24.11.2020 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు మరొక కధనాన్ని ప్రచురిస్తున్నాను. బాబా
మీద కాని మనం కొలిచే ఏ దేవునియందైనా సరే మన భక్తి అచంచలంగా ఉండాలి. నిస్వార్ధంగా ఎటువంటి ప్రాపంచిక కోరికలు లేకుండా
ఉన్నట్లయితే భగవంతుని అనుగ్రహం మనమీద ఎల్లప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది. మన భక్తి, ప్రచారం కోసం కాని, ఆర్భాటం కోసం కాని ఇతరుల ముందు
ప్రదర్శించటం కోసం కాని కాదనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకొని అందుకనుగుణంగా మన వ్యవహారం
ఉండాలి.
ఇప్పుడు
ప్రచురించబోయే కధనం శ్రీ సాయిలీల మాసపత్రిక ఫిబ్రవరి, 1973 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
నిష్కలంకమయిన
భక్తి
శ్రీ ఎమ్.బి.రేగే ఇండోర్ లోని హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న రోజులు. ఆయన శ్రీసాయిబాబాకు అంకిత భక్తుడు. 1910వ.సంవత్సరంలో ఆయన బాబావైపు ఆకర్షితులయ్యారు. అప్పటినుండి ఆయన శ్రీసాయిబాబా మీదనే ప్రత్యేకంగా తన భక్తిని నిలుపుకొని తన జీవితాన్ని అంకితం చేసుకొన్నారు.
ఆయన శ్రీ బి.వి.నరసింహస్వామీజీ గారితో మొట్టమొదటి
సారిగా కలుసుకున్న సమయంలోనే బాబాయందు ఆయనకు ఎంతటి నిష్కలంకమయిన భక్తి, వినయం ఉన్నాయో
వెల్లడయ్యాయి. శ్రీ రేగే గారు స్వయంగా చెప్పిన
మాటలు…..
“ శ్రీ నరసింహస్వామీజీ గారు సాయిభక్తులనందరినీ కలుసుకుంటూ వారి వారి అనుభవాలను సేకరించి సాధకుల ప్రయోజనార్ధం వాటినన్నిటిని ప్రచారంలోకి తీసుకువద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఆవిధంగా ఆయన దేశాటన చేస్తున్న సమయంలో పూనాలో నా సన్నిహిత స్నేహితుడు, బాబాకు భక్తుడయిన శ్రీ పి.ఆర్. అవస్థే గారిని కలుసుకోవడం తటస్థించింది. బాబాతో నాకు ఏర్పడిన సంబంధం గురించి, నా గురించి ఆయన ద్వారా శ్రీ స్వామీజీగారికి తెలిసింది. స్వామీజీ నన్ను కలుసుకోవాలనుకొన్నారు. కాని నాసద్గురువు అనుజ్ఞ లేకుండా అంతేకాదు నాకు ఎటువంటి ప్రచారం ఇష్టంలేని కారణంగా నేను ఆయనను కలుసుకోవడానికి అంగీకరించలేకపోయాను. కాని మేమిద్దరం కలుసుకోవాలనేది దైవ సంకల్పం.
(శ్రీ బి.వి.నరసింహస్వామీజీ)
1937 వ.సంవత్సరంలో నేను పూనా వెళ్ళి కొన్ని రోజులు
ఉండవలసివచ్చింది. శ్రీ అవస్థే గారు తనతో కూడా
స్వామీజీ ఇంటికి రమ్మని ఎంతగానో చెప్పారు.
అప్పుడు నేను ఒక షరతు మీదనయితే వస్తానని చెప్పాను. అదేమిటంటే, నేను వచ్చినట్లుగా స్వామీజీకి తెలియచేయవద్దనీ
నేరుగా నన్ను ఆయనకు పరిచయం కూడ చేయవద్దనీ కొన్ని అడుగుల దూరంలోనే మీవెనుకే నేనుంటానని
అన్నాను. నేను పెట్టిన ఈ నిబంధనకి అంగీకరిస్తేనే
మీతో వస్తానని అవస్థే గారికి చెప్పాను. ఆయన
సరే అన్న తరువాత మేమిద్దరం స్వామీజీ గారి ఇంటికి వెళ్లాము. అవస్థే గారు స్వామీజీ ఉన్న గదిలోకి వెళ్లారు. నేను గది బయటనే ఉండిపోయాను. స్వామీజీ అవస్థే గారిని అడిగిన మొట్టమొదటి ప్రశ్న…”రేగేని
నేనెప్పుడు కలుసుకుంటాను? “త్వరలోనే నేనాయనను
కలుసుకుంటానని బాబా నాతో చెప్పారు” అని స్వామీజీ అన్నారు. నేను గదిలోకి అడుగుపెట్టాను. స్వామీజీ నన్ను చూడగానే, “మీరేనా రేగే?” అన్నారు. ఆయన నన్ను చూడాలని ఎంతో ఆరాటంగా ఉన్నారు. బాబాతో నాకు కలిగిన అనుభవాలను వివరించమని అడిగారు. “చెప్పడానికి ఏమీ లేవు” అన్నాను. నేనిచ్చిన సమాధానానికి ఆయన ఏమన్నా అంటారేమో లేక
ఆయనకు కోపం వస్తుందేమో అనుకున్నాను. కాని ఆయనలో
ఎటువంటి భావాలు లేవు. చాలా ప్రసన్నంగానే కనిపించారు. “నేను కలుసుకోవలసిన వ్యక్తి మీరే…బాబానే మిమ్మల్ని
పంపించారు” అన్నారు.
రేగేలో
ఉన్న స్వచ్చమయిన భక్తికి బాబా చాలా సంతోషించారు.
ఆయన తన అత్యున్నతమయిన ఆశీర్వాదాలను ప్రసాదించదలచుకొన్నారు. అందువల్లనే మధ్యాహ్నం స్వామీజీ ఒంటరిగా ఉన్న సమయంలో
నన్ను తన వద్దకు తీసుకురమ్మని ఆయన ఒకతనిని పంపించారు.
అతను నన్ను తీసుకువచ్చిన తరువాత స్వామీజీ అతనిని పంపించివేసారు. ఆయన నామీద ఎంతో దయను కనపరచారు. నన్ను తన దగ్గరగా కూర్చోమని, నన్ను కౌగలించుకొని,
“ నా ధనాగారం యొక్క తాళంచెవిని నీ చేతుల్లో పెడుతున్నాను. నీకేంకావాలో తీసుకో…అయిదు రూపాయలా లేక వంద రూపాయలా? ఎంత కావాలి?
నీకెంత కావాలంటె అంతా నేనిస్తాను” అన్నారు. ఇది నన్ను ప్రలోభపెట్టడానికే అని అనిపించింది. నేనేమీ అడగదలచుకోలేదు. నాకేది అవసరమో, ఏది మంచిదో ఏది నాకు ఉపయోగపడేదొ
అంతా సాయిబాబాకే తెలుసు. ఇచ్చినా ఇవ్వకపోయినా
అంతా నిర్ణయించేది బాబా. అడగడానికి నేనెవరిని? నా అయిష్టాన్ని గమనించి స్వామీజీ నా చుబుకం పట్టుకొని
అనునయంగా అడిగారు. అపుడు నేను, “నేనేది అడిగినా
మీరు ఇస్తానంటున్నారు, దానికి బాబా అంగీకరిస్తారా?” అని ప్రశ్నించాను.
“ఇస్తాను”
అన్నారు.
“బాబా
అయితే నాకు ఏదికావాలో అడుగుతున్నాను. ఈ జన్మలోను,
మరుజన్మలోను మీరు నానుండి విడిపోకుండా నాతోనే నిరంతరం ఉండాలి” ఇదే నాకోరిక బాబా అన్నాను. అపుడు స్వామీజీ ఎంతో ఆనందంతో నన్ను వీపుమీద తట్టి,
“నేను నీతోనే ఉంటాను…నీలోనే ఉంటాను, లోపలా బయటా నువ్వెక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా నీతోనే
ఉంటాను” అన్నారు. ఆయన మాటలకు. నాకెంతో సంతోషం
కలిగింది.
బాబాకు
ఎంతోమంది భక్తులు ఉన్నారు. కాని రేగే గారికి
ఈవిధంగా సంపదను ఇస్తానని అన్నట్లుగా వారిలో మరెవరికీ ఆవిధంగా అనుగ్రహించలేదు. బాబాయొక్క ఆధ్యాత్మిక ధనాగారం రేగేకు మాత్రమే నిర్దేశించారు. దానిని స్వీకరించడానికి ఆయనే అర్హుడు. ప్రహ్లాదునికి లక్ష్మీనరసింహస్వామి ఏవిధంగానయితే
ఆధ్యాత్మిక సంపదని అనుగ్రహించాడో అదేవిధంగా బాబా రేగే గారిని అనుగ్రహించారు. మనం కూడా రేగే గారి బాటలో పయనిస్తూ బాబావారి అనంతమయిన
అనుగ్రహానికి వారసులుగా మారడానికి ప్రయత్నిద్దాము.
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment