20.11.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
ఈ రోజు సాయిసుధ అక్టోబర్,
1944 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన సాయిబాబా చేసిన అధ్భుత సహాయం ప్రచురిస్తున్నాను. ఎంత కష్టం వచ్చినా సాయి పాదాలను విడువని ఈ భక్తునియొక్క
అచంచలమయిన భక్తిని మనం గమనించాలి.
తెలుగు అనువాదమ్
: ఆత్రేయపురపు త్యాగరాజు
సడలని విశ్వాసమ్
నాకు సాయిబాబాయే మాతృమూర్తి,
దయాళువయిన తండ్రి, ఆధ్యాత్మిక గురువు, దైవం.
ఆయన ఉదార స్వభావాన్ని, అనావృష్టితో బీడుపడిన భూమిమీద కురిపించే అమృతవర్షంలా
ఆయన తన భక్తులమీద నిరంతరం కురిపించే దయను నేనేమని వర్ణిం గలను? ఎంతో క్షోభపడిన నా హృదయాన్ని తన అపరిమితమయిన దయతో
ఏవిధంగా ఓదార్చి సంతోషాన్ని కలిగించారో ఆ సంఘటనని మీకు వివరిస్తాను.
మా అబ్బాయి ఎస్.కె. ఉమాపతి
వయస్సు పదిన్నర సంవత్సరాలు. నాలుగవ తరగతి చదువుతున్నాడు. 26.01.1944 మధ్యాహ్నం 2 గంటలనుండి కనపడకుండా పోయాడు. ఏమయ్యాడో తెలీదు. తెల్లవారినా మా అబ్బాయి జాడలేదు. ఇక్కడ తరచుగా మిలటరీ బస్సులు కూడా తిరుగుతూ ఉంటాయి. ఒక ప్రమాదం కూడా జరిగిందని విన్నాను. ఒకవేళ అటువంటి ప్రమాదం ఏమయినా జరిగిందేమోననే ఆలోచన
రాగానే నాకంగారు యింకా ఎక్కువయింది. నేను పోలీస్ రిపోర్ట్ యిచ్చి ఆస్పత్రిలో కూడా ఎవరయినా అబ్బాయికి ప్రమాదం జరిగి చేర్చబడ్డాడా అని
కూడా విచారణ చేసాను. కాని ఏవిషయం తెలియలేదు. కొన్నాళ్ళ క్రితం కిడ్నాప్ కేసులు కూడా జరిగి ఉండటం
వల్ల మా అబ్బాయిని కూడా ఎవరన్నా కిడ్నాప్ చేసారేమోననే భయం కూడా పట్టుకుంది. ఎంత వెదికినా ఏమాత్రం ఫలితం కనపడలేదు. ఒక జ్యోతిష్య పడితుడిని, హస్త సాముద్రికుడిని కూడా
సంప్రదించాను. వారు అబ్బాయి క్షేమంగా ఉన్నాడనే
చెప్పారు గాని, ఎటువంటి సమాచారం మాత్రం లభించలేదు. నాకు శ్రీకేశవయ్యగారు వ్యక్తిగతంగా బాగా తెలిసుండటం
వల్ల వెంటనే ఆయనకు వర్తమానం పంపించాను. “బాబా
సహాయం చేస్తారు” అని ఆయన వెంటనే సమాధానం పంపించారు.
అబ్బాయిని వెదకడానికి అన్ని ప్రయత్నాలు చేసాను. ఫలితం లేకపోవడంతో నాబాధ వర్ణింపనలవికానంతగా ఎక్కువయింది.
1940 డిసెంబరునుంచి అనూహ్యంగా
నేను శ్రీసాయిబాబావైపు ఆకర్షితుడినయ్యాను.
అప్పటినుంచి ఆయనను ప్రార్ధిస్తూ ఉన్నాను.
ఎపుడు ఈ కష్టసమయంలో బాబాని ఒక్కక్షణం కూడా విరామం లేకుండా ప్రార్ధిస్తూనే ఉన్నాను. ఆయన కృప కోసం మవునంగా రోదిస్తూ ఉన్నాను. ఒకవేళ మాఅబ్బాయిని ఎవరయినా ఎత్తుకునిపోయి ఉంటే ఆబాధను
నేను భరించలేను. ఈవేదన మరింత బాధాకరమయినది. కారణం, సంవత్సరంన్నర క్రితమే టైఫాయిడ్ తో 13 సంవత్సరాల
మాపెద్దబ్బాయి మరణించాడు. నిరాశ నన్ను తీవ్రమయిన
వేదనకు గురిచేస్తోంది. కాని సాయిబాబా మీద
ఉన్న నా విశ్వాసం పెరుగుతూనే ఉంది. వారం రోజులు
గడిచినా గాని మాఅబ్బాయి ఆచూకీ లభించలేదు.
ఇక శ్రీసాయిని మరొక విధంగా ప్రార్ధించాను.
ఆఖరికి మనసులోనే రోదిస్తూ ఆయనని ఈవిధంగా వేడుకొన్నాను. “ఒకవేళ గతజన్మలో నేను చేసిన పాపకర్మ ఫలితంగా ఈ అబ్బాయిని
కూడా కోల్పోవలసి వస్తే, ఆబాధను కూడా భరించడానికి కూడా సిధ్ధంగా ఉన్నాను. కాని సాయిబాబాను పూజించినందువల్లనే నీకు ఇటువంటి
విపత్తు సంభవించిందని ఎవరయినా ఆరోపించవచ్చు. నాలో ఈ విధంగా కలిగిన పిచ్చి ఆలోచనను నేను భరించగలనా?” ఈ ఆలోచన నన్ను పిచ్చివాడిని చేస్తోంది. ఆ మరుసటిరోజు అనగా 01.02.1944 నాడు కన్నీళ్ళు ఉబికి
వస్తుండగా సాయిబాబాను ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నట్లుగా ఇలా ప్రార్ధించాను. “మా అబ్బాయి దొరికినా సరే దొరకకున్నా సరే, నువ్వు
నన్ను మరింతగా బాధకు గురి చేసినా, ఎటువంటి ప్రమాదమయినా నాపైన పడనీ, నేను నీచరణాలవద్ద
శరణు వేడుకుంటున్నాను. నేను నీపాదాల దగ్గరనుంచి
ఒక్క అంగుళం కూడా కదలను. ఇక నువ్వు ఏంచేస్తావో
అంతా నీయిష్టం.” ఈవిధంగా మనస్ఫూర్తిగా ప్రార్ధించిన
తరువాత మనసుకి కొంత ఊరట లభించింది. నాసర్వం
ఆయన పాదాలకు అర్పితం చేసి ప్రశాంతమయిన మనసుతో నిద్రపోయాను.
(ఎప్పుడయితే మన కష్టాలను బాబాకు చెప్పుకొని ఇక నీవే దిక్కు. పాల ముంచినా నీట ముంచినా నీదే భారం తండ్రీ అని మనసులో ఉన్న భారమంతా ఆయన భుజస్కంధాల మీద పెట్టినట్లయితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇక దాని గురించి మనం ఆలోచించకూడదు. ఇక బాబాయే అంతా చూసుకుంటారు...)
తెల్లవారుఝాము నాలుగు
గంటలకి నాకొక స్వప్నం వచ్చింది. ఆ కలలో తెల్లని
దుస్తులు ధరించి పొడవుగా ఉన్న ఒక ఫకీరు ఒక పిల్లవాడిని దెబ్బలు కొడుతూ నాదగ్గరకు తీసుకుని
వచ్చాడు. వాడిని నాదగ్గర కోర్చోబెట్టి మాయిద్దరికీ
తినమని స్వీట్లు యిచ్చాడు. ఉదయాన్నే నిద్రలేచిన
తరువాత నాకెంతో ప్రశాంతంగా అనిపించింది. ఆ
రోజు అనగా 02.02.1944న 9 గంటలకల్లా తయారయి ఆఫీసుకు బయలుదేరబోతున్నాను. అప్పుడే టెలిగ్రామ్ లను యిచ్చే పోస్టుమాన్ వచ్చి
ఒక ఎక్స్ ప్రెస్ టెలిగ్రామ్ ఇచ్చాడు. అందులో
“ఉమాపతిని క్షేమంగా తీసుకువచ్చాము” అనే సందేశం ఉంది. ఇది అధ్బుతమా లేక పరీక్షా? ఏమి జరిగిందో నాకేమీ అర్ధం కాలేదు. అసలు విషయం ఏమిటంటే నాభార్య పనిమీద కొన్ని రోజులు
ఉండటానికి మద్రాసు వెళ్ళింది. మా అబ్బాయి అమ్మకోసం
ఎవరికీ చెప్పకుండా ఒంటరిగానే రైలు ఎక్కి మద్రాసు చేరుకున్నాడు. ప్రయాణంలో ఎవరో ఒకరు మా అబ్బాయికి తినడానికి ఏదోఒకటి
యిస్తూనే ఉన్నారు. మద్రాసు ఎగ్మోర్ స్టేషన్
లో పోలీసులు మా అబ్బాయిని తప్పిపోయిన బాలునిగా గుర్తించి చిల్డ్రన్ ఎయిడ్ సొసైటివారికి
అప్పగించారు. మద్రాసులో మాబావమరిది కంట్రాక్టర్. మా అబ్బాయిని మా బావమరిది దగ్గరికి చేర్చారు. ఇదంతా జరగడానికి వారం రోజులు పట్టింది.
ఇందులో గమనించదగ్గ అంశాలు
రెండున్నాయి. మా అబ్బాయి ఎక్కిన రైలు గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్. ఒకవేళ వాడు ఢిల్లీ వెళ్ళే
బోగీ ఎక్కి ఉంటే తిన్నగా డిల్లీ చేరుకుని ఉండేవాడు. ఇక రెండవ విషయం ప్రయాణంలో వాడు ఆకలితో మాడిపోయి
ఉంటాడేమోనని చాలా బెంగపడ్డాను. కాని ఆశ్చర్యం ఏమిటంటే ఎవరో ఒకరు వాడికి తినడానికి పెడుతూ
వాడి ఆకలిని తీర్చారు.
ఇటువంటి అధ్బుతాలన్నీ
నాసాయినాధుడు కాక మరెవరు చేయగలరు? నాకింత సహాయం
చేసిన నాబాబా ఋణం నేనెలా తీర్చుకోగలను? ఆయన
ప్రేమమూర్తి. అంతా ఆయన దయ. ఎవరూ కాదనలేని నిజం ఏమిటంటే “సాయిబాబా తన భక్తుల
చెంతనే ఉంటారు. ఈ భూమిపై ఏతల్లి చూపించలేని
దయను బాబా తన భక్తులమీద కురిపిస్తూ రక్షిస్తూ ఉంటారు. “నాయందెవరి ధృష్టో వారియందే నాదృష్టి. నువ్వు నావైపు ఒక అడుగు వేస్తే నేను నీవైపు పది
అడుగులు వేస్తాను” అన్న బాబా మాటలు అక్షర సత్యాలు.
“సాయీ! అందరూ నీకు నమస్కరించెదరు
గాక - ప్రభూ! నిన్నందరూ స్తుతించెదరు గాక,
నీదయ ఎల్లెడల ప్రసరించెడు గాక”.
ఎస్. కాశీవిశ్వనాధన్
సికిందరాబాదు
(రేపటి సంచికలో భగవంతుడు గొప్పవాడా?, భగవంతుని నామము గొప్పదా?)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment