01.03.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
సర్వాంతర్యామి
మన సద్గురు సాయిబాబా.  ఆయనకు తన భక్తులే కాదు
అశేష ప్రజానీకం ఏమి చేస్తున్నారో అన్నీ గ్రహించగలరు.  తన భక్తుల మనసులో ఏముందో అనుకున్న క్షణంలోనే వారికి
తెలిసిపోతుంది.  కారణం మనందరి హృదాయలను పాలించేది
ఆయనే కదా.  ఈ రోజు “ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయిబాబా”
మార్చ్, 2016 వ సంచికలోని ఈ లీల చూడండి.
శ్రీ షిరిడీసాయి
వైభవమ్ – 
నన్ను నమ్ముకున్నవారిని నవ్వులపాలు కానివ్వను
మోరేశ్వర్ ప్రధాన్,
ఆయన భార్య ఛోటాబాయి ఇద్దరూ బాబా భక్తులు.  నిజం
చెప్పలంటే వారి కుటుంబమంతా బాబాని పూజిస్తూ ఆయననే తమ సద్గురువుగా భావిస్తూ ఉండేవారు.  ఒకసారి వారి పెద్ద కుమారుడికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది.  జ్వరం తీవ్రంగా పెరిగిపోతూండటంతో అతని శరీరం పాలిపోయి
బలహీనపడిపోయాడు.  అతని స్థితిని చూసి, పినతల్లి
పిల్లవానికి జ్వరం తగ్గితే షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకుంటామని మొక్కుకుంది.  
14 రోజుల తరువాత జ్వరం తగ్గి, నాలుగయిదు రోజుల తరువాత
మంచం మీద కూర్చొనగలిగే స్థితికి వచ్చాడు.  పినతల్లి,
ఛోటూబాయి, కొడుకు ముగ్గురూ కలిసి షిరిడీకి ప్రయాణం పెట్టుకున్నారు.  కాని వైద్యుడు ప్రయాణం చేయవద్దన్నాడు. కాని వారు
వైద్యుడు కాదన్నా వినకుండా షిరిడీకి ప్రయాణమయ్యారు.  దారిలో పిల్లవాడికి మళ్ళీ జ్వరం తిరగబెట్టింది.  ఛోటూబాయి, ఆమె చెల్లెలు ఇద్దరికీ భయం వేసింది.  ఒకవేళ ఏదయినా జరగరానిది జరిగితె అందరూ తమని చూసి
ఎగతాళి చేస్తారని భయపడ్డారు. కారణం అబ్బాయికి జ్వరం తగ్గితే షిరిడికి తీసుకుని వస్తామని
మొక్కుమున్నరు కదా. ఇటువంటి పరిస్థితిలో, పిల్లవానికి జ్వరం తగ్గితే షిరిడీ తీసుకువస్తానని
మొక్కుకున్న పినతల్లి చాలా ఆందోళన పడింది. 
ఏదేమయినప్పటికీ వారంతా కోపర్ గావ్ చేరుకున్నారు.  
అక్కడ ఒక వ్యక్తి “టాంగా కావాలా” అని అడిగాడు.  ఆ మాటలు విని ఆ పిల్లవాడు “మనం సాయిబాబా ఇంటికి
వచ్చామా?నాకు కాస్త సాయం చేస్తే లేచి కూర్చుంటాను” అన్నాడు.  పినతల్లికి ఎంతో సంతోషం కలిగి పిల్లవాడిని తన ఒడిలో
కూర్చోబెట్టుకుంది. పిల్లవాడిని ఎత్తుకుని బాబా దర్శనానికి తీసుకుని వెళ్ళారు.  బాబా,  వాడిని
తన రెండు చేతులతో పట్టుకుని నిలబెట్టారు.  ఎటువంటి
ప్రయాస లేకుండా ఆ అబ్బాయి నుంచోగలిగాడు.  బాబా
అతనికి ఒక అరటిపండు, మామిడి పండు ఇచ్చారు. 
ఎటువంటి కష్టం లేకుండా ఆ రెండు పళ్ళనూ తినగలిగాడు.  అప్పుడు బాబా “బాగుంది.  పిల్లవాడిని ఇక్కడికి తీసుకుని వచ్చారని మిమ్మల్ని
చూసి ఎవరయినా ఎగతాళిగా నవ్వుతారా?” అన్నారు. 
(మరికొన్ని వైభవాలు
ముందు ముందు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 









0 comments:
Post a Comment