28.01.2016 గురువారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
బాబా తన భక్తులను ఎప్పుడు ఏక్షణంలో తనవైపుకు లాక్కుంటారో అంతుపట్టదు. కొంతమందికి బాబా అంటే భక్తి లేకున్నా, అసలు పూజించకపోయినా, ఏదో సంఘటన ద్వారా తను ఉన్నాననె విషయాన్ని గ్రహింప చేస్తారు. ఆవిధంగా తనవైపుకు ఆకర్షించుకొంటారు. బాబా ఆచారాలను, ఉపవాసాలను ప్రోత్సహించలేదు...నిష్టతో ఉండమని చెప్పారు. మన మనస్సు పవిత్రంగా లేనప్పుడు ఎన్నిటి ఆచారాలు పాటిస్తే ఏమి లాభం?
ఈ రోజు "ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి" 06.01.2016 సంచికలో ప్రచురింపబడిన ఈ వైభవాన్ని చూద్దాం.
శ్రీ షిరిడీ సాయి వైభవం - ఆత్మ శుధ్ధి లేని ఆచారమదియేల
భార్యాభర్తలిద్దరూ మరదలితో
కలిసి యాత్రలకు బయలుదేరారు. భార్యా భర్తలిద్దరికీ
బాబా అంటే ఎంతో భక్తి. కాని భార్య చెల్లెలికి
(మరదలు) బాబా భక్తురాలు కాదు. వారు రామేశ్వరం
వెడుతూ మధ్యలో మద్రాసులో బస చేశారు.
వారు బస
చేసిన గుజరాతీ ధర్మశాల ఎంతో పరిశుభ్రంగా నిర్వహించబడుతూ ఉంది. కాని మరదలికి బాగా ఛాందస భావాలు ఎక్కువ. మడి ఆచారాలు,
శుచి, శుభ్రత పాటిస్తూ ఉండేది. అక్కడ బస చేయడానికి చాలా బాగున్నా, మడి ఆచారాలు ఏమీ
లేవని అస్తమానూ గొణుగుతూనే ఉండేది. ఆమె అక్క
“ఇక్కడ ఉండటానికి ఇంత బాగున్నా, మడి, ఆచారాలు అంటూ ఇంకా నువ్వు గొణుగుతూనే ఉన్నావు. అదే, షిరిడీ లో నువ్వేం చేస్తావో తలుచుకుంటే నాకు
ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడ ఎంతటి పూర్వాచారపరాయణులయినా
ఎంతో సంతోషంగా సాయిబాబా పాదాలకు తమ శిరసు వంచి
నమస్కరిస్తారు”. అంది. అక్క చెప్పిన
మాటలకు నివ్వెరపడి, "అలాగయితే నీ సాయిబాబాకి నా సాష్టాంగ నమస్కారాలు ఇక్కడినుండే చేస్తాను. నేనక్కడికి రావలసిన అవసరం కూడా లేదు” అంది చెల్లెలు.
ఆ సాయంత్రమే
మరదలికి కాళ్ళలో విపరీతమయిన నెప్పులు పొడుస్తున్నట్లుగా ప్రారంభమయ్యాయి. కొద్ది అడుగులు కూడా వేయలేని పరిస్థితి. కాళ్ళకు మర్ధనా చేసినా, కాపడం పెట్టినా, మందులు
వాడినా నెప్పి ఏమాత్రం తగ్గలేదు. ఇక సాయంత్రమయేటప్పటికి
, మరదలిని ధర్మశాలలోనే ఆమె అక్కను తోడుగా ఉంచి, వెడదామనుకున్నారు. భక్తిపరురాలయిన అక్క ఇలా అంది “ఎప్పుడయితే నువ్వు,
బాబా గురించి అహంకారంతో మాట్లాడావో ఆ క్షణంనుండే నీపు భరింపరాని నొప్పితో బాధపడటం మొదలుపెట్టావు. నువ్వు రామేశ్వరం యాత్ర, బాబా దర్శనం రెండిటినీ
పోగొట్టుకున్నావు. బాబా సర్వశక్తిమంతుడయిన
భవవంతుడు. నువ్వు ఎక్కడికీ కదిలే పరిస్థితి
కాదుకనక, ఇక్కడినుండే ఆయనకి, రామేశ్వరానికి,
నమస్కారం చేసుకో”. అక్కగారన్న మాటలు ఆమెపై తీవ్రమయిన
ప్రభావాన్ని చూపాయి. ఆమె దాని గురించి ఆలోచించింది.
ఆమె పశ్చాత్తాపంతో ఇలా అంది, “నన్ను క్షమించు,
నేనన్న మాటలను ఉపసంహరించుకొంటున్నాను. ఉదయానికల్లా
నా నెప్పులు తగ్గి రామేశ్వరం యాత్రకు వెళ్ళగలిగేలా ఉంటే వెంటనే షిరిడీ వచ్చి బాబా దర్శనం
చేసుకొంటాను”. కొద్ది గంటల తరువాత ఆమెకు నొప్పులు
తగ్గిపోయి, ఉదయానికల్లా రామేశ్వరం యాత్రకు వెళ్ళడానికి తయారయింది. రామేశ్వరంలోని రామేశ్వరుడు, బాబా ఇద్దరూ ఒకటె అని
అర్ధమయింది ఆమెకు.
బాబా ఎప్పుడూ
ఆచారాలకీ, కట్టుబాట్లకీ, ఉపవాసాలకీ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన తన భక్తులనెప్పుడూ మనస్ఫూర్తిగా నిష్టతో ఉండమని
బోధించేవారు. బాబా ఎప్పుడూ ఉపవాసముండలేదు. ఆయనకి పచ్చి ఉల్లిపాయలంటే ఎంతో ఇష్టం. ద్వారకామాయిలో ఒక సంచినిండా ఉల్లిపాయలు ఉంచుకొని,
రోజూ వాటిని తింటూ ఉండేవారు. శ్రీ సాయి సత్ చరిత్ర 23వ.అధ్యాయంలో, ఒక యోగాభ్యాసి షిరిడీకి వచ్చిన
సంఘటన గురించి గుర్తు చేసుకుందాము. అతను యోగ
శాస్త్రంలో ఎన్నో గ్రంధాలను అధ్యయనం చేశాడు.
కాని కొద్ది సేపయినా మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో ఉండలేకపోయేవాడు. అందుచేత బాబా తనను ఆశీర్వదించి ఏమయినా సహాయము చేస్తారనే
ఆశతో షిరిడీ వచ్చాడు. అతను ద్వారకామాయిలోకి
అడుగుపెట్టగానే, బాబా, రొట్టెలో పచ్చిఉల్లిపాయలను నంచుకొని తింటూ ఉండటం చూసి, బాబా
తనకేం సహాయం చేయగలరు అని మనసులో సందేహించాడు.బాబా అతని మనసులోని ఆలోచనలను గ్రహించి,
“ఎవరికయితే ఉల్లిని జీర్ణించుకొను శక్తి కలదో వారే దానిని తినవలెను” అని అక్కడ ఉన్న నానా
సాహెబ్ తో అన్నారు.
(మరికొన్ని వైభవాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment