31.05.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి సత్ చరిత్ర 15వ.ధ్యాయంలో మనకు దాసగణు గురించిన ప్రస్తావన వస్తుంది. ఆయన మంచి కీర్తనకారుడు. భక్తులు కోరితే కధా సంకీర్తన చేసేవాడు. సాయినాధుని కృపవల్ల దాసుగణు మహాత్ముల కధలు, స్వయంగా
రచించి వానిని చెప్పటంలో ఖ్యాతి చెందాడు. సాయి
చరణ భక్తిని, సాయి ప్రేమను ఎంతో పెంపొందించాడు.
దాసుగణు షిర్దీకి రావటానికి కారణం చందోర్కరే. అక్కడక్కడా దాసుగణు సాయి భజన కీర్తన చేసేవాడు. కొంకణ
ప్రాంతంలో బాబాపై భక్తిని వ్యాపింపచేసినది దాసుగణు మరియు చందోర్కరు. బొంబాయి ప్రాంతంలో సాయిభక్తి ప్రబలడానికి కారణం వీరిద్దరే.
ఇదంతా
దాసగణుకు ఒకవైపు. మనకు తెలియని విషయాలు మరొకవైపు
ఉన్నాయి. ఇపుడు మనం దాసగణు గారి భార్య గురించి
తెలుసుకుందాము.
Shirdisaitrust.org చెన్నై వారి నుండి గ్రహింపబడినది.
తెలుగు
అనువాదం - ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
దాసగణు భార్య – సరస్వతి
దాసగణు
గారి భార్యపేరు సరస్వతి. ఆమె అందరికీ ‘బాయా’
గా కూడా పరిచితురాలు. బాబా ఆమెను ‘తాయి’ అని
పిలిచేవారు.
దాసగణు
భార్యయొక్క బాగోగులను చూసుకోమని బాబాసాహెబ్ సహస్ర బుధ్ధేకు బాబా ఏవిధంగా ఆజ్ఞాపించారో
ఆవివరాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
బాబాసాహెబ్ కి షిరిడీకి వెళ్ళడం ఇష్టంలేదు. అయినప్పటికి నానాసాహెబ్ చందోర్కర్, అన్నాసాహెబ్ ధబోల్కర్, కాకాసాహెబ్ దీక్షిత్ వీరి బలవంతం వల్ల మొట్టమొదటిసారిగా సహస్రబుధ్ధే షిరిడీకి వచ్చారు. అప్పటినుండి సాయిబాబాకు అంకిత భక్తుడయారు.
ఒకసారి
సహస్రబుధ్ధే మసీదులో కూర్చుని ఉండగా బాబా అకస్మాత్తుగా “ఈ
తాయి ఈయన కోడలు” అని ఆయనవైపు వేలితో చూపిస్తూ అన్నారు. ఆమాటలు వినగానే కాకాసాహెబ్
దీక్షిత్ ఇంకా అక్కడున్నవారంతా ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ “అయితే ఈమెని ఆయనకి అప్పచెప్పమంటారా?”
అన్నారు.
“అవును ఈ ముసలివాడికి ఆమెని అప్పగించండి. ఆయనె ఆమెకు అన్ని జాగ్రత్తలు తీసుకుని సపర్యలు చేస్తాడు. తాత్యాసాహెబ్ నూల్కర్ కి చేసినట్లే ఈమెకు కూడా సేవలు చేస్తాడు” అన్నారు బాబా.
తాత్యాసాహెబ్ గారు నీలకంఠ్ రామచంద్ర సహస్రబుధ్ధేకి కళాశాలలో సహాధ్యాయి. ఇద్దరూ కలిసి చదువుకున్నవారే. చాలా కాలం తరువాత వారిద్దరూ షిరిడీలో కలుసుకొన్నారు. తాత్యాసాహెబ్ చివరి రోజులలో మధుమేహవ్యాధితో బాధపడ్డారు. శ్రీసాయిబాబా చెప్పిన ప్రకారం సహస్రబుధ్ధే తన స్నేహితుడయిన తాత్యాసాహెబ్ కు ఇరవైనాలుగు గంటలు ఒక శిక్షణపొందిన నర్సు లాగ సపర్యలు చేసారు. అందువల్లనే ఇక్కడ ఈ ప్రస్తావన వచ్చింది.
దాసగణు భార్యకి సేవలు చేయడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాము.
సరస్వతిబాయికి సపర్యలు చేయడమంటే మాటలు కాదు. అది ఎంతో సున్నితమయిన వ్యవహారం. అంతే కాదు చాలా ప్రయాసతో కూడుకున్నది. దానికి కారణమేమిటంటే ఆమెకు పూర్తిగా మతిభ్రమించింది. అందువల్లనే చాలా సందర్భాలలో ఆమెకు శరీరస్పృహ అనేదే ఉండేది కాదు. ఎప్పుడూ ఏదో ఒకటి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూనే ఉండేది. అన్నిచోట్లకి తిరుగుతూ ఉండేది. తైలసంస్కారం లేని చింపిరి జుట్టు, మురికి బట్టలతో తిరిగేది. ఎక్కడ పడితే అక్కడే మలమూత్ర విసర్జనలు చేసేది. ఆఖరికి తన మంచంమీదనే అన్నీ కానిచ్చేస్తూ ఉండేది. ఆమె ఇతరుల ఇండ్లలోకి కూడా వెళ్ళి వారింట్లో మంచాలమీద కూర్చుంటూ ఉండేది. ఆమె రెండు చేతులకి చర్మవ్యాధి సోకింది. ఒకసారి ఆమె తాను ఏమిచేస్తున్నదో తెలియని స్థితిలో షిరిడీలో నూతిలోకి దూకేసింది.
అటువంటి మానసిక స్థితి సరిగా లేని ఆమెకు సపర్యలు చేయమని బాబా , సహస్రబుధ్ధేను ఆదేశించారు. బాబా మాటలు జవదాటడానికి వీలులేదు. బాబా సహస్రబుధ్ధేను రెండవసారి ఈపనికి నియోగించారు. మొట్టమొదటిసారి నూల్కర్ విషయంలో జరిగింది.
(తాత్యాసాహెబ్
నూల్కర్ గురించి కొంతకాలం క్రితం ఇదే బ్లాగులో ప్రచురించాను.)
ఈ
విషయం గురించి బాబాసాహెబ్ సహస్రబుధ్ధే తన అనుభవాలను వివరిస్తున్నారు.
"బాబా ఆదేశాన్ని వినగానే సరస్వతీబాయికి సపర్యలు చేయడానికి వెంటనే ఒక కుటికురా సబ్బు, ఇంకా వంటికి రాయడానికి మెడికేటెడ్ పౌడర్ రెండూ తీసుకొని వచ్చి సేవలు చేయడం పారంభించాను. ప్రతిరోజు రాత్రి 11 గంటలకు ఆమెను మరొక స్త్రీని తోడిచ్చి, బాత్ రూముకి పంపించేవాడిని. ఈ విధంగా చేయడం వల్ల ఆమె తన పక్కను అపరిశుభ్రం చేయడం ఆగింది. రోజూ రెండు సార్లు సబ్బుతో ఆమె చేతులను శుభ్రం చేస్తుండేవాడిని. ఇలా చేయడం వలన చాలా తొందరలోనే ఆమె శరీరం బాగా శుభ్రపడింది. ప్రతిరోజు ఆమెకు స్నానం చేయించేవాడిని. ఆతరువాత సాఠేవాడాలో ఉన్న అమ్మవారి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయిస్తూ ఒక్కొక్క ప్రదక్షిణ పూర్తయినపుడెల్లా ఆమెతో దేవికి నమస్కారం చేయిస్తూ ఉండేవాడిని.”
ఈవిధంగా ఎంతో శ్రధ్ధగా, చేసే సేవలో ఎటువంటి లోపంలేకుండా చేయడం ఆమె కోలుకోవడానికి ఎంతగానో దోహదపడింది. ఈవిధంగా నెలరోజులపాటు ప్రతిరోజు సేవ చేసారు. ఆమె ఆరోగ్యస్థితిలో గణనీయమైన మార్పు కనిపించింది. ఒకసారి ఆమె బాబాసాహెబ్ దగ్గరకు వెళ్ళి “బాబా సాహెబ్ ఇపుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేనే స్వయంగా వంట చేసి ఇక్కడున్నవారందరికీ భోజనాలు పెడదామని ఉంది” అని చెప్పింది. ఆమె అన్న మాటలకు అక్కడున్నవారందరూ చాలా ఆశ్చర్యపోయారు. పూర్తిగా మతిభ్రమించి అసలు ఏమందులకి నయంకాదనుకున్నట్లుగా ఉండేది ఆమె ఇంతవరకు ఆమె పరిస్థితి. అటువంటి ఆమె ఇప్పుడు ఆవిధంగా మాట్లాడటం వారికి ఆశ్చర్యం కాక మరేమిటి? వారంతా వెంటనే బాబా వద్దకు వెళ్ళి ఆమెకు నయమయిన విషయం చెప్పారు. బాబాసాహెబ్ ఈ ఘనత సాధించినందుకు వారందరికీ సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. వారు చెప్పినదంతా విన్న వెంటనే బాబా “ఆయన ఎవరో తెలియనివారికి ఉపకారం చేసారా ఏమి? ఆయన తన స్వంత కోడలికే కదా సహాయం చేసారు. అందులో పెద్ద గొప్పతనం ఏముంది?” అన్నారు.
బాబా మాటలు విన్న తరువాత అందరూ బాబా ఆమె మీ కోడలు అనడంలోని అర్ధం ఏమిటి అని నన్ను అడగసాగారు. బాబా ఆమెను నా కోడలు అన్నారేమిటి? బాబా ఆవిధంగా అనడంలో గల ఆంతర్యం ఏమిటి? బాబాసాహెబ్ సహస్రబుధ్ధే మనసులో కూడా ఈ విధమయిన ప్రశ్నలుదయించాయి. బాబా అలా ఎందుకని అన్నారో నాలో నేనే శోధించుకోవడం మొదలుపెట్టారు. ఆతరువాత నాకు స్ఫురించింది. దాసగణు ఇంటిపేరు, నాపేరు ఒక్కటే. (గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుధ్ధే) అదే సహస్రబుధ్ధే. వయసులో అతను నాకన్నా చిన్నవాడు. అందువల్లనే అతని భార్య నాకు కోడలు అవుతుందని బాబా ఉద్దేశ్యం.
దాసగణు సంసార జీవితం పెద్దగా చెప్పుకునేంతగా ఎప్పుడూ లేదు. నిజం చెప్పాలంటే అతను సంసార జీవితాన్ని కోరుకోలేదు. దాని ఫలితంగానే అతని భార్య మానసికంగా చాలా ఒత్తిడికి గురవ్వడం వల్లనే ఆమెకు మతి చలించింది. ఇటువంటి పరిస్థితులలోఆయనలో మానసిక క్షోభ చాలా భయంకరంగా ఉండి ఉండవచ్చు. అగ్నిసాక్షిగా పెండ్లాడిన తన భార్యకి న్యాయంచేయలేడు ఆమెని ఆమె ఖర్మకి వదిలేయలేడు. ఇదంతా దాసగణుకు చాలా కఠినమయిన పరీక్ష. ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక విషయాల మీదనే కేంద్రీకృతమయి ఉండేవి. ఆయన పూర్తిగా రచనలు చేయడంలోను, కీర్తనలలోను, జపం చేసుకోవడంలోనే మునిగి ఉండేవాడు. కీర్తనలు ఆలపించడం కోసం వివిధ ప్రాంతాలకి వెడుతూ ఉండేవాడు.
ఆవిధంగా ఎన్నో రోజులపాటు ఇంటిపట్టున ఉండకుండా తిరుగుతూ ఉండేవాడు. అటువంటి పరిస్థితులలో బాబా అతనిని నాందేడులో ఉండమని ఆదేశించారు. అందువల్ల తన భార్యయొక్క బాగోగులన్నీ చూసుకునే బాధ్యత బాబాకే అప్పగించాడు దాసగణు. ఆవిధంగా ‘తాయి’ రక్షణబాధ్యతంతా బాబా తన భుజస్కంధాల మీద పెట్టుకున్న తరువాత దాసగణు మనసుకి శాంతి లభించింది. ఆమె సంరక్షణ బాధ్యతను సరైన వ్యక్తికి బాబా అప్పగించి, దాసగణుని సంసార బాధతలనుండి విముక్తుణ్ణి గావించారు బాబా.
1999
వ.సంవత్సరంలో దాసగణు బార్య మరణించింది.
(ఈ విధంగా బాబా సహస్ర బుధ్ధే చేత దాసగణు భార్యకు సేవలు చేయించి ఆమెను మామూలు మనిషిని చేసారంటే బాబా దయను ఎంతని కొనియాడగలం. అంతే కాదు సహస్ర బుధ్ధే కూడా బాబా మాటను జవదాటకుండా ఎంతో ఓపికగా సేవలు చేసారు. .. ఓమ్ సాయిరామ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
(ఈ విధంగా బాబా సహస్ర బుధ్ధే చేత దాసగణు భార్యకు సేవలు చేయించి ఆమెను మామూలు మనిషిని చేసారంటే బాబా దయను ఎంతని కొనియాడగలం. అంతే కాదు సహస్ర బుధ్ధే కూడా బాబా మాటను జవదాటకుండా ఎంతో ఓపికగా సేవలు చేసారు. .. ఓమ్ సాయిరామ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
3 comments:
its such nice information
https://shirdisaiba.blogspot.com/
Om Sairam🙏🙏🙏
Post a Comment