30.01.2013 బుధవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీవిష్ణుసహస్రనామం 31వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం : అమృతాం శూద్భవోభానుః శశిబిందుస్సురేశ్వరః
ఔషధం జగతస్సేతు స్సత్యధర్మ పరాక్రమః ||
తాత్పర్యం: భగవంతుని, చంద్రుని అమృత కిరణములనుండి పుట్టినవానిగా, సూర్యునివలె ప్రకాశించు కిరణములు కలవానిగా, చంద్రుడను బిందువుగా, దేవతలకధిపతిగా, స్వస్థత కూర్చువానిగా, అన్ని లోకములకు తీరమైన వానిగా, సత్యము చేతనూ ధర్మము చేతనూ లోకములన్నియూ ఆక్రమించువానిగా ధ్యానము చేయుము.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 3వ.అధ్యాయము
ఒకరోజు మధ్యాహ్న్నం నన్ను (దీక్షిత్) ప్రదాన్ ఏమైనా వచ్చాడా అని బాబా అడిగారు. నేను రాలేదని చెప్పాను. ప్రధాన్ ని షిరిడీకి రమ్మని కబురు పంపమంటారా అని బాబాని అడిగాను.
అలాగే కబురు పంపించు అన్నారు బాబా. బాలా షింపే ద్వారా ప్రధాన్ కి కబురు పంపించారు. అదే సమయంలో బాబా ప్రధాన్ గురించి ప్రధాన్ ని అడుగుతున్న సమయంలోనే బొంబాయి హైకోర్టులో బార్ రూములో ఎవరితోనో మాట్లాడుతున్న ప్రధాన్ హటాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. అతను నిరంతరంగా బాబానామాన్ని ఉచ్చరిస్తూనే ఉన్నాడు. అతని దగ్గర ఉన్న స్నేహితుడు వైద్య సహాయం కోసం వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ప్రధాన్ స్పృహలోకి వచ్చాడు. కొంత సేపయిన తరువాత ఆయన ఎవరి ఆసరా, సహాయం లేకుండగానే రైలులో శాంతా క్రజ్ లోని తన యింటికి స్వయంగా తనకు తానే వెళ్ళారు.
మరునాడు బాలాషింపే అనే భక్తుడు షిరిడీనుంచి వచ్చి బొంబాయిలో ప్రధాన్ ని కలిసి బాబా ఊదీ, నేను రాసిన ఉత్తరం ప్రధాన్ కి అందచేశాడు. క్రితం రోజు బాబా ప్రధాన్ ని తలచుకున్న విషయం కూడా చెప్పాడు. బాబా తననెందుకు తలుచుకున్నారో ప్రధాన్ కి అర్ధమయింది. బాబా తన భక్తుడు కష్టంలో ఉంటే వెంటనే ఎలా తమ రక్షణను అందచేస్తారో అనేదానికి ఇదొక చక్కని దృష్టాంతం.
స్వప్న సందేశం:
శాంతాక్రజ్ లో నిర్మించిన దేవాలయంలో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఎం.డబ్ల్యు. ప్రధాన్ సంకల్పించి దానికి బాబాని ఆహ్వానించమని షిరిడీలో ఉన్న నాపేరు మీద బాబాకు ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరంలోని విషయమంతా నేను బాబాకు వివరించి చెప్పాను. బాబా దానికి సమ్మతించారు. బాబా అంగీకరించారని తెలుపుతూ నేను ప్రధాన్ కి ఉత్తరం వ్రాశాను. అదేరోజు ప్రధాన్ మరదలు శ్రీమతి థాయిబాయికి స్వప్నం వచ్చింది. ఆస్వప్నంలో ఆమెకు ఎవరో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నట్లుగా కనపడింది. మరుసటిరోజు ఉదయాన్నే ఆమె తనకు వచ్చిన స్వప్న వృత్తాంతం అందరికీ చెప్పింది. కొంతసేపటి తరువాత ప్రధాన్ కి నేను రాసిన ఉత్తరం అందింది. ఆవిధంగా బాబా తన సమ్మతిని నాఉత్తరం చేరడానికి ముందే ఎలా తెలియచేసారో చూపించి అతని నమ్మకాన్ని మరింతగా బలపరిచారు.
ఊదీమందు:
ఒకసారి నేను ఆఫీసులో పని చేసుకుంటున్నపుడు నాస్నేహితుడు వచ్చి తనకు గత 8 రోజులనుంచి ఒక్క నిమిషం కూడా నిద్ర పట్టడం లేదని చెప్పాడు. డాక్టరు యిచ్చిన మందులు కూడా పని చేయలేదని తన బాధను వెళ్ళబోసుకున్నాడు. అప్పుడు నేను షిరిడీనుంచి తెచ్చిన ఊదీని అతనికిచ్చి వరుసగా మూడు రోజులు పడుకోయేముందు పెట్టుకోమని చెప్పాను. మరునాడు అతను వచ్చి ఊదీ పెట్టుకుని పడుకోగానే గాఢమైన నిద్ర పట్టిందని సంతోషంగా చెప్పాడు. బాంద్రాలో నాకు మరొక మిత్రుడు ఉన్నాడు. అతడు కూడా రెండు మాసాలుగా నిద్రలేమితో బాధ పడుతున్న తన కుమారుడిని షిరిడీకి తీసుకొని వచ్చాడు. షిరిడీ వచ్చిన రోజు రాత్రే ఆ అబ్బాయి ఎటువంటి సమస్య లేకుడా షిరిడీలో ప్రశాంతంగా నిద్రపోయాడు.
ఉపవాసాలు వ్యర్ధం:
బాబా మీద నాహృదయంలో నిండి ఉన్న ప్రేమ భక్తి వల్ల, షిరిడీ నాకు శాశ్వత స్థానమయింది. ఒకరోజు యిక జీవితాంతము రాత్రిపూట ఉపవాసం ఉందామని నిశ్చయించుకొన్నాను. ఈవిషయం నేను వాడాలో (దీక్షిత్ వాడా) అందరికీ చెప్పాను. ఆరోజున మధ్యాహ్న్న ఆరతి తరువాత బాబా నన్ను ఈరోజు రాత్రికి భోజనానికి ఏమి చేసుకుం టున్నావని అడిగారు. "మీరు ఏది చేయమంటే అది చేసి వడ్డిస్తానని" జవాబిచ్చాను. "మామూలే, పప్పు, పోళీ (చపాతి, రొట్టె)" అన్నారు బాబా. అయితే రాత్రి భోజనానికి ఆవంటకాలు తయారు చేసి ద్వారకామాయిలో నైవేద్యానికి ఇక్కడికి తీసుకురమ్మంటారా అని అడిగాను. "తయారు చేసిన వంటకాలు అక్కరలేదు. నైవేద్యం పెట్టుకుని అక్కడే వాడాలోనే తిను అన్నారు. "మీకోరిక ప్రకారం ఈరోజు రాత్రి భోజనం చేస్తాను, కాని రేపటినుంచి రాత్రిపూట ఏమీ తినకూడదని నిర్ణయించుకున్నాను" అని చెప్పాను. బాబా ఆసమయంలో నాకు సమాధానం ఇవ్వలేదు.
మరునాడు ఉదయం మరలా బాబా ముందురోజు రాత్రిలాగే నైవేద్యం పెట్టుకుని భుజించమని చెప్పారు. అప్పుడు బాబాకు ఉపవాస దీక్ష అంగీకారం కాదని అర్ధమయి ఉపవాస దీక్షను విరమించుకొన్నాను. ఆతరువాత బాబా నన్ను రాత్రి భోజనం గురించి అడగలేదు ఎందుకంటే నా దీక్షను ప్రక్కకు పెట్టి ప్రతిరోజు రాత్రి భోజనం చేయడం మొదలు పెట్టాను.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment