09.10.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
ఈ రోజు సాయిసుధ డిసెంబరు
1943 సంచికలో ప్రచురింపబడిన ఒక సాయిలీల ప్రచురిస్తున్నాను.
సాయి దత్తావతారమ్
సాయిబాబా తనను సందర్శించడానికి
వచ్చే భక్తులనుండి దక్షిణ స్వీకరిస్తూ ఉండేవారు.
ఆవిధంగా స్వీకరించిన దక్షిణని మరలా పేదలకు, అవసరంలో ఉన్నవారికి పంచిపెట్టేస్తూ
ఉండేవారు. ఈ విధంగా బాబా తన భక్తుల చెడుకర్మలను
అంతం చేస్తున్నానని తను దక్షిణ స్వీకరించడంలోని ఆంతర్యాన్ని తెలియచేసారు.
1943 వ.సంవత్సరం నవంబరు
నెలలో దత్తాత్రేయస్వామి భక్తుడు యువకుడయిన ఒక స్వామీజీ గూటీ వచ్చారు. బళ్ళారి దగ్గర ఉన్న శ్రీధరగుట్ట అనే గ్రామంలో దత్త
సప్తాహం జరపడానికి చందాలు వసూలు చేయడానికి తన శిష్యుల దగ్గరకు వెడుతూ ఆయన మార్గమధ్యంలో
ఉన్న గూటీకి రావడం తటస్థించింది. నేను ఆయన
దర్శనం చేసుకుని, మాయింటికి వచ్చి పాలు పండ్లు స్వీకరించమని ఆహ్వానించాను. ఆయన గురువారంనాడు మాయింటికి వచ్చారు. మాయింటిలో బాబాకు జరిగిన పూజను చూసి చాలా సంతోషించారు. బాబా దత్తాత్రేయులవారు ఇద్దరూ ఒకటేనని నా అభిప్రాయాన్ని
వివరించాను.
ఆ మరుసటి రోజు రాత్రి
బాబా నాకు స్వప్నంలో దర్శనమిచ్చారు. ఆ కలలో, బాబా
నా చేతిలో రూ.20/- ఉంచి స్వామీజీకి యివ్వమని ఆదేశించారు. ఆక్కడే ఉన్న మరొక భక్తుని సమక్షంలో బాబా ఆ డబ్బును
నా చేతిలో పెట్టారు. ఆ భక్తుడు తాను కూడ అదేవిధంగా
స్వామీజీకి రూ.20/- ఇచ్చినట్లు చెప్పాడు.
మరుసటి గురువారమునాడు మాయింటిలో జరిగే పూజ సమయానికి రమ్మని స్వామీజీని ఆహ్వానించాను. బాబా నాకు కలలో దర్శనమిచ్చిన విషయం అంతా వివరంగా
చెప్పి ఆయనకు రూ.20/- దక్షిణ సమర్పించాను.
బాబా నాకు స్వప్నానుభవం
ఇవ్వకపోయినట్లయితే సామాన్యంగా నేనాయనకు ఇరవై రూపాయలు ఇచ్చి ఉండేవాడిని కాదు. బాబా తాను మహాసమాధి చెందినా గాని, తాను జీవించి
ఉన్నపుడు ఏవిధంగా తన భక్తులకు అనుభవాలనిస్తూ వచ్చారో అదేవిధంగా ఈనాటికీ అనుభూతులను
పంచుతూ ఉన్నారు. భక్తుడు ఎవరయినా ఆయనకి శరణాగతి
చేస్తే చాలు బాబా ఆ భక్తుని యోగక్షేమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. బాబా సశరీరంగా ఉన్నపుడు ఏవిధంగా చేసేవారో ఇప్పటికీ
అదేవిధంగా తనభక్తులను కాపాడుతూ వస్తున్నారు.
దానికి ఎన్నో దృష్టాంతాలను నేను మీకు చూపగలను.
ఎన్. సుబ్బారావు,
ప్లీడర్, గూటీ
శ్రీసాయి సురేష గారు వాట్స్ ఆప్ గ్రూప్ లోని ఒక సాయి భక్తుని అనుభవాన్ని పంపించారు. దానిని యధాతధంగా ప్రచురిస్తున్నాను.
షిర్డీ సాయిబాబా whatsapp
గ్రూప్ సభ్యులు సుబ్రహ్మణ్యం గారి అనుభవం
సాయి బంధువులందరికి నమస్కారములు. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం. నా జీవితంలో ఇటీవల బాబా చేసిన ఒక అద్భుతం గురుంచి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. బాబా తన భక్తులపాలిట ఆపద్భాందవుడనని ఈ సంఘటన ద్వారా నిరూపించారు.
6 నెలల క్రిందట ఒకరోజు సాయంత్రం నేను, నా భార్య పని మీద బజారుకి బయలుదేరాము. నేను ఫిజికల్లీ హాన్డీకాప్డ్.
నాకు ఒక tricle(మూడు చక్రాలు ఉన్న స్కూటర్) వుంది. మేము దాని మీద బయలుదేరాము. మా వీధి నుండి ప్రధాన వీధికి మలుపు తిరగ్గానే వెనుక నుండి తెలిసిన వాళ్ళు మమ్మల్ని పిలిచారు.
మేము స్కూటర్ ఆపి వెనక్కి తిరిగాము. కాని వాళ్ళు పిలిచింది మాకు ముందు నుండి రాబోతున్న పెద్ద
ప్రమాదం గురుంచి హెచ్చరించడానికి. అది మేము గుర్తించే లోపు మాకు ఎదురుగా 15 బర్రెలు(ఎద్దులు) బెదిరిపోయి పరిగెడుతూ మా పైకి వస్తున్నాయి. వాటి వెనుక ఒక ఒంటెద్దు బండి (ఆ ఎద్దు కూడా బెదిరిపోయివుంది) వీటిని తరుముతున్నది. ఇక మాకు తప్పించుకునే అవకాశం లేదు. నేను ఫిజికల్లీ హ్యాండికేప్డ్ వ్యక్తిని ఐనందున పక్కకి
పరిగెత్తలేను. మా ఆవిడ కూడా నన్ను వదిలి వెళ్ళలేదు. ఇక ఇద్దరం మా అంతర్యామి అయిన బాబానే శరణం అనుకొని
ఆయననే స్మరిస్తూ ఉండిపోయాము. .మా పక్కవారు అందరు ఏమి చేయాలో తోచక చూస్తూ ఉండిపోయారు. మాకు సహాయం చేసే వాళ్ళేలేరు. అప్పుడే ఒక విచిత్రం జరిగింది. ఎవరో ఆదేశించినట్లుగా ఆ బర్రెల గుంపు రెండు పాయలుగా
విడిపోయి మా పక్కనుంచి వెళ్లిపోయాయి. కానీ ఎద్దుల బండి మాత్రం నా పైకి వస్తున్నది. నేను బాబా నువ్వే నాకు రక్ష అని అనుకున్నాను. బండి నా పైకి వచ్చి సరిగ్గా బండి కాడిమాను అంటే ఎద్దు మెడపై వుండే పెద్ద కొయ్య నా మెడకి కేవలం ఒక అంగుళం దూరంలో నుండి పక్కనుంచి వెళ్ళిపోయింది. నాకు మా ఆవిడకు ఏమి జరగలేదు. పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బాబా నాముందు నిలుచుని నాకు కనిపించారు. ఇంతటి కరుణని చూపిన ఆదయాళువుకి శత కోటి వందనాలు చెప్పుకున్నాను.
సాయి శరణం.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(రేపటి సంచికలో నాగసాయి)
0 comments:
Post a Comment