16.05.2016 సోమవారం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
శ్రీ సాయి అంకిత భక్తులు - ప్రొఫెసర్ శ్రీ జి.జి. నార్కె -3వ. భాగం
ప్రొఫెసర్ శ్రీ జి.జి. నార్కే గారి గురించి మరికొంత సమాచారం
ఎంతో
కాలం తర్వాత 1916 వ.సంవత్సరంలో నార్కే షిరిడీకి వచ్చారు. రాగానే బాబాకు ఎవరెవరు ఏయే సేవలు చేస్తున్నారని
విచారించారు. న్యాయవాది యైన వామనరావు పటేల్
బాబా తరఫున గ్రామంలో భిక్షాటన చేస్తున్నట్లుగా చెప్పారు. ఆమాట వినగానే నార్కే కాస్త అసూయ పడ్డారు. బాబా తరఫున భిక్షను అడిగే సేవను నాకెందుకు ప్రసాదించకూడదు
అని
తన మనసులో అనుకున్నారు. కాని బయటకు ఎవరికీ చెప్పలేదు.
అప్పుడే ద్వారకామాయిలో బాబాను దర్శించుకునే
సమయం ఆసన్నమయింది. నార్కే గారికి దుస్తులను
కూడా మార్చుకునే సమయం లేకపోవడం చేత సూటు, బూటు, ఫాంటు, కోటు, నెత్తి మీద టోపీల తోనే
మశీదుకు వెళ్ళి బాబాను దర్శించుకున్నారు. ఆ
సమయంలో ఒక భక్తుడు వామనవారువును భిక్షకు పంపించమంటారా అని మూడు సార్లుగా బాబాను అడుగుతూనే
ఉన్నాడు. ఉన్నట్లుడి బాబా నార్కే వైపు చూపుతూ,
“ఈ రోజు భిక్షా పాత్రను ఇతనికిచ్చి పంపించండి.
ఇతను భిక్షకు వెడతాడు” అని అన్నారు.
ఆ రోజు నార్కేగారు సూటు, బూటు, కోటు, నెత్తిమీద టోపీ ఈ వేషంలో బాబా తరఫున భిక్షకు
బయలుదేరి భిక్షను తెచ్చాడు. ఆ తరువాత నాలుగు
నెలలు మామూలు దుస్తులు ధరించి మధ్యాహ్నం వేళలో బాబా తరఫున భిక్షకు వెళ్ళారు. అంత కాలంపాటు భిక్షకు వెళ్ళినది ఆయన ఒక్కరే. బాబా ఆయననే భిక్షకు వెళ్ళడానికి ఎందుకని ఎన్నుకున్నారో
ప్రజలు అర్ధం చేసుకోలేకపోయారు. ఆయన మనసులో ఉన్న కోరికను బాబా తెలుసుకొన్నారు కాబట్టే,
బాబా ఆయనకు తనకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించారు. బాబా తరఫున మధ్యాహ్నం వేళలో భిక్షకు వెళ్ళే భాగ్యాన్ని
ఆయన చాలా తక్కువ మందికి ఇచ్చారు.
ఆఖరికి
1917వ.సంవత్సరంలో పూనా విశ్వవిద్యాలయంలో భూగర్భ శాస్త్రానికి సంబంధించిన కోర్సు ప్రారంభమయింది. అందులో ఆ శాస్త్రాన్ని భోధించేందుకు ఒక ప్రొఫెసర్
కావాలని పత్రికా ప్రకటన ఇచ్చారు విశ్వవిద్యాలయంవారు. ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయమంటారా అని బాబాను సలహా
అడిగి ఆయన అనుమతితో దరఖాస్తు పంపించారు. ఎంతో
మంది అభ్యర్ధుల పోటీ ఎక్కువగా ఉన్నప్పటికి బాబా ఆసీర్వాద బలంతో ఆయనకు ఆ ఉద్యోగం లభించింది. మంచి జీతంతో ఆయన 1918 లో ఆ విశ్వవిద్యాలయంలో భూగర్భ,
గనుల శాస్త్రంలో ప్రొఫెసర్ గా నియమితులయ్యారు.
ఆ విధంగా ఆయన తన సంపాదనతో ఒక మంచి బంగళాను కొనుక్కుని భార్యా పిల్లలతో సుఖంగా
జీవించారు. (ఆయనకు నలుగురు కొడుకులు). బాబా ప్రతి పట్టణానికి చివర ‘పూనా’ అని ఎందుకని
జత చేస్తూ చెప్పేవారో ఇపుడాయనకి అర్ధమయింది.
బాబాగారి సర్వవ్యాపకత్వానికి ఉదాహరణ ఆయనకు ప్రత్యక్ష అనుభవమయింది.
బాబా
భక్తులందరిలోను ఉన్నత విద్యాభ్యాసం చేసిన వ్యక్తి నార్కేగారు ఒక్కరే. ఆయనకు మంచి సూక్ష్మ దృష్టి కలవారనే గుర్తింపు ఉంది. బాబా ను దగ్గరనుండి నిశితంగా పరిశీలించే అవకాశం
ఆయనకు కలిగింది. దాని వల్ల బాబాను బాగా అర్ధం
చేసుకొన్నారు. అంతటి ఉన్నత విద్యావంతుడు బాబా
భక్తుడు అయినా నార్కేగారి నుంచి, బాబాతో ఆయన అనుభవాలను, బాబాగారి అతీంద్రియ శక్తులను
గురించి తెలుసుకోవడానికి, 1936 లో నరసింహస్వామి గారు ఆయనను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో, తన గత నాలుగు జన్మల వివరాలను బాబా
గారే మసీదులో భక్తులందరి సమక్షంలో చెప్పారని అన్నారు. కాని బాబా చెప్పిన ఈ విషయాలు నార్కేకు సంబంధించినవని
ఎవరూ అర్ధం చేసుకోలేకపోయారు. మరికొంత మంది
అదంతా అసందర్భంగా మాట్లాడిన మాటలుగా భావించారు.
బాబాకున్న ప్రత్యేకమయిన కళ ఏమిటంటే ఆయన చెప్పే విషయం ఎవరి గురించయితే చెబుతున్నారో
వారికే అర్ధమయేలా చెప్పడం. మిగిలినవారికి వారు
చెప్పే మాటలు అర్ధమయ్యేవి కావు. బాబా ఈలోకంలోనే
కాదు విశ్వాంతరాళంలో కూడా అదృశ్య రూపంలో పర్యటిస్తూ అక్కడి విషయాలను నియంత్రిస్తూ ఉండేవారని
నరసింహస్వామీజీ గారి ఇంటర్వ్యూలో చెప్పారు.
అదృశ్య శరీరంతో తాను విశ్వాంతరాళంలో పర్యటిస్తూ ఉండేవాడినని బాబా తరచు నాతో
చెబుతూ ఉండేవారని చెప్పారు నార్కే. ఉదయం వేళలలో బాబా ధుని ముందు కూర్చొని తరచుగా ఎవరితోనో
మాట్లాడుతున్నట్లుగాను, లేకపోతే కొన్ని పనులు చేయమని వారిని ఆజ్ఞాపిస్తున్నట్లుగాను
సంజ్ఞలు చేసేవారని చెప్పారు.
మసీదులో ఉన్నవారితో
తాను క్రితం రోజు రాత్రి సుదూర ప్రాంతాలకు ఎక్కడకు వెళ్ళినది, అక్కడ ఏమి చేసినది ఇటువంటి
విషయాలు కూడా చెబుతూ ఉండేవారని, ఆ తరువాత విచారిస్తే బాబా చెప్పిన విషయాలు నిజమేనని
నిరూపితమయ్యాయని కూడా నార్కే గారు తన ఇంటర్వ్యూలో చెప్పారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment