Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, August 1, 2016

శ్రీసాయి బాబావారి బోధనలు మరియు తత్వము - (5) జననమరణ చక్రాలు (2వ.భాగమ్)

Posted by tyagaraju on 8:40 AM
Image result for images of sai
       Image result for images of green rose hd

01.08.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి బాబావారి బోధనలు మరియు తత్వము
(5) జననమరణ చక్రాలు (2వ.భాగమ్)
Image result for images of m b nimbalkar

ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
(5) జననమరణ చక్రాలు (2వ.భాగమ్)
సాయిబాబా వారు సర్వజ్ఞులు.  అయనకు భూత, భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు.  ఆయన ఒకసారి ‘బాబు’ అనే పిల్లవాడి గత జన్మల గురించి, రాబోయే జన్మలు ఎక్కడెక్కడ జరుగుతాయో అతని భవిష్యత్తు కూడా చెప్పారు.  ఆవిధంగా ఒక ఆత్మ ఏవిధంగా మరలా మరలా జన్మనెత్తుతుందో ప్రతివారికీ సోదాహరణంగా వివరించారు.



          Image result for images of shirdisaibaba speaking with devotees
ఈ వృత్తాంతం హెచ్.హెచ్. నరసింహస్వామీజీ గారు రచించిన శ్రీసాయిబాబా భక్తుల అనుభవాలు (ఆంగ్ల పుస్తకం devotees – experiences of Sri Sai Baba) (page 114) లో రావు బహద్దూర్ హెచ్.వి.సాఠే గారు ఈ విధంగావివరించారు.
“బాబాగారికి దాదాకేల్కర్ గారి (అనగా మా మామగారు) మేనల్లుడు బాబు అంటే ఎంతో అభిమానం.  అతను నాదగ్గిర అసిస్టెంటయిన లిమాయే దగ్గర కొలతలు కొలిచే ఉద్యోగి. (నేను అప్పుడు కోపర్గావ్, యేవలా కి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ రెవెన్యూ సర్వేయర్ గా ఉద్యోగం చేస్తున్నాను). కాని అతను తన ఉద్యోగ బాధ్యతలను సరిగా నిర్వర్తించకుండా షిరిడీ వెళ్ళి అక్కడ బాబాకి సేవ చేస్తూ ఉండేవాడు.  నా బావమరిది (బాబు) చేయవలసిన పనిని నిర్లక్ష్యం చేసి ఎప్పుడూ షిరిడీకి వెళ్ళిపోతున్నాడని నా అసిస్టెంట్ ఫిర్యాదు చేశాడు.   నేను ఈ విషయమంతా కేల్కర్ కి చెప్పాను.  – “మనం చేయవలసిందేమీ లేదు.  బాబా ఏంచెబితే అదే చేస్తున్నాడు.   నిజానికి బాబుకి త్వరలోనే ఏంజరుగుతుందన్నది బాబాకు తెలుసు.  అందుకే అతను చేసే ఉద్యోగాన్ని చాలా తేలికగా తీసుకొని “పోతే పోనీ ఉద్యోగం – నాకు సేవ చేసుకోనీ” అని బాబా అన్నారని చెప్పారు కేల్కర్.  బాబు ఎప్పుడూ బాబా దగ్గరే ఉంటూ తాను చేయగలిగినంత సేవ చేస్తూ ఉండేవాడు.  బాబా ఎప్పుడూ బాబుకిష్టమయిన రుచికరమయిన ఆహారపదార్ధాలన్నీ లభించేలా చూసేవారు.  లిమాయే కూడా అతనిని అతనికిష్టమయినట్లుగా వదిలేశారు.  కొద్ది రోజులలో బాబు మరణించాడు.  అప్పుడతని వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే.  అతనికి భార్య ఉంది, పిల్లలు లేరు.

ఇదే సందర్భంలో శాంతాక్రజ్ నివాసి మోరేశ్వర్ w.ప్రధాన్ చెప్పిన విషయం, “ఆ రోజున మేము షిరిడీ చేరుకొన్నాము.  బాబా, మాధవరావు దేశ్ పాండేతో నాభార్యవైపు చూపిస్తూ ఇలా అన్నారు “ఈమే నాబాబుకి తల్లి”. చందోర్కర్ తన కోడలిని ఉద్దేశించి బాబా ఆమాటలు అన్నారనుకొన్నాడు.  కారణం ఆమె గర్భవతి అని నమ్మకం. అందుచేత బాబాని “ఈమే ఆ తల్లి అవునా? బాబా!” తన కోడలిని చూపిస్తూ ప్రశ్నించారు .  బాబా కాదని సమాధానమిచ్చి మరలా నాభార్యని చూపించారు.

సరిగా ఆరోజునుండి 12 నెలల తరువాత నాభార్య మగ శిశువును జన్మించింది.  మేము ఆ పిల్లవానికి ‘బాబు’ అని నామకరణం చేశాము. (బాబా పిలిచే పేరు).
           Image result for images of born boy
బాబుకి నాలుగు నెలలు నిండాక షిరిడీ తీసుకొని వెళ్ళాము.  సాయిబాబా బాబుని తన చేతులలోకి తీసుకొని “బాబు? ఎక్కడ ఉన్నావు ఇంతకాలం? నాతో విసిగి అలసిపోయావా?” అన్నారు.  బాబు షిరిడీకి వచ్చిన శుభసందర్భంలో బాబా తన జేబునుండి రెండురూపాయలు తీసి, దానితో బర్ఫీ (మిఠాయిలు) కొని కొడుకు పుట్టిన సందర్భంలో ఏవిధంగానయితే పంచుతారో ఆవిధంగా పంచిపెట్టారు.  ఈ సందర్భంలో బాబా “బాబుకు అందమయిన బంగళా కూడా తయారుగా ఉంది” అని కూడా అన్నారు.  అది నిజమే.  బాబా మాటలు త్వరలోనే నిజమయ్యాయి.  నేను ఒక బంగళాను కొని గృహప్రవేశం చేసుకొని అందులో నివసించసాగాను.

పైరెండు కధనాలను చదివిన తరువాత పాఠకులకు పునర్జన్మ సిధ్ధాంతం మీద నమ్మకం ఏర్పడటమే కాదు, బాబా తన భక్తులను జన్మ జన్మలకి ఏవిధంగా కాపాడుతూ ఉంటారో అర్ధమవుతుంది.  పునర్జన్మ గురించి చెప్పేటప్పుడు ఈ జన్మలో మనకి కలిగే కష్టసుఖాలన్ని కూడా మనం క్రితం జన్మలో చేసిన పనుల వల్లనేనని బాబా ఎప్పుడూ చెబుతూ ఉండేవారు.  ఉదాహరణకి 46,47 అధ్యాయాలనే తీసుకొందాము.  అందులో రెండు మేకలు, కప్ప, పాముల గతజన్మ, ప్రస్తుత జన్మల గురించి వివరిస్తూ అందులోని నీతిని బాబా వివరించారు. “ఎవరు చేసినదానిని వారే అనుభవించవలెను.  ఇతరులతో గల సంబంధములన్నిటిని, బాధను కూడా అనుభవించవలెను.  తప్పించుకొను సాధనము లేదు.  శతృత్వమున్నయెడల దానినుండి విముక్తిని పొందవలెను.  ఎవరికైన ఏమైన బాకీ యున్న దానిని తీర్చివేయవలెను.  ఋణముగాని, శతృత్వశేషము గాని యున్నచో దానికి తగిన బాధ పడవలెను.  ధనమునందు పేరాసగలవానిని అది హీనస్థితికి దెచ్చును.  తుట్టతుదకు వానికి నాశనము కలుగజేయును”.

అందువల్లనే సాయిబాబా తన భక్తులందరినీ ఎల్లప్పుడు నీతి నిజాయితీగా వ్యవహరించమని చెప్పారు.  ఏదిమంచి, ఏదిచెడు అని తెలుసుకొని జ్ఞానం కలిగి ఉండమన్నారు.  ఆయన ఎప్పుడూ “జైసే జిస్ కీ నియత్, వైసీ ఉస్ క్ బర్కత్” (నీవు మంచిగా వ్యవహరిస్తే నీకెప్పుడూ మంచే జరుగుతుందని” ఎప్పుడూ హితోపదేశం చేస్తూ ఉండేవారు.

శ్రీసాయి సత్ చరిత్ర 14వ.అధ్యాయంలో ధబోల్కర్ గారు బృహదారణ్యకోపనిషత్తు గురించి చెప్పారు.  ఆ ఉపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు ‘ద’ యను అక్షరమును బోధించెను.  ఈ అక్షరము వల్ల దేవతలు ‘దమము’ నవలంబించవలెనని గ్రహించారు (అనగా ఆత్మను స్వాధీనమందుంచుకొనుట).  మానవులు ఈ అక్షరమును ‘దానము’ గా గ్రహించారు.  రాక్షసులు దీనిని ‘దయ’గా గ్రహించారు.  దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమం ఏర్పడింది.  తైత్తరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలెనని తెలియచేస్తుంది.  దానము గట్టి విశ్వాసముతోను, ధారాళముగాను, అణకువతోను, భయముతోను, కనికరముతోను చేయాలి.  భక్తులకు దానము గూర్చి భోధించుటకు ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు వారి మనసులను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుతూ ఉండేవారు.
గత జన్మలో చేసుకొన్న పుణ్యంవల్లనే మనకి ఈ మానవ జన్మ లభించింది.  ఈ జీవితంలో భక్తి, ముక్తి సాధించాలంటే ఈ మానవ జన్మతోనే సాధ్యపడుతుంది.  అందుచేత మనం సోమరిగా ఉండకుండా జీవిత లక్ష్యాన్ని సాధించడానికి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని బాబా ప్రధానంగా చెబుతూ ఉండేవారు. 

8వ.అధ్యాయంలో కూడా బాబా ఇదే విషయాన్ని చెప్పారు.  ప్రపంచంలో సమస్త జీవకోటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము.  కాని మానవునికి మరొక ప్రజ్ఞ ఉంది.  అదే జ్ఞానము.  జ్ఞానంతోనే మానవుడు భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలడు.  ఇక మరే జన్మలోను దీనికి అవకాశం లేదు. 

మానవుడు తన మరణ సమయంలో ఏకోరికతోనయితే మరణిస్తాడో మరుజన్మలో వాడు దానిని పొందుతాడు.  
          Image result for images of bhagavadgita
భగవద్గీత 8వ.అధ్యాయం 5,6 శ్లోకాలలో శ్రీకృష్ణపరమాత్మ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
అంత్యకాలమందు ఎవరయితే నన్నే స్మరిస్తారో వారు నన్నే పొందుతారు.  మనుష్యుడు అవసాన దశయందు ఏఏభావములను స్మరించుచు దేహత్యాగమును చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందుచున్నాడు.

వివిధ కారణాలవల్ల మరణసమయంలో మనకి మంచి ఆలోచనలే వస్తాయని ఖచ్చితంగా చెప్పలేము.  వ్యాధులవల్ల వచ్చిన బాధలు, భవిష్యత్తు గురించి, కుటుంబం గురించి ఆందోళన ఇటువంటి కారణాలన్నీ మన మనసులో నిండిపోయి మంచి ఆలోచనలు రావడానికి ఆస్కారం తక్కువ.  అందుచేతనే యోగులందరూ కూడా మరణసమయంలో కలవరపాటు, చికాకులు ఉండకూడదనే నిరంతరం భగవంతుని నామాన్నే ఉచ్చరిస్తూ ఆయన రూపాన్నే ధ్యానిస్తూ ఉండమని చెప్పారు.  ఈలక్ష్యాన్ని సాధించడానికి తెలివైన భక్తులు ఇంకా సులభమయిన ఉపాయాన్ని సాధన చేస్తున్నారు.
ఆఖరి దశలో వారు యోగులను ఆశ్రయించి శరణాగతి వేదుకొంటారు.  సర్వజ్ఞులయిన యోగులే తరింపచేయగలరని నమ్మి వారినాశ్రయిస్తారు.  శ్రీసాయి సత్ చరిత్ర 31వ.అధ్యాయంలో వీటికి సంబంధించిన ఉదాహరణలున్నాయి.  విజయానంద్ సన్యాసి, బాలారామ్ మాన్ కర్, తాత్యా సాహెబ్ నూల్కర్, మేఘుడు, దర్వీషులచేత తీసుకొని రాబడ్డ పులి. వీరందరు షిరిడీలో బాబావద్ద తమ ఆఖరి శ్వాస వదిలారు.

ఆవిధంగా సాయిబాబా తన భక్తుల పునర్జన్మల గురించి చెప్పడమే కాక, మంచి జన్మను ఏవిధంగా పొందాలో జననమరణ చక్రాలనుండి ఏవిధంగా తప్పించుకోవాలో సోదాహరణంగా వివరించారు. 

(రేపు కర్మ సిధ్ధాంతం) 
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List