04.06.2016 శనివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు (విశాఖపట్నం నుండి)
సాయి భక్తులకు బాబా మీద ఎంత భక్తి విశ్వాసాలు ఉంటాయో, బాబాకు కూడా తన భక్తుల మీద అంత ప్రేమ ఉంటుంది. ఆయన అనుగ్రహం పడితే చాలు ఆయన భక్తులందరూ కష్టాలనుడి బయట పడతారు. కాని కష్టపడకుండా అన్నీ సుఖాలే కావాలనుకుంటే దేవుని అనుగ్రహం ఎంత ఉన్నా జరగని పని. సుఖం కావాలనుకుంటే కష్ట పడవలసిందే. అలాగే పూర్వ జన్మలో చేసుకొన్న కర్మను బట్టే ఈ జన్మలో కష్టాలు సుఖాలు అనుభవించాలి. బాబా అనుగ్రహం ఎంత ఉన్నాగాని, అసలు రోగమే లేకుండా ఏ సాయి భక్తుడయినా జీవితాన్ని గడపడం సాధ్యమా? ఎంతో కొంత కష్టం అనుభవింపక తప్పదు. బాబా అనుగ్రహంతో పడవలసిన కష్టం కొంత తగ్గి ఆ తరువాత పూర్తిగా నివారణ అవుతుంది.
ఇక ఈ రోజు వైభవం చదవండి.
శ్రీ షిరిడీసాయి వైభవం
స్వప్నంలో కూడా వైద్యం చేయగలరు బాబా
రావూజీ బి.ఉపాసని ఎంతో కాలంనుండీ ఆస్త్మా తో బాధపడుతూ ఉన్నాడు. కాకా సాహెబ్ దీక్షీత్ సలహా ప్రకారం 1913 లో బాబాను దర్శించుకోవడానికి షిరిడీ వెళ్ళాడు.
అతనిని చూడగానే బాబా నిన్ను కలుసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది అని అతనిని ఆశీర్వదించి ఊదీనిచ్చారు. అప్పటినుండి రావూజీకి ఉన్న ఆస్త్మా నెమ్మదించింది. ఆ తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు.
1913 వ.సంవత్సరం మార్చ్ నెలలో అతని కుమారుడికి సుస్తీ చేసింది. వారం రోజులపాటు జ్వరంతో బాఢపడ్డాడు. జ్వరం ఏమాత్రం తగ్గలేదు. వైద్యులు కూడా ఇక ఆశ వదిలేసుకొన్నారు. అతనికి అంతిమ క్షణాలు దగ్గర పడ్డాయని భావించి ఉపాసనీ, వైద్యుడు ఇద్దరూ పిల్లవాడి మంచం ప్రక్కనే కూర్చొన్నారు. రాత్రి 2 గంటలకు తండ్రి అలసిపోయి బయటకు వెళ్ళి వరండాలో కూర్చొన్నాడు. అక్కడ అతనికి కాస్త కునుకు పట్టి జోగుతూ ఉన్నాడు. ఆ నిద్రలో అతనికి కల వచ్చింది. ఆ కలలో బాబా అతని కుమారుడి నుదిటి మీద ఊదీని రాస్తూ కనిపించారు. ఆ తరువాత బాబా ఉపాసనీ ముందు నిలబడి "ఆందోళన చెందకు. రెండు గంటల తరువాత అతనికి చెమట పట్టి జ్వరం తగ్గడం ప్రారంభమవుతుంది. అతను కోలుకొన్న తరువాత షిరిడీ తీసుకొని వచ్చి నా దర్శనం చేయించు" అన్నారు. ఉపాసనీ కి మెలుకువ వచ్చింది. బాబా చెప్పినట్లుగానే చేశాడు ఉపాసనీ. రెండు గంటల తరువాత కుమారుడికి చెమటలు పట్టి జ్వరం తగ్గసాగింది. అది చూసిన వైద్యుడికి కూడా ఆశ్చర్యం వేసింది. మూడు రోజుల తరువాత ఉపాసనీకి శ్యామానుండి ఒక ఉత్తరం వచ్చింది. అందులో శ్యామా " బాబా నుండి ఆదేశం లేనందు వల్ల నీకు ఉత్తరం వ్రాయలేదు. ఇప్పుడు బాబా చెప్పిన ప్రకారం నీకు ఉత్తరం వ్రాస్తున్నాను. బాబా నీకు ఈ విధంగా వ్రాయమన్నారు. "నేను ధులియాలో ఉన్న నీ స్నేహితుని ఇంటికి వెళ్ళాను." అప్పుడు నేను బాబాని అడిగాను నా స్నేహితుడు ఎవరని. అప్పుడు బాబా "ఉపాసనీ బాలకృష్ణ రావూజీ" అన్నారు. నేను అతని ఇంటికి తరచూ వెడుతూనే ఉంటానని కూడా రాయి" అని చెప్పారు. బాబా చెప్పినమీదటనే నేను నీకీ ఉత్తరరం వ్రాస్తున్నాను.
15 రోజుల తరువాత ఉపాసనీ తన భార్య, కొడుకుతో బాబాని దర్శించుకునేందుకు షిరిడీ వెళ్ళారు. ఉదయాన్నే కోపర్గావ్ లో దిగి గోదావరి నదిలో స్నానాలు కానిచ్చారు. తొందరగా బాబా ఆరతి సమయానికి షిరిడీ చేరుకొందామనుకున్నారు. కాని టాంగా చాలా ఆలస్యంగా వచ్చింది. ఆరతి సమయానికి షిరిడి చేరుకోగలమా లేదా అని ఉపాసని సందేహించాడు. ఇక్కడ షిరిడీలో బాబా శ్యామాతో "శ్యామా, ఆరతి ఇవ్వడం కాసేపు ఆపు. నీ స్నేహితుడు రావూజీ వస్తూ ఉన్నాడు. దారిలో ఉన్నాడు. అతను మనసులో ఆరతి చూద్దామనే కోరికతో వస్తూ ఉన్నాడు" అన్నారు.ఉపాసనీ తన కుటుంబంతో ద్వారకామాయిలోకి అడుగు పెట్టగానే ఆరతి ప్రారంభమయింది. బాబా ఉపాసనీ కుమారుడిని దగ్గరకు పిలిచి, "నువ్వు జ్వరంతో బాధపడుతున్నపుడు నీకు కలలో దర్శనమిచ్చాను. నన్ను గుర్తించావా?" అని అడిగారు. రావూజీ, అతని కొడుకు ఇద్దరూ వెంటనే బాబా ముందు సాష్టాంగ నమస్కారం చేసి సమయానికి వచ్చి సహాయం చేసినందుకు తమ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
(మరికొన్ని వైభవాలు ముందు ముందు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
1 comments:
Om Sai Namo Namaha
Sri Sai Namo Namaha
Jai Jai Sai Namo Namaha
Sadhuguru Sai Namo Namaha
Post a Comment