Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, December 22, 2014

సాయి చేసిన అద్భుత వైద్యం

Posted by tyagaraju on 8:17 AM
         
               

22.12.2014 సోమవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయిలీల ద్వైమాసపత్రిక మే-జూన్ 2008  సంచికలోని మరొక అధ్బుతమైన లీల గురించి తెలుసుకొందాము.
సాయి చేసిన అద్భుత వైద్యం
రవికుమార్ ఖోషు (120 టి.పూంచ్ హౌస్, గవర్నమెంట్ ఫ్లాట్స్, తలాబ్ టిల్లూ, జమ్మూ - 180 002)

1980వ.సంవత్సరంలో మానాన్నగారికి ఒకరు సాయిబాబా క్యాలండర్  బహూకరించారు.  మేము ఆయోగిపుంగవుని పూజించకపోయినా ఆయన మీద గౌరవంతో ఆక్యాలండర్ ను నాగదిలో గోడకు తగిలించాను.  


1989వ.సంవత్సరంలో రెండున్నరఏళ్ళు వయసుగల మా బాబుకి అలోపేషియా (బట్టతల) వ్యాధి సోకింది.  అల్లోపతి, ఆయుర్వేదం మందులు వాడినా గాని వ్యాధి తగ్గలేదు.  తల మీదున్న వెంట్రుకలన్నీ ఊడిపోయి తలంతా బట్టతల అయిపోయింది.  ఆఖరికి వంటిమీదున్న వెంట్రుకలు కూడా ఊడిపోయాయి.  చండీఘర్ లో ఉన్న వైద్యులు బాబుకి 13 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత తీసుకురమ్మనమని, అప్పుడు స్టెరాయిడ్స్ యిచ్చి వైద్యం చేస్తామని చెప్పారు.  ఆవైద్యం యిపుడే మొదలు పెడితే అబ్బాయి పెరుగుదలకి ఆటంకమని అన్నారు.

ఆఫీసులో నాస్నేహితునితో మా అబ్బాయి సమస్య గురించి చెప్పాను.  నాతోటి ఆఫీసరు ఒకాయన షిరిడీ సాయిబాబా గురించి ఏమన్నా నీకు తెలుసా అని అడిగారు.  అబ్బాయికి సాయిబాబా వారికి సంబంధించిన వైద్యం ఏదయినా చేయించడానికి నీకిష్టమేనా? అని కూడా అడిగారు.  బాబా గురించి నాకసలు ఏమీ తెలియకపోవడం వల్ల అబ్బాయి పరిస్థితిని చూసి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో ఆయన చెప్పినట్లు చేయడానికి నేను సిధ్ధమయ్యాను. తరువాత ఆయన నన్ను తన యింటికి తీసుకొని వెళ్ళి సాయి ఫోటో యిచ్చారు. దానికి ఫ్రేం కట్టించి భక్తితో దానిని పూజిస్తూ ఉండమని ప్రతి గురువారం శాఖాహారం మాత్రమే తీసుకోమని చెప్పారు.  ఆయన నాకు ఊదీ ,ద్వారకామాయినుంచి తెచ్చిన నూనె యిచ్చి, ఊదీని అబ్బాయి నోటిలో వేసి, నూనెను శరీరమంతా రాయమని చెప్పారు.

నేను పూర్తి మాంసాహారిని.  కాశ్మీర్ లాంటి చలి ప్రదేశంలో శాఖాహారిగా ఉండే ప్రసక్తే లేదు.  కాని నేను ఆఫిసరుగారు చెప్పిన సలహాని ఖచ్చితంగా పాటించసాగాను.  ఆరోజుల్లో నేను  రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయంలో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 

 హెడ్ ఆఫీసులో జరిగే అన్ని సమావేశాల్లోను తినడానికి మాంసాహారానికి సంబంధించినవే పెడుతూ ఉంటారు.  ఆసంవత్సరం సమావేశాలన్నీ కూడా గురువారాలలోనే జరుగుతూ ఉండేవి.  కాని, నేను మాంసాహారాన్ని ఏవిధంగానైనా సరే ముట్టుకునేవాడిని కాదు.  నా సహోగ్యోగులంతా చాలా ఆశ్చర్యపోయేవారు.  బహుశ బాబా నన్ను పరీక్షిస్తూ ఉన్నారేమో.  

ఆఫీసరుగారు చెప్పిన మీదట నేను కుటుంబంతో సహా మొదటిసారిగా 1990 సం.జనవరిలో షిరిడీ వెళ్ళాను. మేము షిరిడీలో వారం రోజులున్నాము.  లెండిబాగ్ లో శాఖాహారం మాంసాహారం యొక్క ఉపయోగాలను గురించి జరిగిన ఉపన్యాసాలు విన్న తరువాత, నేను, నాభార్య యికనుంచి మాంసాహారం ముట్టకూడదనే నిర్ణయానికి వచ్చాము.  అప్పటినుండి మేము పూర్తి శాఖాహారులుగా మారిపోయాము.  మా ఆఫీసరు గారు యిచ్చిన పరిచయ పత్రం తీసుకొని వెళ్ళి శివనేశన్ స్వామీజీగారిని కలిసాము. 

 ఆయన మా అబ్బాయిని చూసి ఊది, బాబాకి ఉదయం స్నానం చేయించగా వచ్చిన నీటి తీర్ధం, సింధూరం (ద్వారకామాయిలో బాబా చిత్రపటానికి ఉపయోగించినది) యిచ్చారు.  ఆయన శ్రీబ్రజ్ రావ్ దాల్వేగారితో (శ్రీ సియారాంజీ) అబ్బాయికి కొన్ని మందులను తయారు చేసి యిమ్మని చెప్పారు.  బాబా అనుగ్రహం కోసం ప్రార్ధించమని బాబా ఆశీర్వాద బలంతో సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పారు.  బాబా అనుగ్రహంతో శ్రీసియారాంజీ గారు తయారు చేసిన మందులను శ్రధ్ధగా వాడాము.  రెండు సంవత్సరాల తరువాత బాబుకి జుట్టు పెరగడం ప్రారంభమయింది.  బాబుకి ఏర్పడ్డ సమస్యలన్నీ తీరిపోయాయి.  ఈరోజు బాబుకి వున్న వ్యాధి పూర్గిగా తగ్గిపోయి బొంబాయిలో యింజనీరింగ్ చదువుతున్నాడు.

 బాబా చేసే అద్భుతాలలో 1992లో, ఒక సంఘటన జరిగింది. ఒకరోజున నాభార్య, యిప్పుడు పైన చెప్పిన మాబాబు తో (అప్పటికి వాడి వయస్సు 4 సంవత్సరాలు) జమ్మూలోని గంగ్వాల్ లో ఉన్న తన మేమామ యింటికి  వెళ్ళి సాయంత్రం వేళ తిరిగి వస్తోంది.  ఇల్లు మెయిన్ రోడ్ కి 1.5 కి.మీ. దూరంలో ఉంది.  ఆకాశమంతా దట్టంగా మబ్బులు పట్టి ఉంది.  రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది.  

నాభార్య చాలా భయంతో ఒంటరిగా రోడ్డుకు చేరుకోవడం సాధ్యం కాదేమోనని మా అబ్బాయితో అంది.  అప్పుడు మా అబ్బాయి భయపడకమ్మా! మనముందు సాయిబాబా గారు నడుస్తూ ఉన్నారు అన్నాడు.  అపుడు నాభార్య మన ముందెవరూ లేరు, నాకెవరూ కనబడటల్లేదు అని అంది.  మా అబ్బాయి, మనం మాయయ్య యింటినుండి బయలుదేరినప్పటినుండి మనముందే సాయిబాబాగారు నడుస్తూ ఉన్నారు భయం లేదని పదే పదే చెప్పాడు.  ఆలశ్యమయినా గాని యిద్దరూ క్షేమంగా యింటికి చేరుకొన్నారు.  

ఇంకొకసారి అదేసంవత్సరంలో నాభార్య, కుమార్తె, అబ్బాయి ముగ్గురూ పగటివేళ యింటికి తిరిగి వస్తున్నారు.  అవి వర్షాకాలం రోజులు. రోడ్డు దాటాలంటే మధ్యలో చిన్న కాలవ ఉంది .  కాలవ దాటడానికి రెండు సిమెంటు స్థంభాలు కాలవ మీదుగా వేసి ఉన్నాయి.  వాటిమీద నుంచి జాగ్రత్తగా బాలన్స్ చేసుకొంటూ దాటాల్సి వుంది.  వర్షాలు విపరీతంగా కురవడం వల్ల కాలువలో నీరు నిండుగా ప్రవహిస్తూ ఉంది.  నీరు 2-3 అడుగులు పైకి ప్రవహిస్తూ ఉండటంతో సిమెంట్ స్థంభాలు నీటిలో మునిగి ఉన్నాయి.  పిల్లలతో ఈ కాలువ దాటడం ఎలాగరా భగవంతుడా అని బెంగ పెట్టుకొంది నాభార్య.  సాయం కోసం బాబాని ప్రార్ధిస్తూ ఉంది.  బాబా సాయం లేకపోతే ఆవర్షంలో చిక్కుకుపోవాలి.  

అకస్మాత్తుగా 14-15 సంవత్సరాల వయసుగల శిక్కు కుఱ్ఱవాడు ఎక్కడినుండి వచ్చాడో తెలీదు.  వీరివైపుకు వచ్చి నీపిల్లలిద్దరినీ నేను కాలువ దాటిస్తానని చెప్పి, యిద్దరినీ తన భుజాలమీదకెత్తుకొని కాలువ దాటాడు.  ఆకుఱ్ఱవాడు పిల్లలిద్దరినీ ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతాడో అనే భయంతో దాదాపుగా అతని వెనకాలే పరుగెత్తింది.  కాలవ దాటగానె ఆకుఱ్ఱవాడు. పిల్లలిద్దరినీ రోడ్డు ప్రక్కన దించాడు.  నాభార్య పిల్లలతో మాట్లాడుతూ ఉంది.  కొద్ది నిమిషాల తరువాత సర్దార్ కుఱ్ఱవాడు గుర్తుకు వచ్చి అతని కోసం చూసింది.  కాని ఆకుఱ్ఱవాడు ఎక్కడా కనపడలేదు. పైగా ఆరోడ్డు కూడా తిన్నగా ఎటువంటి సందులు లేకుండా ఉంది.  మరి ఆకుఱ్ఱవాడు ఎలామాయమయిపోయాడు అంత హటాత్తుగా?  అప్పుడామెకు ఆలోచన తట్టింది.  బాబా ఆపిల్లవాని రూఫంలో వచ్చి సహాయం చేశారని.  బాబాయే కనక సహాయం చేయకపోతే తాను పిల్లలతో ఆకాలువను దాటడం కష్టసాధ్యమయ్యేది.  తరువాత తెలిసిన విషయం ఆకాలువలో నీటిప్రవాహం తగ్గడానికి 10-12 గంటలు పట్టిందని.

కాలేజీలకు, స్కూళ్ళకి వేసవికాలం శెలవలు యిచ్చినపుడు జూన్-జూలై నెలలో మేమంతా షిరిడీ వెళ్ళి వస్తూ ఉంటాము.  ఇన్ని సంవత్సరాలుగా షిరిడీ వెడుతున్న ప్రతిసారీ , నాకు ఆఖరి నిమిషంలో శెలవు మంజూరయినా, నేనెప్పుడూ టిక్కెట్ రిజర్వేషన్ కి యిబ్బది పడలేదు.  ప్రతిసారి మాకు రాను పోను టిక్కెట్స్ కన్ ఫర్మడ్ రిజర్వేషన్ దొరికేవి.  బహుశా బాబా మాకోసం మేము ప్రయాణం చేసే రోజుకి ఎప్పుడూ 4-5 టిక్కెట్లు ఖాళీ ఉండేలాగా చేసే వారు అని నా ప్రగాఢ విశ్వాసం. 

ఒకరోజున నేను గురుస్థాన్ లో సాయిబాబా పాదాలముందు నాశిరసునుంచి ప్రార్ధిస్తున్నాను.  నానుదిటినుండి ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లుగా నాశరీరమంతా వ్యాపించింది.  అదేరోజు సాయంత్రం మరలా అదే విధంగా  జరిగింది.  నేను నాభార్యా, పిల్లలకి కూడా అటువంటి అనుభూతి ఏమయినా కలిగిందా అని అడిగాను.  కాని వారు తమకలాంటిదేమీ కలగలేదని చెప్పారు.  శివనేశన్ స్వామీజీకి నాకు కలిగిన అనుభూతిని వివరించాను.  అది బాబా నామీద కురిపించిన ఆశీస్సులని చెప్పారు.  బాబా గుడికి వెళ్ళిన ప్రతిసారి ఎన్నో అనుభావాలు కలిగాయి. 
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List