Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, March 23, 2017

శ్రీసాయి లీలా తరంగిణి – 1 వ.భాగమ్

Posted by tyagaraju on 6:27 AM
       Image result for images of shirdi sai
       Image result for images of rose hd

23.03.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయి లీలా తరంగిణి – 1 వ.భాగమ్
రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన :  తెలుగు.   ఆంగ్లంలోకి అనుబదింపబడినది)
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్ ఖైల్ గేట్,  దుబాయి

ఈ రోజు నుండి శ్రీమతి భారమ్ మణి ఉమా మహేశ్వరరావు గారు రచించిన ‘సాయిలీలా తరంగిణి’ ప్రారంభిస్తున్నాను.  ఈ పుస్తకంలో,  శ్రీ భారమ్ ఉమా మహేశ్వరరావుగారికి, శ్రీమతి మణిగారికి వారి కుటుంబ సభ్యులకు  బాబా వారు చూపించిన అద్భుతమైన లీలలు, వారికందించిన అనుభవాలు ఆవిడ ఏర్చి కూర్చి సాయి బంధువులందరికి అందించారు.  ఈ పుస్తకమ్ ఆవిడ తెలుగులో వ్రాసారు.  దానిని ఆంగ్లంలోకి కూడా తర్జుమా చేయించారు.  ఈ పుస్తకానికి బాబావారు కూడా మెచ్చుకుని ప్రసంశించారు.  దానికి సంబంధించిన లీల కూడా ముందు ముందు వస్తుంది. 


ఈ పుస్తకం తెలుగులోనే ఆమె వ్రాసారు కాబట్టి కొంత మంది వద్ద పుస్తకం ఉండవచ్చునని భావించాను.  మరలా నేను ఆంగ్లంనుంచి తెలుగులోకి అనువాదం చేయడం సరైన పనేనా అనిపించింది.  అనువాదం మొదలు పెడదామని మళ్ళీ విరమించుకున్నాను.  కాని ఇందులోని బాబా లీలలను చదివిన తరువాత ఉండలేకపోయాను.  సరే బాబానే అడుగుదామని, బాబా చిన్న ఫోటో ముందు చీటీలు వేసాను.  ఒక దానిమీద ‘అనువాదమ్ చెయ్యి’  ఇంకొక దానినీద ‘అనువాదం చెయ్యద్దు’ అని రాసి కళ్ళు మూసుకొని ఫొటో ముందు వేసి, కళ్ళు మూసుకునే ఒక చీటీ తీసాను.  అనువాదమ్ చెయ్యమనే వచ్చింది.  ఇది ఆయన ఆజ్ఞగా భావించి అనువాదం ప్రారంభించి మీకందిస్తున్నాను.  ఈ అనువాదానికి కర్త, కర్మ, క్రియ అన్నీ బాబావారే.  నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. 

(బాబా ఫొటో ముందు చీటీలు వేసిన చిత్రం సెల్ ఫోన్ లో తీసాను.   డెస్క్ టాప్ మీద సేవ్ చేసాను.  కాని అది బ్లాగులోకి కాపీ అవలేదు.  వీలును బట్టి అది ఏవిధంగా చేయాలో తెలుసుకుని తరువాత బ్లాగులో పోస్ట్ చేస్తాను.)

ఇందులో మీరు చదవబోయే కొన్ని లీలలు ఇంతకు ముందు శ్రీ భారం ఉమా మహేశ్వరరావుగారు, శ్రీ బొండాడ జనార్ధనరావుగారు, వారి గురించి వ్రాసినవాటిలో చదివారు. వాటిలోవి కొన్ని మరల వస్తాయి.  కాని వాటిలో లేని కొన్ని సంఘటనలు ఇప్పుడు మీరు చదవబోయేవాటిలో కనిపిస్తాయి. కారణమ్ శ్రీ భారమ్ ఉమా మహేశ్వరరావు గారి భార్య శ్రీమతి మణిగారు తన భర్త ప్రక్కనే ఉంటారు కాబట్టి ఆవిడ గ్రహించిన, చూసిన విషయాలను యధాతధంగా వ్రాసారు.  అందువల్ల వాటిని కూడా మరలా మీరు చదవబోతున్నారు. బాబా లీలలు మరలా మరలా చదవాలనిస్తూనే ఉంటాయి.
ఓమ్ సాయిరామ్
త్యాగరాజు
శ్రీసాయిబాబాతో నాజీవితం

శ్రీమతి భారమ్ మణి ఉమా మహేశ్వర రావు
ముందు మాట
(ఆంగ్ల మూలం సాయిలీలా.ఆర్గ్ నుండి గ్రహింపబడినది)

భగవాన్ శ్రీసాయిబాబా దైవాలందరి తరఫున వారి ప్రతినిధిగా భువినించి దివికి దిగి వచ్చిన ప్రత్యక్ష దైవం.  ఆయన సర్వవ్యాపకుడు.  మానవ రూపంలో అవతరించిన భగవదావతారం.  ఆయనని మనఃస్ఫూర్తిగా త్రికరణ శుధ్ధిగా సంపూర్ణ విశ్వాసంతో భక్తితో నమ్మితే చాలు.  ఆయన ఎల్లవేళలా తన భక్తులను రక్షించడానికి సదా సర్వ సన్నధ్ధంగా ఉంటారు.  ఆయన దయ ఎల్లవేళలా మనపై ప్రసరిస్తూనే ఉంటుంది.  శ్రీసాయిబాబా భగవంతుడు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.  మనం ఆర్తితో ఆయనను ప్రార్ధిస్తే తప్పక స్పందిస్తాడు.  ఆయన తన అవ్యాజ్యమయిన ప్రేమని తన భక్తులందరి మీద కురుపిస్తూ ఉంటారు.  సాయినాధ్ దయార్ద్ర హృదయుడు.  తననే ధానిస్తూ తనలోనే లీనమయ్యే తన భక్తులను చూసి బాబా ఎంతగానో  సంతృప్తి చెందుతారు.  తల్లి తన పిల్లలు అభివృధ్ధిలోకి రావాలని ఎంతగానో శ్రమిస్తుంది.  వారు అభివృధ్ధిలోకి వచ్చినపుడు వారిని చూసిన ఆతల్లి హృదయం ఎంతగానో సంతోషిస్తుంది.  అదే విధంగా తాత్వికజ్ఞానాభివృధ్ధి కోసం పరితపించే తన భక్తులకు బాబా తన చేయూతనందిస్తారు.  వారికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి ముక్తిని కలుగచేస్తారు.  శ్రీసాయిబాబా తన భక్తుల కష్టాలను తొలగించి వారు సుఖశాంతులతో సంతోషంగా కాలం గడిపేలా అనుగ్రహిస్తారు.

వివిధ దేశాలలో కోటానుకోట్లమంది సాయిభక్తులు ఉన్నారు.  ఆధ్యాత్మిక సాగరంలో నేనొక నీటిబొట్టును.  శ్రధ్ధ సబూరీలతో సాయిబాబాను చేరుకున్న ప్రతిభక్తునికి ఆయన లీలలు అనుభవంలోకి వస్తాయి.  ఆయన చేసే కొన్ని విచిత్రమయిన లీలలను మనం అర్ధం చేసుకోలేము.  వాటిలో కొన్ని లీలలను మనం మర్చిపోతాము.  మరికొన్నిటిని గుర్తుంచుకుంటాము.  అత్యంత దారుణమయిన మన కష్టాలను కూడా  ఆయన చాలా సునాయాసంగా దూదిపింజలన్నంత తేలికగా తొలగించేస్తారు. బాబా కరుణవల్ల మన జీవితాలు పునీతమవుతాయి.

ఆయన హృదయమంతా తన భక్తులఎడల కరుణతో నిండి ఉంది కాబట్టే తన భక్తులందరినీ ప్రతిక్షణం కాపాడుతూ ఉన్నారు.  ఆయన మీద మనకున్న అచంచలమయిన విశ్వాసం వల్లనే మనం జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతున్నాము.  ఆయన అడుగు జాడలలో నడవడమే మనందరి జీవితాశయం కావాలి.

త్రికరణశుధ్ధిగా ఆయననే నమ్ముకుని ఆయన సేవ చేస్తూ, సర్వశ్య శరణాగతి వేడుకోవాలి. ఆవిధంగా మనం చేయగలిగితే ఆయన ఎల్లప్పుడు తన దయను మనమీద కురిపిస్తునే ఉంటారు.  మన భారమంతా ఆయనే మోస్తారు.  ఆవిధంగా మన సమస్యలన్నిటినీ దూరం చేసి, మనలని దుఃఖాలనుండి తప్పించి మనకు ఆనందాన్ని చేకూర్చుతారు.  ఆయన అనుగ్రహం వల్ల మనమ్ ఈప్రాపంచిక కష్టాలనుండి విముక్తులమవుతాము.  మనలని చుట్టపెట్టుకుని ఉన్న ఈ కష్టాలు తొలగిపోగానే, మనలో సాయిబాబాకు మరింతగా చేరువకావాలనే కోరిక ఇంకా ఎక్కువవుతుంది.  ఆవిధంగా ఆయనపై మన భక్తి కూడా ఇనుమడిస్తుంది.  బాబా మన అజ్ఞానపు చీకటిని తొలగించి, ఆధ్యాత్మిక మార్గంలో పయనింప చేస్తారు.  మనమంతా సామాన్య మానవులం.  మనం మన జీవితాలలో కష్టాలను, వేదనలను సుఖాలను అధిగమించలేము.  మన సమస్యలకు బాబా ప్రతిస్పందిస్తారు.  మన సమస్యలన్నిటిని దూరం చేసి తన మార్గంలోకి మనలని నడిపిస్తారు.

సముద్రంలోని ముత్యాలవలె ప్రపంచం నలుమూలలో సాయిమహిమలు వ్యక్తమవుతూ ఉన్నాయి.  ఆయన చూపే మహిమలన్నిటిని ఏర్చి కూర్చి ఒక పూలదండలాగ తయారు చేయడమంటే ఎవరికయినా కష్టసాధ్యమే.  మా కుటుంబానికి బాబావారు ప్రసాదించిన అనుభవాలను, అద్భుతాలతో సహా, నాకు కూడా బాబా వారు ఇచ్చిన అనుభవాలను వివరిస్తాను.

                           Image result for images of shirdi sai baba with rays
సూర్యుని కిరణాలు ప్రకృతిలోని చీకట్లను పారద్రోలి మనలను మేల్కొలుపుతాయి.  అదే విధంగా సాయిభక్తులు బాబా లీలలు చదివినా, శ్రవణం చేసినా, దాని ఫలితంగా వారి హృదయాలలో సాయిబాబా మీద భక్తివిశ్వాసాలు మరింతగా వృధ్ధి చెందుతాయి. సాయి భక్తులందరిని బాబా లీలలు జాగృతం చేస్తాయి.  వారిలో జ్ఞానాన్ని పెంచుతాయి.  నా భర్త శ్రీ భారం ఉమా మహేశ్వరరావుగారికి సాయిబాబావారు ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలను, బోధనలను, లీలలను ప్రసాదించారు.  వాటినన్నిటిని మేఘాలనుండి కురిసే వర్షపు జల్లులలాగ నలుదిశలా వ్యాప్తిలోకి తీసుకుని రమ్మని బాబా  ఆదేశించారు.
               Image result for images of shirdi sai baba with rays
స్వర్ణముకన్న శ్రేష్ఠమయిన ఈ అనుభవాలన్నిటిని ‘సాయిలీలలు’ గా మీముందుంచుతున్నాను.  బాబా నుండి మేము ఎటువంటి అనుభూతులను, అనుభవాలను పొందినా అది మా గొప్పతనం కాదు.  అది ఆయనయందు మాకు గల భక్తి.  ఆయన మాపై కురిపిస్తున్న దయ, నిరంతర పర్యవేక్షణ వల్ల మాత్రమే.

ఇందులో ఉదహరించిన పేర్లు, నామమాత్రమే.  బాబా చేతిలో మనమంతా ఆటబొమ్మలం.  బాబాయే మన జీవితం, ఆయనే మన సర్వస్వం.  మన ఆధ్యాత్మిక జీవితానికి ఆయన చుక్కాని, మార్గదర్శి.  ఈ సాయిలీల పుస్తకానికి గ్రంధకర్త శ్రీసాయిబాబాయే.  ఈ పుస్తకం సాయిభక్తులందరికీ చేరువలోకి రావడానికి కారణమైన దివ్యశక్తి బాబాయే.

శ్రీసాయిబాబావారి అనుగ్రహంతో ఎంతోమంది సాయిభక్తుల అనుభవాలను సేకరించి, ‘సాయి లీలా తరంగిణి, ‘శ్రీసాయి లీలా స్రవంతి’  కావ్య రూపంలో ‘శ్రీసాయి లలితా గీతా విభావరి’ అనే పుస్తకాలని  తెలుగులో ప్రచురింపగలిగాను.  సాయి భక్తులందరూ ఈపుస్తకాలను చదివి ఎంతగానో అభినందించారు.  బాబా దయవల్ల ఈ పుస్తకం ఆంగ్లంలో కూడా ప్రచురింపబడింది.

ఈ పుస్తక ప్రచురణకు తమ సహాయ సహకారాలు అందించినవారందరికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పుస్తకాన్ని ప్రచురించిన శ్రీ ఎమ్.వి.శ్రీనివాస్, పూర్ణకళా ఆఫ్ సెట్ ప్రింటర్స్, నారాయణగూడ, హైదరాబాదు వారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.  ఈ పుస్తకాన్ని ప్రచురింపచేసిన కుమారి బొండాడ శిరీషకు, తెలుగు అధ్యాయాలను ఆంగ్లంలోకి అనువదించిన శ్రీమతి పింగళ జానకి జ్యోతిగారికి నేనెంతో ఋణపడి ఉన్నాను.

ఈ పుస్తకంలోని బాబా లీలలను చదివిన భక్తులందరు బాబాకు మరింత దగ్గరగా చేరువవుతారని నా ప్రగాఢ విశ్వాసం.

శ్రీసాయిబాబా ఆశీర్వాద, అనుగ్రహ బలం వల్ల సేకరించిన బాబా మహిమలు, లీలలు అనే ముత్యాల మణిహారాన్ని బాబామెడలో అలంకరిస్తున్నాను.

వినమ్రతతోను, భక్తితోను, శ్రీసాయి చరణ కమలాలకు శిరసువంచి పాదాభివందనం చేస్తున్నాను.

శ్రీసాయిబాబా సేవలో
భారం మణి ఉమామహేశ్వరరావు.

(రేపటినుండి బాబా లీలలు ప్రారంభం)

(రేపటి సంచికలో శ్రీ సాయిబాబా వైద్యులకే వైద్యుడు) 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List