10.11.2014 సోమవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గృహస్థులకు సాయి సందేశాలు - 5వ.భాగం
ఆంగ్ల మూలం : సాయి బా ని స శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
హైదరాబాద్
ఈరోజు సాయిబానిస గారు చెపుతున్న గృహస్థులకు సాయి సందేశాలను వినండి.
ముందుగా సాయి ప్రేరణ 3వ.వాక్యం
ఒక్కసారి నాకొరకు బాధను భరించి చూడు, నిన్ను అమితమైన ప్రేమతో ఆశీర్వదిస్తాను.
భార్యమాటను భర్త గౌరవించాలనే విషయం మనకు శ్రీసాయి సత్ చరిత్ర 29వ.అధ్యాయంలో మదరాసు భజన సమాజంవారి విషయంలో తెలుస్తుంది. భార్య శ్రీసాయిని శ్రీరామచంద్రునిగా చూడగలిగానని భర్తతో చెప్పినపుడు, భర్త ఆమెను అవమానించాడు. బాబా తనికి కలలో కనిపించి, భార్యను అవమానించడం మంచి పధ్ధతి కాదని తెలియచేశారు.
అలాగే శ్రీసాయిసత్ చరిత్ర 33వ.అధ్య్లాయంలో అప్పాసాహెబ్ కులకర్ణికి భార్య చెప్పిన విషయం. శ్రీసాయి ఫకీరు రూపంలోనే తన యింటికి వచ్చినపుడు ఒక రూపాయి దక్షిణ యిచ్చినట్లు భర్తకు చెప్పింది. భర్త, భార్య మాటపై గౌరవంతో, ఆఫకీరు గురించి చిత్రే అను స్నేహితునితో కలిసి వెదకడానికి బయలుదేరాడు. ఆఫకీరును ఠాణా పట్టణంలో వెదకి కనుగొన్నాడు. ఆఫకీరును కలిసి పదిరూపాయలు దక్షిణ యిచ్చిన సంగతి మనకు తెలుసు. ఈసంఘటనల ద్వారా భార్యమాటలను భర్త గౌరవించాలనే విషయాన్ని శ్రీసాయి మనకు తెలియచేశారు.
భార్య భర్తలిద్దరూ పెళ్ళినాడు చేసిన ప్రమాణాలను జీవితంలో ఆచరణలో పెట్టాలనే విషయం శ్రీసాయి సత్ చరిత్ర 34వ.అధ్యాయంలో వివరింపబడింది.
శ్యామా (మరదలు) సోదరుడయిన బాపాజీ భార్య ప్లేగు వ్యాధితో బాధపడుతున్నపుడు, రాత్రివేళ బాపాజీ శ్యామా వద్దకు వచ్చి బాబా సహాయాన్ని కోరాడు. ఆవిషయం సాయి తెలుసుకొని బాపాజీకి అతని భార్య పట్ల ఉన్న బాధ్యతకు సంతోషించి ఊదీనిచ్చి పంపేశారు.
శ్యామాతో ఉదయం వెళ్ళి మరదలను చూసి రమ్మని చెప్పారు. ఈవిషయంద్వారా మనకి భార్య అనారోగ్యంతో ఉన్నపుడు, అది అర్ధరాత్రయినా సరే భర్త తన బాధ్యతను గ్రహించి ఆమె ఆరోగ్యం కోసం పాటుపడాలనె విషయం విశదంగా తెలుస్తుంది.
ఇంతవరకు మనం వైవాహిక జీవితంలో భర్తకు ఉన్న బాధ్యత భార్యకు ఉన్న బాధ్యతలను గురించి తెలుసుకొన్నాము. ఇపుడు మనం శ్రీసాయి సత్ చరిత్రలో తల్లిదండ్రుల యెడల పిల్లల బాధ్యతలు గురించి తెలుసుకొందాము. శ్రీసాయి సత్ చరిత్ర 13వ.అధ్యాయాన్ని ఒకసారి గమనిద్దాము. హార్దా నివాసి దత్తపంత్ 14సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతూ సాయిని యిలా ప్రార్ధించాడు. "బాబా ఈ కడుపునొప్పిని నేను భరించలేకుండా ఉన్నాను. నేనెవరినీ హింసించలేదు. నాతల్లిదండ్రులను కూడా నేనెప్పుడూ అవమానించలేదు. అటువంటప్పుడు ఎందుకు నాకీ బాధ వచ్చింది. నన్ను రక్షించు బాబా" అన్నాడు.
దీనివల్ల మనం తెలుసుకోవలసిన విషయం, మనము మన తల్లిడండ్రులను అవమానించరాదు.
పాండురంగని చరిత్రలో పుండలీకుడు యవ్వనంలో తల్లిదండ్రులను హింసించాడు. దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించాడు. ప్రాయశ్చిత్తంగా తల్లిడండ్రుల సేవ చేసుకొని పాండురంగ విఠలుని అనుగ్రహాన్ని పొందాడు.
ఈసంఘటనల వల్ల మనం తెలుసుకోవలసినదేమిటంటే తల్లిదండ్రుల పట్ల పిల్లలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
పెద్దలయెడల మనము వినయవిధేయతలతో వారిని సేవించుకోవాలి. మరణించిన తల్లిదండ్రులకు వారి కుమారులు యధావిధిగా ఉత్తరక్రియలు జరిపించాలి. ప్రతి సంతత్సరము కూడా వారికి శ్రాధ్ధక్రియలు చేయాలి. దీనికి సంబంధించిన విషయం మనకు శ్రీసాయి సత్ చరిత్ర 9వ.అధ్య్లాయంలొ కనిపిస్తుంది. బాబా సూచించిన ప్రకారం గోవింద ఆత్మారాం మాన్ కర్ 1915వ.సంవత్సరంలో షిరిడీ వెళ్ళి తన తండ్రికి ఉత్తర క్రియలు చేసి బాబా ఆశీర్వచనాలు పొందాడు. 35వ.అధ్యాయంలో బాలాజీ పాటిల్ నెవాస్కర్ కుమారుడు తన తండ్రి చనిపోయినపుడు తండ్రికి కర్మకాండలు యధావిధిగా చేశాడు. శ్రీసాయి సత్ చరిత్ర 45వ.అధ్యాయంలో భగవంతరావు క్షీరసాగర్ చనిపోయిన తన తండ్రికి ప్రతి సంవత్సరం శ్రాధ్ధం పెట్టడం మానివేసినప్పుడు శ్రీసాయి వానిని మందలించి అతని చేత శ్రాధ్ధం పెట్టించారు.
తల్లిదండ్రుల మాటలను పిల్లలు గౌరవించి వారి మంచి పనులను మనం పూర్తి చేయాలి. తల్లిదండ్రులు ప్రారంభించిన మంచి పనులను పిల్లలు పూర్తిచేయాలన్న విషయాలు మనకు శ్రీసాయి సత్ చరిత్ర 40వ.అధ్యాయంలో కనిపిస్తుంది.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment