26.01.2012 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి బా ని స డైరీ - 1994 14 వ. భాగాన్ని చదువుకుందాము
సాయి.బా.ని.స. డైరీ - 1994 (14)
23.04.1994
నిన్న రాత్రి శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి, అన్న మాటలు - "కాలము అనేది భగవంతుడు మనకు యిచ్చిన వరము. దానిని వ్యర్ధము చేసుకోకుండ జాగ్రత్తగా మంచి కార్యాలకు వినియోగించుకొంటు, ఈ శరీరాన్ని భగవంతుని సేవలో ఉపయోగించుకొంటు ఈ జన్మను సార్ధకము చేసుకోవాలి."
24.04.1994
నిన్న రాత్రి నిద్రకుముందు శ్రీ సాయికి నమస్కరించి "తెల్లవారితే నా పుట్టినరోజు పుట్టిన రోజు సందర్భముగా సందేశము ప్రసాదించు తండ్రీ " అని వేడుకొన్నాను. శ్రీ సాయి నాకు చూపిన దృశ్యాల సారాంశము. ఒక చోట ఒకవ్యక్తి చనిపోయినాడు. అతని బంధువులు అతని అంతిమయాత్ర కోసము అన్ని సిధ్ధము చేస్తున్నారు ఆ హడావిడి అంత చూస్తు ఉంటే పుట్టినరోజు పండగలాగ ఉన్నది. ఆ జన సమూహములో ఒక వ్యక్తి శ్రీ సాయి రూపములో యున్నారు. ఆయన నన్ను చూసి అంటారు. "మనిషి మరణించిన రోజే నిజమైన పుట్టినరోజు. కారణము మనిషి ఈ శరీరము వదలి యింకొక తల్లి గర్భములోని శరీరములో ప్రవేశించిన రోజు కూడా ఈ రోజే కదా ! కనుక యిదే నిజమైన పుట్టిన రోజు. మిగిలినవన్ని మానవుడు కల్పించుకొన్న పుట్టిన రోజు పండగలు మాత్రమే."
26.04.1994
నిన్న రాత్రి శ్రీ సాయి కలలో దర్శనము యిచ్చి అంటారు - "ఆ విందులు వినోదాలు చూడు.
అక్కడివాళ్ళకు అన్నము పరబ్రహ్మ స్వరూపము అని తెలియదు.
ఆ అన్నాన్ని అగౌరవముపరచి ఎట్లాగ వినోదము పొందుతున్నారో చూడు. జీవించటానికి అన్నము చాలా అవసరము. అన్నము సంపాదించటానికి నిరంతరము కృషి చేయాలి. సోమరి పోతులాగ ఉంటు ఎదుటివాని సంపాదనపై అన్నము తినరాదు".
28.04.1994
నిన్న రాత్రి కలలో శ్రీ సాయి చూపించిన దృశ్యాల సారాంశము. మనిషి జీవితములోని ముఖ్య ఘట్టాలు అయిన సంసార జీవితము, పిల్లల పెంపక జీవితము (పిల్లల చదువులు - వారి వివాహాలు) విషయాలలో నీవు శ్రీ సాయి సహాయము కోరటములో తప్పులేదు. నీ కోరికలు తీరిన తర్వాత ఆయన నీనుండి ఏమి కోరుతున్నది ఆలోచించకుండ ఆయనను మర్చిపోవటము అసలైన పెద్ద తప్పు అని గ్రహించు.
30.04.1994
నిన్న రాత్రి కలలో శ్రీ సాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి చిన్న కధ చెప్పినారు. ఆకధ వివరాలు "ఒక బ్రాహ్మణుడు మండుటెండలో ఎడారిలో దారి తెన్ను తెలియకుండ నడచిపోతున్నాడు.
అతనికి మార్గములో రాతి బండపై రెండు సంచులు కనిపించినవి. ఒక సంచిలో తినుబండారాలు మరియు మరియొక సంచిలో చెప్పుల జత యున్నాయి. అక్కడ ఒక చీటీ వ్రాసి యుంది. ఆ చీటీలో ఏమి వ్రాసి యుందో అని ఆతృతగా చదివినాడు. ఆ చీటీలోని వాక్యాలు "దారి తెన్ను తెలియకుండ ఈ ఎడారిలో నడచిపోతున్న ఓ బాటసారీ నీ పరిస్థితి నాకు తెలుసు. నీవు ఈ రెండు సంచులు కావాలని కోరుకొంటున్నావు. అది వీలుపడదు. ఈ రెండు సంచులలో ఒక సంచిని మాత్రమే కోరుకో. తినుబండారాలు సంచి నీ ఆకలిని తీర్చుతుంది. చెప్పుల జత నీపాదాలకు నీవు ధరించగానే అది చక్కగా నీ గమ్యాన్ని చేరుస్తుంది." ఆ రెండు సంచులలో ఏ సంచిని తీసుకోవాలి అనే ఆలోచనలో పడ్డాడు ఆ భ్రాహ్మణుడు. మరి నీవు ఆ బ్రాహ్మణుడి స్థానములో ఉన్ననాడు ఏ సంచిని తీసుకొంటావు గోపాలరావు అంటారు. వెంటనే తెలివి వచ్చినది.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment