12.10.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నాగసాయి రెండవభాగం నిన్న పనుల వత్తిడిలో ప్రచురించలేకపోయాను. ఈ రోజు ప్రచురిస్తున్న రెండవభాగంలో అధ్భుతమైన సంఘటనలను చదవండి. సాయిలీల 1980 సంచిక, సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
నాగసాయి - 2 వ.భాగమ్
సాయిబాబా - దేవత సుబారావు
నన్ను పక్కన పెట్టి నా
జూనియర్ కి ప్రమోషన్ ఇవ్వడంతో బాబా మీద కూడా నాకు కోపం వచ్చింది. నా ప్రమోషన్ కి అడ్డుపడి నాకింతగా దెబ్బ తగలడం నేను
తట్టుకోలేకపోయాను. డిప్యూటీ ఇన్స్ పెక్టర్
ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్న నాస్నేహితుడు నన్ను ఓదార్చడానికి మాయింటికి వచ్చాడు. నాకెవరయిన్నా ప్రముఖ వ్యక్తి తెలుసుంటే కనక ఆయన చేత
చెప్పించి చూడమని సలహా యిచ్చాడు. నాకు ఉద్యోగంలో
మంచి రికార్డ్ ఉండటం, నాలో అహంకారం, అహంభావం ఉండటం వల్ల ఎవరిదయినా సహాయం తీసుకోవాలనే ఆలోచన అప్పటివరకు
నాకు రాలేదు.
వెంటనే నామనసు సాయి చరణాల మీదకు
మళ్ళింది. ఈ కష్ట సమయంలో నాకు బాబా గుర్తుకు
రానందుకు పశ్చాత్తాపం కలిగింది. కళ్ళలో నీళ్ళు
తిరుగుతుండగా నాస్నేహితునితో, “అవును, మర్చేపోయాను, నేను సహాయం అర్ధించడానికి నాకు
ఒక మహోన్నతమయిన వ్యక్తి ఒకరున్నారు. ఇంత చిన్న
విషయానికి ఆయన సహాయం తీసుకోవడానికి నేను చాలా సిగ్గు పడుతున్నాను” అన్నాను. ఆ మహోన్నతమయిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే ఆత్రుతతో
ఎవరా వ్యక్తి అని అడిగాడు. 1940 నుంచి నాకు
తోడునీడగా నన్ను రక్షిస్తున్న వ్యక్తి సాయిబాబా అని చెప్పాను. బాబా నాకెప్పుడూ అన్యాయం చేయలేదని చెప్పాను. బాబా మీద నాకున్న ప్రగాఢమయిన విశ్వాసానికి నా స్నేహితుడు
చాలా ఆశ్చర్యపోయాడు. మొట్టమొదటిసారిగా నా ప్రమోషన్
కోసం సాయిబాబాకు విన్నవించుకున్నాను. ఆయనకు
నా విన్నపాన్ని విన్నవించుకున్న కొద్ది రోజులలోనే నాకు ప్రమోషన్ ఆర్డర్స్ వచ్చాయి. నా అహంకారానికి నామీద నాకే ఏర్పడిన విపరీతమయిన నమ్మకానికి బాబా నాకు విధించిన చిన్న శిక్ష అని భావించాను. ఎవరికయినా సరే ఉద్యోగ బాధ్యతలలో మంచి రికార్డు ఉండటమే
కాదు, అహంకారం, పొగరుమోతుతనం ఉండకూడదనే గుణపాఠాన్ని నేర్చుకున్నాను.
1960 వ.సంవత్సరంలో నేను
ఆదిలాబాద్ లో జిల్లా సెషన్స్ జడ్జీగా ఉన్న రోజులు. ప్రభుత్వంవారు నాకు ఎత్తయిన ప్రదేశంలో మంచి బంగళాను
కూడా ఇచ్చారు. ఆ బంగళా మంచి విశాలమయిన ప్రదేశం
మధ్యలో ఉంది. బంగళా చూట్టూ విశాలమయిన ఆవరణ. ప్రతిరోజు క్లబ్ కి వెళ్ళి పేకాట
ఆడి రాత్రి 9 గంటలకి ఇంటికి తిరిగి వస్తూండేవాడిని. నేను వచ్చేంత వరకు నా భార్య బయట లాన్ లో కరెంటు
దీపం దగ్గరకూర్చుని ఏదయినా పుస్తకం గాని, పేపరు గాని చదువుకుంటూ ఉండేది. మా పెంపుడు కుక్క (Cocker Spaniel breed) తన తలని నాభార్య కాళ్ళమీద తల వాల్చుకుని పడుకునేది.
(Cocker Spaniel breed dog)
ఒకరోజు సాయంత్రం ఒక పెద్ద చిరుతపులి (huge panther - ఒకరకమయిన నల్లటి చిరుతపులి) హటాత్తుగా
మా ఆవిడముందుకు దుమికింది.
భయంతో నాభార్య బాబాను
స్మరించుకుంది. ఆమె మనసులోకి కేవలం బాబా మాత్రమే మెదిలారు. దగ్గరలోనే చాలా మంది బంట్రోతులు
ఉన్నారు. కాని ఈ సంఘటన ఒక్క క్షణంలో జరిగింది. క్షణంలోనే ఆ చిరుతపులి నాభార్య పాదాల దగ్గర పడుకున్న
కుక్క మెడను కరచుకొని వెళ్ళిపోయింది. ఆ పులి నాభార్య పాదాలను తాకనయినా తాకలేదు. ఈ వార్త
క్లబ్బులో ఉన్న నాకు వెంటనే తెలిసింది. క్షణం
కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నేను ఇంటికి బయలుదేరాను. నాతో కలెక్టర్ గారు, D S P గారు కూడా తోడుగా వచ్చారు. ఇంటికి వచ్చినా మేము చేయగలిగిందేమీ లేదు. కాని, పాపం మాపెంపుడు కుక్క మాత్రం ఆ పులికి తన ప్రాణాలనర్పించింది. మా కుక్కకు అటువంటి దుస్థితి కలిగినందుకు చాలా విచారం కలిగినా, నాభార్యకు ఎటువంటి హాని జరగనందుకు బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము.
మాకుటుంబం మీద బాబా చూపిన
కరుణకి, అనుగ్రహానికి మేమాయనకు ఎంతగానో ఋణపడి ఉన్నాము.
ఇక చివరగా నాఅనుభవాలలో
అతి ముఖ్యమయిన ఆసక్తికరమయిన సంఘటనని వివరిస్తాను.
1955 వ.సంవత్సరంలో నాభార్య చాలా అనారోగ్యంతో బాధపడసాగింది. స్థానికంగా ఉన్న లేడీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షించి
అది కాన్సర్ వ్యాధి కావచ్చని, మద్రాసు తీసుకునివెళ్ళి సర్జరీ చేయించమని చెప్పింది. నేను ఈ విషయాన్ని నాభార్యకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. కాని నాకళ్ళలోనించి వచ్చే కన్నీటిప్రవాహాన్ని మాత్రం ఆపుకోలేని
స్థితిలో ఉన్నాను. బాబా దయవల్ల తనకు నయమవుతుందని
బాధపడవద్దని నాభార్య నన్ను ఓదార్చింది. డాక్టర్
కు వచ్చిన అనుమానం గురించి ఆమెకు ఏమీ తెలియదు.
అదే రోజు నేను డా.లక్ష్మణస్వామి మొదలియార్ గారిని నాభార్య కేసు విషయం గురించి ఫోన్ లో సంప్రదించాను. కాని తను మరుసటి రోజే జెనీవా
వెడుతున్నానని అందుచేత ఈ కేసుని తను చేయలేనని చెప్పారు. ఆయన చెప్పిన విషయం విన్న వెంటనే నాకు నిరుత్సాహం
కలిగింది. ఇక నాభార్యని విశాఖపట్నానికి తీసుకువెళ్ళడానికి
నిశ్చయించుకుని అన్ని ఏర్పాట్లు చేసాను. రైలు
టిక్కెట్లను రిజర్వేషన్ చేయించాను. విశాఖపట్నంలో స్పెషల్ వార్డులో ఒక గది, అక్కడ ఉన్న జిల్లా జడ్జీగారి ద్వారా రైల్వే స్టేషన్ కి అంబులెన్స్
ను రప్పించడంలాంటి ఏర్పాట్లన్ని ముందుగానే చేయించేసాను. ఇక విశాఖపట్నం బయలుదేరడానికి 20 గంటలు మాత్రమే
ఉంది.
ఉదయం 6 గంటల ప్రాంతంలో
నేను, నాభార్య హాలులో కాఫీ తాగుతూ కూర్చున్నాము.
ఆసమయంలో ఒక బిచ్చగాడు వచ్చాడు. అతను
చినిగిపోయిన మాసిన లుంగీ కట్టుకుని ఉన్నాడు.
వంటిమీద చొక్కా లేదు. జుట్టంతా జడలు
కట్టి ఉంది. ఆబిచ్చగాడు వరండాలోనే కూర్చుని
ఉన్న బంట్రోతుల కళ్ళుగప్పి హాలులోకి దూసుకుని వచ్చాడు. అతడిని చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము. నేను నిన్ను చూడటానికి వచ్చాను అని అధికార స్వరంతో
నన్ను ఉద్దేశించి అన్నాడు. ఈలోగా మా బంట్రోతులు
అతనిని బయటకు గెంటేయడానికి వచ్చారు. ఆవ్యక్తి
మీద చెయ్యి వేయవద్దని వాళ్ళని వారించాను. నీకేమయిన
డబ్బు గాని, సహాయం గాని కావాలా అని ఆ బిచ్చగాడిని అడిగాను. నా ప్రశ్నకు అతనిచ్చిన సమాధానానికి నేను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. తను లక్షలు సంపాదించగలనని తనకు డబ్బు అవసరం లేదని జవాబిచ్చాడు. బహుశ మతిస్థిమితం తప్పిన బిచ్చగాడయి ఉండవచ్చనే భావం
ఇంకా నాలో ఉంది. వెంటనే అతను బయటకు రోడ్డు
మీదకు వెళ్ళి చేతినిండుగా యిసుకని తీశాడు.
మళ్ళీ యింటిలోకి వచ్చి నా చేతులు చాపమన్నాడు. అతను చెప్పినట్లుగానే నేను చేతులు చాపాను. అక్కడ ఉన్న అందరి సమక్షంలో అతను నా చేతులలో ఆ యిసుకని
పోసాడు. అతని పిడికిలిలోనుంచి ఇసుక పడటం మాకందరకీ
స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కాని అతను తన పిడికిలొలోనించి
నా చేతులలోకి పడుతున్నపుడు ఆ పడేది ఇసుక కాదు,
తెల్లటి పంచదార.
ఆవింత చూడగానే ఒక్కసారిగా
నేను ఉలిక్కిపడ్డాను. తను బిచ్చగాడిని కానని
నన్ను నమ్మించడానికే అతను ఈ విధంగా చేసాడని స్పష్టంగా అర్ధమయింది.
“నాకు ఎవ్వరి యింటికి
గాని, ఏప్రదేశానికి గాని వెళ్ళే అలవాటు లేదు.
నిన్ను, నీభార్యని అమరావతికి రమ్మని ఆహ్వానించడానికే నేను ప్రత్యేకంగా మీయింటికి
వచ్చాను. నేనక్కడ శివరాత్రికి మహాశివునికి
కోటి బిల్వార్చన చేస్తున్నాను” అన్నాడు.
అపుడు నేను, “నా భార్యకు
వైద్యం చేయించడానికి యిక 20 గంటలలో విశాఖపట్నం బయలుదేరుతున్నాము. అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాము” అని చెప్పాను.
అపుడు అతనన్న మాటలు –
“నాకు తెలుసు. ఆమెకు ఎటువంటి అనారోగ్యం లేదు. ఆమెని అక్కడికి తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు” అన్నాడు.
అతనంత ఖచ్చితంగా అన్న
మాటలకి నాకు ఆశ్చర్యం కలిగింది. కాని, నాకు
నమ్మకం కలగలేదు. విశాఖపట్నంలో వైద్యం చేయించడానికి
అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేసుకున్న తరువాత విరమించుకోవడానికి నాకు యిష్టం లేకపోయింది. నాకు నమ్మకం కలగలేదనే విషయం అతనికర్ధమయిపోయింది. అతను నా భార్యతో ఒక గ్లాసుడు నీళ్ళు తెమ్మన్నాడు. అతను అడిగినట్లుగానే
నాభార్య ఒక గ్లాసుతో నీళ్ళు తెచ్చింది. అతను
ఆ గ్లాసుని తన కనుబొమలదాకా ఎత్తి పట్టుకున్నాడు.
తన రెండు కనుగ్రుడ్లను కనుబొమ్మల మధ్యగా ముక్కు దూలం వద్ద దృష్టిని నిలిపి, నాభార్యవైపు
చాలా తీక్షణంగా చూసాడు. ఆ తరువాత యధాస్థితికి
వచ్చి ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉందని విశాఖపట్నానికి వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పాడు. అతను గ్లాసులోని నీటిని ఆమె అరచేతిలో తీర్ధంలా పోసాడు. మా అందరికీ కూడా తీర్ధంలాగ మా అరచేతులలో పోసి, ఇంకా
ఎవరయినా ఉన్నారా అని అడిగాడు. ఎవరూ లేరని చెప్పగానే
గ్లాసులో మిగిలిన నీటిని పైకి గాలిలోకి విరజిమ్మాడు. విచిత్రంగా ఆ నీరు గాలిలోనే ఆవిరయిపోయింది. హాలులో ఒక్క చుక్క కూడా నేలమీద పడలేదు. అతను తీర్ధంలా యిచ్చిన నీరు చిక్కటి పానకం రుచిలో
ఉంది. నేను లోపలికి వెళ్ళి కొంత డబ్బు తీసుకుని వచ్చి అర్చన
కోసం ఉపయీగించమని యివ్వబోయాను. అర్చనకు తన
దగ్గర లక్షలు ఉన్నాయని చెప్పి నేనివ్వబోయే డబ్బుని తీసుకోలేదు. ఇంత చేసి చూపించినా నాకింకా నమ్మకం కలగలేదనే విషయం
అతనికర్ధమయిపోయింది. అతను వేగంగా మాయింటిలోనుంచి
వెళ్ళిపోయాడు.
మరుసటిరోజు మేము విశాఖపట్నం
చేరుకున్నాము. నాభార్యకి అన్ని పరీక్షలూ చేసారు. నాబార్యకు కలిగిన అనారోగ్యం కాన్సర్ వల్ల కాదని
నిర్ధారించి ఆస్పత్రినుంచి పంపించేసారు.
ఆ ‘బిచ్చగాడు’ చేసిన
అధ్భుతాలకి, అభయప్రదానానికి నాకు నమ్మకం కలగనందుకు నేను చాలా విచారించాను. ఆ బిచ్చగాడు బాబా తప్ప మరెవరూ కాదని, నా భార్య ఆరోగ్యంతోనే
ఉందని, ఆయన చేసిన సూచనల వల్ల యిప్పుడు నాకు ఖచ్చితమయిన నమ్మకం కలిగింది.
బాబాని నమ్ముకున్నవారికి,
కన్నుకి కనురెప్ప ఎంత రక్షణగా ఉంటుందో బాబా కూడా అదే విధంగా రక్షణగా కాపాడుతూ ఉంటారు.
దేవత సుబ్బారావు
హైదరాబాద్ – 32
సాయిలీల
- 1980
(సర్వం శ్రీసాయినాధార్పనమస్తు)
0 comments:
Post a Comment