09.05.2016 సోమవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు షిరిడీ సాయి వైభవంలో మరొక వైభవం తెలుసుకుందాము
శ్రీషిరిడీ సాయి వైభవం
బాబా
సలహాను పాటించాలి
భక్తులు
షిరిడీ నుండి బయలు దేరి వెళ్ళేటప్పుడు బాబా వారి అనుమతి తీసుకుని మరీ వెళ్ళేవారు. వారు వద్దన్నా ప్రయాణమై వెళ్ళిన వారు ప్రమాదాల బారిన
పడుతూ ఉండేవారన్న విషయం మన సాయి భక్తులందరికీ తెలిసున్న విషయమే. బాబా మాటల మీద విశ్వాసం ఉన్నవాళ్ళు సుఖంగా ఉండేవారు. ప్రయాణ సమయాలలోనే కాదు కొన్ని కొన్ని విషయాలలో కూడా
బాబా ఇచ్చిన సలహాలను ఆచరణలో పెట్టిన వారు కూడా ఎంతో లాభాన్ని పొందారు.
ఉదాహరణకి
శ్రీ సాయి సత్చరిత్ర 25 వ.అధ్యాయాన్ని గమనించండి.
దాము అన్నా ప్రత్తిలో జట్టీ వ్యాపారం చేయాలనుకుని బాబాను అడిగి వారి సలహాను
అడిగి తెలుసుకొమ్మని శ్యామాకు ఉత్తరం వ్రాశాడు.
బాబా వద్దని చెప్పారని శ్యామానుంచి జవాబు రాగానే హతాశుడయ్యాడు. మంచి లాభాలు వచ్చే వ్యాపారావకాశం పోయిందని బాధ పడ్డాడు.
ఆ వ్యాపారంలో స్నేహితునితో కలిసి పెట్టుబడి పెట్టలేదు. కాని లోపల చాలా బాధ పడుతూనే ఉన్నాడు. తరువాత ధాన్యం వ్యాపారం కూడా చేద్దామనుకున్నా బాబా
సమ్మతించలేదు. ఆ తరువాత ప్రత్తి వ్యాపారములోను, ధాన్యం వ్యాపారాలలోను చాలా నష్టాలు వచ్చాయని తెలిసి దామూ అన్నా, బాబా తనని
ఆ ప్రమాదాల నుంచి కాపాడినందుకు చాలా సంతోష పడ్డాడు. బాబా మీద నమ్మకం పెరిగింది.
బాబా
మాట పెడచెవిని పెట్టి పనులు సాగించి ఆపదలు కొని తెచ్చుకున్న ఒక భక్తుని ఉదంతం ఈ రోజు
తెలుసుకుందాము.
అంధేరీ బొంబాయి నివాసి కావ్ జీ పటేల్ కి తన తండ్రి ఒక గుడిని నిర్మించాలనే కోరిక చాలా బలీయంగా ఉండేది. వాణీదేవి గుడిని నిర్మించడానికి బాబాని అనుమతి అడిగాడు.
బాబా ”వద్దు” అన్నారు. ఆ తరువాత కొద్ది రోజులకి మళ్ళీ అడిగాడు. బాబా మళ్ళీ “వద్దు” అన్నారు. అప్పటినుండి బాబాని ఎప్పుడు కలుసుకున్నా ఇదే విషయం గురించి అడుగుతూ ఆయన్ని విసిగిస్తూ ఉండేవాడు. అప్పుడు బాబా “నేను ఎన్ని సార్లు వద్దు అని చెప్పినా వినకుండా నన్ను విసిగిస్తూనే ఉన్నావు. ఇక నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. ఆ తరువాత వచ్చే కష్ట నష్టాలన్నిటినీ నువ్వే భరించు” అన్నారు.
శాస్త్రాలు, పాండిత్యం ఏమీ తెలియని ఒక డాంబికుడు ఇచ్చిన సలహాతో కావ్ జీ, గుడి నిర్మాణానికి వెంటనే ఏర్పాట్లు చేయడం ప్రారంభించాడు. ఆ డాంబికుడు ఎప్పుడయితే గ్రామంలోకి అడుగుపెట్టాడో వెంటనే గ్రామంలో ప్లేగు వ్యాధి సోకింది. ఆ వ్యాధికి కొంతమంది బలయ్యారు. కావ్ జీకి ఆ డాంబికునిపై నమ్మకం పోయింది. ఆయినా కాని తన కులదేవత విగ్రహాన్ని ప్రతిష్టించమని బాబా ఇచ్చిన సలహాను పెడచెవిన పెట్టాడు. ఆయన మాటలను విశ్వసించలేదు. అందుచేత అతను తన కుల దేవత కాక మరొక దేవత విగ్రహాన్ని ప్రతిష్టించాడు.
ఆ తరువాత రెండు సంవత్సరాల పాటు అతన్ని దురదృష్టాలు వెంటాడాయి.అనారోగ్యాలతో బాధ పడ్డాడు. తరచూ చావు బ్రతుకుల స్థితికి చేరుకునేవాడు. ఆఖరికి బాబా మీద నమ్మకం పెరిగి బాబా దర్శనానికి వెళ్ళాడు. అపుడు బాబా “నువ్వు ప్రతిష్టించిన మరొక దేవత విగ్రహాన్ని తొలగించి మీ కుల దేవత విగ్రహాన్ని ప్రతిష్టించు” అని సలహా ఇచ్చారు. బాబా ఆజ్ఞను శిరసా వహించి ఆయన చెప్పినట్లే చేశాడు. రాబోయే కష్టనష్టాలు, దురదృష్టాలనుండి విముక్తుడయాడు. బాబా పై గౌరవాభిమానాలతో ఈ సంఘటనని ఆధారం చేసుకొని మరాఠీలో ఒక కీర్తనని కూడా రచించాడు.
(మరికొన్ని వైభవాలు ముందు ముందు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
1 comments:
om sai ram sri sai ram jaya jaya sai ram
Post a Comment