13.09.2016
మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు చెన్నై నుండి శ్రీమతి కృష్ణవేణిగారు వినాయక చవితి మరుసటిరోజు తమ ఇంటిలో బాబావారు
చూపించిన అద్భుతమైన లీలను పంపించారు. శ్రీసాయి
తత్వమ్ ఇంకా చాలా అధ్యాయాలు ప్రచురించవలసి ఉంది.
అప్పటిదాకా ఈ లీలను ఆపుచేసి ఉంచడం భావ్యం కాదు కనక ఈ రోజే ప్రచురిస్తున్నాను. బాబావారు చూపించిన చమత్కారాలని జరిగిన వెంటనే మన
సాయి భక్తులందరం పంచుకుంటే ఆయన మీద మనకున్న భక్తి మరింతగా పెంపొందుతుంది.
ఓమ్
సాయిరామ్
తన
కన్నునిచ్చి పాప కన్నును కాపాడిన సాయి గణేష్
బాబావారు వినాయకుని రూపంలో నా పాపను కాపాడారు.
ఆరోజు 05.09.2016 సోమవారం, వినాయక చవితి.
ఎప్పటిలాగే అందరం చక్కగా వినాయకుని పూజించుకొన్నాము.
తరువాతి రోజు మంగళవారం కావడంవల్ల అదేరోజు సాయంత్రం వినాయక ప్రతిమను నిమజ్జనం చేయాలనుకున్నాను.
కాని మావారు మూడురోజులు వుంచిన తరువాత నిమజ్జనం చేద్దామన్నారు.
నేను మా చిన్న పాపతో పూజ సరిగా చేయలేనేమో అనుకున్నాను.
ప్రతి సంవత్సరం మావారు, ఆయన స్నేహితులతో కలిసి నిమజ్జనం చేస్తూ ఉంటారు.
ప్రతిసంవత్సరం మావారి స్నేహితులు తమతమ విగ్రహాలని నిమజ్జనం చేయడానికి వెళ్ళేముందు మావారిని మావిగ్రహాన్ని కూడా
నిమజ్జనం చేయమని
రమ్మని పిలుస్తూ ఉంటారు.
కాని మావారి స్నేహితులు అదేరోజు అనగా సోమవారమే తమతమ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వెళ్ళారు కాని మావారిని రమ్మని పిలవడం మర్చిపోయారు.
ఇంతలో నేను మాయింటి బయట ఉన్న ఐరన్ షాపుకు వెళ్ళాను.
ఆషాపులో ఉన్నామె “మీరు ఈసారి వినాయకుని ప్రతిమను మీవారి స్నేహితులతో కలిసి నిమజ్జనం చేయడానికి వెళ్ళలేదా?
మీవారి స్నేహితులు ఇప్పుడే వెళ్ళారు” అని అంది.
ఒకవేళ మాతో చెప్పడం మర్చిపోయారేమో అన్నాను.
అప్పుడామె “ఎప్పుడు రావాలో ఎప్పుడు వెళ్ళాలో అంతా ఆయన నిర్ణయం.
వెళ్ళిపొమ్మన్నంత మాత్రాన ఆయన వెళ్ళిపోరు, రమ్మన్నంత మాత్రాన ఆయన వచ్చేయరు” అని అంది.
నేనుకూడా “అవును అంతా ఆదైవనిర్ణయమే” అన్నాను.
మరుసటిరోజు మంగళవారం సాయంత్రం వినాయకునికి నైవేద్యం కోసం ప్రసాదం తయారుచేసాను.
వినాయకుని ముందు దీపం వెలిగించి అగరువత్తులు వెలిగించాను.
ఇంటిలో నేను, మాచిన్న పాప మాత్రమే ఉన్నాము
మాపాప నాదగ్గరే బంతితో ఆడుకొంటూ ఉంది.
సహస్రనామాలు చదువుదామని నేను పుస్తకం తీస్తున్నాను.
ఇంతలో మాపాప కూర్చున్నచోటనుండి లేచి అగరువత్తి స్టాండువద్ద పడ్డ బంతిని తీసుకోవడానికి వంగింది.
నేను ఆవిషయం గమనించలేదు.
పాప బంతి తీసుకోవడానికి కిందకి వంగడంతో వెలుగుతూ ఉన్న అగరువత్తి పాప ఎడమకంటికి తగిలింది.
అసలు ఆరోజు మధ్యాహ్నంనుండి నాకుడి కన్ను అదురుతూనే ఉంది.
ఆడవారికి కుడికన్ను అదురుతే మంచిది కాదంటారు.
అప్పుడు బాబాని “బాబా నా కుడికన్ను అదురుతోంది.
ఎటువంటి చెడు జరగకుండా చూసే భారం మీదే” అని ప్రార్ధించుకున్నాను.
పాప కంటికి ఏమయిందోనని చాలా భయంవేసింది.
ముందుగా కంటిని శుభ్రంగా చల్లని నీటితో కడిగాను.
కుడికన్ను చేతితో మూసి పాపకి బిస్కట్ ఇచ్చి “అమ్మనోటిలో పెట్టు” అన్నాను.
పాప నానోటిలో బిస్కట్ పెట్టగానె “అమ్మయ్య, పాప కంటికి ఏమీ జరగలేదని ఊపిరి పీల్చుకున్నాను.
వెంటనే బాబా పటం వద్దకువెళ్ళి నమస్కరించుకున్నాను.
పాపకి ఎడమకన్ను క్రింద మాత్రమే అగరువత్తి కాలడంవల్ల చిన్నగా గాయమయింది.
పాప కంటిలో అగరువత్తు గుచ్చుకున్నా, లేక బూడిద పడ్డా కంటికి ఏమయి ఉండేదో తలచుకుంటేనే భయం వేసింది.
బాబాగారు మాకు కాబోయే కొండంత బాధను గోరంత విధంగా తీర్చేశారు.
ఇక్కడ విచిత్రమయిన విషయం ఏమిటంటే ఎప్పుడయితే మాపాప కంటికి అగరువత్తి తగిలిందో అప్పుడే మావినాయకుని విగ్రహానికున్న ఎడమకన్ను ఊడి క్రిందపడింది.
అది మాపాప నిద్రపోయాక గమనించాను.
ఇక్కడ చెన్నైలో వినాయకుని విగ్రహానికి కండ్లకు గురువిందగింజలు పెడతారు.
పాపకు తగిలిన దెబ్బకూడా ఎడమకంటికే.
ఇపుడు అన్నీ ఆలోచించి చూస్తే ఐరన్ షాపులో ఆమె చెప్పినట్లుగా ఆయన మాపాపను కాపాడటానికే ఈమూడు రోజులు మాఇంటిలో ఉన్నారు.
మీకిప్పుడు ఒక సందేహం రావచ్చును.
మొదటిరోజునే నిమజ్జనం చేసేసి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అని.
కాని మాపాపకు ఏదో రూపంలో కంటికి పెద్ద హాని కలగవచ్చు.
బాబా వినాయకుని రూపంలో రాబోయే ఆపదని ఈవిధంగా నివారించారు.
బాబాయే ఆరూపంలో తొలగించారని నాకు పూర్తి నమ్మకం ఉంది.
ఎందుకంటే నాకు కుడికన్ను అదరడం వల్ల ఏవిధమయిన కీడు జరగకుండా కాపాడమని బాబాకు విన్నవించుకున్నాను.
అందువల్లనే ఆయన పెద్ద ఆపదనుండి మాపాపను కాపాడారు.
మైనతాయి కధకూడా మనందరికీ తెలుసున్నదే కదా.
(రేపు యధాప్రకారంగా శ్రీసాయిబాబా వారి తత్వము)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
1 comments:
aaha sai
Post a Comment