24.05.2016
మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు జస్టిస్ ఎమ్.బి .రేగే గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము.
శ్రీ
సాయి అంకిత భక్తులు - జస్టిస్ ఎమ్.బి. రేగే – 4వ.భాగమ్
రేగే
మామగారు కూడా బాబా భక్తులే. 1914వ.సంవత్సరంలో
రేగే గారి మూడవ కుమార్తె వివాహ సమయంలో బాబాకు శుభలేఖ పంపించారు.
బాబా ఆ వివాహానికి తాను వస్తున్నట్లుగా జవాబు వ్రాశారు. వివాహ మహోత్సవం జరుగుతూ ఉండగా పోస్టుమాన్ వచ్చి
బాబా నుంచి వచ్చిన ఉత్తరాన్ని ఊదీ పొట్లాన్ని ఇచ్చి వెళ్ళాడు.
ఊదీని పెళ్ళికూతురుకి, పెళ్ళికుమారునికి నుదిటి
మీద రాయమని ఉత్తరంలో బాబా రాశారు. అదే సమయంలో ఒక ఫకీరు వచ్చి రేగే మామగార్ని దక్షిణ
అడిగాడు.
ఆయన పెళ్ళి పనులలో తలమునకలై ఉన్నందువల్ల ఆ అపరిచిత ఫకీరు గురించి పెద్దగా
పట్టించుకోలేదు. ఆ తరువాత ఆయనకి ఆ ఫకీరు బహుశ
బాబాగారయి ఉండవచ్చనిపించింది. ఈ విషయమంతా తెలుసుకున్న
రేగే ఒకవేళ ఆ వచ్చిన ఫకీరే బాబా అయితే ఆయన మరలా రావాలి అని అన్నారు. ఆ మరుసటి రోజే ఆ ఫకీరు మరలా వచ్చి దక్షిణ అడిగాడు. రేగే సంతోషంగా సమర్పించారు.
1915
వ.సంవత్సరంలో రామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళ్ళే ముందు, బాబాకు సమర్పించడానికి కానుక
ఏదయినా తీసుకొని వెడదామని ఇండోర్ లోని బట్టల బజారుకు వెళ్ళారు. అక్కడ చాందేర్ లో తయారయిన ఢాకా మజ్లిన్ వస్త్రం
అమితంగా ఆకర్షించింది.
దానికి చుట్టూ లేసు
అల్లికతో చాలా అందంగా ఉంది. అది ఎంత మెత్తగా
మృదువుగా ఉందంటే దానికి మడిచిన తరువాత చిన్న పాకెట్ లో ఇమిడిపోయింది. బాబా కు కానుకగా దానిని కొని తన చొక్కా జేబులో పెట్టుకొన్నారు. భక్తులు బాబాను దర్శించుకోవడానికి వెళ్ళినపుడు ఆయనకు
వస్త్రాలు సమర్పిస్తూ ఉండేవారు. తరువాత వాటిని
బాబా ఆశీస్సులతో తిరిగి తీసుకొంటు ఉండేవారు.
ఎప్పుడూ ఆ విధంగా జరుగుతూ ఉండేది. కాని
రేగే గారి ఆలోచన మరొక విధంగా ఉంది. బాబా మీద
తనకున్న ప్రేమను ఆయన గుర్తిస్తే, తానిచ్చిన కానుకను ఆశీర్వదించి తిరిగి ఇవ్వకుండా ఆయన
తన స్వంతానికి ఉంచేసుకోవాలని కోరుకొన్నారు.
భక్తులందరూ తాము తెచ్చిన వస్త్రాలను, శాలువాలను బాబాకు సమర్పించి, వాటిని ఆయన
మీద కప్పేవారు. ఆఖరున ఎవరు సమర్పించిన వస్త్రాలను
వారికి ఇచ్చివేస్తూ ఉండేవారు బాబా. రేగే తాను
సమర్పించిన వస్త్రాన్ని బాబా తనకు తిరిగి ఇవ్వకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో, బాబాకు నమస్కరిస్తూ
అతి చాకచక్యంగా తను తెచ్చిన పాకెట్ ను ఎవరూ గమనించని విధంగా ఆయన ఆసనం (గద్దె) క్రిందకు
తోసేశారు. భక్తులందరూ సమర్పించిన వస్త్రాలన్నీ
ఎవరివి వారికి మరలా తిరిగి ఇచ్చేశారు బాబా.
బాబాగారు కూర్చున్న ఆసనం క్రింద ఏమి ఉన్నది ఎవరూ గమనించలేదు. బాబా తన ఆసనం నుండి పైకి లేచి “ఈ ఆసనం తీసి దులిపి
శుభ్రం చేయండి” అన్నారు. ఆసనం ప్రక్కకు జరపగానే
దానిక్రింద మజ్లిన్ క్లాత్ ఉన్న పాకెట్ బయట పడింది. బాబా ఆపాకెట్ లోని మజ్లిన్ వస్త్రాన్ని బయటకు తీసి
“ఏమిటిది? మజ్లినా?” అని దాని మడతలు విప్పి
“దీనిని నేను తిరిగి ఇవ్వను. ఇది నాది” అని
దానిని తన భుజాల మీదుగా కప్పుకొని “ఇది కప్పుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను కదూ” అని
రేగేతో అన్నారు. తాను తెచ్చిన కానుకను స్వీకరించి
తన స్వంతానికి బాబా ఉంచుకుంటానని చెప్పగానే రేగే ఆనందానికి అవధులు లేవు.
చాలా
సంవత్సరాల తరువాత ఆయన కుమారుడు మరణించాడు.
అప్పుడు ఆయన అనేక కుటుంబాలు నివాసముంటున్న ఒక భవంతిలో నివసిస్తూ ఉండేవారు. కుమారుని మరణానికి ఆయన భార్య కృంగిపోయింది. మనకేది మంచిదో అదే బాబా చేస్తారని, బాబాయే కుమారుడిని
తీసుకొని వెళ్ళారని అందుచేత దుఃఖించవద్దని భార్యను ఒదార్చారు. రేగే తన బిడ్డ శరీరాన్ని ఒడిలో పెట్టుకొని కూర్చొని
ఉండగా బాబా కనిపించి “నీకు నేను కావాలో, చనిపోయిన నీ బిడ్డ కావాలో తేల్చుకో. రెండూ కావాలంటే పొందలేవు. నీ కుమారుడిని బ్రతికించమంటే బ్రతికిస్తాను. కాని నేను నీతో ఉండను. ఈ బిడ్డను బ్రతికించుకోవాలని అనుకోకపోతే, నీకు తరువాత
ఎంతో మంది పిల్లకు పుడతారు” అన్నారు. రేగే
ఎటువంటి సంకోచం లేకుండా “బాబా నాకు మీరే కావాలి” అన్నారు. అయితే ఇంక శోకించకు అని చెప్పి అదృశ్యమయ్యారు. ఆవిధంగా బాబా తన ఉనికిని తెలియచేస్తూ ఆయనని అన్ని
సందర్భాలలోను ప్రోత్సహిస్తూ ఉండేవారు.
భక్తుల
అవసరాలను బట్టి వివిధ భక్తులకు బాబా చేసే సహాయాలు కూడా అనేక విధాలుగా ఉండేవి. బాబా
రేగేకు ఎన్నోవిధాలుగా సహాయం చేశారు. అన్ని
సందర్భాలలోను ఆయనకు విలువైన సలహాలను కూడా బాబా ఇచ్చారు.
(ఇంకా
ఉంది)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment