
04.08.2011 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు శుభాశీస్సులు
ఈ రోజు తార్ఖడ్ వారి మరియొక అనుభూతిని గురించి తెలుసుకుందాము.
షిరిడీలో కుండపోతవానలో మృత్యువునెదుర్కొనుట
ప్రియ సాయి బంథు పాఠకులారా, మీరు ఒక్కసారయినా షిరిడీకి వెళ్ళి ఉంటారని అనుకుంటున్నాను. యిప్పటి షిరిడీకి, యింతకుముందు సవత్సరాలలో మా నాన్నగారు వెడుతూండేటప్పటి షిరిడీకి చాలా మార్పు వచ్చింది. మీరు షిరిడీలో ప్రవేశించదానికి కోపర్గావ్ పొలిమేరకు వచ్చినపుదు అక్కడ ఒక వాగు ఉంది. షిరిడీ గ్రామంలోకి రావాలంటే ఆ వాగును దాటాలి. సంవత్సరంలో యెక్కువ సార్లు వాగు యెండిపోయి ఉంటుంది. వర్షాకాలంలో మాత్రమే వాగు వేగంగా ప్రవహిస్తూ ఉండటం చూడచ్చు. యిప్పుడు ప్రథాన రహదారికి దానిమీద చిన్న వంతెన ఉంది. ఆ రోజులలో గ్రామస్థులు ఉదయాన్నే తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి యీ వాగు ఒడ్డుకు వస్తూ ఉండేవారు. అందుచేత, అక్కడ చాలా పొదలు ఉండటంతో సూర్యోదయానికి ముందు ఆ ప్రదేశం అనువుగా ఉండేది. రోడ్డుమీద జనసంచారం కూడా ఉండేది కాదు.
మా నాన్నగారు షిరిడీలో ఉన్నపుడు అవి వర్షాకాలం రోజులు ఆయనకు వేకువజామునే లేవడం అలవాటు. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత, కాకడ ఆరతికి వెళ్ళేవారు. అటువంటి రోజులలో ఒకనాడు ఆయన వేదువజాముననే లేచి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వాగు ఒడ్డుకు వెళ్ళారు. అప్పుడు బాగా ముసురు పట్టి జడివాన కురుస్తూండటంతో తనతో కూడా గొడుగు, టార్చ్ లైటు తీసుకుని వెళ్ళారు. 
ఈ విథంగా ఆయన ఆ పరిస్థితిలో ఉండగా వాగు ఒడ్డుకు అవతలివైపునుంచి యెవరో గట్టిగా అరుస్తూ ఉండటం విన్నారు. ముందర ఆయన ఆ అరుపులని పట్టించుకోలేదు. ఆ వ్యక్తి యెక్కడ ఉన్నాడో చూద్దామని ప్రయత్నించారు గాని చీకటిగా ఉండటం వల్ల యెవరినీ చూడలేకపోయారు. ఆ మనిషి ఒడ్డు దగ్గరనుంచి పరుగెత్తుకుని వెళ్ళిపొమ్మని అరుస్తున్నట్లుగా అర్థమయింది. అతను మరాఠీలో "లోంధా అలారే అలా పాలా" అని అరుస్తున్నాడు. మా నాన్నగారికి లోధా అంటే దాని అర్థం తెలీలేదు. (కెరటం)
ఆయన విద్యాభ్యాసం ఆంగ్ల మాథ్యమంలో జరిగింది కాబట్టి వాడుక భాషలో మాట్లాడే మరాఠీ భాషని అర్థం చేసుకోవడానికి ఆయనకు కష్టమయింది. యేమయినప్పటికి ఆ మనిషి అక్కడున్న వారినందరినీ ఆ ప్రదేశం వదలి పరిగెత్తుకుని వెళ్ళమని హెచ్చరిస్తున్నట్లు తెలుసుకోగలిగారు. ఆయన హడావిడిగా కాలకృత్యాలను ముగించుకుని పైకి లేచి నుంచుని, చుట్టూ యేమి జరుగుతోందో చూద్దామని టార్చ్ లైట్ వేశారు. 15, 20 అడుగుల యెత్తులో నల్లటి రంగులో నీరు తనవైపుకు వస్తూ ఉండటం వెంటనే గ్రహించారు. రాత్రి సమయంలో యెక్కడో విపరీతమైన కుండపోత వర్షం వచ్చి దాని కారణంగా వాగులో హటాత్తుగా వరద వచ్చింది.
తనకి చావు దగ్గర పడిందని ఆయనకు అర్థమయి గట్టిగా "బాబా మేలో మాలా వఛావా" అని అరిచారు. (బాబా నేను చనిపోతున్నాను దయ చేసి నన్ను రక్షించు) ఆయన కళ్ళు మూసుకుని అక్కడే ఆ సమయమంతా బాబా నామస్మరణ చేస్తూ అదే చోట నుంచుని వున్నారు. కొంత సేపటి తరువాత తాను కొట్టుకుని వెళ్ళిపోలేదని, బతికేఉన్నానని అర్థమయింది. ఆయన కళ్ళు తెరిచి చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయారు. నీటి ప్రవాహం రెండు పాయలుగా విడిపోయి తనని తాకకుండా తనముందునుంచి వేగగా వెడుతోంది. ఆయన యింకా ఆ నీటి ప్రవాహంలోనే ఉన్నారు. ఆయనకి చావు భయం పట్టుకుంది. ఆ సమయమంతా బాబా నామ స్మరణ చేస్తూనే ఉన్నారు. కొంత సేపటి తరువాత నీటిమట్టం తగ్గింది. అది మోకాలు లోతుకు వచ్చేటప్పటికి నీరు ఆయన శరీరాన్ని తాకింది. యిప్పుడాయన మోకాలిలోతు నీటిలో ఉన్నారు. ప్రవహించే వరద నీటిలో తన చుట్టూరా చెట్ల కొమ్మలు, పొదలు, జంతుజాలాలు వగైరా కొట్టుకుని పోవడం చూశారు. అక్కడికక్కడే ఆయన బాబాకు థన్యవాదాలు తెలిపి, అటువంటి చావు పరిస్థితి నుంచి బాబాయే కాపాడారని అర్థం చేసుకున్నారు. . అప్పుడాయన మెల్లగా ఆ మోకాలి లోతు నీటిలో వెనకకు నడిచారు. ఆయన తమ బస వద్దకు వచ్చి, స్నానం చేశారు. ఆ ఉదయం ఆయన కాకడ ఆరతిని చూసే అదృష్టాన్ని పోగొట్టుకున్నారని వేరే చెప్పనక్కరలేదు. ఆ ఉదయం జరిగినదంతా తన తల్లికి చెప్పారు. ఆయనని మృత్యు కోరలనుంచి బాబాయే లాగారని, తనకి ప్రాణ భిక్ష పెట్టినందుకు వెంటనే వెళ్ళి ఆయనకు థన్యవాదములు తెలపమని ఆవిడ సలహా ఇచ్చింది. ఆయన వెంటనే ద్వారకామాయికి వెళ్ళి, తన చేతిలో పూజా సామాగ్రితో మెట్లు యెక్కుతూండగా బాబా రెట్టించిన స్వరంతో "ఏయ్ భావూ ! యివాళ పొద్దున్నే నా సహాయం కోసం యెందుకరిచావు? చనిపోతావని భయం వేసిందా?" అన్నారు. మా నాన్నగారు ఆయన కాళ్ళ మీద పడి బాబాతో "మీకంతా తెలుసు. నాలాంటి సామాన్య మానవుడు చావు తథ్యమని కళ్ళెదుట కనపడుతూ ఉంటే భయపడటం సహజం" అన్నారు. బాబా ఆయనని భుజాలు పట్టుకుని లేవనెత్తి "ఏయ్ భావూ, పైకి లే, నేను నిన్ను చావడానికి షిరిడీ తీసుకు రాలేదు. దయ చేసి గుర్తుంచుకో నువ్వింత సులభంగా ఈ విథింగా చావవు. భవిష్యత్తులో నువ్వు చేయవలసిన పని యెంతో ఉంది" అన్నారు.
ప్రియమైన సాయి భక్త పాఠకులారా, మనలాంటి సామాన్యమానవులకి అటువంటి అనుభవాలని అర్థం చేకోవడం కష్టమని నాకు తెలుసు. అప్పుడు నా జీవితంలోఆలోచనా శక్తిని రేకెత్తించే సంఘటన ఒకటి జరిగింది. దానిని నేనిప్పుడు మీకు వివరిస్తాను.
నాకు బాగా గుర్తున్నంత వరకు అది 1962 సం. జూన్ నెల. బాంద్రాలో న్యూ టాకీస్ లో (యిప్పుడది గ్లోబస్ థియేటర్) గొప్ప సినిమా ఆడుతోంది. ఆ సినిమా పేరు "టెన్ కమాన్ డ్ మెంట్స్". ఈ సినిమాకి నిర్మాత సెసెల్లె బెడెమెలె, హాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరు. కొలాబాలోని రీగల్ థియేటర్లో 70 ఎం.ఎం. స్క్రీన్, స్టీరియో ఫోనిక్ సౌండ్ తో తిరిగి నిర్మించవడిన బాంద్రాలోని న్యూ టాకీస్ లోను గత రికార్డులన్నీ ఈ సినిమా బద్దలు కొట్టింది. నేను ఈ సినిమాని చూశాను. నాకు తెలిసిన దేమిటంటే, ఈ సినిమాలో చూపించిన అద్భుతాలు, మానాన్నగారు షిరిడీలో సాయిబాబాతో ఉండగా చూసిన లీలలు రెండూ కూడా సరిపోలాయి. మా నాన్నగారిని నాతో కూడా వచ్చిఈ సినిమాను చూడమని ఒప్పించాను. 30 నుంచి 35 సంవత్సరాల తరువాత అయిఉండవచ్చు, ఆయన థియేటర్ లోకి అడుగుపెట్టి సినిమా చూశారు. ఆయన చూసిన దృశ్యాలు, దైవ సంబంథమైన దివ్యమైన వెలుతురు, (ప్రకాశం) పర్వతాన్ని దర్శించడానికి వచ్చినపుడు మోజెస్ రావడం, ఈజిప్టు భూబాగాన్ని వదలి వెళ్ళే తన జ్యూ ప్రజలందరినీ మోజెస్ తీసుకుని వెళ్ళడం, రెడ్ సీ ఒడ్డుకు వచ్చి ప్రభువుని ప్రార్థించడం, ఫరోహా రాజు ఆగ్రహం నుంచి వారిని తప్పించడానికి సముద్రం రెండు భాగాలుగా విడిపోవడం, మానాన్నగారు ఆ పిక్చరైజేషన్ కి అమితానంద పడ్డారు. కళ్ళనుండి కన్నీరు పెల్లుబికి థారగా కార సాగాయి. మేము థియేటర్ నించి బయటకువచ్చిన తరువాత టెన్ కమాండ్ మెంట్స్ సినిమాలో చూపించిన విథంగా షిరిడీ సాయిబాబా వారికి కూడా అదే విథమయిన మానవాతీత శక్తులు కలిగి ఉన్నారని, మోజెస్ పాత్రకి, ఆయనకి బాగా పోలిక ఉందని నిర్థారించారు. ఆయన యింకా కొనసాగిస్తూ యిలా చెప్పారు. "వీరేన్! షిరిడీ సాయిబాబాతో ఉన్నపుడు నేననుభవించిన అపూర్వమైన అనుభవాలని నమ్మడానికి నీకిప్పుడు తగిన కారణం ఉంది."
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
------------------------------------------------------------
నేను డిగ్రీ చదివే రోజులలో "ది టెన్ కమాండ్ మెంట్స్" సినిమా చూశాను. సముద్రం రెండుగా విడిపోయి దారి ఇవ్వడం చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఒకవేళ యెవరినా చూడకపోతే చూడండి. 








0 comments:
Post a Comment