16.01.2016 శనివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సంక్రాంతి పండుగను బాగా జరుపుకొన్నారా? పండగల హడావిడి వల్ల రెండురోజులుగా డైరీలోని విషయాలను ప్రచురించటానికి కుదరలేదు. బాబా అనుగ్రహంతో మీరందరూ కూడా బంధు మిత్రులతో కుటుంబ సభ్యులతో పండగ సంబరాలు చేసుకున్నారు కదా. ఈ రోజు ఖపర్డే గారి డైరీలొని మరికొన్ని విశేషాలు చదవండి.
శ్రీ జీ.ఎస్.ఖపర్డే
డైరీ- 23
20.01.1912 శనివారమ్
ఇక్కడున్నవారందరిలాగానే
సూర్యోదయానికి ముందుగానే ప్రార్ధనలు పూర్తిచేసుకొని, నా దినచర్యను ప్రారంభించడానికి ఉదయాన్నే
సరయిన సమయానికి లేచాను. ఈ రోజు చాలా అనందకరంగా
ఉండేటట్లనిపించింది, ఆ విధంగానే ఉంది. బాపూ
సాహెబ్ జోగ్, ఉపాసనీ, రామమారుతిలతో కలిసి పరమామృతం చదివాను.
భీష్మకి, మా అబ్బాయి బల్వంత్ ఇద్దరికీ అనారోగ్యంగా
ఉంది. సాయి మహరాజ్ బయటకు వెళ్ళేటప్పుడు, తిరిగి
వచ్చేటపుడు దర్శించుకున్నాము. ఆయన ఉల్లాసంగా
కబుర్లు చెబుతూ కూర్చున్నారు. ఇక్కడ పరిసరాలలో
ఒక గ్రామానికి ప్రస్తుత జాగీర్దార్ ఒకతను వచ్చాడు. సాయిబాబా అతనిని కాస్తంత కూడా పూజ చేసుకోనివ్వకపోవడమే
కాకుండా, దగ్గరకు కూడా రానివ్వలేదు.
ఎంతో మంది
మధ్యవర్తిత్వం చేసినా గాని లాభం లేకపోయింది.
అప్పాకోతే, ఆఖరికి మామూలుగా చేసే పూజనయినా పూజించుకోవడానికి సమ్మతించమని తన
శక్తివంచన లేకుండా ప్రయత్నించాడు. సాయిబాబా
దయతలచి అతనిని మసీదులోని ధుని వద్ద ఉన్న స్థంభానికి పూజ చేసుకోమని అనుమతించారు. కాని, ఊదీ ఇవ్వనన్నారు.
సాయిబాబాకు కోపం వస్తుందనుకున్నాను కాని రాలేదు. మధ్యాహ్న ఆరతి ఎప్పటిలాగే జరిగింది. అన్ని వేళలలోను అన్ని ఆరతులను ఇమ్మని బాపూసాహెబ్
జోగ్ ను సాయిబాబా ఆజ్ఞాపించారు. మేఘా చనిపోవడానికి
రెండు రోజుల ముందే నీనిది ఊహించాను. మధ్యాహ్నం
భోజనమయిన తరువాత వార్తా పత్రికలు చదువుతూ కూర్చున్నాను. ఖాండ్వాలో ప్రాక్టీస్ చేస్తున్న దీక్షిత్ తమ్ముడు
ఈ రోజు ఉదయం వచ్చాడు. అతని బొంబాయి ఏజెంట్
మధ్యాహ్నం వచ్చాడు. దీక్షిత్ తమ్ముడు అన్నగారిని
తిరిగి తీసుకుని వెళ్ళడానికి ఎంతగా నచ్చచెప్పి చూసినా లాభం లేకపోయింది. అతను సాయిబాబాకి విన్నవించుకున్నాడు. కాని, సాయిబాబా విషయాన్నంతటినీ దీక్షిత్ ఇష్టానికే
వదిలేశారు. బాపూ సాహెబ్ జోగ్ కి కూడా నలుగురు
అతిధులు వచ్చారు. సంగ్లీలో ప్రధాన కోశాధికారిగా
ఉన్న అతని మరదలి భర్త ఢిల్లీ దర్బారు నుండి తిరిగి వెడుతూ మొత్తం కుటుంబంతో సహా ఇక్కడికి
వచ్చాడు. అతని భార్య బాపూసాహెబ్ జోగ్ భార్యని
తనతో తీసుకుని వెడదామనుకుంది కాని సాయి మహరాజ్ అనుమతించలేదు. సాయి మహరాజ్ సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళేటప్పుడు
ఆయన దర్శనం చేసుకున్నాము. వాడాలో ఆరతి, ఆ తరువాత
శేజ్ ఆరతులు జరిగాయి. ఎప్పటిలాగానే దీక్షిత్
రామాయణం చదివాడు. భీష్మకి అస్వస్థతగా ఉండటంతోను,
మా అబ్బాయి బల్వంతు మరికాస్త ఎక్కువగా అనారోగ్యంగాను ఉండటంవల్ల భజన జరగలేదు. మోరేశ్వర్ జనార్ధన్ పఠారే తన భార్యతో ఇక్కడే ఉన్నాడు. అతను పక్షవాతంతో చాలా బాధపడ్డాడు. వసాయికి చెందిన జోషి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ పాడుతున్న ప్రార్ధన పాటల అచ్చు కాగితాలను
కొన్ని తెచ్చాడు.
22.01.1912 సోమవారమ్
ప్రొద్దున్నే
తొందరగా లేచి ప్రార్ధన చేసుకున్నాను. సదాశివరావు
దీక్షిత్, హరాలాల్, రామమారుతి , మొదటి ఆయనకి సంబంధించిన స్త్రీలు, పిల్లలు బాబు, మేమంతా
సుభి అని పిలిచే సుభద్ర అందరు వెళ్ళిపోయారు.
వారికి క్రితం రోజు రాత్రే అనుమతి లభించింది. నా దినచర్యను ప్రారంభించాను. బాపూసాహెబ్ జోగ్, ఉపాసనీ, భీష్మలతో కలిసి పరమామృతం
చదివాను. భీష్మ ఈరోజు కాస్త మెరుగ్గా ఉన్నాడు. మా అబ్బాయి బల్వంతుకు ఈ రోజు ఉదయం రెండు విరోచనాలయ్యాయి. దాని వల్ల అతనికి శరీరం తేలికయ్యి ఆరోగ్యం బాగా కుదుట పడుతుంది. సాయి మహరాజ్ బయటకు వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్నాము. పూజా సమయంలో ఆయన రెండు పువ్వులను రెండు ముక్కు రంధ్రాలలోను, రెండు చెవుల వెనకాల, ఒకటి తలమీద పెట్టుకున్నారు.
నేనిది మాధవరావు దేశ్ పాండే చెబితే గమనించాను. ఇది దేనికో సూచన అనుకున్నాను. సాయిబాబా రెండవసారి కూడా ఇదే విధంగా చేశారు. నామనసులో దాని గురించి అర్ధం చేసుకున్నపుడే ఆయన నాకు చిలుము ఇచ్చారు. నాకర్ధమయిన భావాన్ని అది ధృఢపరిచింది. ఆయన ఏదో చెప్పారు. దాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలని ఆయన చెప్పిన తక్షణమే గుర్తుంచుకున్నాను కాని, నా మెదడులోనుండి అది జారిపోయింది. రోజంతా ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాలేదు. ఇటువంటి అనుభవం కలగడం ఇదే మొదటిసారి కావడంతో చాలా ఆశ్చర్యపోయాను. సాయిబాబా తన ఆజ్ఞే సర్వోన్నతమయినదని కూడా చెప్పారు. మా అబ్బాయి ఆరోగ్యం గురించి నేనెటువంటి ఆందోళన చెందనవసరం లేదన్న విషయం నాకర్ధమయింది. మధ్యాహ్న ఆరతి పూర్తయి మేము తిరిగి వచ్చేటప్పటికి, మా బస ముందు లక్ష్మీబాయి కౌజల్గీ నిలబడి ఉంది. ఆమెను చూడగానే నాకు చాలా సంతోషం కలిగింది. నేను సాయి మహరాజ్ కు నమస్కరించి బయటకు వచ్చిన వెంటనే ఆవిడ వచ్చారు. అపుడాయన ఆమెను ప్రత్యేకంగా అనుగ్రహించి తనను పూజ చేసుకోనిచ్చారు. భోజనమయిన తరువాత కొద్దిసేపు పడుకున్నాను. దీక్షిత్ రామాయణం చదివాడు. కొన్ని నాధమహరాజ్ కధలు కూడా చెప్పాడు. ఉపాసనీ, లక్ష్మీబాయి కౌజల్గీ కూడా వినడానికి వచ్చారు. మా సంభాషణల్లో ఆవిడ కూడా పాల్గొంది. ఆమెకు వేదాంతం బాగా తెలుసున్నట్లుగా ఉంది. సాయిబాబా సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళేటప్పుడు తిరిగి శేజ్ ఆరతి సమయంలోను ఆయనను దర్శించుకొన్నాము లక్ష్మీబాయి కొన్ని పాటలు పాడింది. ఆమె రాధాకృష్ణమాయికి పినతల్లి (మావషి). నేనడిగిన మీదట ఆమె రాత్రి కొద్దిగా భజన చేసింది. దీక్షిత్ రామాయణం చదివాడు.
(మరికొన్ని విశేషాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment