Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, November 14, 2016

భావ తరంగాలు - హేమాజోషి

Posted by tyagaraju on 8:57 AM
         Image result for images of shirdisaibaba
        Image result for images of pink rose


14.11.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీసాయి అంకిత భక్తుడయిన శ్రీనానాసాహెబ్ అనబడే శంకరరావు రఘునాధ్ దేశ్ పాండే నిమోన్ కర్ గారి మునిమనమరాలయిన శ్రీమతి హేమాజోషీ గారు వివరిస్తున్న ఆమె అనుభూతులను ప్రచురిస్తున్నాను.  ఆమె చెప్పిన వివరణ శ్రీసాయిలీలా.ఆర్గ్ నుండి గ్రహింపబడింది.
భావ తరంగాలు
నా సద్గురు సాయినాధ్ మహరాజ్ వారి దివ్య చరణముల వద్ద - హేమాజోషి
జోడునియా కర చరణి ఠేవిలా మాథా
పరిసావీ వినంతీ మాఝీ సద్గురునాథా
అసోనసో భావ ఆలో తుఝియా ఠాయా
కృపాదృష్టి సాహే మజకడే సద్గురు రాయా
అఖండీత సావే ఐసే వాటతే పాయీ
సాండూనీ సంకోచ్ ఠావ్ థోడాసా దేయీ
తుకాహ్మణే దేవా మాఝీ వేడీవాకుడీ
నామేభవ పాశ్ హాతి ఆపుల్యాతోడీ
(కరములు జోడించి నీ చరణములపై నాశిరస్సునుంచాను.  ఓ సాయినాధా నావినతి విను.  నాకు భక్తి ఉన్నదో లేదో! నీ దరి చేరాను.  సద్గురు రాజా, నన్ను కృపాదృష్టితో చూడుము.  నీ అఖండ పాదసేవ కోరాను.  సంకోచించక నీ హృదయంలో నాకు స్థానమిమ్ము.  తుకారాము వేడినట్లు నా నామస్మరణలోని లోపాలు మన్నించి నా భవపాశము (కర్మబంధము)ను తొలగించుము.)


షిరిడీలో రామనవమి ఉత్సవం జరుగబోతున్న రోజు.  ఆ రోజున అరుణోదయ కాలం ఎంతో మనోహరంగా ఉంది.  షిరిడీ గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి ఆ తరంగాలు భక్తుల మదిలో ఒక విధమయిన ఆహ్లాదాన్ని నింపుతున్నాయి.  తెలతెలవారుతుండగా చెట్లమీద నివసించే పక్షులు ముందరే నిద్రలేచి కుహు కుహు మని కూస్తూ ఉన్నాయి.  ఆపక్షులు చేసే కిలకిలా రావాలు ఉదయించే సూర్యునికి తీయని పాటలు పాడుతూ ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది వాతావరణం.  షిరిడీ అంతా భూపాల రాగంతో నిండి ఆధ్యాత్మిక పవనాలు వీస్తూ భక్తుల మదిని ఆనందంతో ముంచెత్తుతున్నాయి.  సద్గురు సాయినాధుని మందిరంలో ఉదయాన్నే కాకడ ఆరతి ప్రారంభమయింది.  ఆమధురగాన తరంగాలు షిరిడీ అంతటా వ్యాపిస్తూ అక్కడ ఉన్న భక్తులందరి హృదయాంతరాళాలలో ప్రవేశించి తమ ప్రియమయిన సద్గురు సాయినాధునిపై  ప్రేమను, భక్తిని మరింతగా పెంపొందింపచేస్తున్నాయి.  ఆసమయంలో షిరిడీలోని వాతావరణం ఎంతో పవిత్రంగాను. మనోజ్ఞంగాను ఉంది.  ఆసమయంలో అక్కడ ఉన్న భక్తులందరి హృదయాలు సాయినాధునిపై భక్తితోను ప్రేమతోను నిండిపోయాయి.  వారందరి హృదయాలలో సాయినాధునిపై ప్రేమ తప్ప మరేమీ లేదు.  ప్రేమ – ప్రేమ – ప్రేమ – భక్తి.
                       Image result for images of kakad arati at shirdi

“నా సాయి! నా ప్రియమైన సద్గురు సాయిబాబా!! నాహృదయమంతా నా సాయినాధునిమీదనే భక్తితో నిండిపోయి ఆ ఆనంద తరంగాల ప్రభావంతో నా కళ్ళనుండి ప్రేమాశ్రువులు ధారగా కారుతున్నాయి.  నా ఆధ్యాత్మిక గురువయిన సాయినాధునిపై భక్తి ప్రపత్తులతో కూడిన ప్రేమ నా శరీరాన్నంతా ప్రకంపనాలను కలిగిస్తోంది.

వీనులవిందుగా వినిపిస్తున్న మధురమయిన సంగీత తరంగాలకు అనుగుణంగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాను.  నాతోపాటుగా నాసోదరులు చంద్రశేఖర్, అనంత్, నాసోదరీమణులు నిమ, ఉమ, మంగళ్ ఉన్నారు.  మేమంతా సద్గురు సాయినాధునికి అత్యంత ప్రియతమ భక్తుడయిన స్వర్గీయ నానా సాహెబ్ నిమోన్ కర్ దేశ్ పాండేగారి మునిమనుమళ్ళం, ముని మనమరాళ్ళం.  మేమంతా తెల్లవారుఝామునే లేచి స్నానాలు కానిచ్చి తొందర తొందరగా ద్వారకామాయిలోకి ప్రవేశించాము.  నామనసంతా సంతోషంతో నిండిపోయింది.  నా మదినిండా మధురానుభూతులు, ఏదో తెలియని ఆనందం.  ఈరోజు షిరిడీలో రామనవమి ఉత్సవం.  నాప్రియమైన సద్గురు సాయినాధుని పవిత్రమయిన సమాధి మీద మంగళకరమయిన జండాలకు మేము మహాపూజ నిర్వహించాల్సి ఉంది.  ఆసమయంలో మందిరంలో భజనలు, కీర్తనలు జరుగుతాయి.  మేము సమాధిపై చందనం పూయాలి.  సమాధిమీద జండాలను పరచి, వాటిమీద సుగంధపరిమళాలు చల్లి గులాబీ దండలను, మధురపదార్ధాలను సమర్పించాలి.  ఆ తరువాత జరిగే బ్రహ్మాండమయిన ఉత్సవంలో ఆ జండాలను మా భుజాలపై మోసుకుంటూ సాగాలి.  ఈ ఉత్సవంలో జరిగే ప్రతిపనీ ఎంతో సంతోషంగా ఆనందంగా జరుగుతుంది.  ఈ రామనవమి ఉత్సవం బాబాపై స్వచ్చమయిన భక్తి ప్రేమలతో నిర్వహించబడుతూ ఉంటుంది.

మేము ద్వారకామాయిలోకి ప్రవేశించగానే ఎఱ్ఱటి రంగు ముఖమల్ వస్త్రంపై ఉంచిన సాయిబాబావారి పెద్ద చిత్రపటం మాదృష్టిని ఆకర్షించింది.  బాబా తనదైన ప్రత్యేకమయిన భంగిమలో కూర్చుని ఉన్నారు.  ఆయన నుదిటిపై త్రిపుండ్రం, (విభూతియొక్క మూడు రేఖలు) తెల్లటి కఫనీ, తలకు చుట్టబడిన తెల్లటి వస్త్రంతో ఆయన రూపం ఎంతో మనోహరంగా ఉంది.  ఆయన నేత్రాలు ఎంతో ప్రకాశవంతంగా మావైపు కరుణాదృక్కులతో చూస్తున్నట్లుగా ఉన్నాయి.  ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయంటే, ఆకళ్ళలో ప్రేమ, కరుణ, అనుగ్రహంతో నిండి “నేను మీరాకకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను.  మీరు నాబిడ్డలు.  ఎంతో సేపటినుండి మీ కోసమే వేచిఉన్నాను. “ అని మాతో మాట్లాడుతున్నట్లుగా ఉన్నాయి.
                      Image result for images of shirdisaibaba

నాప్రియమయిన సద్గురు సాయిపై ఆయనే నామాతృమూర్తి అనే భావన నాలో కలిగింది.  ఆప్రేమ తరంగాలు నా హృదయంలో ఉవ్వెత్తున లేచాయి.  వెంటనే ముందుకు పరుగున వెళ్ళి ఆయన పాదాలవద్ద వినమ్రతతో నా శిరసునుంచాను.  నాకళ్ళనుండి ధారగా కన్నీళ్ళు కారుతున్నాయి.  ఆ భావోద్వేగంతో నాగొంతునుండి వెక్కిళ్ళతో ఏడుపు వస్తోంది.  ఆయన నాపై చూపుతున్న అనుగ్రహానికి నాశరీరంలో ప్రకంపనలు రావడంతో వణుకు కూడా ప్రారంభమయింది.  నా కన్నీరు ఆయన పవిత్రమయిన పాదాలను అభిషేకం చేస్తోంది.  ఏమి జరుగుతోందో నాకేమీ తెలియడంలేదు. “నాసాయి! నా సద్గురు సాయి! నాకోసం నువ్వు నిజంగా అంతలా ఎదురు చూస్తున్నావా? నేనెంత అదృష్టవంతురాలిని.  నువ్వు మా  సద్గురువే కాదు. తల్లి, తండ్రి, అన్నీ నువ్వే.  ఈప్రపంచంలో అత్యంత విలువయినది ఏదయితే ఉన్నదో అదే నీవు.  నీకు సాటి మరేదీ లేదు.  మా సర్వస్వం నువ్వే.  నువ్వే మా గురువు, మాతృమూర్తి.  మా పూజలను ప్రేమతో అనురాగంతో స్వీకరించు సాయీ!”
                   Image result for images of shirdisaibaba
ఆ సమయంలో అనిర్వచనీయమయిన భావతరంగాలు నామదిలో ప్రవహించసాగాయి.  ప్రతీ రామనవమి రోజున ఉదయాన్నే మేము ద్వారకామాయిలో ఆయన పటంముందు కూర్చుని సాయిసత్ చరిత్రను పారాయణ చేస్తూ ఉంటాము.  ఈ విధంగా మేము ఎప్పటినుండో ప్రతిసంవత్సరం ఈ పవిత్ర గ్రంధాన్ని పారాయణ చేస్తూ ఉన్నాము.  ఇప్పటికీ అదేవిధంగా కొనసాగిస్తూ వస్తున్నాము.  ఆయన ప్రశాంతమయిన వదనాన్ని చూస్తున్నప్పుడెల్లా నామనసులో ఆయనపై  ప్రేమ, భక్తి ఎంతో బలీయంగా ఉత్పన్నమవుతూ ఉంటాయి.  ఈ రోజు జరిగినట్లుగానే ఎప్పుడూ నా ఆనందాశ్రువులు ఆయన పాదాలను అభిషేకిస్తూ ఉంటాయి.  నాజీవితంలో సాయిబాబాపై ఇటువంటి పవిత్రమయిన ప్రేమానుభూతి చాలా మహత్తరమయినది.  ఆయన నామాతృమూర్తి అనే భావన. నేను ఆయనను అత్యధికంగా ప్రేమించే కుమార్తెను.  ఏమీ తెలియని వట్టి అమాయకురాలను.  నాకు ఆయన యొక్క మాతృ ప్రేమ కావాలి.  ఆయనని ప్రేమించడం, ఆరాధించడం అంతే నాకు తెలుసు. తరతరాలుగా మా వంశంలో ఒక సద్గురువుకు, శిష్యునికి మధ్య ఉన్న శాశ్వతమయిన అనుబంధం ఉన్నదని చెప్పడానికి ఇదే తార్కాణం. 

ఇటువంటి అనుభూతి, అనుభవాలు ప్రతి సాయి భక్తునికి గతంలోను జరిగాయి, ఇప్పటికీ ఇంకా జరుగుతూ ఉన్నాయి.  నిజం చెప్పాలంటే సాయిబాబా వారందరికీ ప్రత్యక్ష కులదైవం.  మనస్ఫూర్తిగా ఆయనని ప్రార్ధిస్తే మీరు చేసే ప్రార్ధనలు ఆయనకు తప్పక చేరతాయి.  సాయిబాబాతో ఆధ్యాత్మికంగా బంధం ఏర్పరచుకోవడానికి మీరు చేసే పవిత్రమైన కార్యానికి  మధ్యవర్తులెవరూ అవసరం లేదు.  

(ఈ ఆనంద తరంగాలు ఇంకా ఉన్నాయి)
(ఈ నెల 16 న బొంబాయికి వెళ్ళి అక్కడి నుండి కొల్హాపూర్, పండరీపురం యాత్రలకు వెడుతున్నాను.  మరలా 25వ.తేదీకి తిరిగి వస్తాను.  తరువాయి భాగం రేపు అనువాదం చేసి ప్రచురించడానికి ప్రయత్నిస్తాను.  కారణం బ్యాంకులో డబ్బులు డ్రా చేయాలంటే  బ్యాంకు వద్ద వరుసలో నిలబడి పని పూర్తి చేసుకోవాలి కదా!)


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List