19.08.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు 
సాయిలీల ద్వైమాస పత్రిక
మే – జూన్ 2015 సంచికలో ప్రచురించిన మరొక అధ్భుతమైన బాబా ఊదీ మహత్య్మాన్ని తెలుసుకుందాము.
ఊదీ - బాబా తన భక్తులకు ప్రసాదించిన వరమ్
1988 వ.సంవత్సరంలో నాకు
ఫిస్టులా వచ్చింది.  ఫిస్టులా వల్ల ఏర్పడిన
వ్రణం కారణంగా ప్రేవుల మీద కూడా దాని ప్రభావం కనిపిస్తుంది.  ఫిస్టులాకి నివారణ సర్జరీ చేయించడం ఒక్కటే మార్గం
కాని చాలా కొద్దిమందికి మాత్రం సర్జరీ అవసరం లేకుండానే దానంతటదే తగ్గిపోతుంది.  ఈ ఫిస్టులా అనేది ఒక జబ్బు.  సర్జన్ నేర్పరితనం మీదనే సర్జరీ విజయవంతంగా జరుగుతుంది.
నేను డెహ్రాడూన్ లో ఉన్న
సర్జన్లను అందరినీ కలిసి మాట్లాడాను.  పిస్టులా
వచ్చినవారికి సర్జరీ చేయడానికి ముందు వారికి వైద్యం చేశారు.  కాని అందరూ చెప్పిన విషయం పిస్టులా దానంతట అది నివారణ
కాదు, సర్జరీ చేయవలసిందేనని.  సర్జరీ అంటేనే
భయం గొలిపే విషయం.  ఆఖరికి బాగా ఆలోచించి డెహ్రాడూన్
లో ఉన్న పేరొందిన సర్జన్ దగ్గర మరుసటిరోజే సర్జరీ చేయించుకోవడానికి సిధ్ధపడ్డాను.  మానాన్నగారు ఉత్తరాఖండ్, హరిద్వార్ కి 85 కి.మీ. దూరంలో
ఉన్న మంగ్లూర్ అనే చిన్న పట్టణంలో ఉంటున్నారు. నేను మా నాన్నగారికి మరుసటిరోజు నాకు
సర్జరీ జరగబోతోందని, ఆసమయానికి ఆస్పత్రిలో ఉండమని చెప్పాను.  కాని ఆయనకు వచ్చే రెండు వారాలకి సరిపడా విపరీతమయిన
పని వత్తిడులు ఉన్నాయని చెప్పారు.  అందువల్ల
ఆపరేషన్ వాయిదా వేయవలసి వచ్చింది.
చార్లెస్ డికెన్స్ యిచ్చిన
సలహా ఏమిటంటే “ఈరోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేయవద్దు, ఆలస్యం చేయడం అనేది కాలాన్ని
దొంగిలించి బంధించడంవంటిది”.
ఈవిధంగా వాయిదాలు వాయిదాలు
వేసుకుంటూ వారాలు, సంవత్సరాలు గడిచిపోయాయి. 
ఇన్ని సంవత్సరాలుగా ఆపరేషన్ చేయించుకునే విషయంలో వాయిదాలు వేస్తూనే ఉన్నాను.
1991 వ.సంవత్సరంలో ఒకరోజు
మాయింటికి ఒక అతిధి వచ్చాడు.  చూడగానే ఆకట్టుకునే
మంచి రూపం.  అతని తలచుట్టూ వలయాకారంగా కాంతి.  అతనిని సాదరంగా ఆహ్వానించి కూర్చోమని చెప్పాను.  అతను వచ్చిన కారణం అడిగాను.  అపుడా వ్యక్తి “నేను నీ ఆరోగ్యం గురించి, నీయోగక్షేమాలను
గురించి తెలుసుకుందామని వచ్చాను” అన్నాడు. 
అపుడతనికి నాకు ఉన్న సమస్యగురించి చెప్పాను.  నేను చెప్పినది వినగానే సుదీర్ఘంగా ధ్యానంలోకి వెళ్ళి
కొద్ది క్షణాల తరువాత తల పైకెత్తి చిరునవ్వు నవ్వాడు.  అతను మృదువుగా మాట్లాడిన మాటలు నాహృదయాన్ని తాకాయి.  “కొన్ని నిమిషాలపాటు నేను చెప్పేది వింటావా?” అన్నాడు.  వినను అని చెప్పడానికి తగిన కారణం ఏమీ నావద్దలేదు.  అందుచేత అతను ఏమిచెబుతాడో వినే ఉద్దేశ్యంతో జాగ్రత్తగా
వినడానికి కాస్త ముందుకు వంగాను.
వ్యాస మహాముని వైశంపాయుడికి
చెప్పిన వృత్తాంతాన్ని నాకు వినిపించడం మొదలుపెట్టాడు.
“పూర్వకాలంలో మద్రదేశాన్ని
భద్రేశ్వర్ అనే రాజు పరిపాలించేవాడు.  ఒకసారి
అతని ఎడమచేతికి కుష్టువ్యాధి సోకింది.  ఆవ్యాధి
తన శరీరమంతటికి ప్రాకుంతుందనే భయంతో జీవితాన్ని అంతం చేసుకుందామనుకున్నాడు.  తన నిర్ణయాన్ని ఆస్థానపురోహితునికి చెప్పాడు.  అపుడా పురోహితుడు నువ్వు నీనిర్ణయం ప్రకారం జీవితాన్ని
చాలిస్తే రాజ్యం భ్రష్టుపట్టి నాశనమయిపోతుంది అని రాజుని హెచ్చరించాడు.  “నువ్వు సూర్యుడిని కనక పూజిస్తే నీకుష్టువ్యాధి
నయమవుతుంది” అని సలహా యిచ్చాడు.  సూర్యుని ఏవిధంగా
పూజించాలో వాటికి కావలసిన నియమనివంధనలు అన్నీ వివరించి చెప్పాడు ఆస్థాన పురోహితుడు.
సూర్యదేవునిని అర్ఘ్యపాద్యాదులతోను,
పండ్లు, నైవేద్యాలతోను మంత్రాలు చదువుతూ మంచి నిష్టతో భద్రేశ్వర్ మహారాజు పూజాదికాలను
నిర్వహించాడు.  
సూర్యదేవుడిని మంచి భక్తిశ్రధ్ధలతోను
నిష్టగాను పూజించినందువల్ల ఒక సంవత్సరంలోనే అతని కుష్టువ్యాధి నయమయింది.
ఈ కధంతా విన్నతరువాత యిక
దీర్ఘంగా దానిగురించి ఆలోచించడం నావంతుగా మిగిలింది.  
నాముఖంలోని భావాలను వచ్చిన వ్యక్తి గమనిస్తూనే ఉన్నాడు.  అతను ఏఉద్దేశ్యంతో వచ్చాడో నాకు అతని కళ్ళలో కనిపిస్తోంది.  నాజవాబు కోసం ఎదురు చూస్తున్నాడు.
అపుడు నేను “కాని, నాకు
మరొక సూర్యదేవుని గురించి బాగా తెలుసు” అన్నాను.
అతను నావైపు ఆశ్చర్యంగా
ఏమీ మాట్లాడకుండా చూసాడు.  
ఆ మరొక సూర్యదేవుడు మరెవరో
కాదు, పగలు రాత్రి షిరిడీ పవిత్రక్షేత్రంనుండి ప్రపంచమంతా తన వెలుగును ప్రసరిస్తూ తన
భక్తులకు దీవెనలను అందిస్తూ ఉన్న సాయిబాబా తప్ప మరెవరూ కాదు” అన్నాను.
“అయితే నీకు షిరిడీసాయిబాబా
తెలుసా?” అని ప్రశ్నించాడు ఆ వచ్చిన అతిధి.
“నా ఎన్నోగత జన్మలనుంచి
ఆయనే నాసూర్యదేవుడు.  అప్పటినుండే నేను ఆయన
కుమారుడిని” అని ఒక్క గుక్కలో ఆవ్యక్తికి చెప్పాను.
“అయితే నివారణకాని ఎన్నో
రోగాలకు దివ్యౌషధమయిన ఆయన పవిత్రమయిన ఊదీ గురించి కూడా నీకు తెలిసే ఉండాలి” అన్నాడు.
“శ్రీసాయి సత్ చరిత్రలో
ఊదీ చేసిన అధ్భుతాలను అన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఒకటొకటిగా  సంఘటనలన్నిటినీ ఆవ్యక్తికి వివరించి చెప్పాను.  అతను నేను చెప్పినవన్నీ ఎంతో ఓపికగాను ఆసక్తితోను
విన్నాడు.
ఇక అతను లేచి వెళ్ళబోయేముందు
తన జేబులోనుంచి ఊదీ పొట్లాన్ని తీసాడు.  అతను
ఆ ఊదీని నా చేతిలో పెడుతూ దానిని ఏవిధంగా ఉపయోగించాలో సూచనలు యిచ్చాడు.  “ఈ ఊదీని నీవ్రణం మీద రాసుకో.  ఒక నెలలోనే నీకు వచ్చిన వ్యాధి నయమయిపోతుంది” అన్నాడు.
అసలు ఇక ఎప్పటికీ సర్జరీ
చేయించుకోకూడదనే నిర్ణయానికి వచ్చేశాను.  ఆ
ఆలోచననే విరమించుకున్నాను.   అతను చెప్పిన సూచనలని
ఖచ్చితంగా పాటిద్దామనే నిర్ణయానికి వచ్చేశాను.
అద్భుతం…ఆవ్యక్తి చెప్పినట్లుగానే
సరిగా ఒక్క నెలలోనే వ్రణం మానిపోయింది.
అపుడు అర్ధమయింది.  ఆవచ్చిన అతిధి ఎవరో.  నేను అతనిని కొన్ని ప్రశ్నలు అడిగిన సందర్భంలో తాను
షిరిడీనుంచి వస్తున్నానని చెప్పాడు.
నా అజ్ఞానం, నా అజాగ్రత్తవల్ల ఆయనని గుర్తించలేకపోయినందుకు క్షమాపణ వేడుకొన్నాను.  కాని ఈ అనుభవం వల్ల షిరిడీసాయిబాబా గారి ఊదీ ఆయన
తన భక్తులకు యిచ్చిన వరం అని గ్రహించుకున్నాను.
శ్రీసాయిబాబా షిరిడీలో
60 సంవత్సరాలపాటు నివసించి 1918 వ.సంవత్సరంలో సమాధి చెందారు.  ఆయన అక్కడ నివసించిన 60 సంవత్సరాలు ఆయన స్వయంగా
వెలిగించిన ధునిలోని ఊదీ అనంతంగా లభించింది. 
సాయిబాబా స్వయంగా ఎందరో భక్తులకు ఆ ఊదీని ప్రసాదించారు.
బాబా ఊదీని పంచిపెట్టడంలో
ఒక పరమార్ధం ఇమిడి ఉంది.  ఊదీ వలన బాబా ఏమని
బోధించదలచుకున్నారో దాని ఉద్దేశ్యం,   "ఈ ప్రపంచంలో కనిపించు వస్తువులన్నియు బూడిదవలె అశాశ్వతములు.  పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నియు 
సౌఖ్యములననుభవించిన
పిమ్మట పతనమైపోయి బూడిదయగును.  ఈ సంగతిని జ్ఞప్తికి
దెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను.  బ్రహ్మ ఒక్కటే సత్యం.  బ్రహ్మాండమంతా అసత్యమే.  ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు,
కొడుకు గాని, తల్లిగాని, మనవారు కారనియు బాబా బోధించెను.  ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగానే వచ్చాము.  ఒంటరిగానే పోయెదము.  ఊదీ వివేక, వైరాగ్యాలను స్పష్టపరుస్తుంది.
ఊదీ అనగా బూడిద తప్ప మరేమీ కాదు.  ఈ ప్రపంచములో ఏవస్తువయినా సరే
వాటి ఆకారం, పేర్లు వేటితోను సంబంధం లేకుండా 
ఆఖరికి బూడిదగా మారవలసిందే.  ఈ బూడిద
శాశ్వతం.  ఇక దానికి మరొక మార్పనేదేమీ లేదు.  ఈప్రపంచములో ఏవస్తువయినా సరే ఎన్ని మార్పులు చెందినా
వాటన్నిటికి మనం పెట్టే పేరుకోసమే.  ఈప్రపంచములో
కనిపించేదంతా అశాశ్వతము, క్షణభంగురము అని బాబా ఈ ఊదీ ద్వారా మనకి బోధించారు.
బాబాగారి ఊదీ వైరాగ్యాన్ని
కలుగజేస్తుంది. ఆశించేవాడికి వైరాగ్యం నిజమయిన సంపద. సాధన చేసేవానికి అది ఎంతో సహాయకారి.  వైరాగ్యం మనసును అంతర్ముఖం చేస్తుంది.  (అంతర్ముఖము = 
మనసును బాహ్యవిషయములపైకి పోనీయకుండా పరమాత్మయందే నిలుపుట).
వైరాగ్యం మనసును బాహ్యవిషయములపైకి
పోనీయకుండా అడ్డుకుంటుంది.  ఒకవేళ మనసు బాహ్యవిషయములపైకి
పరుగెత్తినా , ఈ ప్రాపంచిక సుఖాలయందు ఆసక్తిని పెంచుకొనుటవల్ల అది బాధలకు పునర్జన్మలకు దారితీస్తుందనే విషయాన్ని ఆసమయంలో వైరాగ్యం మనలని హెచ్చరిస్తూ ఉంటుంది.
అందుచేత చంచలమయిన మనస్సును
బాగా సాధన చేసి పగ్గముతో లాగిపట్టుకొనగలిగినవాడు తన గమ్య స్థానమును చేరగలడు.  
అనురాగానికి వ్యతిరేకం
వైరాగ్యం.  వైరాగ్యం అనేది ఉదాసీనత, నిర్లిప్తత,
అనాసక్తి.  వైరాగ్యం చెందిన క్షణంనుంచి, ఆతరువాత
కూడా  ప్రాపంచిక సుఖాలయందు అలక్ష్యం ఏర్పడుతుంది.  సుఖదుఃఖాలయందు సమభావన కలిగి ఉంటాడు.  
వైరాగ్యం పొందిన మానవుడికి
ఈప్రపంచంనందు ఎటువంటి ఆకర్షణ ఉండదు.  అందుచేత
ఆధ్యాత్మికంగా ఎదగాలని భావించేవానికి వైరాగ్యం అత్యంత ప్రాధాన్యమైనదే కాక, వారికది
శాశ్వతమయిన సంపద. వైరాగ్యం వల్ల మనసుకు ఏకాగ్రత
లభిస్తుంది.  మోక్షాన్ని ముక్తిని కోరేవానికి
తీవ్రమయిన కాంక్షను జనింపచేస్తుంది.
                                            డా.సుభోద్ అగర్వాల్, 
                                       షిర్ది సాయిధామ్, డెహ్రాడూన్
                                                 ఉత్తరాఖండ్
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)









0 comments:
Post a Comment