04.11.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి పాదరేణువు (మూర్తి) గారి అనుభవాలను సాయి బంధు సాయి సురేష్ గారు జూలై నెల 25వ.తారీకున నాకు మైల్ ద్వారా పంపించారు. శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము పూర్తయిన తరువాతె ప్రచురిద్దమని ఆపడమ్ జరిగింది. ఈ రోజునుండి వారి అనుభవాలను ప్రచురిస్తున్నాను. చదవండి. ఆయన పంపించిన అనుభవాలను యధాతధంగా ప్రచురిస్తున్నాను. అక్కడక్కడ అక్షర దోషాలను మాత్రమే సరి చేసాను.
సాయి
పాదరేణువు (మూర్తి) గారి అనుభవాలు: 1
మీకు
వాగ్దానం చేసినట్టుగా మీకు నా కథను,
నా లైఫ్ లో బాబా
చేసిన లీలలు, మహిమలు అన్నీ మీకు తెలియ
పరచబోతున్నాను..
[నేను
కవిని కాను, రచయితను కాను.
అందుకని ఈ రచనలో ఎన్నో
అక్షర దోషాలుండ వచ్చు. భావాన్ని మాత్రమే చూడండి, విషయం గ్రహిస్తే చాలు.
బాబా లీలలు, అందుకు నా జీవితంలో ఎటువంటి
సంఘటనలు చోటు చేసుకున్నాయో, నన్నుబాబా
ఏ విధంగా చూసుకున్నాడో అర్ధం చేసుకోండి]
ఇదిగో
ఇదే నా కథ.
My story – Part-1 – సాయి లీల - ప్రధమ
దర్శనం – First appearance of SAIBABA!
నేను
బాబా పరిచయం కాకముందు పూర్తి నాస్తికుడను (అజ్ఞానిని - అన్నీ నాకే తెలుసును
అనుకునే తెలివితక్కువ వాడిని). దేవాలయాలకు
నా అంతట నేను వెళ్ళేవాడిని
కాను. మా
వాళ్ళతో వెళ్ళాల్సివస్తే వెళ్లి వాళ్ళతో పాటు ఉండేవాడిని కాని
భగవంతుడికి నమస్కారం కూడా పెట్టేవాడిని కాను.
రోజులు
గడచిపోతున్నాయి కాని ఎటువంటి ఎదుగూ
బొదుగూ లేని జీవితం. ఎన్నో
సమస్యలు. ఆర్ధిక ఇబ్బందులు. అప్పటికి మాకు పెళ్లై సుమారు
20 సంవత్సరాలవుతుంది. భార్యకు ఎటువంటి ఆభరణాలు చేయించిన పాపాన పోలేదు. ఇద్దరం
సంపాదిస్తున్నాము. అయినా
ఆర్ధిక ఇబ్బందులు తప్పటం లేదు. మాది
పెద్ద ఫ్యామిలీ, సమస్యలు కూడా ఎక్కువే. తన
సాటి వారందరూ బాగా ఎదుగుతూండడం చూసి
నా భార్యకు సహజంగానే మనసు చివుక్కుమంటూ ఉంటుంది. కనీసం
బ్యాంకు లోన్ తీసుకునైనా ఒక
ఫ్లాట్ కొనుక్కుందాం అంటుంది. కాని పిల్లల చదువులు,
వారి ఫీజులు ఇతర ఆర్ధిక సమస్యలు
ఎన్నో నన్ను పట్టి పీడిస్తున్నాయి.
అప్పటికి 5 సంవత్సరాలనుంచి నేను ఇతర సంపాదనా
మార్గాలు ప్రయత్నిస్తున్నా ఏవీ ఫలించడం లేదు.
అవి నష్టాల్లో నడుస్తున్నాయి. ఆర్ధికంగా
చితికి పోతున్నాము. ఇద్దరి
మధ్యా ఎన్నో ఘర్షణలు. నా
తెలివితక్కువతనాన్ని ఒప్పుకునే ధైర్యం లేక, అబద్ధపు జీవితాన్ని
గడుపుతున్నాను. ఏదో ఒకటి చేసి
అధిక డబ్బు సంపాదించి నా
భార్య కోరికలు ఒకటి రెండైనా తీర్చాలి,
పిల్లలని బాగా చదివించుకోవాలి.
ఇవన్నీ నా ఆశలు, కాని
అవి తీరే మార్గాలే కనిపించడం
లేదు.
సరిగ్గా
ఈ సమయంలోనే, నాకు ఎన్నో జన్మల
సంబంధం ఉన్న సాయిబాబా నా
ప్రయత్నం లేకుండానే నా జీవితాన్ని మార్చాలని
సంకల్పించారు. వీడు తనంతట తాను
ఎలాగూ మారడు, భగవంతుణ్ణి ఆశ్రయించడు అని నిర్ధారించుకుని తనకు
తానుగా 1995 సెప్టెంబర్/అక్టోబర్ ప్రాంతంలో [దసరాకి ముందు] నాకు దర్శనం ఇప్పించుకున్నాడు. నా
సహ ఉద్యోగి తన ఇంట్లో ఒక
గురువారం బాబా భజనలు జరుగుతున్నాయి
రమ్మని ఆహ్వానించారు. అయిష్టంగానే వస్తానని చెప్పాను. అయినా
ఆరోజు వెళ్ళాలని లేదు. సాయంత్రం మామూలుగానే
ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాను. కాని
ఆఫీసు నుంచి ఇంటికే బయలుదేరాను. మార్గ
మధ్యంలో బాబా నన్ను ఆవహించి
నా మార్గాన్ని ఆ సహోద్యోగి ఇంటి
వైపు మరలించారు. నా
ప్రయత్నం లేకుండానే నేను అతని ఇంటికి
వెళ్ళేను. అంతవరకూ నాకు బాబా ఎలాగ
ఉంటాడో కూడా తెలీదు. ఆ ఇంటిలోకి అడుగుపెడుతూనే
ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యేను. యాంత్రికంగానే లోపలికి అడుగుపెట్టి అక్కడ ఉన్న ఆ
దివ్య మంగళ బాబా ఫోటోలోకి
అలా చూస్తూనే చాలా సేపు ఉండిపోయాను.
నాకు తెలియకుండానే నమస్కారం పెడుతూ ఉండిపోయాను. ఆ
భజనల్లో యాంత్రికంగానే పాల్గొన్నా.
అదొక
మరచిపోలేని రోజు. నా ఆరాధ్య
దైవం తనంత తానుగా నాకు
దర్శనం ఇచ్చిన రోజు. నా జీవితాన్ని
ఒక అందమైన మలుపు తిప్పిన రోజు.
నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసిన రోజు. నా
మనసంతా ఒక దివ్య ఆనందానుభూతి
ఆవరించివేసింది. అక్కడనించి
కదలాలని అనిపించలేదు. భజనలు అయిపోయిన తర్వాత
తీర్థ ప్రసాదాలను తీసుకుని నా స్నేహితునికి ఎంతో
కృతఙ్ఞతలు చెప్పుకుని బయల్దేరి ఇంటికి ఎలాగ వొచ్చానో తెలియదు.
వచ్చి ఆ ఆనందానుభూతిని నెమరు
వేసుకుంటూ ఎప్పుడో నిద్రపోయాను. అప్పటినుంచి
సుమారు పదిహేను రోజులవరకు ఆ ప్రభావంతో ఆనంద
డోలికలలో మునిగిపోయాను. ఆ
రోజునుంచి నేను పక్కా ఆస్తిక
వాదిని. బాబానే
నా ప్రధాన దైవంగా భావిస్తున్నా మిగతా దేవుళ్ళందరికీ భక్తితో
మామూలుగానే పూజలు చేసుకుంటూ ఉండేవాణ్ణి.
My story – Part-2 – సాయి లీల-2
ఆరోజునుంచి
నా ఆలోచనా విధానమే మారిపోయింది. నా సమస్యలు నన్ను
బాధించడం తగ్గుతూ వస్తున్నాయి. ఆరోగ్య
సమస్యలు తొలగి పోతున్నాయి. చేతిలో
ఏమీ లేకపోయినా, ఎన్నో అప్పులున్నా బాబాని ప్రార్ధించి ఒక ఫ్లాట్ తీసుకుందామని
ప్రయత్నాలు మొదలుపెట్టాను. రెండు
సంవత్సరాల్లో నా ప్రయత్నాలు ఫలించి
(బాబాయే ఫలింప చేసేటట్టు, దానికి
తగిన వనరులన్నిటినీ తానే సమకూరేటట్టు చేసి)
1997 చివరికి మేము మాకున్న ఆర్ధిక
వనరులన్నీ సమకూర్చుకొని, బ్యాంకు లోన్ ద్వారా ఒక
ఫ్లాట్ కి యజమానులమైనాము.
అయినా నా ఇతర ఆర్ధిక
సమస్యలు అలానే మిగిలి ఉన్నాయి. అవి
కూడా బాబా ఎలా తీరుస్తున్నాడో
మీరే చదవండి.
My story – Part-2 – సాయి లీల-3
ఇక్కడ
ఈ హైదరాబాద్ లో ఉంటూ పెద్దగా
సంపాదించ లేనని భావించి
విదేశాలకు వెడితే ఎక్కువగా సంపాదించ వచ్చని, అదే సరియైన మార్గమని
బాబాని ప్రార్ధించాను. మొదట
బాబా వద్దన్నా, తర్వాత నా బాధ భరించలేక
నా సాఫ్ట్ వేర్ నేర్చుకునే ప్రయత్నాలకు
పచ్చ జెండా చూపించారు.
విదేశాలకు వెళ్ళే ఉద్యోగాలకు
కావలసిన అర్హతలు సంపాదించుకున్నాను ఆ రెండు సంవత్సరాలలో. బాబా
దయవల్ల విదేశంలో (అమెరికా - న్యూ జెర్సీ లో)
ఒక ఉద్యోగానికి ఆహ్వానం వచ్చింది. 1998 లో వెళ్ళాను. [ఇక్కడ
మీరు ఒకటి గుర్తుంచుకోవలసి వస్తుంది
- మన ప్రారబ్దంలో ఉన్న కర్మలను అనుభవింప
చేస్తూనే ఆ ప్రారబ్దంలో
లేనివాటిని కూడా మనకు ప్రసాదించగల
సర్వ సమర్ధ అద్భుత దైవం
మన సాయిబాబా. నాకు విదేశాలకు వెళ్ళే
అవకాశం, అర్హత లేక పోయినా
బాబా నా ఆర్తిని అర్ధంచేసుకుని
నాకు అవకాశం ఇచ్చాడు అన్నది నిర్వివాదాంశం.] అయినా
నా ప్రారబ్దంలో ఉన్న
కష్టాలను అనుభవింప చేయాలి కాబట్టి అవి కూడా సమాంతరంగా
ప్రసాదించేడు. విదేశంలో
ఒక 6 నెలలు ఉద్యోగం లేకపోయినా
మిగిలిన కాలం అంతా ఏదో
ఒక ఉద్యోగం అనుభవింప
చేసేటట్టు చేసాడు కాని సంపాదన
మాత్రం ఎక్కువగా లేదు. నామ
మాత్రంగానే సంపాదించాను. అయినా
నేను బాగా సంపాదించగలనన్నమొండి ధైర్యంతో ఉన్నాను. నా
ప్రారంబ్ధం కొద్దీ "Y2K (Year
2000)" అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ సమస్య వచ్చింది,
నా ఉద్యోగం పోయింది. ఒక
3 నెలలు ఊరికినే ఉండి ఇక ఉండలేక
2001 లో ఇండియా తిరిగి వచ్చేసాను.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment