21.12.2015 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు ముక్కోటి
ఏకాదశి, గీతా జయంతి. ఈ సందర్భంగా భగవద్గీతలోని
ఒక శ్లోకమ్ తో మొదలు పెడదాము.
భగవద్గీత పదవ
అధ్యాయం – విభూతియోగము – 9వ.శ్లోకమ్
మచ్చిత్తా మద్గతప్రాణా
బోధయంతః పరస్పరమ్
కధయంతశ్చ మాం
నిత్యం తుష్యంతి చ రమంతి చ
*నా భక్తులు నా యందే
తమ మనస్సులను లగ్నమొనర్తురు. తమ ప్రాణములను,
తమ కర్మలన్నింటిని, తమ సర్వస్వమును నాకే అంకితమొనర్తురు. వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్త్వమును గూర్చి
ఒకరికొకరు తెలుపుకొనుచు , కధలు కధలుగా చెప్పుకొనుచు, నిరంతరము సంతుష్టులగుచుందురు. మరియు వారు సంతతము నాయందే రమించుచుందురు.
శ్రీ షిరిడీ
సాయి వైభవమ్ - బాబా లీలలు ఊహించలేనివి
1910 వ.సంవత్సరంలో
షిరిడీలో కాకా దీక్షిత్, లక్ష్మణ్ భట్ కి చెందిన కొంత పొలం కొందామనుకున్నాడు. భట్ దాని ఖరీదు రెండువందల రూపాయలు చెప్పాడు. దీక్షిత్ అంత ధర చెల్లించడానికిష్టపడలేదు. నూటయాభై రూపాయలయితే దానికి సరయిన ధర అని భావించాడు. భట్ ని ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు కాని భట్
మొండిపట్టుదలతోనే ఉన్నాడు. దీక్షిత్ రాజీ పడదల్చుకోలేదు.
ఇద్దరి మధ్యా
చాలా సేపు చర్చలు జరిగాయి. ఆ రోజు మధ్యాహ్నం
భట్ ద్వారకామాయి వద్దనుండి వెడుతుండగా, బాబా అతనిని పిలిచి “దీక్షిత్ కి నీకు మధ్య
వాదోపవాదాలు చర్చ జరిగింది దేని గురించి” అని అడిగారు. భట్ బాబాకి జరిగినదంతా వివరంగా చెప్పాడు. “నువ్వు ఆ భూమిని నూట డభై అయిదు రూపాయలకు అమ్ము”
అని ఆవిషయాన్ని పరిష్కరించారు. భట్ డబ్బు వసూలు
చేసుకోవడానికి దీక్షిత్ దగ్గరకు వెళ్ళాడు.
భట్ కి, భాబాకి మధ్య జరిగిన విషయం, ఒప్పందం ఏమీ తెలియని దీక్షిత్ తాను ముందరే
చెప్పిన ధర ప్రకారం నూటయాభై రూపాయలు ఇచ్చాడు.
భట్ కూడా బాబా ఖరారు చేసిన మొత్తం ఎంతన్నది దీక్షిత్ కి చెప్పలేదు. దీక్షిత్ ఇచ్చిన డబ్బు లెక్కపెట్టకోకుండానే తీసుకుని
ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తరువాత
ఒకసారి డబ్బు లెక్క చూసుకున్నాడు. మళ్ళీ మళ్ళీ
లెక్కపెట్టాడు. లెక్కపెట్టగా బాబా నిర్ణయించిన
ధర ఎంతయితే ఉందో సరిగ్గా అంటే నూటడభై అయిదు రూపాయలు ఉంది.
అదనంగా లభించే
ఫొటో అయినా సరే, ధనమయినా సరే బాబా తన భక్తులు తృప్తి చెందే విధంగా వారిని అనుగ్రహిస్తారు.
*----*
రామచంద్ర మహరాజ్
గురువు గాడ్గే మహరాజ్ గారు. ఆయన తాను చేయబోయే యజ్ఞానికి ఒక రోజుకయే ఖర్చును
సమర్పించమని రామచంద్ర మహరాజ్ గారిని కోరారు.
రామచంద్ర మహరాజ్ కీర్తనలు పాడుకుంటూ బేలాపూర్, దాని చుట్టుప్రక్కల ప్రదేశాలకు
తిరుగుతూ వెళ్ళారు. ముందుగా అంచనా వేసుకున్న
ఖర్చుకన్నా ఇంకా ఎక్కువ మొత్తానికి వాగ్దానాలు వచ్చాయి. అందుచేత ఆయన చాలా నిశ్చింతగా ఉన్నారు. కొద్ది రోజుల తరువాత ఇస్తామని మాటిచ్చిన దాతల వద్దకు
డబ్బు వసూలు చేసుకోవడానికి వెళ్ళారు. కాని
ఇస్తానని చెప్పిన వాళ్ళెవరూ సొమ్ము ఇవ్వకపోవడంతో చాలా నిరాశ చెందాడు. అందరూ ఇవ్వకుండా తప్పించుకున్నారు. తన గురువుకు ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలో దీనినెలా
పరిష్కరించాలా అనే ఆలోచనలో పడ్డాడు. సహాయం
చేయమని బాబాని మనస్ఫూర్తిగా ప్రార్ధించాడు.
మరుసటిరోజు రామచంద్ర మహరాజ్ కీర్తనలు
పాడుతూ ఉండగా ఒక భక్తుడు వచ్చి వంద రూపాయలు సమర్పించాడు. ఆయన తన గురువుకు ఎంతయితే ఇస్తానని మాటిచ్చాడో సరిగా
అంతే సొమ్ము లభించింది.
ఈ సంఘటన వల్ల
బాబా మీద ఆయనకున్న విశ్వాసం మరింతగా పెరిగిందని చెప్పారు.
*(అందుచేత మన సాయిభక్తులందరూ కూడా మన సాయిమీదే మనసు లగ్నం చేసి ఆయన కధలను, లీలలను, ఆయన చేసిన చమత్కారాలను ఒకరికొకరం చెప్పుకుంటూ, పంచుకుంటూ మన భక్తిని మరింతగా ధృఢ పరచుకొందాము . ఓమ్ సాయిరామ్)
(షిరిడీ సాయి వారి మరికొన్ని వైభవాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment