31.07.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
(5) జనన మరణ చక్రాలు - 1వ.భాగమ్
ఆంగ్లమూలం :
లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదమ్
: ఆత్రేయపురపు త్యాగరాజు
శ్రీసాయిబాబా
ముస్లిమ్ ఫకీరులాగ మసీదులో నివసించినప్పటికీ, ఆయనకు హిందువుల కర్మ సిధ్ధాంతం అనగా జననమరణ
చక్రాలపై నమ్మకం ఉంది. ఆయన
హిందూ భక్తులతో మాట్లాడుతున్నపుడు ఈ సిధ్ధాంతాన్ని గురించి వెనుకటి జన్మలగురించి ఉదహరిస్తూ
ఉండేవారు. కొన్ని చమత్కారాలను చూపించి ఈసిధ్ధాంతం
మీద నమ్మకం కలిగించేవారు.
ఒకనాడు మధ్యాహ్న
భోజనానంతరం శ్యామా, బాబా చేతులను తన తువాలుతో తుడుస్తుండగా బాబా శ్యామా బుగ్గమీద గిల్లారు. శ్యామా కోపాన్ని ప్రదర్శిస్తూ, “దేవా! నా బుగ్గను
గిల్లుట నీకు తగునా? మాబుగ్గలు గిల్లే పెంకి
దేవుడు మాకక్కరలేదు. మేము నీపై ఆధారపడి యున్నామా? ఇదియేనా మన సాన్నిహిత్య ఫలితము?” అన్నాడు.
అప్పుడు బాబా
ఇట్లన్నారు – “శ్యామా! 72 జన్మలనుండి నీవు నాతో ఉన్నప్పటికి నేను నిన్ను గిల్లలేదు. ఇంతవరకు ఎప్పుడు నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్ళకు ఇప్పుడు గిల్లగా నీకు కోపము వచ్చినది.”
అధ్యాయం – 36
అలాగే దురంధర్ సోదరులతో బాబా ఇట్లన్నారు – “గత 60 తరములనుండి
మనమొండురలము పరిచయము
గలవారము”
అధ్యాయం – 50
శ్రీనానా సాహెబ్
చందోర్కర్ సాయిబాబాకు మరొక భక్తుడు. ఆయన అహమ్మద్ నగర్ కలక్టర్ గారి వద్ద సెక్రటరీగా ఉండేవారు.
అప్పసాహెబ్ కుల్ కర్ణి గ్రామ కరణం ద్వారా బాబా అతనిని తన వద్దకు రమ్మనమని ఒక్కసారి కాదు మూడు సార్లు కబురు పట్టారు. ఆఖరికి చందోర్కర్ బాబా వద్దకు వచ్చి తననెందుకు పిలిపించారని
అడిగాడు. అప్పుడు బాబా “ఈ ప్రపంచం మొత్తంమీద
ఒక్కడే నానా ఉన్నాడా? నేను నిన్నే పిలిపించానంటే
దానికేదో కొంత కారణం ఉంటుంది కదా? నేను, నువ్వు
గత నాలుగు జన్మలనుండి కలిసి ఉన్నాము. నీకీసంగతి
తెలీదు. కాని నాకు తెలుసు.” అన్నారు.
గీత 4వ.అధ్యాయం
5వ.శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ ఇదే విషయాన్ని
అర్జునునితో చెప్పాడు.
“బహూని మే వ్యతీతాని
జన్మాని తవ చార్జున I
తాన్యహం వేద
సర్వాణి న త్వం వేత్ధ పరంతప II
ఓ పరంతపా ! అర్జునా
! నాకును నీకును అనేక జన్మలు గడిచినవి. కాని
వాటిని అన్నింటిని నేను ఎరుంగుదును. నీవెరుగవు.
ఒకసారి కొంతమంది
దర్వీషులు ఒక పులిని తీసుకొని వాబా వద్దకు వచ్చారు. వారు దానిని ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకుంటూ
ఉండేవారు. అది ఇప్పుడు జబ్బుతో బాధపడుతుండటం
చేత బాబా వద్దకు తీసుకొని వచ్చారు. అది బాబా
దగ్గరకు రాగానే ఆఖరి శ్వాస వదిలింది.
దర్వీషులు
తమ జీవనోపాధి పోయిందని చాలా విచారించారు. బాబా
వారిని ఓదారుస్తూ పునర్జన్మ సిధ్ధాంతం గురించి ఈవిధంగా చెప్పారు. “క్రిందటి జన్మలో ఆపులి మీకు ఋణపడి ఉంది. ఈ జన్మలో అది మీకు సేవ చేసుకొని ఋణవిముక్తి పొందగానే
నాపాదాల చెంత మరణించింది.”
అధ్యాయం – 31
ఒకరోజు మధ్యాహ్నం
ఖాపర్దేగారి భార్య ఒక పళ్ళెంలో సాంజా, పూరీ, పులుసు, అన్నం, పరమాన్నం, మొదలైనవన్నీ
భోజన సమయానికి మసీదుకు తీసుకొని వచ్చింది.
గంటలకొద్దీ వేచి ఉండే బాబా ఆనాడు వెంటనే లేచి, భోజన స్థలములో కూర్చుండి, ఆమె
తెచ్చిన పళ్ళెంమీద ఆకు తీసి త్వరగా తినడం ప్రారంభించారు. అప్పుడు శ్యామా బాబాని ఇట్లా అడిగాడు. – “ఎందుకింత
పక్షపాతం? ఇతరుల పళ్ళెములను నెట్టివేస్తావు. వాటివైపు అసలు చూడనైనా చూడవు. కాని దీనిని నీవద్దకు ఈడ్చుకొని తృప్తిగా తింటున్నావు. ఈమె తెచ్చిన భోజనం అంత రుచికరంగా ఉందా?”
బాబా ఈ విధంగా
సమాధానం ఇచ్చారు. – “ఈమె భోజనము యదార్ధముగా మిక్కిలి అమూల్యమయినది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలిస్తూ ఉండేది. తరువాతి జన్మలో, ఒక తోటమాలి ఇంటిలో జన్మించి యొక
వర్తకుని వివాహమాడింది. తరువాత ఒక బ్రాహ్మణుని
కుటుంబంలో జన్మించింది. చాలా కాలము పిమ్మట
ఆమెను నేను జూచితిని. కావున ఆమె పళ్ళెమునుండి
ఇంకను కొన్ని ప్ర్రేమయుతమగు ముద్దలను తీసుకొననిండు.
అధ్యాయం – 27
ఆ విధంగా బాబా
ఆమెయొక్క ఎన్నో గతజన్మల వృత్తాంతాన్ని వివరించారు. ఒక ఆత్మకు జంతు జన్మనుంచి మంచిపనులవల్ల బ్రాహ్మణ
జన్మ లభించడం ఏవిధంగా జరుగుతుందో తన భక్తులకు వివరంగా చెప్పడం బహుశా బాబా ఉద్దేశ్యం
అయి ఉండవచ్చు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment