16.07.2016 శనివారమ్
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు వారి తత్వము
(2) ఆహారం –
4వ.భాగమ్
ఆంగ్లమూలం :
లెఫ్టినెన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదం
: ఆత్రేయపురపు త్యాగరాజు
(ఇతరులకు పెట్టకుండా
ఎప్పుడూ ఏదీ తినవద్దు నిన్నటి సంచిక తరువాయి భాగమ్)
ఇదే 24 వ.అధ్యాయంలో హేమాడ్ పంతు సుధాముని కధలో చాలా
వివరంగా చెప్పారు. తమ గురువయిన సాందీపుని ఆశ్రమంలో
శ్రీకృష్ణబలరాముల సహాధ్యాయి సుధాముడు. ఒకసారి
వారు అడవిలో కట్టెలు ఏరడానికి వచ్చినపుడు కృష్ణునికి దాహంగా ఉండి మంచినీరు అడిగాడు. ఉత్తకడుపుతో మంచినీరు తాగవద్దని అన్నాడు సుధాముడు. శ్రీకృష్ణుడు సుధాముని ఒడిలో తలపెట్టుకొని పడుకొన్నాడు.
కొంతసేపయిన తరువాత
శ్రీకృష్ణుడు నిద్రనుండి లేచాడు. సుధాముడు
ఏదో నములుతున్నట్లుగా గమనించి సుధామా నీవేమి తినుచున్నావని అడిగాడు. కాని సుధాముడు తన వద్దనున్న శనగలు తినుచూ కూడా తానేమీ
తినటల్లేదని చలికి వణుకు వస్తుండటంవల్ల తన దంతాలు టకటకమని శబ్దము చేయుచున్నవని అబధ్ధమాడాడు.
దాని ఫలితంగా, శ్రీకృష్ణపరమాత్మకు ఎంత సన్నిహితుడయినా సధాముడు దుర్భర దారిద్యంలో గడపవలసివచ్చిది. అయినప్పటికీ ఆతరువాత, సుధాముడు తన భార్య కష్టించి స్వయంగా
చేసి ఇచ్చిన పిడెకెడు అటుకులను శ్రీకృష్ణపరమాత్మునికి సమర్పించుకొన్నాడు.
శ్రీకృష్ణుడు
సంతోషించి, సుధాముడు జీవితమంతా సుఖంగాను, ఆనందంగాను గడపడానికి స్వర్ణ భవంతిని అనుగ్రహించాడు.
బాబా కూడా ఎవరికీ
పెట్టకుండా తానెప్పుడూ భుజించలేదు. ప్రతిరోజూ
ఆయన భిక్షకు వెళ్ళేవారు. వచ్చినదంతా కూడా మసీదులోనున్న
ఒక మట్టిపాత్రలో వేసేవారు. కొంతమంది బిచ్చగాళ్ళు
దానిలోనుండి 3,4 రొట్టెముక్కలను తీసుకొంటూ ఉండేవారు. కుక్కలు, పక్షులు కూడా వచ్చి అందులోనివి తింటూ ఉండేవి. బాబా వాటినెప్పుడూ తరిమేవారు కాదు. భక్తులెవరయినా ఆయనకు పండ్లు, వండిన మధురపదార్ధాలను
సమర్పించినపుడు ఆయన వాటిని అరుదుగా ఆస్వాదించి, అన్నిటినీ అక్కడ ఉన్న భక్తులందరికీ
పంచిపెట్టేస్తూ ఉండేవారు.
ప్రతిరోజు మధ్యాహ్నం
ద్వారకామాయిలో భోజనాలు వడ్డించి తినడానికి సిధ్ధమయే సమయానికి బాబా, బడేబాబాను (మాలేగావ్
ఫకీరు) పిలిచి తన ఎడమప్రక్కనే కూర్చుండబెట్టుకొని అతిధి మర్యాద చేసేవారు. భోజనమయిన తరువాత రూ.50/- దక్షిణ ఇచ్చి అతనితో కూడా 100 అడుగుల దూరం
వరకు వెళ్ళి సాగనంపేవారు.
తైత్తరీయ పుపనిషత్తు అనువాక II లో ఈ విధంగా చెప్పబడింది.
“అతిధి దేవోభవ”
భగవద్గీతలో కూడా
శ్రీకృష్ణపరమాత్మ 3వ.అధ్యాయం 13వ.శ్లోకంలొ ఇలా చెపుతున్నారు.
యజ్ఞశిష్టాసినః సంతోముచ్యంతే సర్వకిల్బిషైః I
భుంజతే తే త్వఘం
పాపా యే పచంత్యాత్మకారణాత్ II
యజ్ఞ శిష్టాన్నమును
తిను శ్రేష్ఠపురుషులు అన్ని పాపములనుండి ముక్తులయ్యెదరు. తమ శరీరపోషణ కొరకే ఆహారమును సిధ్ధ (వండుకొను) పఱచుకొను పాపులు
పాపమునారగించిన వారైయున్నారు.
ఆవిధంగా సాయిబాబా
ఎంతో చక్కగా విశ్లేషణాత్మకంగా, మనం ఏది తిన్నా కూడా ఇతరులకు పెట్టకుండా తినరాదు అనే
నియమాన్ని మనస్సుకు హత్తుకునేటట్లుగా సోదాహరణంగా వివరించారు.
అతిధి అనగా ఎప్పుడు
వచ్చేది తెలపకుండా అని అర్ధం. పూర్తి అర్ధంలో
వివరించుకుంటే అతిధి అనగా అనుకోకుండా వచ్చి, ఒక రోజుకంటే మించి నివసించనివాడు. కాని ఆకాశన్నంటే ధరలతో చాలీ చాలని సరకులతో సతమతమయ్యే
ఈ రోజులలో, మన దయాగుణాన్ని అడ్డుపెట్టుకొని సంబంధం లేనివాళ్ళు కూడా మనలని అంటిపెట్టుకొనే
ప్రమాదం కూడా ఉందని మనం గ్రహించుకోవాలి.
అన్నదానము :
ఆఖరుగా, బాబా
అన్నదానం గురించి ప్రముఖంగా చెప్పారు. వేరువేరు
యుగాలలో ఆచరించవలసిన వేర్వేరు సాధనాల గురించి మన ప్రాచీన గ్రంధాలలో వేదాలలో నిర్దేశింపబడ్డాయి. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగంలో
యజ్ఞము. ప్రస్తుతం కలియుగంలో దానము. అన్ని దానాలలోకెల్ల అన్నదానము శ్రేష్ఠమయినది. మధ్యాహ్నంవేళ మనకు భోజనం లేకపోతే చాలా బాధపడతాము. అలాగే ప్రాణులన్నీకూడా అదే రీతిలో ఆహారం దొరకకపోతే
ఆకలితో బాధపడుతూ ఉంటాయి. ఈ విషయం గ్రహించుకుని
ఎవరయితే ఆకలితో ఉన్నవారికి, బీదవారికి అన్నం పెడతారో వారే గొప్పదాత.
తైత్తరీయ ఉపనిషత్తులో
“అన్నం పరబ్రహ్మ స్వరూపం”, అన్నంనుండే అన్ని జీవులు జన్మిస్తున్నాయి, జన్మించాయి. అన్నంలోనే అవి జీవిస్తాయి, మరణిస్తాయి, మరలా అన్నంలోనే
అవి ప్రవేశిస్తాయి” అని చెప్పబడింది.
ఇతర దానాలు
అనగా, ధనం దానం చేయుట, ఆస్తి, దుస్తులు మొదలైనవి దానం చేసేటప్పుడు పాత్రనెరిగి దానం
చేయాలి. వీటిని దానం చేసేటప్పుడు వివేకంతో వ్యవహరించాలి. కాని ఆహారం విషయంలో ఇవేమీ పరిగణలోకి తీసుకోనక్కరలేదు. మధ్యాహ్నంవేళ మనింటికి ఎవరు వచ్చినా సరే వారికి
భోజనం పెట్టవలసినదే. ఒకవేళ అంగవికలురు,
గ్రుడ్డివారు, రోగిష్టులు గాని వచ్చినట్లయితే ముందుగా వారికి పెట్టిన తరువాతే, మిగిలినవారికి అనగా ఆరోగ్యవంతులకు,
తరువాత మన బంధువులకు పెట్టాలి.
అధ్యాయం - 38
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment