25.03.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
సాయి భక్తులందరూ
ప్రతిరోజు శ్రీ సాయి సత్ చరిత్రను పారాయణ చేస్తూ ఉంటారు.  కొంతమంది సప్తాహం చేస్తే మరికొందరు రోజుకొక అధ్యాయం
పారాయణ చేయడం చేస్తూ ఉంటారు.  కొందరికి సమయం
లేక ఒక పేజీ గాని, కొన్ని పేరాలు గాని ప్రతిరోజూ చదువుతూ ఉంటారు.  మరికొందరికి అసలు సమయమే కుదరకపోవచ్చు. వారు మనసులోనే
సాయినామ జపం చేసుకుంటు ఉండచ్చు.  అందుచేత సాయినామాన్ని
నిరంతరం జపిస్తూ ఆయననే గుర్తుంచుకునే సాయి భక్తులందరూ సమానమే.  ముఖ్యంగా కావలసినది ధృఢమయిన భక్తి.
మరిచిపోయిన నగలను ఇప్పించిన బాబా….
ఈ రోజు చెన్నై
నుండి శ్రీమతి కృష్ణవేణి గారు పంపించిన అనుభవం, బ్లాగు పరిచయం ఏ విధంగా జరిగిందీ అనేదాని
గురించి పంపించారు.  ఆవిడకి సత్ చరిత్ర పారాయణ
చేయడానికి సమయం కుదర లేదని బాధ పడినప్పుడు బాబావారు ఆమెకు బ్లాగులో తన లీలను చదివే
అవకాశాన్ని  కల్పించారు.  బ్లాగులో ప్రచురించేవన్నీ
బాబా కు సంబంధించిన లీలలే కనక అవి కూడా పారాయణతో సమానమే.  
శ్రీ సాయి సత్
చరిత్ర 3వ.అధ్యాయంలో  బాబా శ్యామాతో  అన్న మాటలను ఒక్కసారి
గుర్తుకు తెచ్చుకుందాము.
“ప్రేమతో నా
నామాన్ని స్మరించేవారి సకల కార్యాలను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను.  నా చరిత్రను, నా మహిమలను  గానం చేసే వారి ముందు వెనుక నలు దిక్కుల నిలచి ఉంటాను.
నా కొరకు మనో ప్రాణాలను అంకితం చేసే భక్తులకు ఈ కధా శ్రవణంలో ఆనందం కలగటం సహజం.  నా కధా సంకీర్తనలు చేసేవారెవరైనా సరే వారికి ఎల్లప్పుడు
ఆనందాన్ని, సుఖ సంతోషాలని ప్రసాదిస్తాను.  నా
అనన్య శరణు జొచ్చి నాభజన నా ధ్యానం నా నామ స్మరణ చేసేవారిని నేను ఉధ్ధరిస్తాను.  ఇది నాప్రతిజ్ఞ” 
                            *********
మరిచిపోయిన నగలను ఇప్పించిన బాబా….
నాకు మన బ్లాగు
ఏవిధంగా పరిచయమయిందో  వివరిస్తాను.  నేను అంతర్జాలంలో బాబా గారి సందేశాలతో  కూడుకున్న
కొత్త కొత్త ఫోటోలన్నీ సేకరిస్తూ ఉంటాను.  నాకు
ఏదయినా కష్టం కలిగినపుడు ఏదో ఒక ఫోటోని ఎంచుకుని అది బాబావారిచ్చిన ఆజ్ఞగా భావిస్తూ
ఉంటాను. ఆ విధంగా ఒకసారి మిరకిల్స్ ఆఫ్ సాయి ఇన్ తెలుగు అని టైప్ చేసినప్పుడు మన బ్లాగుని
చూశాను.  అపుడు ప్రతిరోజూ మీరు ప్రచురించేవన్నీ
చదువుతున్నాను.  ఏ రోజయినా మీరు ప్రచురించకపోతే
పాతవి చదవాలనే ఆలోచన నాకు రాలేదు.  కారణం బాబా
మన ముందు వున్నా కూడా మాయ వల్ల మనం తెలుసుకోలేము. 
ఆ విధంగా మన బ్లాగులో ప్రతీదీ చదవాలన్న ఆలోచన నాకు రాలేదు. 
మా చిన్న పాప
జూన్ 2015 న జన్మించింది.  తరువాత మనకు గోదావరి
పుష్కరాలు వచ్చాయి.  నేను డెలివరీకి ఒంగోలు
వెళ్ళినపుడు పెద్ద పాపకి స్కూలులో మూడు నెలల సెలవు అడిగి నాతోపాటు తీసుకుని వెళ్ళాను.  తరువాత చిన్న పాపకి మూడవ నెలలో చెన్నైకి తిరిగి
రావాలి.  ఎందుకంటే మూడు నెలలకి మించి పెద్ద
పాపకి స్కూలు వాళ్ళు సెలవు ఇవ్వనన్నారు.  మంచి
రోజు కోసం అడిగితే  6 నెలల వరకు వెళ్ళకూడదన్నారు.  నేను ఎప్పుడూ ఒంగోలులో ఉన్న సంతపేట బాబా గుడికి
వెడుతూ ఉంటాను.  
అలాగ చెన్నైకి వెళ్ళేముందు
సంతపేట బాబా గుడికి వెళ్ళాము.  అక్కడ ద్వారకామాయిలో
కూర్చుని “బాబా నీమీద భారం వేసి బయలుదేరుతున్నాను.  బాబా మీకన్నీ తెలుసు కదా!” అని మనసులో ప్రార్ధించుకుని
బాబాకి నమస్కారం చేసుకున్నాను.  అపుడే బాబా
చిత్రపటం నుండి పువ్వులు క్రిందకు జారి పడ్డాయి. 
ఆ సూచనని నేను బాబావారు ఇచ్చిన ఆదేశంగా భావించి పెద్దవాళ్ళు వద్దని చెప్పినా
వినకుండా, బాబా మీద భారం వేసి మొండిగా బయలుదేరాను.  ప్రయాణం బాగానే జరిగింది.  నా హాండు బ్యాగులో పెద్ద పాప నగలు, చిన్న పాప నగలు,
నా డబ్బు కొంత ఉన్నాయి.  నేను రైలు నుండి దిగేటప్పుడు
నా హాండ్ బ్యాగ్ రైలులోనే మర్చిపోయి దిగేశాను. 
చెన్నై సెంట్రల్ స్టేషన్ లో కొంత దూరం నడిచిన తరువాత బ్యాగ్ విషయం గుర్తుకు
వచ్చింది.  
వెంటనే మా వారికి బ్యాగ్ మర్చిపోయిన
విషయం చెప్పాను.  బ్యాగ్ దొరికితే మీపారాయణ
చేస్తాను బాబా అని మనసులోనే బాబాని ప్రార్ధించుకున్నాను.  మావారు వెనక్కి వెళ్ళి మేము కూర్చున్న బోగీ దగ్గరకు
వెళ్ళారు.  బోగీలో మాముందు కూర్చున్నామె బ్యాగ్
తీసి పెట్టి మా కోసం ఎదురు చూస్తూ ఉంది.  మావారు
రాగానే ఆమె బ్యాగ్ అందించి అన్ని సరి చూసుకోమని చెప్పింది.  మావారు అంతా చూసి అన్నీ సరిగానే ఉన్నాయని చెప్పి
ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు.  పెద్దల మాట విననందుకు
ఇలా జరిగిందని భావించాను కాని, బాబా నన్ను మళ్ళి కాపాడారు.  కర్మ ఫలాన్ని తాత్కాలికంగా మాత్రమే అనుభవించేలా
చేశారు.
ఇక చిన్న పాపతో
ఇంటి పనులతో బాబా చరిత్ర పారాయణ చాలా కష్టంగా ఉంది.  నేను బాబానే అడిగాను మీరే దారి చూపాలని.  నాకు కంప్యూటర్ లేకపోవడంతో అన్నీ నా మొబైల్ లోనే
చదువుతూ ఉంటాను.  అందు చేత నాకు పాతవి చదవవచ్చనే
విషయం తెలియదు. అపుడు మన బ్లాగులో అనుకోకుండా ఇంతకు ముందు ప్రచురించినవాటిని ప్రెస్
చేసి చదివాను.  అప్పటినుండి ప్రతిరోజు బ్లాగులో ఆయన లీలలను చదివించేలా
చేసి నా మొక్కు తీర్చారు బాబా. 
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)










0 comments:
Post a Comment