
నోయిడాలో ఉన్న సాయిబాబా మందిరానికి మా అమ్మగారు ప్రతిరోజూ రెండు సార్లు వెడుతూ ఉండేవారు. ఆరోజు నవంబరు 25వ.తారీకు 2004వ.సంవత్సరం సాయిబాబా విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజు. బాబాకు క్షీరాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమయే రోజు. ఆసందర్భంగా మా అమ్మగారు బాబా క్షీరాభిషేకానికి ఒక పాల పాకెట్ సమర్పించుదామనుకొన్నారు. క్షీరాభిషేకం ప్రారంభమవడానికి ముందుగానే బాబా మందిరానికి చేరుకుందామనే ఉద్దేశ్యంతో, ఉదయాన్నే కాస్త తొందరగా పాలు తీసుకు రమ్మని మాకు ప్రతిరోజు పాలు తెచ్చే అతనికి చెప్పింది. కాని మాపాలతను చెప్పిన సమయానికి ఉదయాన్నే పాలు తీసుకురాలేదు. ఇక ఆలశ్యమయిపోతుందని మా అమ్మగారు ఉదయం గం.6.30 ని.కల్లా గుడికి బయలుదేరారు.
బాబా గుడికి వెడుతున్నంత సేపూ క్షీరాభిషేకం చేయించాలనె తన కోర్కెను ఎలాగైనా తీర్చమని దారంతా బాబా ని ప్రార్ధిస్తూ ఉన్నారు. ఇక గుడి దగ్గరకు చేరుకోవడానికి కొద్ది దూరం ఉండగా ఆమె ప్రక్కకు ఒక కారు వచ్చి ఆగింది. కారులోనుండి ఒక స్త్రీ దిగి ఒక పాల పాకెట్టు మా అమ్మగారికిచ్చి బాబాకు క్షీరాభిషేకానికి సమర్పించమని చెప్పింది. అలా చెప్పి ఆమె కారులో వెళ్ళిపోయింది. మా అమ్మగారికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. కళ్ళలో ఆనందభాష్పాలు నిండిపోయాయి. బాబా తన మనసులోని కోరికను ఈవిధంగా తీర్చినందుకు బాబాకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. కారులో వచ్చినామెకు తాను సాయిబాబా గుడికి వెడుతున్నానని ఎలా తెలుసు?
సాయీ అంటే ఓయీ అని పిలిస్తే పలుకుతాననే తానిచ్చిన మాటను అక్షరాలా నిజం చేసి చూపించారు.
కూర్పు: జ్యోతిరాజన్ రౌత్
సీమా వర్మ, 148/H - 19
సెక్టర్ 7, రోహిణి, న్యూడిల్లి - 110 085
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment