27.01.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఈ రోజు సాయి బా ని స డైరీ - 1994 15 వ. భాగాన్ని చదువుకుందాము
సాయి.బా.ని.స. డైరీ - 1994 (15)
01.05.1994
నిన్నటిరోజున ఆఫీసులో జరిగిన సభలో నన్ను ఎవరు గుర్తించలేదు అనే బాధతో యింటికి వచ్చి చాలా ఆలోచించినాను. శ్రీ సాయి బా.ని.స. గా మారిన తర్వాత కూడా గుర్తింపు అనే వ్యామోహముని వదలించుకోలేకపోతున్నానే - ఈ వ్యామోహము వదిలించుకొనే మార్గము చూపించమని శ్రీ సాయినాదుని వేడుకొని నిద్రపోయినాను. శ్రీ సాయి అజ్ఞత వ్యక్తి రూపములో కలలో దర్శనము యిచ్చి అంటారు. "తిండికి లేక ధన సంపాదన కోసము కొండజాతి కోయవాడు అందరి చేతులు చూస్తూ వాళ్ళకు జాతకాలు చెబుతూ వాళ్ళతో ఫొటోలు తీసుకొని మళ్ళీ ఆఫొటోలు యితరులకు చూపి వాళ్ళ జాతకాలు చెబుతూ ధన సంపాదన చేసుకొంటాడు. గుర్తింపు అనేది తిండి తిప్పలు లేనివాడికి, వాడి ప్రాపకము వీడి ప్రాపకము గురించి ప్రాకులాడేవాడికి కావాలి. నా భక్తులకు ఆ బాధ లేదు. నా భక్తుల యింట లేమి అనే శబ్దమురాదు - అన్న వస్త్రాలకు లోటు యుండదు. యింక నా భక్తుని గుర్తింపు అనే వ్యామోహము ఎక్కడిది." నిద్రనుండి తెలివచచ్చినది. లేచి శ్రీ సాయినాధునికి కృతజ్ఞతలు చెప్పుకొన్నాను.
05.05.1994
నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి సాయి తత్వము గురించి చెప్పమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు ద్వారా గ్రహించిన సందేశము.
1) శ్రీ సాయి దయ అనే గాలి ఎన్నివంకరలు ఉన్న గొట్టాలు ద్వారా అయినా పయనిస్తూ ఆఖరికి సాయి భక్తుని దగ్గరకు చేరుకొంటుంది.
2) సర్వ జీవాలలో సర్వ దేవతా స్వరూపుడు శ్రీ సాయి ఉన్నారు. ఏనుగులో శ్రీ సాయి గణేష్ ను చూడు పాలు యిచ్చే ఆవులో శ్రీ సాయి మాతను చూడు.
08.05.1994
నిన్నటిరోజున పరస్త్రీ వ్యామోహమునుండి మనసును మళ్ళించలేక మానసికముగా చాలా బాధపడినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి నా సమస్యకు పరిష్కారము చూపమని వేడుకొన్నాను. శ్రీ సాయి ఒక స్నేహితుని రూపములో దర్శనము యిచ్చి ఈ విధముగా అన్నారు. "నీ జీవితములో వావి, వరస యుండి నిన్ను వివాహము చేసుకొనేందుకు సిధ్ధముగా యున్న ఆ స్త్రీవైపు కనీసము చూడటానికి అయినా యిష్ఠపడటములేదు. కారణము ఆమె అందవికారముగా ఉండటమే కదా. ఆ అందవికారము నీలో వ్యామోహాన్ని కలిగించటములేదు. నీలో ఉన్న జ్ఞాన శక్తి ఆ అందవికారాన్ని గుర్తించగలిగినది. మరి అదే జ్ఞాన శక్తితో అందమైన పరస్త్రీలను మండుతున్న కొలిమిలాగ ఊహించుకో.
పరస్త్రీ మండుతున్న కొలిమి అనే భావనతో బ్రతుకు. అపుడు నీ మనసులో పరస్త్రీ వ్యామోహము కలగదు.
09.05.1994
నిన్నటిరోజున శ్రీ సాయి తత్వము గురించి ఆలోచించుతూ నిద్రపోయినాను. రాత్రి కలలో శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్నారు. "ఆసుపత్రిలో నీ పిల్లలు జ్వరముతో బాధపడుతుంటే నీ మనసు గిలగిల కొట్టుకొనుచున్నదే. మరి నా పిల్లలు (నా భక్తులు) వారి జీవితాలలో వారు బాధలు పడుతు ఉంటే నేను చూస్తూ ఉండగలనా! నా పిల్లలు నా నుండి ఎంతదూరములో యున్న నేను వాళ్ళను రక్షించుకొంటాను."
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment