29.01.2013 మంగళవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీవిష్ణుసహస్రనామం 30వ. శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: ఓజస్తేజో ద్యుతి ధరః ప్రకాశాత్మా ప్రతాపనః
ఋధ్ధ స్స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః ||
తాత్పర్యం: పరమాత్మను, ఓజస్సుగా, తేజస్సుగా, వెలుగును ధరించినవానిగా, వెలుగుచున్న ఆత్మగా, వెలుగుయొక్క ఆత్మగా, తపింపచేయువానిగా, అక్షరమయిన సృష్టిని రూపముగా వృధ్ధి పొందు వానిగా, మంత్రములన్నిటికీ బీజమయిన "ఓం" కారముగా, చంద్రుని వెన్నెల సూర్యుని వెలుగు తానే అయినవానిగా ధ్యానము చేయుము.
కాకా సాహెబ్ దీక్షిత్ డైరీ - 2వ.అధ్యాయము
పరామర్శ:
ఒకసారి శ్రీసాయిబాబా శ్యామాకు స్వప్నంలో కనపడి "శ్యామా! గోవర్ధన్ దాస్ యింటికి వెళ్ళావా" అని అడిగారు. శ్యామా లేదని చెప్పగానే బాబా" గోవర్ధన్ తల్లి చనిపోయింది. వెళ్ళి అతనిని పరామర్శించు" అని చెప్పారు.
శ్యామాకి బాబా వాక్కుల మీద నమ్మకం. అందుచేత మరుసటిరోజు మధ్యాహ్న్నం 3 గంటలకు గోవర్ధన్ యింటికి వెళ్ళాడు శ్యామా. అక్కడికి వెళ్ళగానే బాబా చెప్పినమాటలు పూర్తిగా యదార్ధమనితెలిసింది. క్రితం రోజునే గోవర్ధన్ తల్లి మరణించింది. బాబా శ్యామాను సరియైన సమయానికి పంపించారు.
భవిష్యద్వాణి.
ద్వారకానాధ్ అనే వ్యక్తి బాబా దర్శనం కోసం షిరిడీ వచ్చాడు. అతను తన మామగారు శ్రీసాయిబాబాకు అందచేయమని ఇచ్చిన ఉత్తరాన్ని పట్టుకుని వచ్చాడు. ఆఉత్తరంలో ప్రధాన్ తన కూతురి అనారోగ్యం గురించి వ్రాశాడు. ద్వారకానాధ్ ఆఉత్తరాన్ని బాబా చేతికిచ్చాడు. బాబా దానిని తలక్రిందులుగా పట్టుకొని "ఆమె వెళ్ళిపోతున్నదన్నమాట" అంటూ గొణిగారు. నేను (కాకాసాహె దీక్షిత్) ఆమాటలు స్పష్టంగా విన్నాను. కాని మిగతావారికి అంత స్పష్టంగా వినిపించలేదు. తరువాత ఆఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించారు. ఆఉత్తరం చదివిన తరువాత ద్వారకానాధ్ "బాబా, నాభార్యను ఎప్పుడు తీసుకుని రమ్మాంటారు" అని ఆడిగాడు. అప్పుడు బాబా "ఇక నాలుగు రోజులలో ఆమే నావద్దకు వస్తుంది" అన్నారు. సరిగా నాలుగు రోజులకు ఆమె మరణించడం భక్తులందరకూ ఆశ్చర్యం కలిగించింది.
అంతర్యామి:
ఒక గురుపూర్ణిమ రోజున హేమాడ్ పంత్ సకుటుంబంగా షిరిడీకి వచ్చాడు.
రెండు రోజులలోనే అతని దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. చేతిలో పైసా లేకుండా అయిపోయింది. ఒకరోజు తరువాత నేను, మోరేశ్వర్ ప్రధాన్ షిరిడీ చేరుకున్నాము. ప్రధాన్ దగ్గిరకూడా తొందరలోనే డబ్బంతా ఖర్చయిపోయింది. మరునాడు శ్రీసాయిబాబా ప్రధాన్ ని దక్షిణ అడిగారు. "నావద్ద పైసా లేదు" అని ప్రధాన్ చెప్పారు. అపుడు బాబా "అన్నా సాహెబ్ దగ్గరకు వెళ్ళి(హేమాడ్ పంత్) అడిగి పట్టుకురా" అన్నారు. హేమాడ్ పంత్ వద్ద కూడా డబ్బు లేదని ప్రధాన్ కి తెలుసు. అయినా బాబా ఆజ్ఞను తూచా తప్పక ఆచరించాలని మరొకమాట మాట్లాడకుండా ప్రధాన్ అన్నా సాహెబ్ వద్దకు వెళ్ళి డబ్బు అడిగాడు.
ప్రధాన్ తనని డబ్బు అడగగానే అన్నా సాహెబ్ ఆశ్చర్యపోయాడు. "నా వద్ద డబ్బుందని నీకెలా తెలుసు" అని హేమాడ్ పంత్ ప్రశ్నించి, ఇపుడే బాంద్రానించి ఒక వ్యక్తి వచ్చి నాకు డబ్బు ఇచ్చాడు. అని చెప్పాడు. ప్రధాన్ హేమాడ్ పంత్ ను కలుసుకోవాడానికి కొద్ది నిమిషాల క్రితమే జరిగిన ఈ విషయం ఎవరికీ తెలీదు. బాబా దివ్యదృష్టిలోని రహస్యం ఎవరికి తెలుసు?
రక్షకుడు:
ఒక ముస్లిం భక్తుడు శ్రీసాయిబాబా వద్దకు వెళ్ళాడు. ఆ వ్యక్తికి ఒక బ్రాహ్మణ మిత్రుడు ఉన్నాడు. అతనికి మరణ శిక్షపడింది. ఆ భక్తుడు తన స్నేహితుని శిక్షనించి తప్పించమని బాబా ను వేడుకున్నాడు. బాబా అతనిని ఆశీర్వ దిస్తూ "నాలుగు రోజులలో భగవంతుడు అతనినిని అనుగ్రహిస్తాడు" అన్నారు. బాబా చెప్పినట్లుగానే సరిగా నాలుగు రోజుల తరువాత ఆబ్రాహ్మణ మితృడు అప్పీలు మీద, మరణ శిక్ష రద్దయ్యి విడుదల చేయబడ్డాడు.
గణేశసాయి:
శ్రీచిదంబర్ గాడ్గిల్ గణేష్ మహరాజ్ భక్తుడు. అతడు బాబా భక్తుడు కూడా. అతడు బాబాలో గణేశుడిని దర్శించేవాడు. వినాయకుని పూజించినట్లె బాబా ని కూడా పూజించాడు. అతనిలో విఘ్నేశ్వరుని మీద ఎంత భక్తి ఉందో ధృఢపరచుకోవాలనుకున్నారు బాబా. ఒకసారి గాడ్గిల్ గారు బాబాను పూజిస్తున్నపుడు, బాబా అకస్మాత్తుగా "ఈముసలివాడు చాలా టక్కరి. ఈ ముసలివానిని బయటకు తోలేయండి. నాఅసనం క్రింద ఎలుక ఉన్నదని చెపుతున్నాడు" అన్నారు.శ్రీసాయిబాబా తన పూజని అంగీకరించారని తాను ఆయనని గణేశునిగా భావిస్తున్నట్లు తెలుసుకొన్నారని ఆభక్తుడు చాలా అనందించాడు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment