08.01.2016 శుక్రవారమ్
ఓంసాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
శ్రీ జీ.ఎస్.ఖపర్డే
గారి డైరీ నుండి మరికొన్ని విశేషాలు
డైరీ నుండి కొన్నిటిని
ఇవ్వటంలేదు. ముఖ్యమయిన విశేషాలు ఉన్నవే ఇస్తున్నాను. అందుచేత మధ్య మధ్యలో కొన్ని తేదీలలోని విషయాలను
ఉద్దేశపూర్వకంగానే వదలి వేస్తున్నాను.
శ్రీ జీ.ఎస్.ఖపర్డే
డైరీ – 19
07.01.1912 ఆదివారమ్
ప్రొద్దున్న
తొందరగా లేచి కాకడ ఆరతికి వెళ్ళాను. సాయి మహరాజ్ చాలా సంతోషంగా ఉన్నారు. యోగ దృష్టిని ప్రసరించారు. రోజంతా ఒక విధమయిన పారవశ్యంతో గడిపాను.
ఉదయం తరువాత నేను, బాపూసాహెబ్ జోగ్, ఉపాసనీ, రంగనాధ
యోగవాసిష్టం చదవడం మొదలు పెట్టాము. ఆ తరువాత
మేము సాయి మహరాజ్ బయటకు వెళ్ళడం చూశాము. ఈ
లోపులో మసీదుకు వచ్చిన మహమ్మదీయ యువకులతో మాట్లాడుతూ కూర్చున్నాము. వారిలో ఒకతను కొన్ని శ్లోకాలు వల్లించాడు. మధ్యాహ్న ఆరతి ఆలస్యమయింది. సాయిబాబా చక్కటి కధను ప్రారంభించారు. తనకి మంచి బావి ఉందట. అందులోని నీరు ఆకాశ రంగులో నీలంగా ఉందిట. ఎంత తోడినా అందులోని నీరు ఎన్నటికీ తరిగేవి కావట. నాలుగు మోటలతో తోడినా బావి ఇంకి పోయేది కాదట. ఆ నీటితో పెరిగిన పళ్ళు అపరిమితంగ వచ్చేవిట. ఈ సంఘటన తరువాత ఈ కధని పూర్తి చేయలేదు. మధ్యాహ్నం
దీక్షిత్ రామాయణంలో రెండు అధ్యాయాలు చదివాడు.
ఉపాసనీ, నేను, రామమారుతి, దీక్షిత్ విన్నాము. తరువాత మేము సాయిబాబా వ్యాహ్యాళిలో ఉండగా కలిసాము. చీకటి పడుతుండగా ఆయనకు కోపం వచ్చిందో లేక కోపం వచ్చినట్లు
ప్రదర్శించారో గాని, కట్టెలు కొట్టుకునే స్త్రీలమీద కోపపడ్డారు. రాత్రి భీష్మ భజన, దీక్షిత్ రామాయణం జరిగాయి.
పీ.ఎస్. ఈరోజు
ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చదువుతుంటే అది ఒక గూఢచారి రాసినట్లుగా ఉంది. ఆ లక్షణాలు కనిపించాయి. అది తిలక్ విడుదల గురించి. కాని అది కల్పించి రాసి జత చేసిన ఉత్తరంలా ఉంది. ఈ రోజు పార్శీ పెద్దమనిషి ఒకాయన తన కుటుంబ స్త్రీలతో
వచ్చాడు. మరుసటి రోజు వెళ్ళిపోదామనుకుంటున్నాడు.
08.01.1912 సోమవారమ్
ప్రొద్దున్న
తొందరగా నిద్ర లేచాను కాని మరీ తొందరగా లేచాననిపించి, తిరిగి నిద్రపోయాను. బాగా నిద్రపట్టేసి రోజూ కన్నా ఆలస్యంగా నిద్ర లేచాను. దాంతో పనులన్నీ ఆలస్యమయి దాని ప్రభావం రోజువారీ
కార్యక్రమాలన్నిటి మీదా పడింది. ప్రార్ధన తరువాత
బాపూ సాహెబ్ జోగ్, ఉపాసనీ, రామమారుతి, మాధవరావు దేశ్ పాండేలతో కలిసి రంగనాధ యోగవాసిష్టం
చదువుతూ కూర్చున్నాను. సాయి మహరాజ్ బయటకు వెళ్ళేటప్పుడు,
తిరిగి వచ్చేటప్పుడు ఆయన దర్శనం చేసుకున్నాము.
మధ్యాహ్న ఆరతి తరువాత సాయి మహరాజ్ హటాత్తుగా తీవ్రమయిన కోపాన్ని ప్రదర్శిస్తూ
దారుణంగా తిట్టారు. ఇక్కడ మరలా ప్లేగు వ్యాధి
ప్రబలంగా రాబోతోందని, అది తిరిగి రాకుండా అలా తిడుతూ దానిని ఆపే ప్రయత్నం చేస్తున్నారని
భావించాము. భోజనాల తరువాత మేమంతా మాట్లాడుకుంటూ
కూర్చున్నాము. ఆ తరువాత కొద్దిగా రామాయణం చదివాను. అప్పుడు కోపర్ గావ్ మామలతదారు సానే, ధులియా డిప్యూటీ
కలెక్టర్ జోషీని వెంటబెట్టుకుని వచ్చాడు.
రామాయణం ఒక అధ్యాయం
చదివిన తరువాత మేమందరం సాయి మహరాజ్ దర్శనానికి వెళ్ళాము. ఆయన ఎప్పుడూ వ్యాహ్యాళికి వెళ్ళి వచ్చేంత వరకు వేచి
చూశాము. రాత్రి శేజ్ ఆరతికి వెళ్ళాము. రాత్రి భీష్మ భజన, దీక్షిత్ రామాయణ పఠణం ఎప్పటిలాగే
జరిగాయి.
10.01.1912 బుధవారమ్
ఉదయాన్నే చాలా
తొందరగా నిద్రలేచి, తెల్లవారకముందే ప్రార్ధనతో సహా అన్ని కార్యక్రమాలు ముగించుకున్నాను. అపుడు నేను, భీష్మ, బాపూ సాహెబ్ జోగ్, రంగనాధ యోగవాసిష్టం
చదివాము. ఆ తరువాత సాయి మహరాజ్ బయటకు వెళ్ళేటప్పుడు,
తిరిగి మసీదుకు వచ్చేటప్పుడు రెండు సార్లూ ఆయన దర్శనం చేసుకున్నాము.
ఒక మార్వాడీ వచ్చి తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. తనకు పెద్ద మొత్తంలో వెండి, ఆఖరికి బంగారు కడ్డీలు
లభించాయనీ వాటిని లెక్క పెడుతుండగా మెలకువ వచ్చేసిందని చెప్పాడు. సాయి మహరాజ్ ఆ కల ఎవరో ఒక గొప్ప మహనీయుని మరణాన్ని
సూచిస్తుందని చెప్పారు.
మసీదులో ఉండగానే
నాకు చాలా నిద్ర ముంచుకు వచ్చింది. మెలకువగా ఉందామని ఎంత ప్రయత్నించినా నిమిష నిమిషానికి
నా కన్నులు మూత పడుతూనే ఉన్నాయి. మధ్యాహ్న
ఆరతి తరువాత బసకు తిరిగి వచ్చి, భోజనమయిన తరువాత కాసేపు పడుకున్నాను. తర్వాత దీక్షిత్ రామాయణం చదువుతుంటే మేమంతా వింటూ
కూర్చున్నాము. సాయంత్రం సాయి మహరాజ్ ఎప్పటిలాగే
వ్యాహ్యాళికి వెళ్ళేటప్పుడు ఆయన దర్శనం చేసుకోవడానికి మసీదుకు వెళ్ళాము.. తరువాత శేజ్ ఆరతికి వెళ్ళాము. భాటే, బాలక్ రామ్ ఇద్దరూ రాలేదు. అందుచేత నెమలి వింజామరను వీచే బాధ్యత నాకప్పగించబడింది. అది పట్టుకుని విసురుతుంటే నేనెంతో ఆనందాన్ననుభవించాను. రాత్రికి భీష్మ భజన, దీక్షిత్ రామాయణం యధావిధిగా
జరిగాయి.
(మరికొన్ని విశేషాలు
మరుసటి సంచికలో)
(సర్వమ్ శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment