10.08.2018 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిబాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయం చేస్తున్నారా?
4 వ.భాగమ్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
అట్లాంటా (అమెరికా)
ఫోన్. నంబర్
: 1 571 594 7354
కోయంబత్తూర్
:
కోయంబత్తూర్
లో నివసించే కొంతమంది ఎంతగానో పుణ్యం చేసుకొన్నారని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
ఆఖరి
ప్రపంచపు యుద్ధం జరుగుతున్న రోజులలో కెప్టెన్ దేవరాజ్ మధ్యధరా సముద్రంలో ఓడలో ఉన్నాడు. శతృవులు ఓడపై బాంబులతో దాడి చేసారు. ఓడ బాగా దెబ్బతింది. కెప్టెన్ దేవరాజ్ ఓడలో ఒక చివర ఉన్నాడు. అతని గురుదేవుడయిన సాయి అతడిని ఎటువంటి ప్రమాదం
బారిన పడకుండా రక్షించారు.
ఈ
విషయం కోయంబత్తూర్ ల్ ఉన్న భక్తులందరికీ తెలిసింది. సాయి చేసిన సహాయం భక్తులందరి మనసులను ఎంతగానో ప్రభావితం
చేసింది. ఆ భక్తులందరిలోను ప్రముఖుడయిన శ్రీ
సౌందర్ రాజన్ గారు తన ఇంటిలో సాయిపూజ, సాయిభజన ప్రారంభించారు. పట్టణం చివరలో ఒకవైపున ప్రజలు పూజలు, భజనలు చేసుకునేందుకు
వీలుగా ఒక చిన్న కుటీరాన్ని నిర్మించారు. ఒకరోజు
సాయంత్రం పూజ, భజనలు యధావిధిగా జరుగుతున్నాయి.
కుటీరమంతా భక్తులతో నిండిపోయి ఉంది.
ఆ భక్త బృందం మధ్యలోకి ఒక సర్పం ప్రవేశించింది. అది ఒక బాలుని కాలుమీదుగా ప్రాకింది. అతడు భయంతో “పాము, పాము” అని అరిచాడు. అక్కడ ఆబాలుడు ఒక్కడే భయపడ్డాడు. ఆపాము చుట్టచుట్టుకొని 5, 6 అడుగుల ఎత్తులో నిలబడి
భజనలకు అనుగుణంగా తలను ఊగిస్తూ భక్తుల మధ్యలో నిలబడి ఉంది. అది తన స్థానంలోనే ఉండి తలను అటుఇటు ఊపుతూ ఉంది. భజనపాటలకి పరవశిస్తూ అంతమంది ఉన్నా భయపడకుండా ఉన్న
ఆపాము ఏమయి ఉంటుందా అని అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఆశ్రమంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటలవరకు భజన
జరుగుతూ ఉన్నంతసేపూ ఆ పాము అక్కడనే ఉంది. ఇక భజన, పూజ అన్నీ పూర్తయిన తరువత భక్తులందరూ ఎవరింటికి
వాళ్ళు వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం వచ్చి
చూసేసరికి వారి ఆశ్చర్యానికి అంతులేదు. ఆపాము
ఇంకా అక్కడే మందిరంలో ఉంది. ఆమందిరం తాటాకులతో
కట్టబడిన కుటీరం. పక్కాగా కట్టిన భవనం కాదు. అది రోడ్డుకు ఒక ప్రక్కన ఉంది. ఆసర్పం సాయిబాబా తప్ప మరెవరూ కాదని వారందరూ నిశ్చయించుకొన్నారు. దానిని పూజించడానికి చేమంతి పూలను బుట్టలనిండా తీసుకునివచ్చారు. ఎంతోమంది భక్తులు దాని చుట్టూ చేరి ఓం సాయినాధాయనమః
అంటూ అష్టోత్తరం చదువుతూ దాని తలపై చామంతి పూలను చల్లుతూ పూజించసాగారు. తన తలపై వేయిపూలు పడినా కూడా ఎటూ కదలకుండా పూజ పూర్తయినంతసేపూ
వారి మధ్యలో అలా నిలబడె ఉంది. సాయిబాబాయే సర్పం
రూపంలో వచ్చారని వారందరికీ ధృఢమయిన నమ్మకం కలిగింది. దానిని అందరూ నాగసాయి అని పిలవసాగారు.
అపుడు ఆ భక్తులలో ఒకతను “ఎటువంటి సందేహం లేకుండా
నువ్వు సాయిబాబావే. మేము నిన్ను ఈవిధంగా పూజించామని
బయట అందరితోను చెప్పినా మామాటలను ఎవరూ నమ్మరు.
అందుచేత మేము నిన్ను ఫోటో తీస్తాము.
మేము పట్టణంలోకి వెళ్ళి ఒకఫొటోగ్రాఫర్ ని తీసుకుని వచ్చేంతవరకు నువ్వు ఇదే స్థితిలో
ఉండు” అని అన్నాడు. ఫొటోగ్రాఫర్ ఊరిలోనుండి
వచ్చేటపటికి అరగంట పట్టింది. అతను వచ్చేంత
వరకు ఆపాము అట్లాగే ఉంది. ఫొటోగ్రాఫర్ కెమేరాను దానికి దగ్గరగా పెట్టి అధ్భుతమయిన ఫొటో
తీసాడు. ఫొటో తీసే సమయంలో పెద్దలతో సహా పిల్లలు
తమ తలలను కదుపుతున్నందువల్ల ఫొటోలు సరిగా రావని అనుకున్నారు. కాని సాయి వారిని నిరాశపరచలేదు. నాగసాయి కూడా కదలక మెదలక అలాగే నిలుచుని ఉండటం వల్ల
అధ్భుతమయిన ఫొటో వచ్చింది. అంతకుముందు రోజు
సాయంత్రం 5 గంటలకు వచ్చిన నాగసాయి మరునాడు ఉదయం 11 గంటలకు వెళ్ళిపోయింది. ఈస్థలం కోయంబత్తూర్ పట్టణానికి దగ్గరలోనే ఉంది. కోయంబత్తూర్ పట్టణ జనాభా చాలా ఎక్కువ. ఈ అధ్భుతాన్ని విన్న ప్రజలు వేలాదిమంది పట్టణం నుంచి
వచ్చి పూజలందుకుంటున్న నాగసాయిని దర్శించుకుని తరించారు.
బాబా
చూపిన లీలకి ఫొటోయే సజీవ సాక్ష్యం. ప్రజలలో
నాస్తికత్వం, ఉదాసీనత, మతపరమయిన విషయాలలో అలక్ష్యం, వీటినన్నిటినీ తొలగించడానికే బాబా
ఈ అద్భుతమయిన లీలను ప్రదర్శించారు. ఆవిధంగా
కొట్టుమిట్టాడుతున్న ప్రజలను మేల్కొలిపి భక్తిమార్గంలో ప్రజలను దారిమళ్ళించాలంటె అటువంటి
అధ్భుతమయిన సంఘటనలు అవసరం. వారిలో నమ్మకాన్ని
పెంపొందించడానికే బాబా చమత్కారాలను చూపిస్తారు.
దాని ఫలితంగానే ఈ అధ్భుతాన్ని తిలకించడానికి, నాగసాయి రూపంలో వచ్చిన బాబాను
పూజించడానికి రోజురోజుకి ఆమందిరానికి వచ్చే భక్తుల సంఖ్య వేలల్లోకి చేరుకొంది. ఆ ప్రదేశాంలోనే నాగసాయి మందిరాన్ని నిర్మించారు. కోయంబత్తూరులోని ఆ మందిరం ఎంతగానో ప్రాచుర్యం పొందింది.
అహ్మదాబాద్ :
అహ్మదాబాద్
క్రొత్త ప్రదేశమయినప్పటికీ ఇక్కడ కూడా బాబా చమత్కారాలు ఎంతో నాటకీయంగాను అకస్మాత్తుగాను
జరిగాయి. అహ్మదాబాద్ లో శ్రీ సి.సి.మానెక్
వాలా మంచి పెరున్న న్యాయవాది. బాబా ఆయనకు
అద్భుతమయిన లీలలను చూపించారు.
1953
సెప్టెంబర్ సాయిసుధ మాసపత్రికలో ఆయన అనుభవం ప్రచురింపబడింది. ఆయన తన అనుభవాన్ని యధాతధంగా తన మాటలలోనే ఈ విధంగా
వివరించారు.
1948
నుంచి 1952 వరకు అయిదు సంవత్సరాలపాటు నేను జలోదరంతోను, గాస్ట్రిక్ అల్సర్ తోను విపరీతంగా
బాధపడ్దాను. నాకు ఆకలి ఉండేది కాదు. నాకు రక్తపువాంతులు అవుతూ ఉండటంవల్ల ఏమీ తినలేకపోయేవాడిని. కనీసం మంచినీళ్ళు కూడా త్రాగలేకపోయేవాడిని. క్రిందటి సంవత్సరం జవరినుంచి నాబరువు విపరీతంగా
పెరిగి 300 పౌడ్లకు చేరుకుంది. నేను మంచానికి
అతుక్కునిపోయాను. వైద్యులు వైద్యం చేస్తున్నా
ఎటువంటి గుణం కనపడలేదు. 1952 ఏప్రిల్ లో ఆస్పత్రి
ప్రధాన వైద్యుడు ఇంకా నాకు వైద్యం చేస్తున్న వైద్యులు అందరూ నాకు ఇక నయమవదని ఆశలు వదిలేశారు. ఒకరోజున ప్రధాన వైద్యుడు నన్ను పరీక్షించాడు. ఆయన పరీక్షిస్తున్న సమయంలో జలోదరం బాగా అధికమయి
నావరువు 300 పౌండ్లు ఉండటంవల్ల నానోటినుంచి విపరీతంగా రక్తం కారసాగింది. నాశరీరంలో చేరిన విషపదార్ధాల కారణంగా రెండు రోజులలో
నాశరీరానికి హాని తప్పదని చెప్పాడు. 1952 ఏప్రిల్
లో నాస్నేహితులు, బంధువులు నన్ను సాయిబాబాను ప్రార్ధించుకోమని సలహా ఇచ్చారు. సాయిబాబా మందిరం మాయింటికి ఎదురుగానే ఉంది. వారిచ్చిన సలహా ప్రకారం నా ఎదురుగా గోడకు సాయిబాబా
క్యాలండరు వ్రేలాడదీసి పూజించసాగాను. ఆయన ఫొటొను
చూసిన తరువాత నాకాయనపై ప్రేమ ఉదయించింది. మొదట్లో
నాకు ఒక మహమ్మదీయ సాదువును పూజించడమేమిటనే భావం ఉండేది. కాని ఆయన వదనంలోని ప్రసన్నత, కరుణ నన్ను కట్టిపడేసాయి.
నిరంతరం ఆయన ఫొటోనే చూస్తూ ఉండటం వల్ల నాలో ఆయన
ఆలోచనలు ఆయనతో నేను మనసులోనే మాట్లాడుకునే మాటల ప్రభావంతో, ఒకరోజు ఉదయం 6 గంటలకు నాకు
మెలకువ రాగానే అకస్మాత్తుగా ఆయన రూపం నాకు గోచరమయింది.
అపుడు బాబా నాతో “నేను ఫకీర్ ను కాను. నేను దత్తావతారాన్ని. నాతో సహా 9 దత్తావతారాలు ఉన్నాయి. వారిలో నాగపూర్ లోని తాజుద్దీన్ బాబా, ఖాండ్వాలోని
ధునివాలా దాదా, నర్మదాలోని దేవానంద సరస్వతి, అక్కల్ కోట స్వామి మొదలయినవారు” అని అన్నారు.
మరుసటిరోజు నాకు గుజరాతీ భాషలో ఉన్న బాబా గురించిన రెండు పుస్తకాలను ఎవరో ఇచ్చారు. నేను వాటిని భక్తిబావంతో చదివాను. కొద్దిరోజుల తరువాత డాక్టర్ వచ్చి నన్ను పరీక్షించాడు. నేనింక రెండు గంటలకన్నా (అనగా మధ్యాహ్నానికి) ఎక్కువ
బ్రతకనని చెప్పాడు. మధ్యాహ్నం ఒంటిగంటకు బాబా
నాముందు ప్రత్యక్షమయ్యారు. మొట్టమొదటగా తలుపులనుంచి
వెలుగు వచ్చింది. ఆవెలుగులో బాబా వచ్చారు. మా అమ్మ శివగంగ, నేను ఇద్దరం ఆయనను చూసాము. ఆయన చెప్పిన మాటలు కూడా విన్నాము. బాబా ఇలా అన్నారు, “భయపడకు. నీకున్న రోగాలన్నిటినీ నేను తొలగించేసాను. నీమనుమడిని వెంటనే షిరిడీకి పంపించు” అని చెప్పి
అదృశ్యమయ్యారు. మా అబ్బాయికి షిరిడీ యాత్రలో అనుభవం లేదు. అంతేకాదు, ఒకవేళ నేను మరణిస్తే అంత్యక్రియలకి వాడు
తప్పక ఉండాల్సిన అవసరం వస్తుందని కొందరు సందేహం వెలిబుచ్చారు. నేను, మా అమ్మగారు ఇద్దరం సంప్రదించుకుని మా అబ్బాయిని
షిరిడీకి బయలుదేరమని చెప్పాము. మేము చెప్పినట్లుగానే
షిరిడీకి బయలుదేరి వెళ్ళాడు. ఆరోజు సాయంత్రం
6 గంటలకు బాబా మరలా వచ్చి, “భయపడద్దు, నేను మీ అబ్బాయితో కూడా ఉన్నాను. రేపు 12 గంటలకి మీఅబ్బాయినుంచి తాను క్షేమంగా షిరిడీ
చేరుకున్నట్లుగా టెలిగ్రామ్ పంపిస్తాడు” అని
చెప్పారు. సాయంత్రం 6 గంటల తరువాత డాక్టర్
వచ్చి పరీక్షించాడు. నేను బ్రతికే అవకాశం లేదని
మరలా చెప్పాడు. నాకు కలిగిన అనుభవాన్ని వివరించి
చెప్పగానే యెగతాళిగా మాట్లాడాడు. “మీదంతా ఒక
భ్రమ” అని కొట్టిపారేసాడు. మరుసటిరోజు మధ్యాహ్నం
మా అబ్బాయినుంచి “షిరిడీకి క్షేమంగా చేరుకున్నాను” అని తంతివార్త వచ్చింది. ఆక్షణంనుంచి నాకు విరోచనాలు మొదలయి 24 గంటలపాటు
అలా అవుతూనే ఉన్నాయి. మూత్రం కూడా వచ్చింది
కాని రక్తం రాలేదు. మరుసటిరోజుకి నాశరీరంలో
ఉన్న విషమంతా ఆవిధంగా బయటకు పోయింది. నాశరీరం
తేలికయింది. బరువు చూసుకుంటే 75 పౌండ్లు ఉంది. గుండె, నాడి సాధారణ స్థితికి వచ్చాయి. నాకు విరోచనాలు అవుతున్నపుడు డాక్టర్ వచ్చాడు. నా శరీర బరువు చూసేటపుడు నాగుండె, నాడి సక్రమంగా
కొట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు. డాక్టర్ నా
ఆరోగ్యాన్ని పరీక్షించి నాకిక ప్రమాదం లేదని చెప్పాడు. బాబా చమత్కారంగా చేసిన వైద్యం వల్లనే నేను క్షేమంగా
ప్రమాదంనుంచి గట్టెక్కానని చెప్పాడు. ఆరోజునుండి
నా ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడింది. రెండు
నెలల్లో మామూలుగా ఆహారాన్ని తీసుకునే స్థితికి వచ్చాను. అప్పటినుండి సంపూర్ణ ఆరోగ్యవంతుడినయి అంతకుముందులాగే
నా న్యాయవాద వృత్తిని కొనసాగించగలిగే స్థితికి చేరుకున్నాను. నేను
బాబాని పూజించడం కొనసాగించాను. కుటుంబ వ్యవహారాలకి
సంబంధించిన విషయాలలో కూడా బాబా నాకు మార్గదర్శకత్వం చూపిస్తూ నన్ను కాపాడుతున్నారు. ఆతరువాత నేను షిరిడీ వెళ్ళాను. దక్షిణదేశ యాత్రలన్నీ పూర్తి చేసాను. యాత్రలనుంచి తిరిగి ఇంటికి వెళ్ళేటపుడు మరలా షిరిడీ
వెళ్ళి బాబాను దర్శించుకుంటాను. 3, 4 రోజులక్రితమే
నేను మద్రాసుకు వచ్చాను. అడయార్ లో ఉన్న అంబల్సి
ఖపాడియాగారి ఇంటిలో దిగాను. 8 వ.తారీకు రాత్రి
9వ. తారీకు ఉదయం 5 గంటలకు బాబా దర్శనభాగ్యం కలిగింది. బాబా నన్ను మైలాపూర్ లో ఉన్న తన మందిరానికి వెళ్ళమని
అక్కడ ఉండే భక్తులందరినీ కలుసుకోమని చెప్పారు.
అందువల్ల నిన్న, ఈ రోజు నేను ఈ మందిరానికి వచ్చాను.
1953
వ.సంవత్సరంలో మొట్టమొదటిసారిగా శ్రీమానెక్ వాలా గారికి బాబా దర్శనమిచ్చారు. 1953వ.సంవత్సరంతోనే ఆగిపోకుండా 1954 లో కూడా బాబా
ఆయన హితం కోరి దర్శనమిచ్చారు.
ప్రజలయొక్క
మేలుకోరి బాబా ఆయనకు 1954 ఆగస్టులో దర్శనమిచ్చారు. నేను వ్రాసిన ఈ ప్రచారపత్రాన్ని ప్రింటు చేయించడానికి
ఆగస్టు నెలలో ప్రయత్నం చేసాను. దీనిని ప్రింటుచేయవలసిన
ప్రింటరు చాలా ఆలశ్యం చేశాడు. ఈ ఆలశ్యం కావడం
కూడా కొంత మంచికే జరిగింది. బాబా ఇప్పటికీ
జీవించే ఉండి తన భక్తులకు సహాయం చేస్తున్నారా అనే ప్రశ్నకి తగిన సమాధానాలను కూడా పొందుపరిచేందుకు
దోహదపడింది. బాబా 23.08.1954 ఉదయం శ్రీమానిక్
వాలా గారికి దర్శనమిచ్చారు. ఈ కరపత్రంలోను,
శ్రీ బి.వి.ఎన్. స్వామిగారి సాయిబాబా చరిత్రలోను ప్రింటు చేసి అందరికీ తెలియచేయవలసిన
సందేశాన్ని బాబా ఆయనకు చెప్పారు. ఈ సందేశం
సాయిసుధ, సెప్టెంబరు 1954 వ.సంవత్సరం సంచికలో ప్రచురింపబడింది.
ఆ
సందేశం యొక్క పూర్తి కధనం ---
మీకందరికీ
ఈ విషయాన్ని తెలియచేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. బాబా నన్ను ఈవిధంగా అనుగ్రహించినందుకు నాకెంతో ఆశ్చర్యకరంగా
కూడా ఉంది. ఆ అనుభూతిని నేను వర్ణించలేను. వేకువజామున బాబా ఎప్పటిలాగా కనిపించే మధురమయిన చిరునవ్వుతో
దర్శనమిచ్చి మీకందరికీ ఒక విషయాన్ని తెలియచేయమని నాకు గుర్తుచేసారు. “శ్రీ సాయిబాబా నిరంతరం తన భక్తుల ఎదుటనే ఉంటారు”
అని తన సందేశాన్ని శ్రీసాయిబాబా మీకందరికీ తెలియపర్చమని నన్ను ఆదేశించారు. ఈ ప్రపంచంతో సహా భక్తులందరి ప్రయోజనార్ధం బాబా
సర్వాంతర్యామిగా ఉండి మార్గదర్శకత్వం చేస్తున్నారు. ఆయన ఒకసారి నన్ను చావునుండి తప్పించారు. ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరి జీవితాలలోను, నాకు, ఆయన
మాత్రమే మార్గదర్శకులుగా ఉన్నారు. బాబా నాఎదుట
చిన్న చిరునవ్వుతో నిలబడి పైన చెప్పిన సందేశాన్ని చెబుతున్నారు. అదే విషయాన్ని మీకందరికీ చెప్పమని ప్రత్యేకంగా నన్ను
ఆదేశించారు. ఎందుకని? ఆయన నన్నే ఎందుకని ఆదేశించారో
నాకు తెలీదు.
బాబా
దయవల్ల నేను మృత్యువునుండి బయటపడ్డాను. ఆయన
అనుగ్రహబలంతో నేను యధావిధిగా న్యాయవాదిగా పలుకేసులను వాదించి అన్నిటిలోను విజయాన్ని
సాధించాను. సివిల్, క్రిమినల్ 302, 307 ఐ.పి.సి. మర్డర్ కేసులు అన్నిటినీ వాదించి అన్నిటిలోను
నెగ్గాను. ప్రతిక్షణం నేను సాయిబాబా నాప్రక్కనే
ఉన్నారనే అనుభూతిని పొందాను. తల్లిదండ్రులు
తమ పిల్లలపట్ల ఎంత శ్రధ్ధ తీసుకుంటారో అదే విధంగా బాబా నిరంతరం నాయోగక్షేమాలను చూస్తూ
ఉన్నారనే భావం నామనసులో నిండిపోయింది. కొన్నికొన్ని
సందర్బాలలో నేను ఎన్నో కఠినపరీక్షలను ఎదుర్కోవలసివచ్చింది. ఐహిక వ్యవహారాలలో గట్టిగా పోరాడవలసిన సందర్భాలలో
కూడా అన్నిటిని జయించాను. పూజ చేసుకునే సమయంలో
కూడా బాబా ఉనికిని అనుభవించాను. ఆయన నాచర్యలను
గమనిస్తూ సరైన సమయంలో నన్ను అనుక్షణం కనిపెట్టుకుని తాను ఉన్నాననే భావం నాలో కలిగించారు. అంతేకాదు బాబా నాకు తగినట్లుగా దిశా నిర్దేశం చేస్తూ
నేను అధ్బుతమయిన దారిలో నడవడానికి సహాయపడుతూ ఉన్నారు.
నేను
మరలా మీకొక్కసారి విన్నవిచుకునేది ఏమిటంటే శ్రీ బాబా గారే నన్ను ఈ సందేశం మీకు అందించమని
నన్ను ఆదేశించారు.
ఇక
బాబా మీద విశ్వాసం రెట్టింపు అయే విషయం ఏమిటంటే తోటపల్లి హిల్స్ లోని శాంతి ఆశ్రమమంలో
బాబా తనపేరుని ఒక వెండిరేకుమీద వ్రాయడం. తెలుగులో
బాబా చేసిన సంతకాన్ని దానిమీద చూడవచ్చు.
ఆవెండిరేకును శ్రీ ఓంకరస్వామిగారు శ్రీ రాజేశ్వరానంద గారికి పంపించారు. ఆయన దానిని 06.10.1954 న జరిగిన శ్రీ బి.వి.నరసింహస్వామి
గారి 81 వ.జన్మదిన ఉత్సవాల సందర్భంగా నససింహస్వామిగారికి బహూకరించారు. బాబా నేటికీ జీవించే ఉన్నారనీ తన భక్తులకు ఇప్పటికీ
సహాయపడుతూ ఉన్నరన్నదానికి సాక్ష్యంగా ఆవెండి రేకుని ఆల్ ఇండియా సాయి సమాజ్ మైలాపూర్
లో ఉన్న సాయి మందిరం పూజాగదిలో ఉన్న పూజా సామానులతోపాటుగా ఉంచారు.
దేశవ్యాప్తంగా
బాబా చూపించిన చమత్కారాలు, ఆయన చేసిన చర్యలలో పైన చెప్పిన సంఘటనలు చాలా అత్యల్పం. అనగా ఆయన చూపించిన లీలలు ఎన్నో ఉన్నాయి. ఆయన సహజంగా చేసిన చర్యలు, ఆయన ఉద్దేశ్యాలు అన్నీ
దైవసంబంధమయినవి. అవన్నీ ప్రజలకు భగవంతునియందు
నమ్మకం కలిగించడానికే. అందువల్లనే సాయి ఈ భూమిపై అవతరించారని చెప్పడంలో ఎటువంటి సందేహం
లేదు.
సాయి
సశరీరంతో లేకపోయినా ఇప్పటికీ తన కార్యాలను నిర్వర్తిస్తూనే ఉన్నారు. కష్టాలో ఉన్న తన భక్తులను ఆదుకుంటూ వారికి సహాయపడుతూ
ఉన్నారు. తనను శరణుజొచ్చినవారిని ఉద్దరించి
వారి లక్ష్యాన్ని చేరుకునేందుకు బాబా సహాయపడుతూ ఉన్నారు.
ప్రజలకు, సమాజానికి మేలు చేయడానికై ఆయన కొంతమందికి సశరీరంగా దర్శనమిచ్చి తాను చేయదలచుకున్న దైవకార్యాలను,
వారిద్వారా జరిపిస్తారు. ఈ కరపత్రాన్ని చదివిన
తరువాత భక్తుల మనసులో ఉన్న అన్ని అనుమానాలు, భయాలు, మందకొడితనం అన్నీ పటాపంచలయిపోతాయి. బాబా గురించి మరింతగా తెలుసుకోవాలన్న ఆసక్తి వారిలో
కలుగుతుంది. వ్యాధులనుండి, కష్టాలనుండి విముక్తి
పొందడానికై బాబాతో అనుబంధం పెంచుకోవాలని, తమకు కావలసినవన్నీ ఆయన ద్వారా నెరవేర్చుకోవాలనే
సంకల్పం భక్తులలో ఉదయిస్తుంది. బాబా సహాయంతో
కష్టాలు, దుఃఖాలు, బంధాలనుండి విముక్తులయి తమ తమ లక్ష్యాలను నెరవేర్చుకున్నవారవుతారు.
(సమాప్తమ్)
(సర్వమ్
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment