04.11.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
గత ఇరవై రోజులుగా ప్రచురించడానికి
అస్సలు వీలు కుదరలేదు. ఈ రోజు శ్రీ సాయి పదానంద
రాధాకృష్ణ స్వామీజీ గారి గురించి ప్రచురిస్తున్నాను. ఆయన గురించిన సంపూర్ణ సమాచారం శ్రీ బొండాడ జనార్ధనరావుగారి
బ్లాగునుండి, మరియు సాయిఅమృతాధార నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్
: ఆత్రేయపురపు త్యాగరాజు
రాధాకృష్ణ స్వామీజీ
(శ్రీ సాయిపదానంద)
నరసింహస్వామీజీ గారు
19.10.1956 వ.సంవత్సరంలో మహాసమాధిచెందారు.
అదేరోజున పౌర్ణమినాడు తను అనుకున్న
లక్ష్యాన్ని మరింత శక్తివంతంగా ముందుకు కొనసాగేలా తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ
రాధాకృష్ణస్వామీజీకి బదలాయించారు. సాయిబాబా
నరసింహస్వామీజీ గారికి 29.08.1936 న ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించారు. శ్రీ నరసింహస్వామీజీగారు తాను శరీరాన్ని విడిచే
రోజున తనకు లభించిన సాయి ఆధ్యాత్మిక సంపద సర్వస్వాన్ని శ్రీరాధాకృష్ణ స్వామీజీ గారికి
సమర్పించేశారు.
అప్పటినుండి రాధాకృష్ణస్వామీజీ
మద్రాసులోని ఆల్ ఇండియా సాయి సమాజ్ కి ప్రెసిడెంటుగా బెంగళూరులో ఉన్న త్యాగరాజనగర్
మందిర నిర్వహణ బాధ్యతలను చేపట్టారు.
బెంగళూరులో ఉన్న త్యాగరాజనగర్
మందిరంలో సాయిబాబా, శ్రీనరసింహ స్వామీజీ, శ్రీరాధాకృష్ణ స్వామీజీల
విగ్రహాలతో శోభాయమానంగా భక్తులందరికీ సుఖశాంతులను, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తూ
ఉన్నాయి.
శ్రీరాధాకృష్ణస్వామిజీ
తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా పొయ్యమని గ్రామంలో ఏప్రిల్, 15, 1906 లో జన్మించారు. ఆయన శ్రీ పుదుక్కుడి డి.వెంకటరామ అయ్యర్, శ్రీమతి
లక్ష్మీ అమ్మాళ్ దంపతులకు అయిదవ సంతానం. ఆయన
బాలుడిగా ఉన్నప్పుడే కాకుండా యుక్తవయసు వచ్చిన తరువాత కూడా మతాచార ప్రకారం ఆధ్యాత్మిక వాతావరణంలో
పెరిగారు. ఆయన సాదువులను, మహాత్ములను కలుసుకుంటూ
ఉండేవారు. అంతేకాదు దూర ప్రదేశాలలో ఉన్న దేవాలయాలను
కూడా సందర్శిస్తూ ఉండేవారు.
ఆయన ఆధ్యాత్మిక గ్రంధాలను,
పౌరాణిక సద్గ్రంధాలను ఎంతో మక్కువతో చదివేవారు.
రాఘవేంద్రస్వామి, సదాశివ బ్రహ్మేంద్ర, చైతన్య మహాప్రభుల గురించిన గ్రంధాలను
కూడా ఆయన చదివారు. తిరువణ్ణామలైలో ఆయన రమణమహర్షి,
శేషాద్రిస్వామి గార్లను కూడా కలుసుకున్నారు.
శేషాద్రిస్వామిగారు ఆయనకు మూడు రాళ్ళను యిచ్చి వండుకుని తినమన్నారు. రమణమహర్షిగారు దానిలోని గూఢార్ధాన్ని యిలా బోధించారు. గుణాతీతుడవు కావాలంటే సత్వ, రజ, తమో గుణాలనే మూడు
దశలను దాటుకుని వెళ్ళాలని దాని భావాన్ని విడమర్చి చెప్పారు.
కంచికామకోఠి పీఠాధిపతి
జగద్గురు శంకరాచార్యగారిని కలుసుకునే అవకాశం ఆయనకు లభించింది. ఆతరువాత ఎన్నోసార్లు ఆస్వామీజీని కలుసుకున్నారు. ఆయనకు పాఠశాలకు వెళ్ళి చదువుకోవడం యిష్టంలేక మధ్యలోనే
తన చదువుకు స్వస్తి చెప్పారు. ఆయనకు ఆధ్యాత్మిక
విషయాలందు ఆసక్తి ఎక్కువ. అందుచేత ఎక్కువగా
ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడంలోనే నిమగ్నమయి
ఉండేవారు. అయన సంపన్న కుటుంబానికి చెందినవారు. అందువల్ల ఆయనకు ఉద్యోగం సంపాదించి జీవితాన్ని గడపాలనే
అవసరం కూడా లేదు.
రాధాకృష్ణ స్వామీజీపై
కంచి ఆచార్యగారి ప్రభావం ఎంతగానో పడింది. ఒకసారి
ఆయన సోదరులలో ఒకరు పూనాలో ఉన్నపుడు, యుక్తవయసులో ఉన్న రాధాకృష్ణగారు తన సోదరునితో కలిసి
ఉండేవారు. అలా ఉన్న సమయంలో ఎన్నో పుణ్యక్షేత్రలను
దర్శించారు. తన ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన
కోసం ఎంతోమంది సాధువులను కలుసుకుంటూ ఉండేవారు.
పూనా, బొంబాయి, చుట్టు ప్రక్కల ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఉన్న సమయంలో
ఆధ్యాత్మిక సాధనకు అనువుగా ఉండే కొన్ని గుహలు కనిపించాయి ఆయనకు. ఒక గుహలో ఆయన 48 రోజులు తపస్సు చేసారు. తపస్సు చేసుకునే సమయంలో అయనకు దత్తాత్రేయస్వామి
వారి దర్శన భాగ్యం లభించింది. “నువ్వు అనుకున్న
లక్ష్యాన్ని సాధించి మానవాళికి సహాయం చేయి” అని దత్తాత్రేయస్వామి ఆజ్ఞాపించారు.
1921 లో రాధాకృష్ణన్
గారు ఊటీ వచ్చి 20 సంవత్సరాలు అనగా 1942 వరకూ అక్కడే ఉన్నారు. ఆయనకు 21 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి యిక వివాహం
చేసుకొమ్మని ఆయన కుటుంబ సభ్యులు బాగా వత్తిడి చేసారు. ఆయనకు వివాహం మీద అంతగా యిష్టం లేకపోయినా తన కుటుంబ
సభ్యుల వత్తిడి మేరకు, తన తల్లివైపు బంధువులలో పార్వతి అనే ఆమెను వివాహమాడారు. ఆయన తన సంసార జీవితాన్ని తామరాకు మీద నీటిబొట్టులా
గడిపారు. చాలా సంవత్సరాల తరువాత ఆయన సన్యాసాన్ని
స్వీకరించారు. ఆయన భార్యకు, కుటుంబానికి ఇది
ఆశానిపాతాన్ని కలిగించింది. ఇక చేసేదేమీ లేక ఆబాధను మవునంగానే భరించారు. ఒంటరి జీవితాన్ని గడిపిన ఆయన భార్య తన భర్తను మరలా జీవితంలో కలుసుకోలేదు. ఆమె 1979 లో మరణించింది.
ఆయనకు వివాహమయిన తరువాత
ఊటీలోని రేస్ క్లబ్ లో మానేజరుగా పార్ట్ టైమ్ ఉద్యోగం చేసారు. రేస్ క్లబ్ లో ఉద్యోగిగా ఆ ఉద్యోగానికి తగినట్లుగా
మంచి హుందా ఉట్టిపడేటట్లుగా దుస్తులను ధరించాలి.
ఆవిధంగా అందులో ఉద్యోగం చేస్తున్నపుడు అందమయిన యువకునిలా కన్పించేవారు. ఆరోజుల్లో ఆయన సీనియర్ యూరోపియన్ ఆఫీసర్లతోను యింకా
సమాజంలో మరికొంతమంది ఉన్నతాధికారులతోను కలిసి తిరుగుతూ ఉండేవారు. ఆవిధంగా ఆయనకి ఎంతో మంది ప్రముఖవ్యక్తులు స్నేహితులయ్యారు.
ఆయన తన అన్నగారితో కలిసి
నివసించేవారు. అన్నదమ్ములిద్దరూ చాలా దూరం
నడచుకుంటూ వెడుతూ ఉండేవారు. ఆసమయంలో ఇద్దరూ
కలిసి ఆధ్యాత్మిక విషయాలమీద గంటలతరబడి చర్చింకుకుంటూ ఉండేవారు. ఆయన తన కుటుంబ సభ్యులు నిర్మించిన శివాలయంలో బంధువులతో
కలిసి ప్రతిరోజూ కొంతసమయం గడుపుతూ ఉండేవారు.
అక్కడ భజనలు జరుగుతున్న సమయంలో ఆయన తనను తాను రాధ, కృష్ణుడు, ఆండాళ్ గా ఊహించుకుని
ఆవిధంగా నాట్యం చేస్తున్నట్లుగా ఆనందపారవశ్యంలో మునిగిపోయేవారు.
1927 వ.సంవత్సరంలో నారాయణమహరాజ్
ఖేడ్ గావ్ , బెట్ నుంచి ఊటీ వచ్చినపుడు ఆయననుండి దత్తమంత్రోపదేశాన్ని పొందారు.
ఆయన నిరంతరం పుస్తకాలను
చదువుతూనే ఉండేవారు. చెన్నై అడయార్ లో ఉన్న
ధియోసాఫికల్ సొసైటీకి తరచుగా వెడుతూ ఉండేవారు.
ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ‘మంత్రమహోదరి’
అనే సంస్కృత పుస్తకాన్ని క్రమం తప్పకుండా చదివేవారు. ఆపుస్తకం ఆయన జీవితంలో ఒక స్థిరమయిన సహచరి అనే చెప్పవచ్చు.
1936-42 సంవత్సర కాలంలో
ఆయన తీవ్రమయిన మానసిక సంక్షోబాన్ని అనుభవించారు.
తిరుచిరాపల్లినుంచి మద్రాసుకు రైలులో వెడుతుండగా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారు. రైలు చిదంబరం దగ్గర కోల్ రూన్ నదిని దాటుతున్న సమయంలో
రైలునుండి దూకి నదిలో పడి చనిపోదామనే ఉద్దేశ్యంతో తలుపు తెరిచారు. కాని వెంటనే వెనుక ఎవరో గట్టిగా పట్టుకొని ఆపినట్లయింది. వెనుకకి తిరిగి చూశారు. తన వెనుక తలకు గుడ్డ చుట్టుకుని ఉన్న ఒక వృధ్దుడు
కనిపించాడు. ఆ వృధ్ధుడు "నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు. నీ జీవితంలో నువ్వు సాధించవలసినది ఎంతో ఉంది” అన్నాడు.
ఆవిధంగా తనను వెనుకకు లాగి ఆపినది బాబా అని ఆతరువాత ఆయనకి అర్ధమయింది.
WHY FEAR WHEN I AM HERE
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment