30.11.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ
గారు భక్తులనుద్దేశించి
చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను. SrI sai
Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు. ఈ రోజు ఆ ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లు. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 2 వ.భాగమ్
26.11.1970
: ఈ రోజు స్వామీజీ గురు – భక్తి గురించి
ముచ్చటించారు. “గురువే దైవం. గురువు ద్వారానే మనం భగవంతుని చేరుకోగలం. సంసారమనే సముద్రాన్ని గురువు దాటిస్తాడు. అవసరమయినపుడు
భగవంతుడు మనకు గురువుని లభింపచేస్తాడు. ఆఖరికి
సృష్టికర్తయిన బ్రహ్మ కూడా తన గురువయిన నారాయణుని వద్దకు వెళ్ళాల్సివచ్చింది. భగవంతుడు గురువు ద్వారానే మనతో సంభాషిస్తాడని చెబుతారు.
అందువల్ల మనకు మన గురువుయందు ప్రగాఢమయిన నమ్మకం
ఉండాలి. ప్రతిచోట, ప్రతివారిలోను గురువుని
దైవాన్ని చూడగలగాలి. ఆ విధంగా గురువుని, దైవాన్ని, సర్వశక్తిమంతుడుగాను.సర్వజ్ఞుడుగాను, సర్వాంతర్యామిగాను
చూడగలుగుతారు. యదార్ధమయిన విషయం ఏమిటంటే గురువుయొక్క
పరిమిత రూపాన్ని అనంతమయిన రూపంలోకి మార్చాలి.
28.11.1970 : ఆ తరువాత
స్వామీజీ దేవాలయానికి వచ్చే భక్తుల గురించి చెపుతూ, భక్తులలో మూడు రకాలయినవారు ఉంటారని
చెప్పారు. ఒక రకంవారు, దేవాలయానికి వస్తారు,
భగవంతునికి ‘సామీప్యంగా’ నే ఉంటారు. కాని,
పనికిమాలిన కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు.
దేవాలయానికి వచ్చినా గాని తాము ఎందుకు వచ్చామో ఆ ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోలేరు. మరికొందరు పూజలు చేయించుకుంటారు కాని, దేవుని మీద
పూర్తిగా దృష్టిని కేంద్రీకరించలేరు. ఇటువంటివారు
‘సాలోక్య’ లో ఉంటారు. ఇక శ్రేష్ఠమయినవారు ఎవరంటే
వారు గుడికి రాగానే దేవునియందే తమ దృష్టిని కేంద్రీకరించి ఉంటారు. గుడినుంచి వెళ్ళిపోయిన తరువాత కూడా దేవుని గురించే
ఆలోచిస్తూ ఆయననే తమ ఆలోచనలలో నిలుపుకుని ఉంటారు.
దీనికే ‘సాయిజ్య’ అని పేరు.
(శ్రీ పరిపూర్ణానందస్వామి ప్రవచనం వినండి...)
27.11.1970 : భగవంతుని
గురించి తెలుసుకుని ఆయనని చేరుకోవాలంటే కామ, క్రోధ, లోభాలను విడిచిపెట్టాలి. గీతలో చెప్పినట్లుగా ఈ మూడు గుణాలే మానవుడిని నరకంలోకి
నెట్టుతాయి. మానవునిలో కామం ఉంటే అది క్రోధానికి,
క్రోధం లోభానికి లాక్కునివెడుతుంది. అందువల్ల
ఆ మూడింటిని అంతం చేసుకున్నవానికి ఆత్మజ్ఞానం సిధ్ధిస్తుంది. భగవన్నామమొక్కటే ఈ సంసారాన్ని దాటించడానికి సహాయపడుతుంది. వాస్తవంగా చెప్పాలంటే కామ,క్రోధ, లోభాలతో నిండివున్న
మానవుని హృదయంలోకి భగవంతుడు ప్రవేశించడు. అందువల్ల
ఆ మూడు గుణాలని క్రమక్రమంగా అదుపులో ఉంచుకోవాలి.
మనం ఎవరి సాహచర్యం కోసం నిరీక్షిస్తూ ఉన్నామో ఆ భగవంతుడు సాధువుల రూపంలో మన
చెంతకు వస్తాడు.
మరుసటిరోజు : త్యాగరాజ ఆరాధనలు జరుగుతున్న సమయంలో స్వామీజీ చేసిన
అనుగ్రహ భాషణం --- త్యాగరాజస్వామి గొప్ప సత్పురుషుడు. ఆయన వైభవం యిప్పటికీ కొనసాగుతూ ఉంది. ఇకముందు కూడా ఆవిధంగా వెలుగొందుతూనే ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే సర్వసంగపరిత్యాగం చేసిన మహారాజు. శ్రీరామచంద్రులవారి కోసం తనకున్నదంతా త్యాగం చేసిన
మహానుభావుడు.
త్యాగరాజస్వామి ఆలపించిన రామనామం
మనందరికీ అత్యుత్తమమైనది. ‘రామ’ లో ‘రా’ అనే
అక్షరం నారాయణునికి ‘మ’ అక్షరం శివునికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కలగాలంటే మన హృదయ
కవాటాలను తెరవాలి. “నీ హృదయాన్ని తెఱు, నీహృదయాన్ని
భక్తి, జ్ఞానాలతో నింపుతాను” అని బాబా అన్నారు.
భగవన్నామ స్మరణ అనే ఉత్తమమైన దారిని బాబా మనకు చూపించారు. మనము విశ్రాంతిగా ఉన్నపుడు లేదా ఏదయినా పనిలో ఉన్నపుడయినా
సరే బాబా చెప్పినట్లుగా మనం భగవన్నామస్మరణ చేసుకుంటూనే ఉండాలి. అపుడు ఖచ్చితంగా బాబా మనలను ఉన్నతస్థితికి తీసుకునివెడతారు. బాబా మరియు త్యాగరాజస్వామివార్ల దీవెనలు మనందరికి
సమృధ్ధిగా లభించుగాక. మనము ఆఫీసులో గాని,
దుకాణంలో గాని, బస్సులో గాని ఎక్కడ ఉన్నాసరే
ఆ భగవంతుడిని గుర్తు చేసుకుంటూ ఆయన నామస్మరణ చేసుకుంటు ఉండాలి.
27.03.1971 : స్వామీజీ
-- భగవంతునికి మనము పూర్తిగా శరణు వేడుకోవాలి. అపుడే ఆయన మన రక్షణ భారాన్ని వహిస్తాడు. ద్రౌపదీ వస్త్రాపహరణం గురించి ఒక్కసారి గుర్తుకు
తెచ్చుకొనండి. ఆ సమయంలో ద్రౌపది తనను రక్షించేవాడు శ్రీకృష్ణపరమాత్మ ఒక్కడే అని ఆయనకు శరణాగతి చేసి రక్షించమని వేడుకొంది. వెంటనే శ్రీకృష్ణపరమాత్మ ఆమె మానప్రాణాలను రక్షించాడు.
అదేవిధంగా గజేంద్రుడిని శ్రీమన్నారాయణుడు రక్షించిన
సందర్భాన్ని కూడా గుర్తుకు తెచ్చుకొనండి. గజేంద్రుడు
తనను తాను రక్షింకోవడానికి మొసలితో ఎంతగానో పెనుగులాడాడు. ఆయినా ఫలితం లేకపోయింది. సర్వశక్తులూ నశించిపోయిన తరువాత విష్ణుమూర్తిని
శరణు వేడుకొన్నాడు. వెంటనే విష్ణుమూర్తి వచ్చి
గజేంద్రుడిని రక్షించాడు.
08.04.1971 : ఈరోజు
స్వామీజీ కడపలో జరిగిన ఆధ్యాత్మిక సమ్మేళన విశేషాలను వివరించారు.
ఆ సమ్మేళనానికి కులమత
భేదాలు లేకుండా అన్ని తెగలవారు వచ్చారు. ఇదే
‘సమరస’ . బాబాని కూడా మనం ‘సమ – రస సన్మార్గ
స్థాపనాయ’ అని పూజిస్తాము. అనగా దానర్ధం ప్రపంచములోని
అన్ని తెగలవారిని కులమత వర్గ భేదాలకు అతీతంగా అందరినీ ఒక్కటిగా చేసిన కారుణ్యమూర్తి. మనమందరం మంచితనాన్ని సామరస్యాన్ని పెంపొందించుకోవాలని
ఆయన మనలనుంచి కోరుకున్నారు. అందుచేత మనము ఎవరియందూ అయిష్టతను ప్రదర్శించరాదు. కలహాలను నివారించాలి. నీవు ఏదయితే ఆహారంగా స్వీకరిస్తావో దానిని ప్రక్కనున్నవారితో
పంచుకోవాలి. నీదగ్గర ఉన్నది పంచుకుంటే బాబా
నీకు మరింతగా లభింపచేస్తారు. అలాకాక, యింకా
యింకా సంపదను పెంచుకుంటూ పోయి మానవసేవకు ఉపయోగించకుండా ఉన్నట్లయితే బాబా ద్వారా నీకు
లభించవలసినది ఆగిపోతుంది. నీదంటూ ఏమీ ఉంచుకోకు. బాబా అనుగ్రహం వల్ల నీకోరికలన్నీ నెరవేరుతాయి. బూటీ గొప్ప ధనవంతుడు. బాబా భక్తుడు.
తలుచుకుంటే బూటీ బాబాకు పెద్ద బంగళాను కట్టించగల సమర్ధుడు. కాని బాబా శిధిలావస్థలో ఉన్న మశీదులోనే నివసించారు. ఆ మసీదులోకి అందరికీ ప్రవేశం ఉంది. బాబా ఈ విశాలప్రపంచానికి చెందినవారు.
09.04.1971 : దైవాంశసంభూతులయినవారికి,
సామాన్యులకు గల భేదమేమిటి? అన్న ప్రశ్నకు స్వామీజీ యిచ్చిన వివరణ. దైవాంశసంభూతులను అపనంతర ఆత్మలు అని పిలువబడుతారు. బాబా, రామకృష్ణపరమహంస లాంటివారందరూ ఆవిధంగా పరిగణింపబడతారు. వారు ఎల్లపుడూ భగవంతునిలోనే జీవిస్తూ ఉంటారు. వారెల్లపుడూ సర్వమానవాళి యోగక్షేమాల గురించే తపిస్తూ
ఉంటారు. వాస్తవంగా చెప్పాలంటే వారందరూ సంపూర్ణమయిన
పరమసుఖాన్ని పొందినవారు. ఇతరులకు కూడా అటువంటి
ఆనందం లభించాలని కోరుకొంటూ ఉంటారు. ఇటువంటి
మహాత్ములు ప్రతిచోటా ఉన్నారు. వారందరూ సమానమే. ఒక సత్పురుషునికి మరొక సత్పురుషునికి మధ్య ఎటువంటి భేదం లేదు. ఒకే లక్ష్యాన్ని చేరుకోవడానికి వారంతా వేరువేరు
మార్గాలను మనకు చూపించారు. వారి దృష్టి మనపై
ప్రసరింపబడితే చాలు. అదే మనలను ఉన్నత స్థితికి
తీసుకునివెడుతుంది. గొప్ప జ్ఞానసంపన్నులయిన
బాబా, రామకృష్ణపరమహంస, సదాశివబ్రహ్మేంద్ర, చంద్రశేఖర భారతి, కంచి జగద్గురు కామకోటి
ఆచార్యలాంటివారి పవిత్రమయిన దృష్టి ఒక్కసారి మనమీద ప్రసరింపబడితే చాలు. ఆ చూపే మనలను ఆధ్యాత్మికంగా యింకా ముందుకు తీసుకునివెడుతుంది.
భగవంతుని ఆజ్ఞప్రకారమే అటువంటి అపనంతర ఆత్మలు ఈ
భూమిపై అవతరిస్తాయి. అటువంటివారితో మనం ఎవరిని
అనుసరించినా మనం మన లక్ష్యాన్ని చేరుకోగలం.
మనలను అనుగ్రహించడానికి వారెల్లపుడూ సిధ్ధంగా ఉంటారు. కాని, కొంతమంది మాత్రమే ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకోవడంలో
విజయాన్ని సాధిస్తారు. కొంతమంది మాత్రం తమకెటువంటి
పురోగతి రాలేదని చెబుతూ ఉంటారు.
(స్వామీజీ చెప్పిన మంచి విషయాలు యింకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment