06.10.2015 మంగళవారం
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీ జీ.ఎస్. కపర్డె గురించి మరికొంత సమాచారం తెలుసుకుందాము. సమాచారం చివరలో కపర్డే గారి డైరీలనుండి జనవరి, ఫిబ్రవరి, నెలలలో మూడు రోజులలో ఆయన వ్రాసుకున్న విషయాలను కూడా ప్రచురించాను. బాబా ఆయనను షిరిడీ విడిచి వెళ్ళవద్దని చెప్పిన విషయాలు, మనకి సాక్ష్యాలు.
బాబా భక్తులు
శ్రీ జీ.ఎస్.కాపర్డే - 3 (మూడవభాగం)
కపర్డే ఇచ్చిన బహిరంగ ఉపన్యాసాల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆయన మీద దేశద్రోహ నేరం మోపి శిక్షించబోతోందని బాబాకు తెలుసు. కపర్డే 6, డిసెంబర్ 1911 సంవత్సరంలో షిరిడీ వచ్చారు. ఆసమయంలో కపర్డే గారిని ప్రభుత్వం అరెస్టు చేయడం తధ్యమని బాబాకు తెలుసు. బాబా కపర్డే గారిని షిరిడీ నుంచి వెళ్ళడానికి అనుమతినివ్వలేదు. బాబా ఆజ్ఞప్రకారం కపర్డే షిరిడీలో 15, మార్చ్, 1912 వరకు అంటే 101 రోజులు ఉండిపోయారు. షిరిడీలో కపర్డే గారి కదలికలపై నిఘా ఉంచి తమకు అన్ని వివరాలు పంపించమని ప్రభుత్వం నటేకర్ ని గూఢచారిగా షిరిడీకి పంపించింది.
నటేకర్ స్వరం ఎంతో మృదు మధురంగా ఉండేది. అది ఆయనకు భగవంతుడిచ్చిన వరం. ఆయనలో ఉన్న పవిత్రత, మృదువైన భాషణం వీటివల్ల నటేకర్ ను హంస, స్వామి/సాధువు అని పిలిచేవారు. తను హిమాలయాలను దర్శించి అక్కడ కొన్నాళ్ళు ఉన్నట్లు కూడా చేప్పేవాడు. అందుచేతనే అతను కపర్డే ఇంగ్లాండులో ఉన్నపుడు వారి యింటికి వెళ్ళి, వారి కుటుంబ సభ్యుల అతిధి సత్కారాలను అందుకున్నాడు. ఆవిధంగా నటేకర్ ఒక సాధువులా షిరిడీలో అడుగుపెట్టి అక్కడే మకాం ఏర్పరచుకున్నాడు. షిరిడీలోని ప్రజలందరితో కలిసిమెలసి తిరుగుతూ కపర్డే గురించి సమాచారం తెలుసుకోవడానికి రాధాకృష్ణమాయితో కూడా సన్నిహితంగా మెలగసాగాడు. తనెవరన్నది చాలా రహస్యంగా ఉంచాడు. కపర్డే తాను వ్రాసుకున్న డైరీలను భద్రంగా తాళం వేసి ఉంచారు. 1913వ.సంవత్సరంలో ఆయన ఇంటిలోనుండి ఆయన డైరీలు తస్కరింపబడ్డాయి. ఆ డైరీలు బ్రిటిష్ ప్రభుత్వం వారికి చేరాయి. బ్రిటిష్ ప్రభుత్వం ఆడైరీలను క్షుణ్ణంగా శోధించారు. వాటిలో కపర్డేపై నేరారోపణ చేయడానికి ఎటువంటి సమాచారం, వ్రాతలు లేకపోవడంతో వాటిని మరలా ఆయన యింటికే చేర్చేశారు. ఈసంఘటన తరువాతనే నటేకర్ గూఢచారనే విషయం కపర్డేకు అర్ధమయింది. తన గురించి సమాచారం సేకరించడానికే అతను ఒక సాధువులా తన యింటిలోకి ప్రవేశించాడని అర్ధం చేసుకున్నారు. కపర్డే తన న్యాయవాద వృత్తిలో లీగల్ కేసులను (చట్టపరమయినవి) కూడా అంగీకరించటంలేదనే నిర్ణయానికి వచ్చాడు నటేకర్. అంతేకాదు ఎంతో ఆదాయాన్ని ఆర్జించి పెట్టే క్రిమినల్ కేసులను కూడా వదలుకోవడంతో ఆయన వద్దకు క్లయింటులు కూడా రావడం మానుకున్నారు. కపర్డే పూర్తిగా తనన్యాయవాద వృత్తిని వదిలేశారు . ఇటువంటి పరిస్థితులలో కపర్డె ఒక పిచ్చి ఫకీరు మాయలో పడి సమాజానికి దూరమయి తనకు వచ్చే కేసులన్నిటినీ వదలుకుంటున్నారని ఆయన మీద పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లు బొంబాయి, చుట్టుప్రక్కల అన్ని ప్రాంతాలు, ఆఖరికి విదేశాలకు కూడా వ్యాపించాయి. షిరిడికి వచ్చిన తరువాత అక్కడినుండి ఎప్పుడు బయలుదేరదామా అని కపర్డె ఆతృతగా ఎదురు చూస్తుంటే వెళ్ళనివ్వకుండా బాబా అక్కడే ఉంచేశారు. ప్రతిరోజు ఎప్పటికప్పుడు బాబా అనుమతినిస్తారని ఎదురు చూస్తూ ఉండేవారు. కాని బాబా కావాలనే ఆయనని అక్కడే ఉంచేశారు.
1912 వ సంవత్సరం జనవరినుంచి ఆయన వ్రాసుకున్న డైరీలను పరిశీలిస్తే మనకు దీనికి సంబంధించిన ఋజువులు స్పష్టంగా కనిపిస్తాయి. నటేకర్ తనను ఫిబ్రవరి నెలాఖరుకు అమరావతికి రమ్మని ఉత్తరం వ్రాశాడని కప్ర్డే 19.02.1912 న తన డైరీలో వ్రాసుకున్నారు. 23.02.1912 ఆయన తన డైరీలో వ్రాసుకున్న ప్రకారం అమరావతి తిరిగి వెళ్ళడానికి కపర్డే కి అనుమతినివ్వమని శ్యామా ఆయన తరపున బాబా ని అడిగాడు. కాని బాబా, ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవని అతను యింకా మరికొన్ని నెలలు షిరిడీలోనే ఉండాలని చెప్పారు. నటేకర్ చేస్తున్న ప్రయత్నాలన్నీ బాబాకు తెలుసు. కపర్డే మీద చెలరేగిన వదంతులన్నీ బ్రిటిష్ వారి చెవిన పడ్డాయి. అంతే కాక కపర్డేలోను, ఆయన జీవన విధానంలోను ఒక్కసారిగా వచ్చిన ఈ అనూహ్యమైన మార్పును గమనించి, బ్రిటిష్ వారు ఆయనపై పెట్టిన నిఘాను ఉపసంహరించుకోవడానికి నిర్ణయించుకున్నారు. కపర్డేని రక్షించడానికి ప్రభుత్వంవారి ఆలోచనలనే మార్చి వేసిన బాబాకి ఏదీ అసాధ్యమన్నది లేదు. ఆ విధంగా బాబా తన అనుగ్రహంతో పడబోయే శిక్ష నుండి కపర్డేను రక్షించారు. కపర్డే కుమారుడు బాలకృష్ణ 1962 వ. సంవత్సరంలో కపర్డే జీవిత చరిత్రలో ఈవిషయాలన్నిటినీ పొందుపరిచారు.
(బాబా కపర్డెను శిరిడీ విడిచి వెళ్ళవద్దని చెప్పిన విషయాలు - కపర్దే డైరీ)
01.01.1912
నేను ప్రొద్దున్నే లేచి కాకడ హారతికి చావడికి వెళ్ళాను. ముందుగా సాయి మహరాజు ముఖం చూచాను. అది మధురమైన తేజస్సుతో ఉంది. నాకు చాలా ఆనందం కలిగింది. మేము వాడాకు తిరిగి వచ్చాక ఉపాసనీ సోదరుడు కన్పించాడు. ఆయన ధూలియా నుండి వచ్చాడు. నేను ఆయనను ఇంతకు ముందే పూనాలోను, అమరావతిలోనూ చూచాను. ఆయన సాయి మహరాజు దర్శనానికి వెడితే వారు ప్రతి మనిషినీ ఏదో ఒక పూర్వ జన్మ బంధం కలుపుతుంటుందని చెప్పారు. తాము, బాపూ సాహెబ్ జోగ్, దాదా కేల్కర్, మాధవరావ్ దేశ్ పాండె, నేనూ, దీక్షిత్ ఏదో ఒక విడదీయరాని అనుబంధంతో కలిసి ఉన్నామనీ, అక్కడ ధార్మిక గురువు ఉన్నారనీ అతను తనను మళ్ళీ దగ్గరకు తెచ్చాడనీ చెప్పారు.
నేను ఆయన బయటకు వెడుతుండగా చూచి, రామాయణం చదువుకొంటూ కూర్చున్నాను. మధ్యాహ్న హారతి సమయమంలో సాయి దర్శనం చేసుకున్నాను. ఆయన ఆదరంగా మాట్లాడారు. దీక్షిత్ ఇవ్వేళ మా అందరికీ నైవేద్యం ఏర్పాటు చేసాడు. అందరి భోజనాలూ ఆయన దగ్గరే జరిగాయి. వైద్య, నానాసాహెబ్ చందోర్కర్, దహను మామ్లతాదారైన దేవ్ అందరం కూర్చొని మాట్లాడుకొన్నాం. సాయి మహరాజును చూడటానికి వెళ్ళినపుడు ఆయన అందరితోపాటు నన్ను కూడా వెళ్ళిపొమ్మన్నారు మొదట. కానీ నన్ను వెనక్కు పిలిచి, "నువ్వు పారిపోవడానికి తొందర పడుతున్నావేం?" అన్నారు. సాయంత్రం చావడి ఎదురుగాాఆయన దర్శనం అయింది. రాత్రి భీష్మ భజన, దీక్షిత్ రామాయణ పఠనం జరిగాయి. భజనకు బాలాషింపీ కూడా వచ్చాడు.
19.02.1912
దీక్షిత్, అతని భార్య, మాధవరావు, హీరాలాల్ యింకా యితరులూ ప్రొద్దున్నే వెళ్ళిపోయారు. దీక్షిత్ కుటుంబం తమ కొడుకు ఉపనయనానికి నాగపూర్ వెడితే మాధవరావు తన మిత్రుడింట్లో అలాటి ఉత్సవానికే హార్దా వెళ్ళాడు. ప్రార్ధన తరువాత పంచదశి క్లాసు నడిచింది. మోర్ గావ్ కర్ తన గొలుసు, గడియారం పోయినాయన్నాడు. అవి రెండూ బంగారపువీ, చాలా విలువైనవీను. వెదికారు గానీ దొరకలేదు. సాయిబాబా బయటికి వెళ్ళటం, తిరిగి రావటం కూడా చూచాము. మధ్యాహ్న హారతి మామూలుగా నడిచింది.
ఒకటికి బదులు రెండు చామరాలు వచ్చాయి ఈవేళ. బాలాసాహెబ్ పూజ చేసుకొన్నాక హారతికి కూడా ఉందామనుకున్నాడు గానీ బాబా ఆయనను వెళ్ళిపొమ్మన్నారు. భోజనానంతరం కాస్సేపు పడుకొని లేచాక పంచదశి క్లాసు మా మామూలు సభ్యులతో నడిచింది. కొంతసేపటి తర్వాత దాదాకేల్కర్, బాలాషింపీ తదితరులు వచ్చారు. సాయి మహరాజును సాయంత్రం వ్యాహ్యాళి వేళ దర్శించుకొన్నాము. వాడా ఆరతి తరువత శేజారతికి వెళ్ళాము కృత్రిమ తోటలు, చందమామ మొదటిసారి ఉపయోగించబడినపుడు చాలా అందంగా ఉండి ఓ పెద్ద గుంపును ఆకర్షించాయి. సాయి సాహెబ్ కు అవి నచ్చనట్లేమీ లేదు. చందమామ (సహాయకంగా) నే పనికి వచ్చేటట్లుగానే ఉందనిపించింది నాకు. భీష్మ భాగవతం, దాస బోధలో పది సమాసాలు చదివాడు. నటేకర్ అలియాస్ హంస నేను యీ నెలాఖరుకు అమరావతికి రావలసి ఉందని నాకు ఉత్తరం వ్రాసాడు.
23.02.1912
నేను మామూలుగానే లేచి ప్రార్ధన తరువాత పంచదశి క్లాసుకు వెళ్ళాను. మామూలు సభ్యులే కాక, నాసిక్ నుంచి వచ్చిన శ్రీమతి సుందరాబాయి కూడా వచ్చింది. బాబా బయటికి వెళ్ళటం, తిరిగి లోనికి రావడం కూడా చూచాము. మసీదులో బాబా నాకో కధ చెప్పారు. ఆయన యవ్వనంలో ఉన్నపుడు ఒక ఉదయం బయటికి వెళ్ళి ఆడపిల్లగా మారి కొన్నాళ్ళు అలాగే ఉండిపోయారట. ఇంతే చెప్పారు. ఎక్కువ వివరాలివ్వలేదు. మధ్యాహ్న హారతి మామూలుగా నడిచిపోయింది. ఇవ్వేళ పూజకు చాలా మంది వచ్చారు. మధాహ్న భోజనం, విశ్రాంతి తరువాత పంచదశి నడిచింది. మాధవరావు నేను అమరావతి మరలి వెళ్ళటం గురించి బాబాను అడిగాడు. నాకు రోజులు అనుకూలంగా లేవనీ, మరి కొన్ని నెలలు నేనిక్కడే ఉండాలనీ జవాబు వచ్చింది. మేము సాయిబాబాను సాయంత్రం నడకలోను, వాడా హారతి తరువాత దర్శించుకొన్నాము. శేజారతి తరువాత భీష్మ భాగవతం, దాస, బోధ చదివాడు.
(తరువాయి భాగం రేపటి సంచికలో)
(సర్వమ్ శ్రీ సాయినాదార్పణమస్తు)
1 comments:
Hi
Post a Comment