(నాగ మల్లె పూవు)
10.10.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
ఈ రోజు సాయిలీల మాసపత్రిక
డిసెంబరు, 1980 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన మరొక అధ్భుతమైన సాయిలీలను ప్రచురిస్తున్నాను. నిన్నటి సంచికలో ఈ రోజు ప్రచురిస్తానని చెప్పడం
వల్ల అనువాదమ్ పూర్తిగా చేయలేకపోయినా, మొదటి భాగం ప్రచురిస్తున్నాను. దీనిలో కోయంబత్తూర్ లో ఉన్న నాగసాయి మందిరం గురించిన
ప్రస్తావన వస్తుంది. దాని గురించి మరికొంత
సమాచారాన్ని నాగసాయి మందిరం ట్రస్ట్ వారి సైట్ నుంచి ఇద్దామనుకున్నాను. కాని దానికి కాపీ రైట్ ఉండటం వల్ల వారిని ఫోన్ ద్వారా
సంప్రదించాను. వారు కూడా తమ అనుమతిని ఫోన్
లోనే తెలియచేసారు. కాని మైల్ ద్వారా వారి అనుమతిని
పంపించమని చెప్పాను. వారు ఈ రోజు సాయంత్ర్రం
మైల్ చేస్తామన్నారు. కాని ఇంకా రాలేదు. అది రాగానే అందులోని విషయం కూడా మీకు ఫొటోలతో సహా
అందిస్తాను.
మరొక ముఖ్య విషయం సాయిభక్తులందరికీ తెలియచేయమని చెప్పారు. నవంబరు 2017, 12, 13 తేదీలలో కోయంబత్తూరులో ఉన్న నాగసాయి మందిరంలో బాబా పాదుకల దర్శనం ఉంటుందని చెప్పారు.
నాగసాయి మందిరం గురించి కొంత సమాచారమ్, నాగసాయి మందిరంలో జరిగే లైవ్ దర్శన్ కోసం
www.srinagasai.com మరియు www.srinagasai.com/live లలో చూడవచ్చును.
లైవ్ దర్శన్ సమయాలు కూడా గమనించండి.
సాయిబాబాతో శ్రీ దేవత సుబ్బారావుగారి అనుభవాలు
నాగసాయి
1947 వ.సంవత్సరంలో నేను
తెలుగులో బాబామీద పద్యాలతో మొట్టమొదటి పుస్తకాన్ని రచిస్తూ ఉన్నాను. మొత్తం 200 పద్యాలపైగా ‘అంజలి’ అనే పేరుతో 1948
లో ఆపుస్తకం ప్రచురితమయింది. ప్రతిరోజూ రాత్రి
పద్యాలను రాస్తూ ఉండేవాడిని. ఆసమయంలో కోయంబత్తూరులో
సాయిబాబా మందిరంలో భజనలు, ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి.
ఆవిధంగా ఉత్సవాలు జరుగుతున్న రోజులలో వార్తా పత్రికలలో మంచి ఆసక్తికరమయిన ముఖ్యమయిన
వార్తలు ప్రచురింపబడ్డాయి. బాబా మందిరంలో బాబా
విగ్రహం ప్రక్కనే ఒకనాగుపాము వచ్చి కూర్చుంటూ ఉందనే వార్త. అక్కడ ఎంతోమంది భక్తులు భజనలు చేస్తూ ఉన్నా ఆ శబ్దాలకి, అక్కడ ఉన్న భక్తులకి ఏమాత్రం భయపడకుండా పడగ విప్పి కూర్చుంటూ ఉందని పత్రికలలో రాసారు. పత్రికలలో ప్రచురింపబడ్డ వార్తల ప్రకారం భక్తులు
ఆ సర్పానికి పూలు, పండ్లతోపాటుగా ఆరతిని కూడా యిచ్చేవారట. వార్తాపత్రికలలో ఫోటోలను కూడా ప్రచురించారు. ఆ నాగుపాము తన దగ్గరకు వచ్చిన భక్తులెవరి మీదా బుసకొట్టేది
కాదని కూడా రాసారు. దానికి భక్తులందరూ నాగసాయి
అని పిలవసాగారు.
(ఫోటోలను పైన ఇచ్చిన వెబ్ సైట్ లో చూడవచ్చును)
ఈ వార్త నామనసులో చెరగని
ముద్రవేసింది. ఒకరోజు రాత్రి నాగసాయి మీద పద్యాలను
రచిస్తూ అందులో నిమగ్నమయి ఉన్నాను. నా భార్య
వరండాలో వాలుకుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంది. మా యింటిలోకి 1940 వ.సంవత్సరంలో సాయిపూజను పరిచయం
చేసినది నాభార్యేనని నేను ఇంతకుముందు వ్రాసిన వ్యాసాలలో వివరించడం జరిగింది. అకస్మాత్తుగా ఆమెకి వరండాలో ఒక నాగుపాము పడగవిప్పుకుని
కనిపించింది. నా భార్య ఒక్కసారిగా అరవడంతో
నేను గదినుంచి బయటకు వచ్చాను. కాని ఆ నాగుపాము
వెంటనే అదృశ్యమయిపోయింది. నాకు ఆ నాగుపాము యొక్క
దర్శనం లభించకపోవడం నా దురదృష్టమని భావించాను.
మరుసటిరోజు ఉదయం నా గురువుగారయిన సంగమేశ్వర కవిగారు మాయింటికి వచ్చారు. నాభార్యకి నాగసాయి దర్శనం కలిగిందనడానికి ఆ సంఘటనే ప్రత్యక్ష
ప్రమాణమని వివరించారు.
1940 వ.సంవత్సరంలో శ్రీకాకుళంలో
మంచి చిత్రకారుడయిన శ్రీ కె.నరసింహన్ చేత బస్ట్ సైజ్ సాయిబాబావారి లైఫ్ సైజ్ పెయింటింగ్
చేయించాను. అప్పటినుంచి ఆ పెయింటింగ్ మా గృహంలో శోభాయమానంగా విరాజిల్లుతూ ఉంది. ఆ తైల వర్ణ చిత్రాన్ని ఎంత అధ్భుతంగా చేసి యిచ్చాడంటే
ఆ చిత్రపటాన్ని చూసేవారు ఏ చోట నిలబడి చూసినా బాబా కళ్ళు వారినే చూస్తూ ఉన్నట్లుండేలా
చిత్ర్రించాడు. ఎంతమంది వచ్చి ఏమూలనుంచి ఎ కోణంలో నిలబడి
చూసినా బాబా తమ వైపే చూస్తూ ఉన్నట్లుగా అనుభూతి చెందేవారు. చూసినవారందరూ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవారు.
ఆ చిత్రకారుడు చిత్రించిన అధ్భుతమయిన చిత్రకళ ఎంతో మెచ్చుకోదగ్గది. 1954 లేక 1955 వ సంవత్సరంలో బాపట్లనుంచి ప్రముఖ న్యాయవాదయిన
శ్రీ ఎమ్.కాళిదాస్ గారు మాయింటికి వచ్చారు.
మాయింటిలో ఉన్న బాబా చిత్రపటం ఆయనను అమితంగా ఆకర్షించింది. తనకు కూడా అటువంటి చిత్రపటమే కావాలని, ఆ చిత్రకారునితోనే
మరొకదానిని తయారుచేయించమని నన్ను కోరారు. నేను
ఆ చిత్రకారునికి ఉత్తరం వ్రాసి అటువంటిదే మరొకటి చిత్రించి పంపమన్నాను. కొద్ది రోజుల్లోనే కాళిదాస్ కోరుకున్నట్లుగానే మరొక
సాయిబాబా చిత్రపటాన్ని పంపించారు. ఆ పటం కూడా
చాలా అధ్భుతంగా ఉంది. బాబా చూపులలో కనిపించే కరుణామృతం చూచేవారిని కట్టిపడేసి మంత్రముగ్ధులను
చేసే విధంగా ఉంది. నేను వివరించినట్లుగా బాబా
చూపులు ఆయనని ఆకర్షించినట్లుగా నాకు అనిపించలేదు.
ఆ చిత్రాన్ని చూసిన వెంటనే కాళిదాస్ గారి స్పందన నన్ను చాలా నిరుత్సాహపరిచింది. ఆ చిత్రపటం కాళిదాస్ గారిని ఆకర్షించలేకపోయినందుకు
నాకు చాలా బాధ కలిగింది. కాని ఆమరుక్షణమే కాళిదాస్ గారు మళ్ళీ ఆపటాన్ని పరిశీలించి చూశారు.
చూడగానే ఎంతో తన్మయత్వంతో “ఎంత అధ్బుతమయిన చిత్రకళ - నేను దీన్ని వదులుకోలేను” అన్నారు. ఆయన ముఖంలోని సంతోషాన్ని చూసిన తరువాత నాకు చాలా
ఆనందం కలిగింది.
1957 వ.సంవత్సరంలో నాకు
తెలియకుండానే మానవరూపంలో ఉన్న ఒక త్రాచును అణగద్రొక్కాను. నాకు జిల్లా సెషన్స్ జడ్జీగా పదోన్నతి వస్తుందని
ఎదురు చూస్తున్న సమయం. నా ఉద్యోగ విధులలో ఎటువంటి
మచ్చ లేకుండా మంచి రికార్డు ఉన్నదనే అహంకారం ఉంది. అంతే కాదు ప్రమోషన్ నాకు కాక మరెవరికి వస్తుందనే
ధృఢ చిత్తంతోను, అహంభావంతోను ఉన్నాను. నాకు పదోన్నతి
ఎపుడు వస్తుందో కూడా తేదీతో సహా చెప్పేసాను.
దురదృష్టవశాత్తు అనుకోకుండా ఈ ‘సజ్జనుడి’ వల్లనే నాకు అసంతృప్తి కలిగిందనే వాస్తవాన్ని
నేను గుర్తించలేకపోయాను. 13 సంవత్సరాల క్రితమే
నేను పదవీ విరమణ చేసినప్పటికీ నేనాయనను బాధపెట్టాననే విషయాన్ని తెలుసుకోలేని అజ్ఞానిని. నా ఊహకి అందకుండా ఆ సజ్జనుడు ఎంత చెడు చెయ్యాలో
అంతా చేసాడు. ఒక రోజు ఉదయం ప్రొమోషన్ లిస్ట్
చూసాను. అందులో నాపేరు లేదు. నా జూనియర్ కి ప్రమోషన్ వచ్చింది. చాలా తెలివిగా ఎంతో నేర్పుతో నన్ను పక్కనపెట్టి
నా జూనియర్ కి ప్రమోషన్ ఇచ్చారు.
(మిగిలినది రేపటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment