Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, April 19, 2016

శ్రీ సాయి అమృత ధార - పెళ్ళి చూపులు

Posted by tyagaraju on 9:25 AM

Image result for images of shirdi sai baba looking smiling
      Image result for images of rose hd

19.04.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి అమృత ధార
పెళ్ళి చూపులు

(చిత్రంగా జరిగిన నా వివాహం)
Image result for images of baba doing marriage

ఈ రోజు మరొక అత్యద్భుతమైన అమృతధార ఒకటి తెలుసుకుని ఆనందిద్దాము. ఈ అద్భుతమైన లీల శ్రీసాయిలీల మాస పత్రిక ఏప్రెల్, 1987 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.  బాబా ఎప్పుడు ఎవరికి ఎటువంటి విచిత్రాలు చూపిస్తారో అంతు చిక్కదు.  ఇప్పుడు మీరు చదవబోతున్న చిత్రమైన లీలలో బాబా తన భక్తురాలికి వివాహం ఏవిధంగా జరిపించారో చూడండి.  ఇంకా చెప్పేకంటే చదువుతేనే ఆ మాధుర్యాన్ని అనుభవించగలం.

అది 1980వ. సంవత్సరం.  నా బి.ఎ. పరీక్షలు పూర్తయిపోయాయి.  ఇక పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాను.  నా భవిష్యత్తు ఏవిధంగా ఉంటుందోనన్న ఆలోచనలతో సతమతమవుతూ ఉన్న రోజులవి.  1975 వ. సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయారు.  ఇంటిలో మా అమ్మగారు, మా అన్నయ్య, వివాహమయిన నా అక్కలు ఉన్నారు.  వారు నాకు తగిన వరుడికోసం సంబంధాలు వెతుకుతున్నారు.  ఎందుకనో వారు చూసిన సంబంధాలేవీ నా అభిప్రాయాలకి తగినట్లుగా లేవు.  


నేనప్పటికే శ్రీ సాయిబాబాని పూజిస్తూ ఉన్నాను.  ప్రతిరోజు శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేస్తున్నా గాని బాబాని ఎప్పుడూ నాకిది కావాలని అడగలేదు.  ఎప్పుడూ “బాబా, నాకేది మంచిదో అదే నాకు లభింపచేయి” అని ఆయనతో చెప్పుకుంటూ ఉండేదానిని. ఆయననే నా తండ్రిగా భావించుకుంటూ, ఆయనమీదే నా నమ్మకాన్ని ప్రగాఢంగా నిలుపుకున్నాను.

అది 1980 జూన్ నెల.  ఒక రోజు రాత్రి నాకొక కల వచ్చింది.  ఆ కలలో నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి పుణ్యక్షేత్రాలు, దేవాలయాలతోఉన్న ప్రదేశాలు కనిపించాయి. 
                  Image result for images of woman dreaming

ఉదయం లేవగానే  నాకది కల ఏమాత్రం కాదనే బలమయిన భావన నాలో కలిగింది.  నేను నిజంగానే ఆ ప్రదేశాలకు వెళ్ళాననీ, అక్కడి మనుషులను కలుసుకున్నాననీ  అనిపించింది. నేను కలలో చూసిన ప్రదేశాలు నిజంగా ఉన్నాయని నాకు ఒక ఖచ్చితమైన భావన కలిగింది.  అటువంటి స్వప్నం రెండు సార్లు వచ్చింది.  ఇక అప్పటినుండి ఎప్పుడు నిద్రపోతున్నా ఎవరో నన్ను నా పేరుతో “రేఖా” అని పిలుస్తున్నట్లుగా వినిపిస్తూ ఉండేది.  ఈ విధంగా జరగడం నాకెంతో విచిత్రమనిపించింది.  నా స్నేహితురాలికి నాకు వచ్చిన కల గురించీ, నన్నెవరో నా పేరుతో పిలుస్తున్నాట్లుగాను వినిపిస్తూ ఉందని చెప్పాను.  కలలో నేను చూసిన ప్రదేశాలవంటివి నిజంగా ఉన్నాయా అని అడిగాను.  ఈ విధంగా నా కెప్పుడు కల వచ్చినా, మరుసటి రోజు ఉదయమే బాబా పటానికి నమస్కరించి, “బాబా, నాకు రోజూ పవిత్రమయిన ప్రదేశాలు కలలో కనిపిస్తున్నాయి.  నాకేదో మంచి జరుగుతుందని అనిపిస్తోంది” అని బాబాతో అంటూ ఉండేదానిని.  బహుశ సాయిబాబా ఎవరి ద్వారానో నాకు ప్రసాదం పంపిస్తున్నారేమో అని నాలో నేనే అనుకున్నాను.
ఈవిధంగా కొద్ది రోజులు గడిచాయి.  ఒక రోజు మధ్యాహ్నం నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళాలనిపించి, మా ఇంటికి కొద్ది దూరంలోనే ఉన్న ఆమె ఇంటికి వెళ్ళాను.   నా స్నేహితురాలు “ఈ రోజు దుబాయి నుండి మా పెంపుడు తమ్ముడు వస్తున్నాడు.  ఈ రోజు అతనికి పెళ్ళి చూపులు ఏర్పాటు చేశాను.  ఇప్పుడు మేమంతా పెళ్ళిచూపులకి అమ్మాయి ఇంటికి వెడుతున్నాము” అని చెప్పింది.  “నువ్వు కూడా మాతో వస్తావా” అని అడిగింది.  “నేను రాను. తొందరగా నేను ఇంటికి వెళ్ళాలి” అన్నాను.  అప్పుడే కాలింగ్ బెల్ మ్రోగింది.  తెల్లటి చొక్కా, ముదురు రంగు ఫాంటు ధరించిన యువకుడు లోపలికి వచ్చాడు.  అతని కళ్ళు చాలా అందంగా ఉన్నాయి.  మొదటి చూపులోనే అతను నన్నాకర్షించాడు.  నాకు ఇటువంటి వ్యక్తి భర్తగా లభిస్తే బాగుండుననిపించింది.  ఇలా ఆలోచించుకుంటు హాలులోనే కూర్చున్నాను.  నా స్నేహితురాలు అతనిని తన పెంపుడు తమ్ముడయిన రాజు వాభీ అని నాకు పరిచయం చేసింది.  పరిచయం చేసిన తరువాత పెళ్ళిచూపులకు బయలుదేరడానికి తయారవడం కోసం లోపలికి వెళ్ళింది.  హాలులో మేమిద్దరమే ఉన్నాము.   అతను నాపేరడిగితే ‘రేఖ’ అని చెప్పాను.  వెంటనే అతను లేచి ఇది బదరీనాధ్, కేదార్ నాధ్ ప్రసాదం అని చెప్పి ప్రసాదం తీసుకోమని చేతిలో పెట్టాడు.  తను అప్పుడే పుణ్య క్షేత్రాలను దర్శించి వస్తున్నానని చెప్పి, “ఈ ప్రసాదం తీసుకోండి.  మీకు సంవత్సరం లోపల వివాహమవుతుంది” అన్నాడు.  అతను నా చేతులో ప్రసాదం పెడుతున్నప్పుడు అతని వ్రేలుకి శ్రీసాయిబాబా ఉంగరం ఉండటం గమనించాను.  
          Image result for images of shirdi sai baba ring to finger

నాకు వచ్చిన కల, అతను ప్రసాదం ఇవ్వడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.  ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను.  నాలో అతని మీద ఇష్టం కలగడం ఎందుకని  మొదలయిందో నాకు తెలియదు.  కాని ఈ రోజుల్లో విదేశాలనుంచి వచ్చిన అబ్బాయిల గురించి అంత తొందరగా ఒక అభిప్రాయమంటూ ఏర్పరచుకోలేము.  వాళ్ళ గురించి కూడా ఏమీ చెప్పలేము అనుకున్నాను మనసులో. అతను సింధి భాటియా కులస్తుడు. మేము మరాఠీలం.  మా ఇంట్లో వాళ్ళు ఈ సంబంధానికి అనుమతించరని నాకు బాగా తెలుసు.

అందుచేత నేను వెంటనే లేచి మా ఇంటికి వెళ్ళిపోయాను.  కాని నా ఆలోచనలన్నీ అతని చుట్టూతా పరిభ్రమిస్తూనే ఉన్నాయి.  రెండు రోజుల తరువాత నా స్నేహితురాలు మా ఇంటికి వచ్చింది.  తన తమ్ముడు రాజు నన్ను ఇష్టపడుతున్నాడని చెప్పింది.  నేను అంగీకరిస్తే వివాహం చేసుకుందామనుకుంటున్నాడని చెప్పింది.  నేను చాలా ఆశ్చర్యపోయాను.  నేను విన్నది నిజమేనా అని నా చెవులను నేనే నమ్మలేకపోయాను.  నా స్నేహితురాలికి నా పుట్టిన తేదీ, సమయం, నక్షత్రం అన్నీ తెలిసుండటం వల్ల నా వివరాలన్నీ తన తమ్ముడికి ఇచ్చాననీ , మా ఇద్దరికీ జాతకాలు బాగా నప్పాయనీ చెప్పింది.  మొదటి చూపులోనే రాజు మీద నాకెందుకని ఇష్టం కలిగిందో నాకే తెలీదు.  బాబాయే అతనిని నాకోసం పంపించాడని ప్రగాఢమయిన నమ్మకం కలిగింది.  ఆ తరువాత మేమిద్దరం కలుసుకున్నపుడు అతనికి నాకు వచ్చిన కలల గురించి అన్ని వివరాలు చెప్పాను.  అతనెప్పుడయినా అటువంటి పుణ్యక్షేత్రాలు, ప్రదేశాలు చూసాడేమో చెప్పమన్నాను.  నేను నాకు వచ్చిన  కలల గురించి చెప్పిన వివరాలన్నీ విని అవి కలలో నేను దర్శించినవి  బదరీ నాధ్, కేదార్ నాధ్ అని చెప్పాడు.  
                                                     
Image result for images of badrinath and kedarnath
              Image result for images of badrinath and kedarnath

నేను చెప్పిన వివరాలని బట్టి నేను ఆ పుణ్యక్షేత్రాలను నిజంగానే చూసాననుకున్నాడు, కారణం అవన్నీ నాకు ఉన్నవి ఉన్నట్లుగా కలలో కనిపించాయి.  కాని నాకు అవన్నీ కలలో కనిపించాయని చెప్పాను.  మేమిద్దరం కూడా ఆధ్యాత్మిక భావాలు కలవారం అవడం వల్ల, మాకు చాలా సంతోషం కలిగింది.  
                    Image result for images of baba doing marriage

                         Image result for images of shirdi sai baba ring to finger

సాయిబాబాయే మమ్మల్నిద్దరినీ కలిపారని భావించాము. ఒకరి మీద ఒకరికి మాకు నమ్మకం ఉన్నా గాని మా ఇరువురి కుటుంబ పెద్దలకీ మా వివాహం జరిపించడం ఇష్టం లేదు. అయినా మేమిద్దరం వివాహం చేసుకున్నాము.  శ్రీసాయిబాబా ఆశీర్వాదం వల్ల మేము చాలా సంతోషంగా జీవిస్తున్నాము.  మాకిద్దరు అబ్బాయిలు రవి (అయిదున్నర సంవత్సరాలు), రాజీవ్ (నాలుగు సంవత్సరాలు), అమ్మాయి ప్రియ (నాలుగు నెలలు).  ఇపుడు మా పెద్దలందరూ రాజీ పడి మా వివాహాన్ని హర్షించారు.  సాయిబాబా ఆశీర్వాద బలంతో నా భర్త స్వంతంగా ‘రవిరాజ్ కన్ స్ట్రక్ షన్స్’ పేరుతో వ్యాపారం మొదలు పెట్టారు.  ఈ రోజు నేనేమి చేస్తున్నా, మాకేది లభించినా అంతా సాయిబాబా దయే.
అందుచేత అందరికీ నేను చెప్పేదేమిటంటే ప్రతి ఇంటిలోను శ్రీసాయి సత్ చరిత్ర ఉండాలి.  అందరూ శ్రీసాయి సత్ చరిత్ర ప్రతిరోజూ పారాయణ చేయాలి.  శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేయడం వల్లనే నాకు మంచి భర్త లభించాడు.
Image result for images of shirdi sai baba ring to finger

తొందరలోనే నేను వెర్సొవా లో సాయిబాబా మందిరాన్ని నిర్మిద్దామని నిర్ణయించాను.  సాయిబాబా ఈ కార్యాన్ని కూడా నాచేత చేయిస్తారని నా ప్రగాఢ విశ్వాసం.

సాయిబాబా కి నా ప్రణామాలు. 
శ్రీమతి రేఖారాజువాబి, జుహు
(మరికొన్ని అమృత ధారలు ముందు ముందు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)










Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List