14.05.2016 శనివారం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి అంకిత భక్తులలో ఒకరయిన శ్రీ జి.జి. నార్కే గారి గురించి మరికొంత సమాచారం ఈ రోజు తెలుసుకుందాము.
శ్రీ సాయి అంకిత భక్తులు _ ప్రొఫెసర్ జి.జి. నార్కే - 2 వ.భాగం
ప్రతి
రోజూ భాగోజీ షిండే ఉదయాన్నే వచ్చి బాబా వారి కాలిన చేతికి కట్టు కట్టడం, బాబా కాళ్ళకు
మర్ధనా చేయడం అన్నీ నార్కే గమనించారు. కుష్టు
వ్యాధిగ్రస్తుడు, బాబా భక్తుడయిన భాగోజీ బాబా ఆదేశానుసారం ధునిలోని ఊదీని తీసి భక్తులందరికీ
పంచేవాడు. వ్యాధిగ్రస్తులయిన వారి నోటిలో కూడా
ఊదీ వేసేవాడు. భాగోజీ కుష్టువాడయినప్పటికి
అతను చేసిన ఈ చర్యల వల్ల ఏభక్తునికీ ఎటువంటి హాని జరగలేదు. ఈ విషయాలన్నీ నార్కేగారికి తెలుసు.
ఒకసారి
బాబా 1913 లోనే నార్కే గారితో “మీ మామగారయిన బూటీ ఇక్కడ ఒక రాతి భవనం నిర్మిస్తారు. ఆ భవానికి నువ్వే నిర్వహణాధికారివి” అని చెప్పారు.
చాలా
కాలం నార్కేగారికి ఉద్యోగం లేదు. ఆయనకు ఉద్యోగం
లేదని తెలిసినా కూడా బాబా నార్కే గారిని పలు సందర్భాలలో రూ.15/- దక్షిణ అడుగుతూ ఉండేవారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. అయన మామగారయిన బూటీ పెద్ద ధనవంతుడయినా, నార్కే
గారు తన మామగారినుండి ఒక్క పైసా కూడా ఆశించకుండా తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్నారు. బాబాకు ఆ విషయం కూడా తెలుసు. అన్ని సందర్భాలలోను బాబా తన నుండి దక్షిణ కోరినా
గాని ఎటువంటి సమాధానం చెప్పకుండా మవునంగా ఉండేవారు. నార్కే గారు గొప్ప విద్యావంతులు, అన్నీ తెలిసినవారు. అన్ని విషయాలను నిశితంగా పరిశీలించే శక్తి కలిగినవారు. బాబా సర్వంతర్యామి అనీ, తను నిరుద్యోగినన్న విషయం
కూడా ఆయనకు తెలుసనే విషయం కూడా నార్కే గారికి తెలుసు. అయినప్పటికీ బాబా తరచూ దక్షిణ అడుగుతూ ఉండేవారు. అప్పుడు ఆయన ఆలోచించారు. తన పరిస్థితి తెలుసుండీ కూడా బాబా తనను మాటి మాటికీ
రూ.15/- దక్షిణ అడుగుతున్నారంటే ఇందులో ఏదో గూఢార్ధం ఉండే ఉంటుందని ఆలోచించారు. ఒకసారి మధ్యాహ్నం భోజనమయిన తరువాత బాబా మసీదులో
వంటరిగా కూర్చుని ఉన్నారు. అపుడు నార్కేగారు
కాస్త ధైర్యం తెచ్చుకుని బాబాని ఇలా అడిగారు.
“బాబా ఎంతో కాలంనుండీ నేను నిరుద్యోగిగా ఉన్నానన్న విషయం మీకు తెలుసు. అయినా మీరు నన్ను ప్రతిసారి రూ.15/- దక్షిణ అడగటంలోని
ఆంతర్యం ఏమిటి?” అప్పుడు బాబా “నార్కే, బంగారం, వెండితో చేయబడ్డ ఈ డబ్బు నాకవసరమా? ఈ డబ్బుతో నేనేమి చేసుకుంటాను? ప్రతిరోజు నువ్వు
యోగ వాసిష్టం చదువుతున్నావు కదా! ఇప్పుడు నీవు
చదువుతున్న అధ్యాయంలో చెప్పబడిన 15 ఉపదేశాలను ఆచరించు. వాటిని ఆచరించినట్లయితే నీకు కష్టసుఖాలలో ఎంతో మేలు
చేస్తాయి. నాకు నీ నుంచి ఎటువంటి ధనము అవసరం
లేదు” అన్నారు.
తోసార్ ,
బాపూ సాహెబ్ జోగ్, మరియు వామనరావు పటేల్ ఈ భక్తులందరూ భవిష్యత్తులో సన్యాసం స్వీకరిస్తారనే
విషయం బాబాకు తెలుసు. అందుచేత 1914 లో ఒక రోజు
బాబా వీరందరికీ కఫనీలను పంచిపెట్టారు. ఆ సమయంలో
అక్కడే ఉన్న నార్కే గారు తన మనసులో “బాబా నాకు కూడా కఫనీని ఇస్తే ఈ క్షణంలోనే నేను
సన్యసిస్తాను” అని అనుకున్నారు. ఆ విధంగా అనుకుని నార్కే కూడా కఫనీ తీసుకోవడానికి చేతిని
చాచారు. అప్పుడు బాబా మృదుమధురమయిన స్వరంతో
“ఈ మసీదు ఫకీరు (భగవంతుడు) నీకు కఫనీ ఇవ్వడానికి నన్ను అనుమతించలేదు. నేనేమి చేయగలను చెప్పు?” అన్నారు. బాబా తనకు కూడా ఒక కఫనీని ఇస్తే దానిని దాచుకుని
బాబా భజన ఇంకా ఇతర ప్రత్యేక సందర్భాలలో దానిని ధరించవచ్చనుకున్నారు. తను కఫనీ ఇవ్వనందుకు నార్కే చాలా అసంతృప్తిగా ఉన్నా
సరే ఆయన కఫనీ ఇవ్వకపోవడానికి కారణం ఆయనకి సన్యసించే యోగ్యత లేదని బాబాకి బాగా తెలుసు.
ఆయన భవిష్యత్తులో ఒక మహత్కార్యం నిర్వహిస్తాడనీ అతని భవిష్యత్తు కూడా ఉజ్జ్వలంగా ఉంటుందనే
విషయం బాబాకు తెలుసు.
నార్కే
షిరిడీలోనే ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఆయన షిరిడీలో నిరుద్యోగిగా 13 మాసాలు ఉన్నారు. ఒకసారి, ఇంటర్వ్యూకి రమ్మని బర్మా, కలకత్తాలనుండి
ఒక్కసారే ఉత్తరాలు వచ్చాయి. బర్మా వెళ్ళాలా, కలకత్తా వెళ్ళాలా అనే పెద్ద మీమాంసలో పడ్డారు. బాబాని సలహా అడిగారు. “నువ్వు బర్మా-పూనా వెళ్ళు”
అన్నారు బాబా. బాబా ఏ పట్టణానికి వెళ్ళమని
సలహా ఇచ్చినా ఆ ఊరి పేరు చివర పూనా ని కూడా జత చేసి చెబుతూ ఉండేవారు. నార్కే కు బర్మా గాని, కలకత్తా గాని వెళ్ళడానికి
ఇష్టం లేదు. అందు చేత రెండింటినుంచి వచ్చిన
అవకాశాలను వదలుకున్నారు. ఆ విధంగా సంవత్సరాలు
గడిచిపోయాయి. కొంతకాలం తరువాత వారణాసి విశ్వవిద్యాలయం
నుంచి ఇంటర్వ్యూకి రమ్మని ఉత్తరం వచ్చింది.
బాబాని సలహా అడిగినప్పుడు “నువ్వు వారణాసి వెళ్ళవలసిన అవసరం లేదు. పూనా వెళ్ళు” అన్నారు. “బాబా, పూనాలో భూగర్భ శాస్త్రానికి సంబంధించిన కాలేజీలు
గాని, విశ్వవిద్యాలయాలు గాని ఏమీ లేవు” అన్నారు నార్కే. కాని బాబా నార్కేకి ఏసమాధానం ఇవ్వలేదు. కాని బాబా మాత్రం తరచుగా పూనా పేరే చెబుతూ ఉండేవారు.
(ఇంకా వుంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment