26.09.2015 ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి భక్తులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు హెతాల్ పటెల్ రావత్ గారి బ్లాగునుండి సేకరించిన ఒక సాయి భక్తురాలి అనుభవం తెలుసుకుందాం.
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
పిలిస్తే పలికే దైవం
యునైటెడ్ కింగ్ డం నుండి ఒక సాయిభక్తురాలి అనుభవం:
నాకు సాయిబాబా అంటే ఎంతో నమ్మకం. ఈ సంఘటన, నాకు పాప పుట్టిన మరుసటిరోజున జరిగింది. అప్పుడు నేను లండన్ లో ఆస్పత్రిలో ఉన్నాను. నాకు అమ్మాయి పుట్టింది. కాని పుట్టిన వెంటనే పాపకి ఊపిరితిత్తులలో సమస్య ఏర్ఫడి శ్వాసతీసుకోవడంలో చాలా ఇబ్బంది పడసాగింది. వెంటనే పాపని నియో నాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు. ప్రాణానికి కూడా ప్రమాదం కలగవచ్చని డాక్టర్ లు చెప్పారు. పాపకి యాంటీబయాటిక్స్ వాడుతూ ఐ.వీ. కూడా పెట్టారు. అప్పుడే పుట్టిన పాప లేలేత చేతులకి సూదులు, పక్కన యంత్రాలు, మొదటిసారిగా ఈ స్థితిలో (NICU ) లో ఉన్న పాపని చూసి నా గుండె బ్రద్దలయింది.
ప్రసూతి వార్డ్ లోకి నిర్ణీత సమయాలలో తప్ప ఎవరినీ అనుమతించరు. కొన్ని బ్లాకులు దాటి వెళ్ళాలి. అక్కడ ఒక బ్లాకులో (NICU) పాప ఉంది.
మానసికంగాను, శారీరకంగాను బలహీనంగా, నిస్పృహతో ఉండటం వల్ల నేను పాపని చూడటానికి వెళ్ళలేని పరిస్థితి. ఒంటరిగా చాలా నిరాశతో ఏడుపు తప్ప ఏమీ చేయలేకుండా ఉన్నాను. రెండురోజుల తరువాత ఏదయినా శుభవార్త వినవచ్చనే ఆశతో నా పాప ఉన్న బ్లాక్ వద్దకు వెళ్ళాను. పాపకి లంగ్స్ పరిస్థితి బాగానే ఉందనీ, కాని పరిస్థితి లో మాత్రం మార్పు లేదని చెప్పారు. యాంటీబయాటిక్స్ యింకా వారం రోజులు వాడాలని అందుచేత మరొక వారంరోజులు ఐ.సీ.యూ.లోనే ఉంచాలని చెప్పారు. నావార్డుకి తిరిగివచ్చి మంచం మీద పడుకుని ఏడవసాగాను.
నాలో నేనే బాబాతో మాట్లాడటం మొదలుపెట్టాను. "నేను ఇక్కడినుండి నాపాపను చూడటానికి నడిచివెళ్ళే శక్తి లేదు. నాపాపని అటువంటి స్థితిలో చూసి తట్టుకునే ధైర్యం కూడా లేదు నాకు. నువ్వే నాపాపకు సహాయం చేయాలి". ఈ విధంగా నా నమనసులోనే బాబాతో నాబాధని చెప్పుకుంటున్నాను. వెంటనే నాకు చాలా కోపం వచ్చింది.
ఆకోపంలో బాబాతో "నాపాప అలా అవడానికి కారణం నువ్వే. నువ్వే దీనిని పరిష్కరించాలి. ఏవిధంగా అన్నది నాకు తెలీదు. కాని ఇప్పుడే ఈక్షణంలోనే పాపకి బాధ తగ్గిపోవాలి. కావాలంటే ఆ బాధను నేను భరిస్తాను. కాని అభం శుభం తెలీని ఆపసిపిల్ల మటుకు క్షేమంగా ఉండాలి". ఏమీపాలుపోని పరిస్థితిలో నిరాశ నన్నావహించింది. కళ్ళంబట కన్నీరు ధారగా కారిపోతోంది.
అదేక్షణంలో ఒక నర్సు నాగదిలోకి ప్రవేశించింది. ఆమెవంక సూటిగా చూడలేక గబగబా కన్నీరు తుడుచుకున్నాను. ఆ నర్సు నావద్దకు వచ్చి అంతా బాగానే ఉందా అని అడిగింది. కాని ఆమె ఎప్పుడూ నాగదిలోకి వచ్చే నర్సు కాదు. "నేను మామూలుగా రౌండ్స్ కి వస్తూ ఇలా వచ్చాను" అని చెప్పింది. నేను ఆమెను హలో అని చిన్న నవ్వుతో పలకరించి బాగానే ఉన్నానని చెప్పాను. నర్సు పాప ఎక్కడ ఉంది అని అడిగింది. పాప ఎన్ ఐ సీ.యూ లో ఉందని చెప్పాను. విచిత్రం ఆమే అలా నాతో మాట్లాడుతూనే ఉంది. ఆమె నన్ను "అసలు మీరు ఎక్కడివారు" అనడిగింది. మాది భారతదేశం అని చెప్పాను. అదివినగానే మొట్టమొదటగా ఆమె నన్ను "నీకు షిరిడీసాయిబాబా" తెలుసా అని ప్రశ్నించింది. ఆప్రశ్న వినగానే ఒక్కసారిగా నేను అప్రతిభురాలినయ్యాను. క్షణం క్రితం అప్పుడే నేను నామనసులో సాయితో మాట్లాడుతున్నాను. సాయిబాబా అంటే నీకు నమ్మకం ఉందా అని అడిగింది. వెంటనె నేను బాబా అంటే నాకు నమ్మకం ఉందని చెప్పాను. అధ్బుతమేమీ జరగకపోయినా, ఆమెతో మాట్లడుతుంటే నాకెంతో సంతోషం అనిపించింది. ఆ వెంటనే ఆమె "నేను సాయివ్రతాన్ని పూర్తి చేసాను. నీకు సాయిప్రసాదం, పుస్తకం ఇస్తాను. తీసుకోవడానికి ఏమన్నా అభ్యంతరముందా" అని అడిగింది నన్ను. నేనింకా ఆశ్చర్యంలోనుండి తేరుకోకుండానె అభ్యంతరం లేదని చెప్పాను. "నేను వీటిని నీ బాగ్ లో పెడతాను. ఇంటికి వెళ్ళి స్నానం చేసి ప్రసాదం పంచమని" చెప్పింది. నేను అలాగే అని ఆమెకి కృతజ్ఞతలు చెప్పాను.
నేను ఇక్కడ ఆస్పత్రిలో ఉన్న రెండురోజుల క్రితం కూడా ఆ నర్సుని చూడలేదు. ఎటువంటి పరిస్థితులలోనయినా నన్ను ధైర్యంగా ఉండమని భగవంతుడే నాకీవిధంగా తన ఆశీర్వాదాలను పంపించాడనిపించింది నాకు. ఇదంతా మంచికోసమే జరిగిందని భావించాను. ఈసంఘటన ఉదయం 10 గంటలకు జరిగింది. నేను నాపాపని ఉదయం 8 గంటలకు చూశాను. మధ్యాహ్నం రెండుగంటలకు డాక్టర్ వచ్చి పాపకి రక్తపరీక్షలో నెగెటివ్ వచ్చిందనీ మరుసటిరోజు ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పారు.
ఆనందం పట్టలేకపోయాను. ఆ సంతోషం నాకు కంట నీరొచ్చింది. నేను నాబాబాకి ఏవిధంగా నా కృతజ్ఞతలు చెప్పుకోగలను? ఏవిధంగా ఆయన్ని పొగడగలను? ఎంతపొగిడినా, కీర్తించినా తక్కువే. సాయంత్రం 5 గంటలకి విజిటింగ్ అవర్స్ లో డాక్టర్ గారు మళ్ళీ వచ్చి "పాప ఇప్పుడు చాలా బాగుంది. అన్ని పరీక్షలు చేసేశాము. రేపు కాకుండా ఈరోజు సాయంత్రమె ఇంటికి వెళ్ళిపోవచ్చు" అన్నారు. ఆరోగ్యవంతమైన పాపను తీసుకొని ఆరోజు రాత్రి 8 గంటలకి ఇంటికి వచ్చేశాము. బాబాకి ధన్యవాదాలు చెప్పడానికి నాకు మాటలు చాలవు. నేనెప్పటికీ ఆయనకు ఋణపడి ఉన్నాను. బాబాను ప్రార్ధించే ప్రతిసారి ఆయనకు నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. నామీద బాబా చూపించే ప్రేమకి కొలమానం లేదు. అది వెలకట్టలేనిది. ఆయన నాతండ్రి, నా దైవం. నన్నెప్పుడు కనిపెట్టుకుని నా యోగక్షేమాలు చూస్తూ ఉంటారు. సాయిరాం.
(సర్వం శ్రీసాయినాదార్పణమస్తు)
0 comments:
Post a Comment