30.06.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు బాబా
కు అంకిత భక్తుడయిన శ్రీ స్వామి శరణానంద్ గురించి తెలుసుకుందాము. ఆయన గురించిన సమాచారమ్ శ్రీసాయి అమృతాధార నుండి
అనువాదించాను.
స్వామి
శరణానంద
ప్రాణ్
గోవిందజీ అతని భార్య మణిగౌరి ఇద్దరూ షిరిడీ యాత్రకు వెళ్ళారు. బాబా ఆశీర్వాదంతో వారికి 05.04.1889 లో సూరత్ లోని
బర్దోలీ తాలూకాలోని మోటా గ్రామంలో వామన్ పటేల్
జన్మించాడు. అతని పూర్తి పేరు వామనరావ్ ప్రాణ గోవింద పటేల్మూడు సంవత్సరాల వయసులో
అతనికి చాలా జబ్బు చేసింది. పిల్లవాడు బ్రతుకుతాడా
లేదా అని భయపడ్డారు తల్లిదండ్రులు. బాబా ఒక
ఫకీరు రూపంలో వచ్చి అతని తల్లికి ఊదీనిచ్చారు.
ఊదీని నీళ్ళలో కలిపి తీర్ధంగా పిల్లవానికి ఇమ్మని చెప్పారు. పిల్లవానికి వీపు మీద కుడివైపున పుట్టుమచ్చ ఉందని
అతను గొప్ప సత్పురుషుడు అవుతాడని చెప్పాడు ఆ ఫకీరు. తల్లి ఆ ఫకీరు చెప్పినట్లుగానే తీర్ధాన్ని పిల్లవాడి
చేత త్రాగించింది. పిల్లవాడు కోలుకొన్నాడు.
వామనరావు
ప్రాణ గోవింద పటేల్ ప్రాధమిక విద్యాభ్యాసం సూరత్ లోను అహమ్మదాబాద్ లోను జరిగింది. 13
సంవత్సరాల వయసులో సోమనాధ్ మందిర్ కి వెళ్ళినపుడు బాబా అతనికి ఒక ఫకీరు రూపంలో దర్శనమిచ్చారు.
1910 వ.సంవత్సరం బొంబాయి లోని ఎల్ఫిన్ స్టన్ కళాశాలనుండి బి.ఎ. పట్టా పుచ్చుకొన్నాడు. ఆ తరువాత 1912 లో ఎల్.ఎల్.బి. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అతని మదిలో ఎప్పుడూ ప్రశ్నలు ఉదయిస్తూనే ఉండేవి. చదువుకునే రోజుల్లోనే అతను ప్రొఫెసర్లని, సాధువులని,
దేవుడు అనేవాడు నిజంగా సాకారంగా ఉన్నాడా లేక నిరాకారంగా ఉన్నాడా? అని ప్రశ్నిస్తూ ఉండేవాడు. ఎవరూ కూడా అతనికి సంతృప్తికరమయిన సమాధానాలు ఇవ్వలేకపోయారు.
అతని
తండ్రి కొడుకుని స్వామి సమర్ధ శిష్యుడయిన బాలకృష్ణ మహరాజ్ దగ్గరకు 1904 వ.సంవత్సరంలో
తీసుకొని వెళ్ళాడు. వామనరావు మహరాజ్ ని కూడా ఇదే ప్రశ్న అడిగాడు. అప్పుడు వామనరవు వయస్సు 15 సంవత్సరాలు. వామనరావు
దేవుడి గురించి ప్రశ్నించగానే మహరాజ్ కి విపరీతమయిన ఆగ్రహం కలిగింది. అయినా కాని అతనికి
మరాఠీ భాషలో రచించబడ్డ అక్కల్ కోట మహరాజ్ జీవిత చరిత్ర, ఏకనాధ భాగవతం అనే రెండు పుస్తకాలనిచ్చి
వాటిని చదవమని చెప్పారు. వామనరావు బాలకృష్ణ
మహరాజ్ తో “ఏసత్పురుషుడయితే నాకు భగవంతుని ప్రత్యక్షంగా చూపించగలరో వారినే నేను నా
గురువుగా భావిస్తాను” అన్నాడు. ఆ పుస్తకాలు చదివినా అతనికి తృప్తి కలగలేదు. అక్కల్ కోట మహరాజ్ జీవిత చరిత్రలోని సంఘటనలు వామనరావుని
ప్రభావితం చేసాయి. భగవంతుడిని చూపించగలిగే
సత్పురుషులు ఇంకా భూమి మీద ఉన్నారని వారు తనకి సహాయం చేయగలరనే నమ్మకం కలిగింది. దత్తాత్రేయుని నాలుగవ అవతారమయిన అక్కల్ కోట మహరాజ్
1878 లో సమాధి చెందారు. ఆ తరువాత ఆయన స్థానంలోకి
వచ్చిన బాలకృష్ణ మహరాజ్ నే వామనరావు తండ్రి తరచూ దర్శించుకుంటూ ఉండేవారు.
వామనరావు
తండ్రి బంధువయిన శంకర్ లాల్ కేశవ్ లాల్ భట్ కి పెద్ద యాక్సిడెంట్ అయి ఎడమకాలు బాగా
దెబ్బతింది. ఆ ప్రమాదంలో మోకాలి వద్ద నరం చితికింది. అన్ని రకాల వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయింది. దాని వల్ల అతను సరిగా నడవలేకపోయేవాడు. ఇటువంటి పరిస్థితిలో ఒక పూర్ణపురుషుడయిన సద్గురువు
ఆశీర్వాదం తోనే అతని కాలు యధాస్థితికి వస్తుందని భావించాడు వామనరావు. అటువంటి సత్పురుషుని కోసం అన్వేషణ మొదలుపెట్టాడు.
ఖేడ్
జిల్లాకి డిప్యూటీ కలెక్టరయిన హరివినాయక్ సాఠే బాబాకు గొప్ప భక్తుడు. ఆయనమీద అచంచలమయిన భక్తి కలవాడు. ఒకసారి సాఠే, ప్రాణ్ గోవిందదాస్ ని కలుసుకోవడం తటస్థించింది. సాఠే, గోవిందదాస్ కి బాబా గురించిన లీలలు, మహిమలు
కధలు కధలుగా వర్ణించి చెప్పాడు. అవి ఆయన మీద
ఎంతో ప్రభావాన్ని చూపాయి. 1911 మే నెలలో హరివినాయక్
సాఠేనుంచి పరిచయ పత్రం తీసుకొని శంకర్ లాల్ తో షిరిడీకి ప్రయాణమయ్యాడు. హెచ్.వి.సాఠే, నానా సాహెబ్ చందోర్కర్ బంధువయిన బాలభావు
చందోర్కర్ కి పరిచయ పత్రం రాసి వీరి చేతికిచ్చి పంపించాడు. బాలభావు చందోర్కర్ షిరిడీలో ఒక చిన్న హోటల్ ని నడుపుతున్నాడు. షిరిడీ ప్రయాణం పెట్టుకున్న రోజులలో వామనరావు తండ్రి
సర్జరీ ద్వారా అప్పటికే పన్ను పీకించుకున్నాడు.
చిగుళ్ళు బాగా బలహీనంగాను, బాగా సలుపు పెడుతూ ఉండటం వల్ల గట్టి పదార్ధాలు, ఆఖరికి
చపాతీ కూడా నమిలి తినలేని పరిస్థితిలో ఉన్నాడు.
ఇంటిలో *షీరా ఒక్కటే తింటూ ఉండేవాడు.
కాని, షిరిడీలో షీరా ఎవరు తయారు చేసి పెడతారు? అదే ఆయనకి పెద్ద సమస్యయింది.
(*షీరా మహరాష్ట్రవాసులు చేసుకునే తీపి పదార్ధం. షీరా, సెమోలినాతో తయారు చేస్తారని చెప్పారు. సెమోలినా అంటే బొంబాయి రవ్వ. దీనినే మనం రవ్వ కేసరి అంటాము. షీరా తయారీ యూట్యూబ్ లింక్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ వంటలు చేయడం గురించి చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. షీరా అంటే మనకందరికి తెలియదు కాబట్టి యూ ట్యూబ్ లో వెతికి ఇందులో పెట్టడం జరిగింది. షీరా అని రాసినంత మాత్రాన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఏమంటారు.)
https://www.youtube.com/watch?v=c7CPSCs1XO4
కాని ఏమయినప్పటికీ వామనరావు తండ్రి బాబా అనుగ్రహంతో
శంకర్ లాల్ కాలు బాగవుతుందనే ఉద్దేశ్యంతో అతనిని వెంటబెట్టుకొని షిరిడీకి వచ్చాడు. కాస్త గట్టిగా ఉన్న పదార్ధాలను నమలడం కూడా చాలా
కష్టంగా ఉండేది ప్రాణ్ గోవింద దాస్ కి. షిరిడీలో
భోజన సమయంలో ప్రాణ్ గోవింద దాస్ కి చపాతీలు వడ్డించారు. అవి తినక తప్పదు. “నేనీ చపాతీలను ఎలా తినగలను? ఇంటి దగ్గరయితే హాయిగా
షీరా తినగలిగేవాడిని. ఇంక ఇక్కడ షిరిడీలో చపాతీలు
తప్ప వేరే ఇంకేమీ తినడానికి దొరకవు” ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా ద్వారకామాయినుండి ఒకతను
పరిగెత్తుకుంటూ వచ్చి, “బాబాగారు పాత్ర నిండా షీరా తీసుకొని రమ్మని చెప్పారు. భోజనాలు అప్పుడే మొదలుపెట్టవద్దని భక్తులందరికీ
చెప్పమన్నారు. షీరా తినకుండా ఎవరూ వెళ్ళవద్దని
కూడా చెప్పమన్నారు. అందుచేత అందరికీ షీరా
వడ్డించేంత వరకు వేచి ఉండండని” చెప్పాడు. ప్రాణ్
గోవింద దాస్ చాలా ఆశ్చర్యపోయాడు. బాబా ఒక అపూర్వమయిన
సత్పురుషుడని, తన మనసును, తన కష్టాన్ని గ్రహించి తన కోసం భోజనం చేసే వేళకు షీరా పంపిస్తున్నారని
ఎంతో సంతోషపడ్డాడు. కాని, వారు షిరిడీ వచ్చిన
కారణం శంకర్ లాల్ యొక్క కుంటితనాన్ని వదిలించడానికి. ఆవిధంగా రెండు రోజులు గడిచిపోయాయి. బాబా అనుమతి తీసుకొని తిరిగి వెళ్ళిపోదామనుకొన్నారు. కోపర్ గావ్ వెళ్ళడానికి బాలాగాంధీ దుకాణం దగ్గరకు
వచ్చి టాంగా మాట్లాడుకొన్నారు. శంకర్ లాల్
టాంగా ఎక్కుతుండగా కాలులో విపరీతమయిన నెప్పి కలిగింది. తన కాలు ఇంక పనికిరాదనే భావించాడు. ఆ బాధతోనే తన కాలుని ముందుకు వెనక్కు కాసేపు ఆడించాడు. వెంటనే చాలా ఆశ్చర్యం కలిగింది. ఇక ఎటువంటి బాధ లేకుండానే నడవగలిగాడు. నెప్పి కూడా మాయమయిపోయింది. అనుకోకుండా జరిగిన ఈ అద్భుతానికి చాలా ఆశ్చర్యపోయాడు. బాబా అనుగ్రహం వల్ల గాయం కూడా పూర్తిగా మానిపోయింది. బొంబాయికి తిరిగి వచ్చిన తరువాత శంకర్ లాల్, ప్రాణ్
గోవిందదాస్ లు ఇద్దరూ వామనరావుకు తమకు కలిగిన అనుభవాలని వివరించి చెప్పారు. ఒక్కసారి
షిరిడీ వెళ్ళమని, ఆయనే అసలయిన సత్పురుషుడని, వారిద్దరూ వామనరావుకి సలహా ఇచ్చారు. అంతే కాకుండా షిరిడీలో అతనికి ఉన్న సందేహాలన్నీ
నివృత్తి అవుతాయని కూడా చెప్పారు.
(ఇంకా ఉంది)
0 comments:
Post a Comment