22.01.2016 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ జీ.ఎస్.ఖపర్డే గారి డైరీలోని మరికొన్ని విశేషాలు
శ్రీ జీ.ఎస్.ఖపర్డే
డైరీ – 25
02.02.1912 శుక్రవారమ్
పొద్దున్నే లేచి
కాకడ ఆరతికి వెళ్ళి, ఆతరువాత పరమామృతం క్లాసుకి వెళ్ళాను. ఎందుచేతనో పంచదశి గురించి మాట్లాడటానికి దానిని
చదవడం మొదలుపెట్టాను. ఈ విషయం మీద ఇది చాలా
గొప్ప గ్రంధం. దాని గొప్పతనాన్ని ఎవ్వరూ గ్రహించలేరు.
సాయి మహరాజ్ ను దర్శించుకోవడానికి ఆయన బయటకు వెళ్ళేముందే
వెళ్ళి, ఆయనతో కూడా సాఠేవాడా దాకా వెళ్ళాను.
ఆ తరువాత మధ్యాహ్న ఆరతికి వెళ్ళాను.
న్యాయవాద వృత్తి మరలా చేపట్టమని అమరావతినుండి ఉత్తరం వచ్చింది. సాయిమహరాజ్ ను అనుమతి కోసం అడగమని మాధవరావు దేశ్
పాండే తో చెప్పాను. ఆయన అలాగే అడుగుతానని చెప్పారు. మధ్యాహ్నం భోజనమయిన తరువాత కొద్దిసేపు పడుకున్నాను. ఆ తరువాత దీక్షిత్ రామాయణం చదివాడు.
ఆ తరువాత సాయిమహరాజ్ వ్యాహ్యాళికి వెళ్ళేటప్పుడు
దర్శించుకోవడానికి వెళ్ళాము. వెంటనే తిరిగి
వచ్చిన తరువాత రాత్రికి భీష్మ భజన, దీక్షిత్ రామాయణం జరిగాయి.
03.02.1912 శనివారమ్
బధ్ధకం వల్ల
ఈ రోజు లేవడం ఆలస్యమయింది. బాపూ సాహెబ్ జోగ్
ఆలస్యమయాడు, అలాగే దీక్షిత్, దాదాపు అందరూ ఆలస్యమే. ప్రార్ధన అయిన తరువాత మసీదుకు వెళ్ళాను కాని సాయిబాబా
లోపలికి రాకుండా ఊదీ తీసుకొని వెళ్ళమన్నారు.
నేనలాగే చేసి, బాపూ సాహెబ్ జోగ్ బసకు వెళ్ళాను. అతనితోను, ఉపాసనీ, కౌజల్గీలతో కలిసి పంచదశి చదివాము. అలా మధ్యాహ్నం దాకా చదువుతూ సాయిబాబా ఆరతికి వెళ్ళాము. మధ్యాహ్నం
భోజనమయిన తరువాత కొంత విశ్రాంతి తీసుకుని దాసబోధ చదువుతూ కూర్చున్నాను. మధ్యాహ్నం దీక్షిత్ రామాయణం చదివాడు. స్థానికంగా ఉండే సాయిబాబా భక్తుడు గణోబా అబా వినడానికి
వచ్చాడు. అతనికి ఎన్నో శ్లోకాలు తెలుసు. అనేక శ్లోకాలు కంఠస్థం చేశాడు.
సాయిబాబా వ్యాహ్యాళికి
వెళ్ళినప్పుడు వెళ్ళి దర్శించుకొన్నాము. నేను
తిరిగి అమరావతికి వెళ్ళడానికి అనుమతి కోసం సాయిబాబాను అడిగానని మాధవరావు దేశ్ పాండే
చెప్పాడు. ఇంకా ఆయన “ నేను ముసలివాడిని నామర్యాదను
వదలుకోవడం నాకిష్టంలేదు” అని అనుమతినివ్వడానికి నిరాకరించారని చెప్పాడు. అప్పుడాయన “రెండువందల మంది పొరుగూరికి వెళ్ళారని,
వారిని అల్లరిమూకలుగా భావించారని, వారి జాబితాలో అనవసరంగా మాధవరావు పేరు చేర్చారని,
దాని వల్ల ఇబ్బంది అయిందని” అన్నాడు. రాత్రి
వాడాలో ఆరతి, తరువాత శేజ్ ఆరతి రెండింటికి వెళ్ళాను. భీష్మ భజన చేయలేదు గాని దాని బదులు భాగవతం చదివాడు. దీక్షిత్ రామాయణం చదివాడు.
(మరికొన్ని విశేషాలు
తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment